NRI NewsTelugu News

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో.. ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య హోరాహోరీ

ఇటీవల చికాగో నగరంలో జరిగిన డెమోక్రటిక్‌ పార్టీ సమావేశం తన అధ్యక్ష అభ్యర్థిగా కమలా దేవి హారిస్‌ను ప్రకటించింది. ప్రచారంలో తొలుత అభ్యర్థిగా ఉన్న జో బైడెన్‌ తడబడటం, పొంతన లేకుండా మాట్లాడటం వంటి పరిణామాల వల్ల కమల రంగంలోకి వచ్చింది. నవంబరు 5వ తేదీన జరిగే ఎన్నికలకు ముందు సెప్టెంబరు 10వ తేదీన, తర్వాత జరిగే చర్చల్లో ఆమెను ఎదుర్కొనేందుకు మాజీ ఎంపీ తులసీ గబ్బార్డ్‌ సాయం తీసుకోవాలని ట్రంప్‌ నిర్ణయించాడు. పార్టీలకు వేసే ఓట్లను బట్టిగాక ఎలక్టరల్‌ కాలేజీలో తెచ్చుకొనే ఓట్లే అధ్యక్ష పదవిలో కూర్చునే వారిని నిర్ణయిస్తాయి. అలాంటి ఓట్లు 538 కాగా, గెలవాలంటే 270 కావాలి. ఆగస్టు నెల 18వ తేదీన ఉన్న పరిస్థితిని బట్టి కమలా హారిస్‌ 225, డోనాల్డ్‌ ట్రంప్‌ 219 ఓట్లతో పోటీ పడుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. 

అయితే, ఎన్నికల నాటికి ఈ అంకెలన్నీ మారిపోతుంటాయి. రెండు పార్టీలకు సాంప్రదాయంగా బలమైన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఎటూ మొగ్గని చోట పలుకుబడి పెంచుకొనేందుకు అభ్యర్థులు పోటీ పడతారు. ఈ క్రమంలో ప్రచారంలో ఎన్నో అవాస్తవాలు, దిగజారుడు పద విన్యాసాలు, వినిపిస్తాయి, కనిపిస్తాయి. ట్రంపు ఏం మాట్లాడతాడో తెలియదు. గతంలో బైడెన్‌ ఒక దొంగ, మోసగాడు, అబద్దాల కోరు, చరిత్రలో చెత్త అధ్యక్షుడు అంటూ నోరు పారవేసుకున్న పెద్ద మనిషి ఇప్పుడు కమలా హారిస్‌ మీద కూడా అదే మాదిరి దాడి చేస్తున్నాడు. ఆమె కూడా దొంగ, అబద్దాల కోరు, ఆమె నిజంగా నల్ల జాతీయురాలు కాదు కానీ ఇప్పుడు అలా చెప్పుకుంటున్నది. ఆమె తన పేరును కూడా సరిగా ఉచ్ఛరించలేదు, ఆమె అసమర్ధురాలు అని మాట్లాడాడు. ఆమె సభలకు జనం రావటం లేదు, కృత్రిమ మేథ ద్వారా పెద్ద ఎత్తున జనం ఉన్నట్లు చిత్రిస్తున్నారు అని ట్రంపు ఆరోపణలు చేస్తున్నారు.

అమెరికా ఎన్నికల్లో పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలూ వర్గరీత్యా బహుళజాతి గుత్త సంస్థలు, ఆయుధ తయారీదార్లకు అనుకూలమైనవే. అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించటంలో రెండు పార్టీలూ విఫలమయ్యాయి. ఈ కారణంగానే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావన అక్కడ రోజు రోజుకూ పెరుగుతోంది. కొన్ని సామాజిక సమస్యల్లోనే రెండు పార్టీల మధ్య తేడాలు ఉన్నాయి. అక్కడి వామపక్ష శక్తులు, ఉదారవాదులు ఏ రాక్షసుడితో తక్కువ ముప్పు అని చూసి…చిన్న రాక్షసుడిగా ఉండే డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతు ఇస్తుంటారు.

కీలకమైన రాష్ట్రాలలో కమలా హారిస్‌ది పైచేయిగా కనిపించటంతో ట్రంప్‌ రెచ్చిపోతునట్లు కనిపిస్తోంది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన సభల్లో మాట్లాడుతూ సలహాదారులు రాసి ఇచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి కమలా హారిస్‌ కమ్యూనిస్టు, ఫాసిస్టు ఎజెండాలను పాటిస్తున్నారని ఆరోపించాడు. ట్రంప్‌ ప్రసంగం విసుగు పుట్టించి సభికులు మధ్యలోనే లేచి వెళ్లిపోతుండటంతో కమలా హారిస్‌ మీద వ్యక్తిగత దూషణలతో ఆకర్షించేందుకు చూశాడు.

జో బైడెన్‌తో జరిపిన తొలి సంవాదం సందర్భంగా ట్రంప్‌ ఇతరుల సాయం తీసుకున్నాడు. మారిన పరిస్థితుల్లో కమలా హారిస్‌తో ఎన్నికల సంవాదానికి డోనాల్డ్‌ ట్రంప్‌కు మాజీ మిలిటరీ అధికారిణి, డెమోక్రటిక్‌ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యురాలు, తరువాత రిపబ్లికన్‌ పార్టీకి ఫిరాయించిన తులసీ గబ్బార్డ్‌ సాయం కావాల్సి వచ్చింది. డెమోక్రటిక్‌ పార్టీలో ఉండగా కమలా హారిస్‌ మంచి చెడ్డలు, ఆమె రాజకీయ, ఇతర అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి తులసి. 2020లో అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం కమలా హారిస్‌తో పాటు పార్టీలో పోటీ పడింది. 2022లో ఆమె రిపబ్లికన్‌ పార్టీలో చేరింది. అందుకే ట్రంప్‌ ఆమెను ఎంచుకున్నాడు.

తులసి తిరోగమన భావాలు ట్రంప్‌కు ప్రతిరూపంగా ఉంటాయి. తులసీ గబ్బార్డ్‌ను ఎంచుకోవటంలో తనకూ కమలతో సమానమైన మహిళ తులసి మద్దతు ఉందని చెప్పుకొనేందుకు, అమెరికాలో స్థిరపడిన హిందువుల ఓట్ల వేట కూడా ఇమిడి ఉంది. కమలా హారిస్‌ భారతీయ మూలాలు ఉన్న ఆఫ్రికన్‌. డెమోక్రటిక్‌ పార్టీలో ఉన్నపుడు 2020 ఎన్నికల్లో పార్టీలో కమలతో పోటీ పడి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే కమల కంటే తులసికి తక్కువ ఓట్లు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ.. ఇప్పటి వరకు వివిధ మీడియా సర్వేలు ఇచ్చిన విశ్లేషణల ప్రకారం కమలా హారిస్‌ ముందంజలో ఉన్నారు.

Show More
Back to top button