భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం గానీ, స్వాతంత్ర్యం తరువాత గానీ మహిళలు ఇంటిగడప దాటి బయటకు రావటమే మహాపాపంగా అభివర్ణించేవారు. సమాజంలోని కట్టుబాట్ల ద్వారా మహిళలు అన్నిరకాలుగా అణిచివేయబడ్డారు. “పితృస్వామ్య వ్యవస్థ” (పురుషస్వామ్య వ్యవస్థ) లో మగవాడి ఆధిపత్యం ఎక్కువ కాబట్టి అప్పటి సమాజాన్ని పరిశీలించి చూస్తే, సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని మగవాడి ఆధిపత్యం ఎంతగా ప్రభావితం చేయబడిందో అర్థమవుతుంది. ఈ ఆధిపత్యం కారణంగానే మహిళలు మొన్నటివరకు అన్నిరంగాలలో మగవాళ్ళతో సమానంగా ముందుకు వెళ్లలేకపోయారు. కానీ ఇటీవలి కాలంలో ఆధునికత కేవలం చదువులోనే కాకుండా మహిళల జీవితంలో కూడా చేరిపోయిన కారణంగా, మహిళలు తమ హక్కుల కోసం రాజ్యాంగ బద్ధమైన పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో మహిళలు తమ రంగాలలో అడ్డంకులను అధిగమించి, వారధులను నిర్మించి, దేశంలో ఆవిష్కరణలకు పునాది వేశారు. అలాంటి మార్గం గురించి ఎవరూ వినని కాలంలో, లెక్కలేనంత మంది ఇతరులు అనుసరించడానికి మార్గం చూపి అనేకమంది మహిళలకు దిశానిర్దేశం చేసిన భారతదేశపు మొట్టమొదటి మహిళా ఇంజనీరు అయ్యల సోమయాజుల లలిత.
అయ్యలసోమయాజుల లలిత.. భారత తొలి మహిళా ఇంజనీర్
మద్రాసులో స్థిరపడిన తెలుగు ద్రావిడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అయ్యల సోమయాజుల లలిత ఆనాటి సమాజ పద్ధతుల ప్రకారం ఇంకా పాఠశాలలో చదువుకుంటూ ఉండగానే పదిహేను సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసారు. దాంతో పదో తరగతి తరువాత ఆమె చదువుకు స్వస్తిచెప్పింది. కుమార్తె శ్యామలకి జన్మనిచ్చిన నాలుగు నెలలకే భర్త చనిపోవడంతో తన తండ్రి పప్పు సుబ్బారావు, సోదరుల ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, కుటుంబసభ్యులు పనిచేస్తున్న కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గిండి (సి.ఇ.జి) లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో చేరి కళాశాలలో ఇతర మహిళా ఇంజనీర్లు పి కె. థ్రెస్సియా, లీలమ్మ కోషీ (నీ జార్జ్) తో కలిసి చదువుకుని ఇంజనీరు పట్టా పొంది, భారతదేశపు తొలి మహిళా ఇంజనీరు అయ్యారు. లలిత ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన తరువాత సిమ్లా లోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషనులో పని చేశారు . పొగలేని ఓవెన్లు, జెలెక్ట్రోమోనియం (ఎలక్ట్రికల్ సంగీత వాయిద్యం) పరిశోధనలో ఆమె తన తండ్రికి సహాయం చేశారు. 1948లో కలకత్తాలోని బ్రిటిష్ సంస్థ అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ (ఏ.ఇ.ఐ) లో చేరి భారతదేశంలో అతిపెద్ద డ్యాం అయిన భాక్రా నంగల్ డ్యామ్, ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్‌స్టేషన్ లేఅవుట్‌ల రూపకల్పనలో పనిచేశారు. దాదాపు ముప్పై సంవత్సరాలు ఏ.ఇ.ఐ లో పనిచేసి పదవీ విరమణ చేసిన ఆమె 1964లో న్యూయార్క్‌లో జరిగిన మొదటి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు, శాస్త్రవేత్తల (ఐ.సీ.డబ్ల్యూ.ఇ.యస్) సదస్సుకు భారతదేశం నుండి హాజరైన మొదటి మరియు ఆఖరు మహిళా ఇంజనీరు లలిత ఒక్కరే కావడం విశేషం.
