ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో నిర్ణయించడంలో కీలక అంశం నిరుద్యోగం. ప్రజలకు చేతినిండా పని దొరికితే వస్తు సేవలకు గిరాకీ పెరుగుతుంది. నిరుద్యోగం తగ్గి ఖజానాకు భారీగా డబ్బులు వస్తాయి. రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతూ న్నామని ప్రకటనలు చేస్తున్నా అది ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదని కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
ప్రధాని మోడీ 2014 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2014 నుంచి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ 2024 వరకు 10 సంవత్సరాల పాటు 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. దేశంలో రోజుకు 40 వేల మంది నిరుద్యోగులు నెలకు 11 లక్షల మంది నిరుద్యోగులు పెరుగుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగుల కోసం తిరుగుతున్న పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం మాట అటుంచితే.. నిరుద్యోగం పెంచుతున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, పరిశ్రమలు తీసుకువచ్చి లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఈ సంవత్సరం జూన్‌లో మనదేశ నిరుద్యోగ రేటు 8 నెలల గరిష్ట స్థాయికి చేరి 9.2 శాతానికి చేరింది. మే నెలలో ఏడు శాతం ఉండగా ఒక నేలలో 2.2శాతం నిరుద్యోగ రేటు పెరిగింది. మనదేశంలో నాలుగింట ఒక వంతు మంది నిరుద్యోగులు ఉన్నారు. గత ఏడాది జూన్లో 8.5 శాతం ఉంది. 2024 జూన్ నాటికి 9.3 శాతానికి నిరుద్యోగ రేటు చేరుకుంది.
దేశంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరగడానికి కారణం జనాభా వేగంగా వృద్ధి చెందడంతో.. దానికి తగ్గట్టుగా సాంకేతిక నైపుణ్యాలు పెంచకపోవడం మరో కారణం. నిరుద్యోగుల్లో యువత కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. గత ఏడాది జూన్‌లో నిరుద్యోగంతో సతమత మవుతున్న మహిళలు 15.1 శాతం ఉంటే ఈ ఏడాది జూన్ నాటికి అది 18.5 శాతానికి పెరిగింది. దేశీయంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను సమీకరించకపోవడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురాకపోవడం పారిశ్రామిక అభివృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయి.
అయితే దేశంలో ప్రస్తుతం 47శాతం మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉద్యోగ నైపుణ్యాల లేక బాధపడుతున్నారని పలు సర్వేలు బయటపెట్టాయి. అంతేకాకుండా ఎంబిబిఎస్ పూర్తి చేసిన రెండు లక్షల మంది నిరుద్యోగులు మిగిలిపోయారు. నిరుద్యోగ యువతకు స్కిల్స్ పెంచడం, దేశీయంగా పెట్టుబడులు, ఎఫ్డీఐల ద్వారా విస్తృతంగా విదేశీ పెట్టుబడిన తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సులను అమలు చేయాలి.
గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అమలు చేస్తున్నట్లు పట్టణ ప్రాంతాల్లోనూ ఈ పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టాలి. వికసిత భారత్, ఆత్మ నిర్బ ర్, మేకిన్ ఇండియా పేరుకు మాత్రమే కార్యక్రమాలుగా మిగిలాయి తప్ప, వాటితో సున్నా ఫలితాలే. కాబట్టి వీటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి త్వరితగతిన నిరుద్యోగ సమస్యకు పరిష్కారం తీసుకొస్తే.. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా.. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది.