మూగ సినిమా శకం ముగిసి, శబ్ద చిత్రాలు మొదలైన 1931 తరువాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి శబ్దచిత్రం “ఆలం ఆరా” ను అర్దేశిర్ ఇరానీ నిర్మించారు. అప్పట్లో తరువాత రోజులలో నేపథ్య గానం ప్రవేశపెట్టడంతో నటీనటులు పాడవలసిన అవసరం తగ్గింది కానీ తెలుగు సినిమా తొలినాళ్లలో నటీనటులు తప్పనిసరిగా నాటకాల అనుభవం తప్పనిసరిగా ఉండాల్సిందే. బళ్లారి రాఘవ, శాంత కుమారి, కన్నాంబ, యస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరావు, నందమూరి తారకరామారావు, నాగభూషణం మొదలగు వంటి విభిన్నమైన నటులు, విలక్షణమైన స్వరాలున్న ప్రఖ్యాత రంగస్థల నటులు చిత్ర పరిశ్రమకు మారారు. చిత్తూరు నాగయ్య, వేమూరి గగ్గయ్య , కళ్యాణం రఘురామయ్య , నాగేశ్వరరావు, యడవల్లి సూర్య సూర్యనారాయణ, ముదిగొండ లింగమూర్తి , తెలుగు సినిమా తొలినాళ్లలో అత్యుత్తమ నటులు. అయితే నాటకానుభవం లేని, సంగీతానుభవం లేని తెలుగు చలనచిత్ర తొలి స్టయిలిష్ స్టార్ “సి.హెచ్. నారాయణరావు”. ఆయన సినిమా జీవితం 1940 నుండి 1952 వరకు కథనాయకుడిగానూ, ఆ తరువాత పాతికేళ్లుగా సహాయ నటుడిగా, అతిథి నటుడిగా కొనసాగింది.
తక్కువగా సినిమాలు నిర్మాణమైన 1940 వ దశకంలో ఎక్కువగా సినిమాలలో నటించిన ఘనత సి.హెచ్. నారాయణ రావు సొంతం. ఆయన యాభైకి పైగా చిత్రాలలో వివిధ పాత్రలలో నటించిన నారాయణ రావు తెలుగు సినిమా తొలి దశాబ్దాలు అయిన 1940 లలో తెలుగు సినిమా రంగాన్ని చక్రం తిప్పిన ముగ్గురు కథానాయకులు చిత్తూరు వి. నాగయ్య, ఈలపాట రఘురామయ్య తో పాటు తాను కూడా ఉన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు తొలి నేపథ్యగానం చేసింది నారాయణ రావు సినిమాకే. ఆయన సినిమా నుండే ఒక కథనాయకుడికి ఒక గాయకుడు పాడడం మొదలైంది. ప్రముఖ నేపథ్య గాయకులు యం.యస్. రామారావు అత్యధిక పాటలు నేపథ్య గానం చేసింది సి. హెచ్.నారాయణ రావు సినిమాలకే. నండూరి సుబ్బారావు తొలి ఎంకి పాట కూడా నారాయణ రావు నటించిన తహసీల్దార్ సినిమాకే. టంగుటూరి సూర్యకుమారి తొలిసారి కథానాయికగా నటించిన దీనబంధు (1942) చిత్రంలో నారాయణ రావే కథనాయకులు. వైవిధ్యభరితమైన చిత్రాలను నిర్మించి గుమ్మడి, కృష్ణకుమారి లాంటి నటులను వెండితెరకు పరిచయం చేసిన తమిళనాడు టాకీస్ యస్. సౌందర రాజన్ నిర్మించిన తొలి తెలుగు చిత్రం చెంచులక్ష్మి (1958) సినిమాలో విష్ణు పాత్రలో నటించినది నారాయణ రావు. అలాగే వైజయంతి మాల నటించిన తొలి తెలుగు చిత్రం “జీవితం” (1950) అనే సినిమాలో కథనాయకుడిగా నారాయణ రావు నటించారు.