ఓకే కుటుంబంలో ఏడుగురు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు…
బీసీసీఐ అధ్యక్షులుగా పనిచేసిన ఏ.సి.ముత్తయ్య, భారతదేశంలో శ్వేతవిప్లవానికి ఆద్యుడు వర్గీస్ కురియన్, క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చివుకుల ఉపేంద్ర, తమిళ నటుడు క్రేజీ మోహన్, మొదలగు వారంతా కూడా మద్రాసులో ఏర్పాటైన అత్యంత పురాతన సాంకేతిక పాఠశాల, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గిండి కళాశాలలో చదువుకున్నవారే. ప్రస్తుతం అన్నా విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న “కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గిండి” లో 1915 ప్రాంతంలో తెలుగు ప్రముఖులు పప్పు సుబ్బారావు ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో ఆచార్యులు (ప్రొఫెసర్) గా పనిచేస్తుండేవారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందినవారు సుబ్బారావు తండ్రి గోదావరి నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. దాంతో సుబ్బారావు తన బాబాయి సంరక్షణలో పెరిగి ఇంజనీరింగు పూర్తి చేసి మద్రాసులోని గిండి కళాశాలలో ఉపాధ్యాయులుగా చేరి అంచెలంచెలుగా ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్నారు. ఆయన భార్య పేరు కామాక్షి.
ఆ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. వారిలో ఐదవ సంతానం అయ్యల సోమయాజుల లలిత. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు వెంకట రామయ్య, నారాయణ మూర్తి, ఇద్దరు అక్కయ్యలు శాంత, కమల, ఒక చెల్లెలు శారద, ఇద్దరు తమ్ముళ్లు శాస్త్రి మరియు ప్రకాష్. తరువాత కాలంలో పప్పు సుబ్బారావు నలుగురు కుమారులు, కుమార్తె లలితతో కలిపి ఐదుగురు ఎలక్ట్రికల్ ఇంజనీర్లే. పప్పు సుబ్బారావు కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరు అయినందున ఆయనతో కలిపి ఆరుగురు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఆ కుటుంబం నుండి ఉన్నారు. ఆ తరువాత రోజులలో అయ్యల సోమయాజుల లలిత అల్లుడు కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరుగా పట్టా పొందారు. ఆ రకంగా ఒకే కుటుంబం నుండి ఏడుగురు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఉన్నారు.
నేపథ్యం…
అయ్యల సోమయాజుల లలిత 27 ఆగస్టు 1919 నాడు మద్రాసులో (నేటి చెన్నై) తెలుగు ద్రావిడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పప్పు సుబ్బారావు కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పటికీ తనకున్న ఎనిమిది మంది సంతానంతో వారిది మధ్యతరగతి కుటుంబంగానే ఉండేది. ఆడపిల్లలకు చదువు అంటే ఆ రోజుల్లో వింతగా ఉండేది. బంధుమిత్రులు కూడా వారిని వింతగా చూసేవారు. అలా ఉన్న ఆ రోజులలోనే సుబ్బారావు ప్రొఫెసర్ కాబట్టి తాను ఆడ, మగ వ్యత్యాసం లేకుండా అమ్మాయిలను కూడా పాఠశాలకు పంపించారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు సర్వసాధారణమైనందున ఐదో సంతానమైన లలితకు కూడా 1935 లో తన 15వ యేట వివాహం చేశారు. అప్పటికీ ఆమె ఇంకా పాఠశాల చదువు చదువుకుంటున్నారు.
