Telugu News

బిస్లరీ నీటిపై FSSAI ఆందోళన.. కంపెనీ ఏమంటోంది?

ప్రముఖ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బ్రాండ్‌ బిస్లరీ నీటి నాణ్యతపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కీలక ప్రకటన చేసింది. గోవాలోని బిస్లరీ తయారీ కేంద్రం నుంచి సేకరించిన నీటి నమూనా నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని వెల్లడించింది. తొలుత నమూనాలో బ్రోమేట్‌ స్థాయులు పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించామని, ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం నీటిని సురక్షితం కానిదిగా ప్రకటించినట్లు తెలిపింది. కంపెనీ అప్పీల్‌ చేయడంతో నమూనాను రిఫరల్‌ ఫుడ్‌ ల్యాబొరేటరీకి పంపగా, అక్కడ నిర్వహించిన పరీక్షల్లో పాలీన్యూక్లియర్‌ అరోమాటిక్‌ హైడ్రోకార్బన్లు ఉన్నట్లు గుర్తించామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. దీంతో బిస్లరీ ఇంటర్నేషనల్‌పై చట్టపరమైన చర్యలకు అనుమతి ఇచ్చింది.

బిస్లరీ నీరు సురక్షితమే.. కంపెనీ ఏమంటోంది?

ఈ ప్రకటనపై బిస్లరీ స్పందిస్తూ.. తమ నీరు సురక్షితమని, వినియోగదారుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. తమ 10 దశల తయారీ ప్రక్రియలో 90కి పైగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అధికారులు పరీక్షించిన నమూనాలు సుమారు 14 నెలల క్రితం గోవా ప్లాంట్‌లో తయారైన ఒక బ్యాచ్‌కు చెందినవని వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌ 30న ప్లాంట్‌ నుంచి ఆరు నమూనాలు సేకరించారని, ఈ ఏడాది ఫిబ్రవరి 2న స్వతంత్ర పరీక్షల ఫలితాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి సమర్పించినట్లు కంపెనీ తెలిపింది. నాణ్యత విషయంలో అధికారుల నుంచి అధికారిక నోటీసు అందకపోవడంతో ఈ అంశం ముగిసిందని భావించామని వివరించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్‌ వాటర్‌ బ్రాండ్లపై FSSAI నిఘా

బిస్లరీ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బ్రాండ్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దృష్టి పెట్టింది. మార్కెట్‌లోని అన్ని బ్రాండ్ల నీటి నమూనాలను పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షల అనంతరం వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. నీటి నాణ్యతతో పాటు ప్రముఖ బ్రాండ్లను పోలిన పేర్లు, లేబుళ్లను ఉపయోగిస్తున్న సంస్థలపైనా నిఘా పెట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలతో ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ నాణ్యత, భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Show More
Back to top button