చర్మ సౌందర్యంలో ఈ మధ్యకాలంలో ‘కొలాజెన్’ అనే పదం బాగా వినబడుతోంది. అసలు కొలాజెన్ అనేది మన శరీరంలో ఎక్కువగా ఉండే ఒక రకమైన ముఖ్యమైన ప్రోటీన్. ఇది చర్మం, ఎముకలు, కణజాలాలకు ఒక బలమైన ఆధారాన్ని ఇస్తుంది. చర్మం టైట్‌గా, మృదువుగా, బలంగా ఉండటంలో కొలాజెన్ పాత్ర చాలా కీలకం. అయితే వయసు పెరిగేకొద్దీ శరీరంలో ఇది సహజంగానే తగ్గిపోతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు పడటం, చర్మం సాగిపోవడం, కళ్ల కింద గీతలు రావడం వంటి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి.
కొలాజెన్ పెంచే స్కిన్‌కేర్, సప్లిమెంట్స్ ఇవే!
వయసు పెరిగే ప్రక్రియను నెమ్మదింపజేసి, చర్మంలో కొలాజెన్ స్థాయులను పెంచుకోవడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. విటమిన్ సి, సన్‌స్క్రీన్ రోజూ వాడటం వల్ల ఉన్న కొలాజెన్ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. అలాగే రెటినాయిడ్స్, పెప్టైడ్స్ వంటివి కొత్త కొలాజెన్ తయారవ్వడానికి బాగా సహాయపడతాయి. మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉంటే కొలాజెన్ ఉత్పత్తికి కావలసిన అమైనో ఆమ్లాలు లభిస్తాయి. ఇక కొలాజెన్ సప్లిమెంట్ల విషయానికొస్తే.. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి కానీ, రాత్రికి రాత్రే అద్భుతాలు ఏమీ చేయలేవని నిపుణులు చెబుతున్నారు.
వర్కవుట్స్, ఆధునిక చికిత్సలతో మెరిసే చర్మం
మన రోజువారీ అలవాట్లు కూడా కొలాజెన్ ఉత్పత్తిపై చాలా ప్రభావం చూపుతాయి. మంచి పోషకాహారం తీసుకోవడం, కంటినిండా నిద్రపోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వ్యాయామంలో భాగంగా వెయిట్స్ ఎత్తడం లేదా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల శరీరంలో కొత్త కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మాన్ని మళ్లీ తాజాగా మార్చడానికి మైక్రోనీడ్లింగ్ వంటి ఆధునిక చికిత్సలు కూడా బాగా పనిచేస్తాయి. కేవలం ఒకే రకమైన ప్రాసెస్ మీద ఆధారపడకుండా, సరైన స్కిన్‌కేర్, మంచి అలవాట్లు పాటిస్తే చర్మాన్ని ఎల్లప్పుడూ హెల్దీగా, యంగ్ గా ఉంచుకోవచ్చు.