చదలవాడ నారాయణరావు కుటుంబ నేపథ్యం,
సి.హెచ్. నారాయణ రావు పూర్తి పేరు చదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణ రావు. సన్నిహితులు అతడిని దత్తు అని పిలిచేవారు. ఆయన 13 సెప్టెంబరు 1913 నాడు కర్నాటకలో బెంగుళూరు – హుబ్లీ మార్గంలో ఉన్న మధుగిరి లో జన్మించారు. నిజానికి ఆయన తల్లిదండ్రులు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. ఆయన తండ్రి పేరు నరసింహారావు, తల్లి పేరు వజ్ర లక్ష్మి. అయితే నారాయణరావు తల్లి వైపు తాత, ముత్తాతలు, మేనమామలు అప్పట్లో మైసూరు దివాణంలో పనిచేసేవారు. నారాయణరావు తండ్రి చదలవాడ లక్ష్మీ నరసింహారావు రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసేవారు. అనంత పద్మనాభ వ్రతం రోజున పుట్టిన బిడ్డ కావడంతో, ఆ దంపతులు పెట్టుకున్న పూర్తి పేరు చదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణరావు. ఆ పేరే వెండితెరపై సంక్షిప్తంగా సిహెచ్. నారాయణరావు అయింది. నారాయణరావు బాల్యంలో చదువంతా ఏలూరులో సాగింది. అయితే డిగ్రీ చదువు గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో పూర్తి చేశారు. 1930 వ సంవత్సరంలో తాను కళాశాల చదువుతున్నప్పుడే తన మేనమామ నందిరాజు శ్రీరాములు అమ్మాయి శారదాదేవితో వివాహమయ్యింది. అప్పట్లో ప్రకాశం పంతులు గారి బృందంలో చేరి నారాయణ రావు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ ఉండేవారు. అదే సమయంలో అరెస్టు అయి కొద్ది నెలలు జైల్లోనే ఉన్నారు.
రైల్వే గార్డుగా ఉద్యోగం.
నారాయణ రావు జైల్లో ఉండగానే స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు ఇంటూరి వెంకటేశ్వరరావుతో పరిచయం అయింది. ఆ తరువాత రోజులలో నారాయణ రావు తెలుగు చలనచిత్ర కథనాయకుడు అయితే, ఇంటూరి వెంకటేశ్వరరావు మాత్రం తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు, ప్రముఖ పాత్రికేయుడు అయ్యారు. వారిద్దరి స్నేహం చిరకాలం కొనసాగింది. నారాయణ రావు మామగారు మరియు మేనమామ అయిన నందిరాజు శ్రీరాములు రైల్వే డివిజన్లో గార్డుగా పనిచేస్తూ ఉండేవారు. జైలు నుండి విడుదలైన నారాయణరావుకు తన పలుకుబడిని ఉపయోగించి రైల్వే డివిజన్లో గార్డుగా ఉద్యోగం ఇప్పించారు నందిరాజు శ్రీరాములు. ఆ రైల్వే ఉద్యోగంలో తరచూ ప్రయాణాలు ఉండేవి. ఆ ప్రయాణాలలో నారాయణ రావుకు అనేకమంది ప్రముఖులతో పరిచయం ఏర్పడింది.
వీరిలో ఇద్దరు ప్రముఖులతో బాగా సాన్నిహిత్యం ఏర్పడింది. వారిలో ఒకరు ప్రముఖ రాజకీయ నాయకురాలు, కవయిత్రి అయిన సరోజినీ నాయుడు సోదరుడు స్వతహాగా బెంగాలీ అయిన హరింద్రనాథ్ చటోపాధ్యాయ ఒకరు. ఆయన తండ్రి అఘోరేనాథ్ చటోపాధ్యాయ ఉద్యోగరీత్యా హైదరాబాదులోనే ఉండేవారు. హరింద్రనాథ్ చటోపాధ్యాయ ఆంగ్లంలో కవి, నాటకాలు కూడా వేస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు నారాయణ రావును చూసి మీరు బెంగాలీలా అని అడిగారు. ఎందుకంటే నారాయణరావు అందగాడు, స్ఫురద్రూపి మాత్రమే కాకుండా చూడడానికి అచ్చం బెంగాలీ బాబు లాగానే ఉండేవారు. హరింద్రనాథ్ చటోపాధ్యాయ ద్వారా షేక్స్పియర్ నాటకలతో నారాయణరావుకు పరిచయం ఏర్పడింది. హరింద్రనాథ్ ప్రదర్శించిన షేక్స్పియర్ నాటకాలలో నారాయణరావు చిన్న చిన్న పాత్రలను పోషించేవారు. అలా వారిద్దరి స్నేహం చాలా కాలం కొనసాగింది.
