HEALTH & LIFESTYLE

తగినంత నిద్ర లేకపోతే బరువు పెరుగుతారా?

బరువు తగ్గడానికి రకరకాల డైట్లు ఫాలో అవుతుంటాం, జిమ్‌లలో కష్టపడుతుంటాం కానీ కంటినిండా నిద్రపోవడాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. రోజుకు తగినంత నిద్ర లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియలు దెబ్బతిని వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్ర లేకపోతే ఆకలి హార్మోన్లలో మార్పులు

నిద్ర తక్కువైతే ఆకలిని పెంచే ‘గ్రెలిన్’, కడుపు నిండిన భావన కలిగించే ‘లెప్టిన్’ హార్మోన్ల పనితీరు మారుతుంది. దీనివల్ల ఆకలి పెరిగిపోయి, అవసరానికి మించి ఆహారం తీసుకోవడం జరుగుతుంది.

జంక్ ఫుడ్, స్వీట్లపై పెరుగుతున్న మక్కువ

నిద్ర సరిగా లేనప్పుడు శరీరం అలసిపోయి తక్షణ శక్తిని కోరుకుంటుంది. ఈ క్రమంలో క్యాలరీలు, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్, స్వీట్లపై మక్కువ పెరుగుతుంది. నిద్రలేమి కారణంగా రక్తంలో గ్లూకోజ్ వినియోగం, ఇన్సులిన్ పనితీరు దెబ్బతింటాయి. దీర్ఘకాలం పాటు ఈ సమస్య ఉంటే జీవక్రియలు మందగించి ఊబకాయం లేదా మధుమేహం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం వల్ల అర్ధరాత్రి వేళ స్నాక్స్ తినడం అలవాటుగా మారుతుంది. దీనికి తోడు కలిగే అలసట మరుసటి రోజు వ్యాయామం చేయనివ్వదు, దాంతో తీసుకున్న క్యాలరీలు ఖర్చుకాక కొవ్వుగా పేరుకుపోతాయి.

బరువు నియంత్రణకు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి?

ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయాలంటే మంచి ఆహారం, వ్యాయామంతో పాటు రోజుకు 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. అందుకే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా, నిద్రలేచేలా అలవాటు చేసుకోవాలి. అయితే బరువు పెరగడానికి నిద్రలేమి మాత్రమే కాకుండా తీసుకునే ఆహారం, వయసు, జన్యుపరమైన కారణాలు, వాడే మందులు కూడా కారణం కావొచ్చు. దీర్ఘకాలికంగా నిద్రపట్టకపోవడం లేదా వేగంగా బరువు పెరుగుతుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం చాలా మంచిది.

Show More
Back to top button