సుబ్బారావుకు స్నేహితుల అబ్బాయి పెళ్ళికొడుకు. తాను బందరుకు చెందిన ఒక ధనవంతుల కుటుంబంలో ఒక్కడే కుమారుడు, పేరు అయ్యల సోమయాజుల సీతారామచంద్రరావు. వివాహం తర్వాత లలిత మద్రాసులోనే లేడీ వెల్లింగ్టన్ పాఠశాలలో చదువు కొనసాగించి 1936 వ సంవత్సరంలో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేశారు. ఆ తరువాత చదువు ఆపేయమని అత్తింటి వాళ్ళు చెప్పడంతో ఆమె చదువుకు స్వస్తి చెప్పారు. లలిత అక్కయ్యలు శాంత, కమల వాళ్ళు కూడా ఎస్.ఎస్.ఎల్.సి తోనే చదువు ఆపేశారు. 1937 వ సంవత్సరంలో లలిత సీతారామచంద్రరావుకు ఒక కూతురు జన్మించింది. ఆమెకు శ్యామల అని పేరు పెట్టుకున్నారు. ఆ పాప నాలుగు నెలల వయస్సులో ఉండగానే 12 జనవరి 1938 నాడు సీతారామచంద్రరావు మసూచితో చనిపోయారు. అప్పటికి ఆయన వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. మసూచి టీకా తీసుకున్నప్పటికీ కూడా ఆయన చావు నుండి తప్పించుకోలేకపోయారు.
ఇంటర్మీడియట్ చదువు పూర్తి…
పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో నాలుగు నెలల పాపతో వితంతు అనే ముద్ర వేయించుకున్న లలిత తిరిగి పసిపాపతో తన తల్లిగారి ఇంటికి వచ్చింది. తండ్రి సుబ్బారావు మాత్రం లలిత చదువును తిరిగి కొనసాగింప చేయాలని భావించారు. ఆరోజు తండ్రి తీసుకున్న నిర్ణయం 18 సంవత్సరాల లలిత పట్టుదల కలగలిపి భారతదేశంలో కోట్లాదిమంది మహిళలకు సాంకేతిక విద్యను బాటలు వేసేలా చేసింది. వారికి ఆమె దిశానిర్దేశం అయ్యింది. బంధుమిత్రుల ఆక్షేపణలను పట్టించుకోకుండా, లోకుల మాటలను లెక్కచేయకుండా సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో చేరిపోయి రెండేళ్లలో 1940 సంవత్సరంలో మొదటి తరగతిలో ఉత్తీర్ణులు అయ్యారు. అప్పటికి లలిత వయస్సు 22 సంవత్సరాలయితే, ఆమె పాప వయస్సు రెండున్నర సంవత్సరాలు.
పాప సంరక్షణ చూసుకుంటూనే ఆమె తన చదువును కొనసాగించారు. కానీ వితంతు పునర్వివాహానికి మాత్రం ఆమె ఒప్పుకోలేదు. అందుకు తండ్రి, ప్రొఫెసర్ సుబ్బారావు ఆమెకు అండగా నిలిచారు. ఆ రోజులలో మెడిసిన్ చదివే మహిళల సంఖ్య చెప్పుకోదగ్గగానే ఉండేది. డాక్టర్ ముత్తు లక్ష్మి లాంటి వారు అప్పట్లో డాక్టర్ చదివే మహిళలకు ఆదర్శంగా నిలిచారు. అయితే లలిత మాత్రం డాక్టరు చదువువైపు వెళ్లకుండా కూతురు సంక్షేమమే ధ్యేయంగా ఇంజనీరు చదువు వైపు మొగ్గు చూపారు. అప్పటికే ఆమె అన్నయ్యలు ఇద్దరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆమె నాన్న ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదవాలనే ధ్యేయం మొదలైంది. అప్పటికి భారతదేశంలో ఏ మహిళ కూడా ఇంజనీరింగ్ కళాశాలలో చేరలేదు. ముందుగా గిండి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ.సీ చాంద్ ను కలుసుకుని విషయం చెప్పారు సుబ్బారావు.