ఉద్యోగం పనిమీద తరుచూ మద్రాసుకు.
హరింద్రనాథ్ ద్వారా పరిచయమైన విశ్వ వాసుదేవరావు వలన నారాయణ రావుకు షేక్స్పియర్ నాటకాలను మరింత అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. రైల్వే గాంధీ గారి పేరున్న వరాహగిరి వేంకటగిరి (ఈయననే వి.వి.గిరి అంటారు, ఈయన తరువాత రోజులలో భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు) ప్రభావంతో నారాయణ రావు రైల్వే కార్మికుల సంఘాల్లో క్రియాశీలకంగా పని చేశారు. ఇన్ని ప్రయోగాల తరువాత నారాయణరావుని తన తండ్రి ఏలూరు తీసుకొచ్చారు. 1938 సంవత్సర ప్రాంతంలో ఇక్కడ ప్రముఖ ప్రచురణ సంస్థ వెంకట్రామా అండ్ కో యందు ఉద్యోగం ఇప్పించారు. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా తరచూ ఆయన మద్రాసు వెళ్తూ ఉండేవారు. ఇక్కడ నారాయణరావు మిత్రుడు అయిన మల్లాది రామ్మూర్తి (మీర్జాపురం రాజా వారి జయా ఫిలిమ్ సంస్థలో పని చేస్తూ ఉండేవారు) తో కలిసి ఒకసారి జయా ఫిలిమ్ సంస్థ స్టూడియోకి వెళ్లినప్పుడు నారాయణరావు దేహదారుడ్యం మీర్జాపురం రాజావారిని ఆకర్షించింది.
1939 వ సంవత్సరంలో ఒకరోజు వెంకట్రామా అండ్ కో అనే పనిమీద మద్రాసు వెళ్ళినప్పుడు లడ్జ్ కార్నర్ లోని ఆంధ్ర హోటల్లో నారాయణరావు భోజనం చేస్తున్నప్పుడు ద్రోణంరాజు చిన్న కామేశ్వరరావు అనే వ్యక్తి నారాయణరావును చూసి పలకరించి, సినిమాలలో నటిస్తారా అని అడిగారు. నిజానికి షేక్స్పియర్ నాటకాలలో అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు పోషించిన నారాయణరావుకు సినిమాలలో నటించిన అనుభవం లేదు. నటుడు కావాలని ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. సినిమా నటుడు అంటే నటన, పాటలు రెండు రావాలి. దాంతో ద్రోణంరాజు చిన్న కామేశ్వరరావు వద్ద నారాయణ రావు అనుమానం వ్యక్తం చేశారు. పొట్టి మనిషి, చదువుకున్న వ్యక్తి, పండితుడు ఆయన ద్రోణంరాజు చిన్న కామేశ్వరరావు 1939 లో కచేదేవయాని అనే సినిమాకు రచన చేశాడు. ఆ సినిమాలో దేవయానిగా నటించింది సి.కృష్ణవేణి.
సినిమా రంగప్రవేశం.
ద్రోణంరాజు చిన కామేశ్వరరావు దర్శకత్వం వహించిన కచదేవయాని (1938) చిత్రంలో కథనాయికగా నటించిన సి.కృష్ణవేణి తరువాత రోజులలో తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా (మేకా వెంకట్రామయ్య అప్పారావు బహదూర్) వారికి సతీమణి అయ్యారు. అప్పటికే రాజకీయాలతో విసిగిపోయిన మీర్జాపురం రాజావారు “జయా పిక్చర్స్” (ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు) స్థాపించి ఒక స్టూడియోను నిర్మించారు. ఆ సమయంలో 1939 లో టి.మార్కోని దర్శకత్వంలో “మహానంద” అనే సినిమా తీస్తుండగా రాజావారికి ఒక సమస్య వచ్చింది. ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న టి.మార్కోని అనే ఇటలీ దేశస్తుడిని బ్రిటిష్ సైనికులు అరెస్టు చేయడంతో చేసేదిలేక ఆ సినిమాని పూర్తి చేసే బాధ్యతలను ద్రోణంరాజు చిన కామేశ్వరరావుకు అప్పగించారు రాజావారు.
