Telugu News

అమాయకులే కాదు ఐటీ ఉద్యోగులూ బలి.. అసలు జాగ్రత్తలు ఇవే..

“మీ అకౌంట్ బ్లాక్ అయింది, వెంటనే ఈ లింక్ నొక్కండి”, “మీకు లాటరీలో రూ. 20 లక్షలు వచ్చాయి”, “పార్ట్ టైమ్ జాబ్స్.. రోజుకు రూ. 5 వేలు సంపాదించండి”.. పొద్దున్న లేచింది మొదలు మన ఫోన్లకు ఇలాంటి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ఎన్నో వస్తూనే ఉంటాయి. ఈరోజుల్లో దొంగలు చేతిలో కత్తులు, గొడ్డళ్లు పట్టుకుని రోడ్ల మీద తిరగడం లేదు. జస్ట్ ఒక లాప్‌టాప్, ఫోన్ పట్టుకుని ఏసీ రూముల్లో కూర్చుని మన బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు. దాన్నే ‘సైబర్ మోసాలు’ అంటున్నారు. చదువుకోని వాళ్లే కాదు, పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, రిటైర్డ్ అధికారులు కూడా ఈ మాయగాళ్ల వలలో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అసలు ఈ డిజిటల్ దొంగలు మనల్ని ఎలా బురిడీ కొట్టిస్తున్నారు? వీళ్ల ట్రాప్‌లో పడకుండా మన కష్టార్జితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

ఈ సైబర్ నేరగాళ్లు వాడే మెయిన్ వెపన్ ఏంటో తెలుసా? మనకు ఉండే ‘ఆశ’ లేదా ‘భయం’. పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొడితే చాలు వందల రూపాయలు ఇస్తామని నమ్మిస్తారు. మొదట్లో ఒక రూ. 500 ఇచ్చి టాస్కుల పేరుతో లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయించి ముంచేస్తారు. ఇంకొన్ని సార్లు “మీరు డ్రగ్స్ కేసులో దొరికారు.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం” అంటూ పోలీస్, సీబీఐ అధికారులలాగా వీడియో కాల్స్ చేసి భయపెడతారు. దాన్నే ‘డిజిటల్ అరెస్ట్’ అంటారు. అలా భయపడేలా చేసి అకౌంట్లలోని డబ్బులన్నీ వాళ్ల ఖాతాల్లోకి బదిలీ చేయించుకుంటారు. ఇవే కాకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లు, కరెంట్ బిల్ కట్ అయిపోతుందనే ఫేక్ మెసేజ్‌లు పంపి మనల్ని ఈజీగా ట్రాప్ చేస్తున్నారు.

మరి ఈ మోసాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఫస్ట్ రూల్ ఏంటంటే.. ఈ ప్రపంచంలో ఉచితంగా రూపాయి కూడా ఎవరూ ఇవ్వరు అనే విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఫోన్ కి వచ్చే ఓటీపీలు (OTP), బ్యాంక్ పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు అస్సలు ఎవరికీ చెప్పకూడదు. బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసినా సరే ఓటీపీ అడగరనే లాజిక్ మిస్ అవ్వద్దు బాస్. తెలియని నంబర్ల నుండి వచ్చే లింకులను అస్సలు క్లిక్ చేయకూడదు. అలాగే ఎవరైనా పోలీస్ లేదా కస్టమ్స్ అధికారులమని చెప్పి ఫోన్ చేసి భయపెడితే.. కంగారు పడకుండా వెంటనే ఫోన్ కట్ చేసి, లోకల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లడమో లేదా ఇంట్లో వాళ్లకు చెప్పడమో చేయాలి. ఫోన్లలో మన పర్సనల్ ఫోటోలు, బ్యాంక్ డీటెయిల్స్ దాచుకోకపోవడం చాలా మంచిది.

ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి సైబర్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే.. అస్సలు టైమ్ వేస్ట్ చేయకూడదు. వెంటనే ‘1930’ అనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. మోసం జరిగిన గోల్డెన్ అవర్ (మొదటి గంట) లోపు గనక ఫోన్ చేస్తే, ఆ దొంగల అకౌంట్లను హోల్డ్‌లో పెట్టి మన డబ్బులు తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో అయినా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. టెక్నాలజీ పెరిగింది.. దాంతో పాటు దొంగతనాలు కూడా డిజిటల్ అయిపోయాయి. అందుకే స్మార్ట్ ఫోన్ వాడటమే కాదు బాస్.. మనం కూడా కొంచెం స్మార్ట్‌గా, అలర్ట్‌గా ఉందాం.

Show More
Back to top button