1944 లో ఇంజనీరింగ్ పట్టా పొంది…
అమ్మాయి ఇంజనీరింగ్ కోర్సులో చేరడం ఏంది అని ముందుగా ప్రధానాచార్యులు ఈ.సీ చాంద్ ఆశ్చర్యపోయారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని అన్ని అనుమతులు లభించాక పప్పు సుబ్బారావు తన కూతురును 1940లో గిండి ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించారు. తన 21 సంవత్సరాల వయస్సులో వందలాది మగ విద్యార్థుల మధ్య ఒక్కతే అమ్మాయి లలిత. ఈ కళాశాలలో అందులో ఇంజనీరింగ్ లో ఇమడగలనా అన్న సందేహం ఉండేది. కానీ క్రమక్రమంగా మగ పిల్లలు ఆమెను గౌరవంగా చూడడం, అధ్యాపకులు కూడా ఆమె ఆశయాన్ని అర్థం చేసుకొని అభినందించడంతో తొందరగానే ఆమె కళాశాల వాతావరణానికి అలవాటు పడ్డారు. ఆమె పసిపాపను చూసుకోవడానికి అమ్మ నాన్నలు ఉన్నారు.
కళాశాల నుండి సాయంత్రం ఇంటికి రాగానే పొత్తిళ్లలో చేరే తన పసిపాపను నిద్రపుచ్చి కళాశాలలో తాను నేర్చుకునే పాఠాలు పునఃచ్చరణ చేసుకుని మరుసటి రోజు కళాశాలలో చేయబోయే ప్రయోగాలకు సిద్ధంగా ఉండేది. ఇదే అయ్యల సోమయాజుల లలిత దైనందిన జీవితం. ఆమె ఇంజనీరింగ్ లో చేరిన కొద్ది రోజులకు అమ్మాయిలకు ఇంజనీరింగ్ లో ప్రవేశం ఉంది అని ప్రభుత్వం ప్రకటన ఇవ్వడంతో కేరళ నుండి ఇద్దరు అమ్మాయిలు వచ్చి గిండి ఇంజనీరింగ్ కళాశాలలో చేరిపోయారు. వారు లీలమ్మ, జార్జ్ పీ.కే థెరిసా. తరువాత రోజులలో పీ.కే థెరిసా మొట్టమొదటి మహిళా చీఫ్ ఇంజినీరు (పిడబ్ల్యుడి భాగంలో) అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకోవడం వలన 1943 వ సంవత్సరంలో ఇంజనీరింగ్ విద్యను ఒక సంవత్సరం కుదించి ఈ ముగ్గురికి పరీక్షలు నిర్వహించారు. లలిత మాత్రం మరొక సంవత్సరం డిగ్రీ కొనసాగించి 1944 వ సంవత్సరంలో ఇంజనీరింగ్ లో ఆనర్స్ పట్టా తీసుకున్నారు.