అయితే ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రాజావారి పనితీరు నచ్చి, ఆయన దర్శకత్వంలోనే మరొక సినిమా నిర్మిద్దాం అనే ఆలోచనలో ఉన్న రాజావారు, కథ ప్రకారం ఆ సినిమాలో కొత్త కుర్రాన్ని తీసుకుందామని అనుకున్నారు. అయితే అప్పటికే ద్రోణంరాజు చిన కామేశ్వరరావు ఒక కుర్రాన్ని ఎంపిక చేసి తర్ఫీదు కూడా ఇస్తున్నారు. కానీ ఆ కుర్రాడి నటన అంతగా బాగోలేదు. అందువలన నారాయణరావుని కలిసి స్టూడియోకి స్క్రీన్ టెస్ట్ కి రమ్మని పిలిచారు ద్రోణంరాజు చిన్న కామేశ్వరరావు. అయితే అంతకుముందే నారాయణ రావును స్టూడియోలో రాజావారు చూశారు. అతడినే దర్శకులు కూడా ఎంచుకున్నందుకు రాజావారు కూడా అభ్యంతరం చెప్పలేదు. నారాయణరావుకు స్క్రీన్ టెస్ట్ చేసి వారు తీయబోయే సినిమాకు ఎంపికచేసి పారితోషికంగా ఒక వంద రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు నిర్మాత రాజావారు. ఆ సినిమా పేరు “జీవన జ్యోతి” (1940). అది 25 అక్టోబరు 1940 నాడు విడుదలైంది. నారాయణరావు, కృష్ణవేణి నటీనటులు. కమలా కోట్నిస్, కుంపట్ల, ఉషారాణి మిగతా పాత్రలు ధరించారు. సమకాలీన సామాజిక సమస్యలు, స్త్రీల ఇక్కట్లు ప్రధాన అంశాలుగా “జీవనజ్యోతి” కథను తెరకెక్కించారు. ఈ సినిమాను 10 సెంటర్లలో ఒకేసారి విడుదల చేశారు. ఈ సినిమా ఓ మాదిరిగా విజయం సాధించినా కూడా నటుడిగా తనకు నూరు మార్కులు పడ్డాయి.
15 సంవత్సరాలు వివిధ రకాల పాత్రలు.
జీవన జ్యోతి (1940) సినిమా తరువాత పత్రికలు నారాయణరావు ను అభినందించాయి. నిండు విగ్రహం, విగ్రహానికి తగ్గ చక్కదనం, చక్కదనానికి తగ్గ భావస్ఫూర్తి ఆయనలో ఉన్నాయని పత్రికలు వ్రాశాయి. మొదటి సినిమాలతోనే తెలుగు చిత్రరంగంలో తన స్థాయిని పదిలపరుచుకోగలిగారు. “జీవనజ్యోతి” సినిమా తరువాత తాను 15 సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అవకాశాల కోసం అర్రులు చాచే అవసరం తనకు కలుగలేదు. అన్ని సంవత్సరాల పాటు నారాయణరావు వివిధ రకాల పాత్రలే కాకుండా ప్రతినాయకుడిగా, హాస్య ప్రతినాయకుడిగా, గుణచిత్ర నటుడిగా తనను తాను నిరూపించుకుంటూ ముందుకుసాగారు. ఆ క్రమంలో నారాయణరావు నటించిన తరువాత చిత్రం వాహిని పిక్చర్స్ పతాకంపై బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తెరకెక్కించిన దేవత (1941). అందులో సుకుమార్ పాత్రలో నారాయణరావు నటించారు. ఇది కథకు చాలా కీలకమైన పాత్ర. ఆ పాత్ర కూడా నారాయణ రావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన తరువాత చిత్రం వాహిని పిక్చర్స్ నిర్మాణంలో కదిరి వెంకటరెడ్డి (కే.వీ.రెడ్డి) దర్శకత్వం వహించిన తొలి చిత్రం భక్త పోతన (1943). ప్రసిద్ధ తెలుగు కవి పోతన జీవితం ఇతివృత్తంగా వెలువడిన ఈ సినిమాలో అతిథి పాత్ర అయిన శ్రీరాముడి పాత్రలో నారాయణరావు నటించారు.
