రాయలసీమ తలరాతను మార్చేసే ఒక మంచి రోజు వచ్చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆనందంగా చెప్పారు. కడప జిల్లా జమ్మలమడుగు దగ్గరున్న సున్నపురాళ్లపల్లెలో దాదాపు రూ.16,350 కోట్ల భారీ ఖర్చుతో కట్టబోతున్న ‘జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ’ పనులను ఆయన స్వయంగా ప్రారంభించారు. దీంతో పాటు విజయనగరంలో ఉన్న జిందాల్ ఇండస్ట్రియల్ పార్కును కూడా ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ స్టీల్ ప్లాంట్ రావడంతో సీమ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం మొదలైందని, ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా ఈ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేస్తానో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తానని ప్రజలకు నమ్మకం ఇచ్చారు.
రాయలసీమ అంటే అందరూ అనుకునేలా కరవు ప్రాంతం కాదని, నీటితో కళకళలాడే పచ్చటి నేలని చంద్రబాబు గుర్తుచేశారు. ఇక్కడ పండ్ల తోటలు ఎంత బాగా పండుతాయో అందరికీ తెలిసిందేనన్నారు. గత ఐదేళ్ల తప్పుడు పాలన వల్ల దెబ్బతిన్న మన రాష్ట్రానికి మళ్లీ ఊపిరి పోస్తున్నామని, ఇప్పుడు వస్తున్న కొత్త ఫ్యాక్టరీలు, ఉద్యోగాలతో రాయలసీమ ప్రాంతమంతా ఎంతో బిజీగా మారిపోతోందని చెప్పారు. ఒకప్పుడు రాళ్ల సీమగా పిలిచిన ఈ గడ్డను, ఇప్పుడు నిజమైన ‘రతనాల సీమ’గా మార్చి చూపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి సజ్జన్ జిందాల్ గారు రెడీగా ఉన్నారని, సీమ ప్రజలకు అన్నీ మంచి రోజులేనని చెప్పారు.
గతంలో ఎన్నికల కోసం చేసిన మోసపూరిత శంకుస్థాపనలను ప్రజలంతా చూశారని బాబు విమర్శించారు. 2019లో ఒకసారి, మళ్లీ 2023లో ఇంకోసారి కేవలం బోర్డులు పెట్టి కొబ్బరికాయలు కొట్టారే తప్ప.. కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదు, చిన్న గది కూడా కట్టలేదని మండిపడ్డారు. కానీ తాము అధికారంలోకి రాగానే అడ్డంకులన్నీ క్లియర్ చేసి, ఫ్యాక్టరీ కోసం వెంటనే 1100 ఎకరాల భూమిని ఇచ్చేశామని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా రెండు దశల్లో రెండు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి కాబోతోందని, దీంతో మన ఏపీ దేశంలోనే ఒక పెద్ద ఉక్కు రాష్ట్రంగా మారుతుందని చెప్పారు. ఇకపై స్టీల్ అంటే కేవలం వైజాగ్ మాత్రమే కాకుండా.. మన రాయలసీమ కూడా మెయిన్ సెంటర్ కాబోతోందని చంద్రబాబు సగర్వంగా చెప్పారు.