సిమ్లాలో సహాయక ఇంజనీరుగా ఉద్యోగం…
ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో వృత్తి శిక్షణ ప్రయోగాల (అప్రెంటీస్ ప్రాక్టికల్) కోసం బీహార్ లోని జమల్పూర్ లో రైల్వే డివిజన్ లోని లోకోమోటివ్ శిక్షణా శిబిరం విభాగంలో ఎనిమిది నెలలపాటు లలిత శిక్షణార్థిగా పనిచేశారు. లలిత తన అమ్మ, నాన్న, తన ఆరేళ్ళ పాప శ్యామలతో కలిసి జమాల్పూర్ వెళ్లారు. అక్కడే రైల్వే క్వార్టర్స్ లో ఉంటూ పాపను అక్కడే ప్రాథమిక పాఠశాలకు పంపించేవారు. ఒక మహిళా అభ్యాసి (ట్రెయినీ) శిక్షణా శిబిరం (వర్క్స్ షాప్) కోసం సైకిలుపై వస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. 1944 వ సంవత్సరంలో ఫైనల్ డిగ్రీ చేతికి వచ్చింది. ఆ విధంగా అయ్యల సోమయాజుల లలిత అనే పాతికేళ్ల అమ్మాయి భారతదేశంలో తొలి మహిళ ఇంజనీర్ అయ్యారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని 08 సెప్టెంబరు 1944 నాడు ఆంధ్ర మహిళా సంఘం తరపున ఆ సంస్థ కార్యదర్శి దుర్గాబాయ్ దేశ్ ముఖ్, అధ్యక్షురాలు మీర్జాపురం మహారాణి పెద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆ మహాసభలో లలిత తన అనుభవాలను చెప్పుకొచ్చారు. తాను వేసిన తొలి అడుగు తరువాత రోజులలో కోట్లాదిమంది మహిళలకు స్ఫూర్తిదాయకం అవుతుందని ఆమె ఆనాడు ఊహించలేదు.
కేవలం డిగ్రీ తీసుకోవడంతోనే సరిపెట్టుకోకుండా అభ్యసించిన చదువును మూడు దశాబ్దాల పాటు సద్వినియోగం చేసిన ఘనత కూడా లలిత సొంతం. సిమ్లా లోని ఎలక్ట్రికల్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ సహాయకురాలిగా లలిత ఉద్యోగంలో చేరారు. 1944 చివరి నుండి డిసెంబరు 1946 వరకు అక్కడ పనిచేశారు. అప్పటికి లలిత పెద్దన్నయ్య వెంకట్రావు కూడా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ కార్యాలయం సిమ్లా లోనే పనిచేస్తూ ఉండేవారు. వారి ఇంట్లోనే లలిత ఉండేవారు. కొంతకాలం కుమార్తె శ్యామలను తనతో పాటు ఉంచుకున్న లలిత కూతురు స్థిరమైన చదువు కోసం పాపను మద్రాసులో ఉన్న తన అమ్మ నాన్నల దగ్గరకు పంపించేశారు. ఎలక్ట్రికల్ విభాగంలో మొట్టమొదటి మహిళా ఉద్యోగినిగా చేరిన ఆమెకు తన సహ ఉద్యోగులనుండి అంతగా సహకారం ఉండేది కాదు. ప్రతీరోజూ రెండు కొండలు దాటి కార్యాలయంకు వెళ్లాల్సి రావడం, ఎంత క్రమశిక్షణతో పని చేసినా కూడా పదోన్నతి (ప్రమోషన్స్) రాకపోవడం, ఇన్నిరకాల పరిమితులతో ఉద్యోగం కొనసాగిస్తూనే విద్యుత్తు మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ల సంస్థ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) లో పట్టభద్రత (గ్రాడ్యుయేషన్) పరీక్షలలో కూడా ఉత్తీర్ణులయ్యారు.
కలకత్తా లో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా ఉద్యోగం…
తండ్రి సుబ్బారావు ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో కొత్తగా పరీక్షలు చేస్తున్నారు, కొత్త పరికరాలకు పేటెంట్స్ తీసుకువచ్చారు, మరికొన్ని వాటికోసం ప్రయత్నిస్తున్నారు. ఆ పరిశోధనలో తనకు సహాయంగా ఉండటానికి మద్రాసుకు వచ్చేయమని లలితకు కబురు పంపించారు. సిమ్లాల ఉద్యోగం కూడా అంత సౌకర్యంగా ఉండకపోవడంతో 1946 చివర్లో మద్రాసు వచ్చేసి లలిత తన తండ్రికి సహాయకురాలిగా రెండేళ్లు పనిచేశారు. ఆ రోజులలో తండ్రి కూతుర్లు కలిసి పరిశోధనలు చేసి క్రోమోనియం అనే ఒక సంగీత పరికరం, ఎలక్ట్రికల్ ఓవెన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ లాంటి కొన్ని పరికరాలకు పేటెంట్స్ తెచ్చుకున్నారు. 1946 నుండి 1948 వరకు తండ్రికి లలిత సహాయం చేశారు. అప్పటికి కూతురు శ్యామలకు 11 సంవత్సరాలు వచ్చాయి.