ఘనవిజయం సాధించిన తహసీల్దారు (1944).
నారాయణ రావు నటించిన నాలుగవ చిత్రం “దీనబంధు” (1942). రూపవాణి పిక్చర్స్ పతాకంపై ఎం.ఎల్.టాండన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 14 ఆగస్టు 1942 నాడు విడుదలైంది. టంగుటూరు సూర్యకుమారి కథానాయికగా నటించిన ఈ జానపద చిత్రం దీనబంధు లో ఆమెతో కలిసి నటించిన నారాయణరావు స్టైలిష్ పాత్రలో నటించారు. కానీ ఇది ఆశించినంత విజయం సాధించలేదు. దీని తరువాత నారాయణరావు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చెంచులక్ష్మి (1943). ఈ సినిమా నిర్మాత యస్.సౌందరరాజన్ కు లాభాల పంట పండించింది. ఆ తరువాత జగదీష్ పతాకంపై దర్శకుడు వై.వి.రావు తెరకెక్కించి నిర్మించిన సినిమా తాసిల్దార్. ఇందులో భానుమతి, నారాయణరావులు భార్యభర్తలుగా నటించారు. వారి మధ్య వచ్చే మరో మహిళ కమల కొట్నిస్. ఇందులో కూడా నారాయణరావు ఆకర్షణీయమైన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.
14 నవంబరు 1944 లో విడుదలైన తహసీల్దారు చిత్రం మంచి విజయం సాధించింది. దీని తరువాత నారాయణ రావు నటించిన సినిమా సినిమా స్వర్గసీమ (1945). వేశ్యా వ్యామోహాన్ని గర్హిస్తూ బి.ఎన్.రెడ్డి 1945లో తెరకెక్కించిన స్వర్గసీమ సినిమా తొలి సారిగా భారతదేశపు ఎల్లలు దాటి వియత్నామ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని ఒక విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గణుతికెక్కింది. ఘంటసాల గాయకుడుగానూ, సంగీతదర్శకుడుగానూ పరిచయమైన సినిమా, నటిగా, గాయనిగా భానుమతికి గుర్తింపు తెచ్చిన సినిమా, సినీరచయితగా చక్రపాణి పరిచయమైన సినిమా కూడా ఇదే. భానుమతి పాడిన ఓహో పావురమా అనే పాట విజయవంతమైంది. 10 జనవరి 1946 విడుదలైన ఈ చిత్రం అత్యంత ఘనవిజయం సాధించింది. ఇందులో ప్రధాన పాత్రలో నారాయణరావు నటించగా, కథనాయకుడిగా చిత్తూరు నాగయ్య నటించారు.
తొమ్మిది మంది సంతానం.
మూడు సినిమాలు “దీనబంధు” (1942), “తహసిల్దారు” (1944), “స్వర్గసీమ” (1945) లలో ప్రధాన పాత్ర పోషించిన నారాయణరావు వరుస విజయాలతో, తనదైన షరతులతో నటించే స్థాయికి, నెల జీతం తీసుకునే స్థాయి నుంచి పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకున్నారు. తక్కువ సినిమాలు నిర్మాణమైన రోజులలో కూడా నారాయణరావు రోజుకు రెండు, మూడు సినిమాలలో నటించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సినీ జీవితం ప్రారంభమైన కొత్తలోనే మద్రాసులో కాపురం పెట్టిన ఆ దంపతులకు 1942లో మొదటి కుమారుడు రామకృష్ణ సుకుమార్ జన్మించారు. 1945లో రెండో అబ్బాయి శ్రీ అరుణ్ కుమార్ జన్మించారు. ఆ తరువాత రోజులలో నారాయణరావు, శారదా దేవి దంపతులకు విజయకుమార్, రాధా రాణి, కృష్ణ కుమార్, గిరిజ కుమారి శ్యామ్ కుమార్, వివేకానంద్ కుమార్, కిషోర్ కుమార్ జన్మించారు. అంటే ఏడుగురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు కలిపి మొత్తం తొమ్మిది మంది సంతానం.
