
కొత్త ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం.. రూ.11,500 కోట్ల ప్యాకేజీతో ఇటీవల ఆమోదముద్ర..!
సమగ్ర ప్రణాళికతో.. విశాఖ స్టీల్ పరిరక్షణ.. ప్రైవేటీకరణకు నో ఛాన్స్ – సీఎం చంద్రబాబు నాయుడు..
స్టీల్ రంగంలో విశాఖ ఉక్కు అనేది ప్రధాన సంస్థ. పోర్ట్ ఆధారిత స్టీల్ ప్లాంట్ గా ఇది వ్యవహరిస్తోంది. ఈ పరిశ్రమను కొనేళ్ళ తరబడి అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో..
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు కలిసినప్పుడు ప్లాంట్ ప్రస్తావన తేగా.. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన్ను కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని వివిధ సందర్భాల్లో వీలైనప్పుడల్లా సీఎం చెబుతూనే ఉన్నారు.
కాగా చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించటంతో, ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. ఈ సందర్భంగా రూ.11,500 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తాజాగా కేంద్రం నిర్ణయించింది.
గత ప్రభుత్వ హయంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే! ఎందుకంటే అప్పట్లో జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలోనూ అసమర్థ రాజకీయాలే చేసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద గట్టిగా పట్టుబట్టిందిలేదు. పైగా స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేసి ఆర్థిక ఇబ్బందులు పరిష్కరించుకోవాలని ఉచిత సలహాలు సైతం ఇచ్చిన ఘనత గత పాలకులదే అనడంలో అతిశయోక్తి లేదు.
కనీస సామర్థ్యంతో ఈ ప్లాంట్ పనిచేస్తూ ఉండటమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం ఒక అంచనాకు వచ్చింది. ఒక పక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మరోపక్క ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు ముందుకు తీసుకువచ్చాయి. దీనికితోడు గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో కార్మికుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రైవేటీకరణ జరగనీయబోమని చెప్పడంతో.. ప్లాంట్‌ను నిలబెట్టే చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పుడు ప్లాంట్ నిర్వహణకు మూలధనం అందివ్వడం విశేషం!
విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి ఎలాగంటే.. త్వరలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ప్రారంభమవుతాయి. అటు పిమ్మట ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్‌లు అందుబాటులోకి రానున్నాయి.
వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు, సరిపడినంత ముడిసరకు లేకపోవడం, కోర్టు ఎటాచ్‌మెంట్ లు, ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ తదితరాలతో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వీటిని తీర్చడంతోపాటు భవిష్యత్తులో తలెత్తే ఇతర సమస్యలను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు స్థాయీసంఘానికి ఇదివరకే చెప్పింది. దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలోనూ సిఫార్సు చేసింది. దానిప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు స్పష్టమవుతుంది.