నాన్న గారితో కలిసి చేసే పని చివరిదాకా ఉండేది కాదు. అందులోనూ ఆర్థిక స్థిరత్వం కోసం ఉద్యోగం తప్పనిసరి కాబట్టి మళ్ళీ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టి కలకత్తాలో అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ (ఏ.ఇ.ఇ) అనే కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా ఉద్యోగం సంపాదించుకున్నారు. అది ఇంగ్లాండుకు చెందిన కంపెనీ. ఆ తరువాత రోజులలో జనరల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంపెనీ (జి.ఇ.ఇ.సి) వాళ్ళు దాన్ని కొనుగోలు చేశారు. అప్పటికి లలిత రెండో అన్నయ్య నారాయణమూర్తి కూడా కలకత్తాలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య మద్రాసులో ఉండగా లలితకు సహాధ్యాయి. కలకత్తాలో లలితకు ఉద్యోగంతో పాటు అన్నయ్య నారాయణమూర్తి ఇంట్లోనూ ఉండే అవకాశం వచ్చింది.
29 సంవత్సరాలు ఎలక్ట్రికల్ ఇంజనీరుగా…
అయ్యల సోమయాజుల లలిత 1948 నుండి 1977 దాకా దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు ఎలక్ట్రికల్ ఇంజనీరుగా (ఏ.ఇ.ఐ తరువాత జి.ఇ) ఉద్యోగం చేశారు. అదే కంపెనీలో ప్రొటెక్షన్ గేర్స్, ఎలక్ట్రికల్ స్టేషన్ నిర్మాణాల రూపకల్పన, నిర్వహణ, అమ్మకాల విభాగం, సేవల విభాగం ఇలాంటివి వివిధ భాగాల్లో పనిచేసే అవకాశం లలితకు వచ్చింది. ఆమె ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లోనే సేవలు అందించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు భారతదేశంలో అతిపెద్ద బాక్రాంగల్ డ్యామ్ నిర్మాణం, దానికి సంబంధించిన విద్యుత్తు ఉత్పత్తి యంత్రాల అమరికలో లలిత ప్రత్యక్షంగా పాల్గొని సేవలు అందించారు. మొదట్లో కొన్ని సంవత్సరాలు రూపకల్పన పనులతో తీరిక లేకుండా ఉండేవాళ్ళు. క్రమక్రమంగా అమ్మకాలు మరియు సేవల (సేల్స్ అండ్ సర్వీసెస్) విభాగంలోకి మారారు. ఇంగ్లాండు లోని పరికరాల ఉత్పత్తి సమస్యలకు భారతదేశంలోని కొనుగోలుదారులు మరియు ఇంజనీర్లకు మధ్య సంధానకర్తగా ఉండేవారు. కొనుగోలుదారులకు ఏ సమస్య వచ్చినా ముందుగా తాను విశ్లేషించి పరిష్కరించాలి. తనకు వీలు కాకపోతే ఇంగ్లాండులోని ప్రధాన కేంద్రాన్ని సంప్రదించి పరిష్కారం అందించాలి. అది అంత తేలికైన ఉద్యోగం మాత్రం కాదు. విపరీతమైన ఒత్తిడి ఉండేది. కానీ తనకున్న లోతైన పరిజ్ఞానంతో ఆమె అత్యంత సమర్థవంతంగా తన విధులను నిర్వర్తించేవారు. అందుకే కంపెనీ యాజమాన్యం మారినా కూడా అయ్యల సోమయాజుల లలిత ఉద్యోగానికి ఏమాత్రం ఆటంకం లేకుండా సాగింది.