ఘన విజయం సాధించిన ముగ్గురు మరాఠీలు (1946).
స్వర్గసీమ (1945) సినిమా తరువాత నారాయణరావు నటించిన చిత్రం ముగ్గురు మరాఠీలు (1946). ప్రతిభా పిక్చర్స్ బ్యానర్‌పై ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ముగ్గురు మరాఠీలు చిత్రం అక్కినేని నాగేశ్వరరావుకు మూడవ సినిమా. 01 జూన్ 1946లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి గుంటూరు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి సెంటర్లలో విజయవంతంగా 100 రోజులుదాకా ప్రదర్శింపబడి ప్రజామోదం పొందింది. ఇందులో సోమోజీ పాత్రలో నారాయణరావు నటిస్తే, చిన్నవాడు ఫిరోజి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. వరుస విజయాలు సాధిస్తున్న నారాయణరావు సినీ జీవితంలో “ముగ్గురు మరాఠీలు” మరో విజయవంతమైన చిత్రం అయ్యింది. ముగ్గురు మరాఠీలు చిత్రం తర్వాత నారాయణరావు నటించిన చిత్రం “మనదేశం” (1949).
నాగయ్య మరియు నారాయణరావు లు అన్నదమ్ములుగా నటించిన “మనదేశం” చిత్రంలో ఎన్.టి. రామారావు బ్రిటిష్ పోలీస్ గా ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఇది ఎన్.టి. రామారావు తొలిచిత్రం కాగా దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్, ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. భారత స్వాతంత్ర్య సంగ్రామం చిత్ర కథకు నేపథ్యం కాగా, ఈ సినిమా “విప్రదాస్” అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. 24 నవంబరు 1949 నాడు విడుదలైన ఈ సినిమా ద్వారానే నందమూరి తారకరామారావు వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో పోలీసు వేషం తీసేసి పంచ, లాల్చీతో నడిచి వస్తుంటే నందమూరి తారక రామారావును చూసి మీరు భవిష్యత్తులో గొప్ప నటుడు అవుతారు అన్నారు నారాయణ రావు. అన్నట్టుగానే నెలల వ్యవధిలోనే ఆయన హీరో అయ్యారు. 1950 వ సంవత్సరంలో నారాయణ రావు నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అన్నింటిలో నారాయణరావుది హీరో పాత్రనే.
“లక్ష్మమ్మ” (1940), “శ్రీ లక్ష్మమ్మ కథ” (1940).
1940 వ సంవత్సరంలో నారాయణరావు నటించిన ఒక్క సినిమా విడుదలయితే, 1950 లో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. నాలుగింటిలోనూ నారాయణరావు కథనాయకుడిగానే నటించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు అయిన 26 ఫిబ్రవరి 1950 నాడు రెండు భారీ సంస్థలు ఒకే కథతో, విభిన్న సాంకేతిక నిపుణులతో పోటాపోటీగా రెండు సినిమాలను విడుదల చేశారు. అవి “లక్ష్మమ్మ”, “శ్రీ లక్ష్మమ్మ కథ”. ఈ రెండూ కూడా ఒకేరోజు విడుదల అవ్వగా, ఆ రెండింటిలోనూ అక్కినేని నాగేశ్వరావు, నారాయణరావు లు హీరోలుగా పోటీపడ్డారు. ఆ రెండు సినిమాల నిర్మాతలు ఆయా హీరోలను వెండితెరకు పరిచయం చేసినవాళ్లే. అక్కినేని నాగేశ్వరావును కథనాయకుడిగా పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య “శ్రీ లక్ష్మమ్మ కథ” అయితే, నారాయణరావు ను వెండితెరకు పరిచయం చేసిన మీర్జాపురం రాజావారిది “లక్ష్మమ్మ” చిత్రం. ఈ సినిమాల విడుదల ముందు ప్రకటనలు, విడుదల తర్వాత ప్రకటనలు అన్నీ కూడా సంచలనమే. అయితే శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై సి.కృష్ణవేణి నిర్మించిన “లక్ష్మమ్మ” సినిమా పైచేయి అయ్యింది.
విజయవంతమైన “జీవితం” (1954).
ఆ తరువాత 19 మార్చి 1954 లో “తిరుగుబాటు” సినిమా విడుదలైంది. ఇందులో కూడా నారాయణరావు కథనాయకుడిగా నటించారు. నాయికలుగా శాంత కుమారి, కృష్ణవేణి నటించారు. ఇది ఆశించినంతగా విజయం సాధించలేదు. ఆ తరువాత నారాయణరావు, జి.వరలక్ష్మీ కలిసి నటించిన చిత్రం మొదటి రాత్రి. 09 జూన్ 1950 నాడు విడుదలైన ఆ చిత్రం పరాజయం పాలైంది. ఆ తరువాత నారాయణరావు నటించిన విజయవంతమైన చిత్రం “జీవితం”. 14 జులై 1954 విడుదలై ఘనవిజయం సాధించింది. ఏ.వి.యం. ప్రొడక్షన్స్ వారు ఎం.వి.రామన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో నిర్మించిన మొదటి చిత్రం. ప్రముఖ నటి వైజయంతిమాలకు ఇది తొలి తెలుగు చిత్రం. తమిళంలో దాని పేరు వాళ్‌గై. ఇందులో ఎస్.వి.సహస్రనామం ధరించిన పాత్రలో తెలుగులో నారాయణరావు నటించారు. 1947 వ సంవత్సరంలో భారత స్వతంత్ర్య దినోత్సవం రోజు మద్రాసులో సినీ కళాకారులందరితో ప్రఖ్యాత రచయిత, ఆకాశవాణిలో రేడియో వ్యాఖ్యత బుచ్చిబాబు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, దానిలో నారాయణరావు కూడా ఉన్నారు.
నిర్మాతగా మారి “మంజరి” అనే చిత్రం నిర్మాణం.
“జీవితం” సినిమా తర్వాత నవంబరు 1950లో మోడరన్ థియేటర్స్ పతాకంపై “ఆడజన్మ” విడుదలై విజయం సాధించింది. 1951 వ సంవత్సరంలో విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై “పేరంటాలు” చిత్రంలో నారాయణరావు నటించారు. లక్ష్మమ్మ కథతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్ తన తరువాత చిత్రం “పేరంటాలు” లో నారాయణరావుని కథనాయకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఆ తరువాత నారాయణరావు నటించిన చిత్రం “మానవతి” (1952). సర్వోదయ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించబడిన మానవతి సినిమాలో నారాయణరావు, జి.వరలక్ష్మి నాయకా, నాయికలుగా నటించారు. నారాయణరావుతో తహసిల్దార్ చిత్రం నిర్మించిన వై.వి.రావు గారే “మానవతి” చిత్రానికి దర్శకులు.
జనవరి 1952లో విడుదలైన ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. అప్పటివరకు ఆయన నటించిన సినిమాల్లో విజయం సాధించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని విజయాల తరువాత ఆయన వేసిన ఒక తప్పటడుగు ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది, అదే సినిమా నిర్మాణం. జూలై 1953లో విడుదలైన “మంజరి” అనే జానపద చిత్రాన్ని దర్శకుడు వై.వి.రావు మొదలుపెడితే నిర్మాణం మధ్యలో ఏర్పడిన ఇబ్బందుల వలన నారాయణ రావు పెట్టుబడి పెట్టక తప్పలేదు. అయితే ఈ సినిమా పరాజయం పాలవ్వడంతో అంతవరకు ఆయన దాచుకున్న సంపాదన బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.
ప్రధాన పాత్రలు పోషిస్తూ.