సి.ఐ.ఇ.ఇ లండన్ సంస్థకు మహిళా సభ్యురాలిగా…
కలకత్తా లో ఉన్నన్ని రోజులు అన్న వదినల దగ్గరే లలిత ఉన్నప్పటికీ, వాళ్ళ అన్నయ్య ఉద్యోగ బదిలీల మీద తరచూ వెళ్లాల్సి వచ్చిన సమయంలో మాత్రం ఆమె కలకత్తాలోని మహారాష్ట్ర నివాస్ లోనే ఉండేవారు. వాళ్ళ అన్నయ్య వదిన కలకత్తా రాగానే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లేవారు లలిత. ఆమె కూతురు శ్యామల కు కళాశాల వయస్సు రాగానే కలకత్తా పిలిపించుకున్నారు. శ్యామల కళాశాల చదువు అంతా కలకత్తాలోనే కొనసాగింది. లలిత తన వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం సమతుల్యం చేసుకుంటూనే అంతర్జాతీయ సంస్థలలో సభ్యురాలిగా ఉండేవారు. లండన్ కేంద్రంగా ఉన్న కౌన్సిల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థకు భారతదేశం నుండి మొట్టమొదటి మహిళా సభ్యురాలిగా ఎంపికయ్యారు. భారతదేశం నుండి ఎంపికైన ఏకైక సభ్యురాలు కూడా అయ్యల సోమయాజుల లలితనే. ఆమె 1953 వ సంవత్సరంలో అనుబంధ సభ్యులు (అసోసియేట్ మెంబరు) గా ఎంపికయ్యారు. 1966 లో ఆ సంస్థకు పూర్తిస్థాయి సభ్యులయ్యారు.
15 జూన్ 1966 నుండి 21 జూన్ 1966 వరకు వారం రోజులపాటు అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా ఇంజనీర్ల శాస్త్రవేత్తల సదస్సులో 35 దేశాల నుండి ప్రతినిధులు హాజరైతే, భారతదేశం నుండి హాజరైన ఏకైక వ్యక్తి అయ్యల సోమయాజుల లలిత. ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత (సైన్స్ అండ్ టెక్నాలజీ) ఇంజనీరింగ్ రంగాల్లో స్త్రీల చదువు, ఉద్యోగాలు ప్రోత్సహించడమే. ఆ సదస్సుకు హాజరవ్వడానికి లలిత 12 జూన్ 1966 నాడు ఢిల్లీలో విమానం ఎక్కిన దగ్గర నుండి వెళ్లి తిరిగి వచ్చే వరకు ఆ పర్యటన గురించి ఎలక్ట్రికల్ ఇండియా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎలక్ట్రికల్ ధర్మయోగ్, హితవాద మొదలగు పత్రికలు వరుసగా వార్త కథనాలు ప్రచురించాయి. ప్రతీ వార్తలోనూ భారతదేశ తొలి ఇంజనీర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎక్కడికి వెళ్లినా సంప్రదాయబద్ధమైన చీరకట్టులోనే లలిత తన ఆహార్యాన్ని ప్రదర్శించేవారు.