“మంజరి” సినిమా తరువాత 1954 వ సంవత్సరంలో “మేనరికం”, 1955 వ సంవత్సరంలో “గంగ గౌరీ సంవాదం” లాంటి రెండు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించినా కూడా అవి ఆయన నటనా జీవితాన్ని నిలబెట్టలేకపోయాయి. నిజానికి 1958 లో “గంగా గౌరి సంవాదం” మినహాయిస్తే 1954 వ సంవత్సరానికే నారాయణరావు నట జీవితం ముగిసిందని చెప్పవచ్చు. 1958 తరువాత నారాయణ రావు దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఆయన ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. ఆ తరువాత 1925 వ సంవత్సరంలో “వీలునామా” సినిమాలో చిన్న పాత్ర పోషించారు. ఆ తరువాత 1967 వ సంవత్సరంలో లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో “రహస్యం” అనే చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించారు. ఇలా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ 1982 వరకు అప్పుడప్పుడూ 15 సినిమాలలో అతిథి పాత్రలో నారాయణరావు కనిపిస్తూ వచ్చారు. వాటిల్లో నాగభూషణం సొంత సినిమాలు “ఒకే కుటుంబం” (1970), “ప్రజానాయకుడు” (1972), భాగస్తులు (1975) సినిమాలలో నటించారు. నారాయణ రావు నటించిన చిట్టచివరి చిత్రం కృష్ణంరాజు గారి “మధుర స్వప్నం” సినిమా జనవరి 1982 లో విడుదలైంది. ఈ విధంగా కథనాయకుడిగా నారాయణరావు శకం 1954 లోనే ముగిసింది.
1984లో చదలవాడ నారాయణరావు కన్నుమూత
అరకొర పాత్రలతో 1982 వరకు కొనసాగిన నారాయణ రావు సినిమా జీవితం 1982 తరువాత ఆగిపోయింది. 1950 సంవత్సరాలలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరావు లాంటి వాళ్ళ శకం మొదలయ్యాక కథనాయకులు నాగయ్య తప్ప 1940 సంవత్సరాల ప్రాంతంలో ఉన్న నటులు కనుమరుగైపోయారు. 1955 సంవత్సరానికి నారాయణరావు వయస్సు 42 సంవత్సరాలు. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామశర్మ, కాంతారావు మొదలగువారంతా అప్పటి యువతరం. కానీ నారాయణరావుకు సహాయ పాత్రలు ఎందుకు రాలేదో అర్థం కాలేదు. కథనాయకుడిగా నటించినప్పుడు ఒక పెద్ద బంగాళా, రెండు కార్లు ఉండేవి. 1964 తరువాత ఇల్లు, కార్లు అమ్మేశారు. 1980 తరువాత నారాయణరావు ఆరోగ్యం చాలా దెబ్బతింది. చివర్లో ప్రోస్టేట్ సమస్యతో ఇబ్బంది పడ్డారు.
అది చివరకు మూత్రపిండాల సమస్యకు దారితీసింది. తెలుగు సినిమా రంగంలో తొలి స్టైలిష్ స్టార్ నారాయణరావు 14 ఫిబ్రవరి 1984 మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు దవాఖానలోనే మూత్రపిండాల వైఫల్యంతోనే కన్నుమూశారు. అప్పటికి వాళ్ళ కుటుంబం అంతా ఇంట్లో ఉంది. వారందరూ దవాఖానకు వచ్చారు. వారు అక్కడి నుండి స్మశాన వాటికకు తీసుకెళ్లి తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణరావు మరణ వార్త దవాఖాన నిర్వహకులు ఆనందన్ కు తెలిసింది. దాంతో ఈ విషయాన్ని ఢిల్లీ నుండి ప్రసారమయ్యే ఆకాశవాణిలో ప్రధాన వార్తల్లో ప్రచారం చేశారు. జి.వరలక్ష్మి, కమలా కోట్నిస్, ఇంటూరు వెంకటేశ్వరరావు మొదలగువారు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తన 71 సంవత్సరాల వయస్సులో సి. హెచ్. నారాయణరావు జీవన ప్రస్థానం ముగిసింది