ఏ.ఇ.ఐ ప్రధాన కార్యాలయం సందర్శన…
అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా ఇంజనీర్ల శాస్త్రవేత్త ల సదస్సులో అయ్యల సోమయాజుల లలితతో పాటు ఇంగ్లాండు నుండి మరొక మహిళ ఇంజనీరు ఇస్సాబెల్ అనే మహిళ పాల్గొన్నారు. తిరిగు ప్రయాణంలో లండనులోని మాంచెస్టార్ లో ఆగి ఏ.ఇ.ఐ ప్రధాన కార్యాలయంను సందర్శించారు. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు అయ్యల సోమయాజుల లలితను ఎంతో గౌరవించి, ఆ కంపెనీ మొత్తం తిప్పి చూపించారు. భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న లలిత తమ దేశంలో మార్కెటింగ్ చేస్తున్న ఉత్పత్తులు ఎలా తయారవుతున్నాయో స్వయంగా పరిశీలించే అవకాశం అందిపుచ్చుకున్నారు. లలితకు ఏ.ఇ.ఐ అంతర్గత పత్రిక వాళ్ళు లలిత పర్యటించిన ఇంగ్లాండు పర్యటన గురించి ప్రచురించి ఆ కంపెనీలోని మిగతా శాఖలన్నింటికీ పంపించారు. అప్పటికి శ్యామల (లలిత వాళ్ళ అమ్మాయి) టెన్నిస్ ఆటలో మంచి పేరు తెచ్చుకున్నారు. తన గురించి ప్రచారం చేసుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడేవారు కాదు. 1965 వ సంవత్సరంలో లండన్ లోని ఉమెన్స్ ఇంజనీరింగ్ సొసైటీ (డబ్ల్యూ.ఇ.ఎస్) సంస్థ వారు లలితను తమ ప్రతినిధిగా ఎంపిక చేసుకున్నారు.
నిష్క్రమణ…
01 జూలై 1967 నుండి 09 జూలై 1967 వరకు లండన్ లోని కేంబ్రిడ్జిలో జరిగిన ద్వితీయ అంతర్జాతీయ సదస్సుకు హాజరవ్వడమే కాకుండా సదస్సు ప్రతినిధి (కాన్ఫరెన్స్ రిప్రెసెంటేటివ్) గా కూడా పనిచేశారు. 1967 వ సంవత్సరం నాటికి భారత మహిళా ఇంజనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. లండన్ లోని కేంబ్రిడ్జిలో జరిగిన ద్వితీయ అంతర్జాతీయ సదస్సుకు మరొక ఐదుగురు మహిళా ఇంజనీర్లు హాజరయ్యారు. 1957 వ సంవత్సరంలో శ్యామలకు అనకాపల్లి వాస్తవ్యులు వేదల చిన్న వెంకట చేనులకు ఇచ్చి వివాహం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అల్లుడు చిన్న వెంకట చేను కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరే. అయ్యల సోమయాజుల లలితకు తన పట్టుదల ఇచ్చి, స్ఫూర్తిని కలిగించడంతో పట్టుదలే పెట్టుబడిగా తొలి మహిళ ఇంజనీరు అయిన తన కూతురు ప్రతిభ పాటవాలకు వచ్చిన గుర్తింపుకు కనులరా చుసిన తండ్రి పప్పు సుబ్బారావు 1965 వ సంవత్సరంలో మరణించారు.
1977 వ సంవత్సరంలో పదవీ విరమణ చేసిన లలిత తన నివాసాన్ని కలకత్తా నుండి మద్రాసుకు మార్చారు. విశ్రాంతి దశలో లలిత మనుమడు ఆమె వద్దనే ఉండి చదువుకున్నారు. పదవీ విరమణ తరువాత లలిత తన చెల్లెలితో కలిసి భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి చూశారు. దురదృష్టవశాత్తు ఆమె విశ్రాంతి జీవితం రెండేళ్లకు మించి కొనసాగలేదు. అక్టోబరు 1979 మొదట్లో మెదడులోని నరాల్లో ఒక కణితి ఉన్నట్లు బయటపడింది. అప్పటికే రక్తపోటు ఉన్న లలితను దవాఖానలో చేర్పించారు. 12 అక్టోబరు 1979 సాయంకాలం మెదడులోని ఒక భాగానికి రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరగడంతో ఈ లోకం నుండి లలిత నిష్క్రమించారు. ఆమె ఇచ్చిన స్ఫూర్తి కోట్లాది మంది మహిళలకు మార్గదర్శకం అయ్యింది. ఆ స్ఫూర్తి తన కుటుంబంలోని తరువాత తరం వారు కొనసాగించారు.










