Telugu Featured News

ఏపీని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే. స్వర్ణాంధ్ర-2047 విజన్‌!

తలసరి ఆదాయం.. వృద్ధిరేటుపై సీఎం ప్రత్యేక పవర్‌ ప్రజెంటేషన్‌.. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌గా చేస్తాం..!

2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రూ.2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2047 నాటికి రూ.58.14 లక్షలు అవుతుందని తెలిపారు. 15% వృద్ధిరేటు లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని, 2047 నాటికి 42 వేల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యంగా నిర్ధేశించుకున్నామన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రూ.నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. అమరావతి పనులు జరుగుతున్నాయి. పోలవరం పనులు వేగవంతమయ్యాయి. అమెరికా సిలికాన్‌ వ్యాలీలో నీరులేక రూ.4 లక్షల కోట్ల ఆస్తి బూడిదపాలు అయ్యింది.. అందుకే నీటి భద్రత ముఖ్యం. పోలవరం పూర్తయ్యేనాటికి గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేయనున్నాం. 

2025-26లో జీఎస్‌డీపీ 15% వృద్ధి చెందితే… రాష్ట్ర సంపద రూ.18.47 లక్షల కోట్లకు చేరుతుంది. ప్రభుత్వ రుణపరిమితి రూ.64,646 కోట్లకు పెరుగుతుంది. ఇకపోతే రాష్ట్ర సొంత ఆదాయం, రుణాల ద్వారా తెచ్చుకున్నా.. మొత్తం కలిపి… రూ.1,84,703 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వం ఖర్చు చేసేందుకు అదనంగా రూ.20,645 కోట్లు అందుబాటులో ఉంటాయి. 15% వృద్ధిరేటు ఇలాగే కొనసాగితే గనుక.. 

2029-30 నాటికి రాష్ట్ర సంపద రూ.32.30 లక్షల కోట్లకు.. రుణపరిమితి రూ.1.13 లక్షల కోట్లకు చేరుతుంది. ప్రభుత్వానికి సమకూరే మొత్తం వనరులు రూ.2.23 లక్షల కోట్లకు చేరతాయి. ప్రభుత్వం వద్ద రూ.42,136 కోట్ల అదనపు నిధులు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. 

*మూడు రాజధానుల పేరిట అమరావతిని గత పాలకులు సమాధి చేశారు. ఏపీ జీవనాడి అయిన పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు, గత ఐదేళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలసపోవడం, పారిశ్రామికవేత్తలు సైతం రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని ఆయన దుయ్యబట్టారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను నమ్మారు.. నేను వస్తే అభివృద్ధి జరుగుతుంది. సంపద వస్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్‌ బాగుంటుందని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

*సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది.
అభివృద్ధి వల్ల సంపద పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించి పేదరికాన్ని పూర్తిగా రూపుమాపవచ్చు. ఇది నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం. 

ఇదివరకు నేను తెచ్చిన విజన్‌ 2020తో నేడు దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ ముందుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కువ తలసరి ఆదాయం ఆర్జిస్తున్నారు. రెండోతరం ఆర్థిక సంస్కరణలకు నేను నాంది పలికాను. విద్యుత్‌రంగంలో సంస్కరణలు తెచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చి నేను ఓడిపోయాను. ఆ విషయంలో నేను రాజీపడి ఉంటే ఓడిపోయేవాడిని కాదేమో. విమానాశ్రయాలకు ఓపెన్‌ స్కై పాలసీ తీసుకొచ్చాను. శంషాబాద్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టులకు శ్రీకారం చుట్టాను. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టును 5 వేల ఎకరాలతో ప్రారంభించామని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. నాడు విశాలమైన రహదారులకు శ్రీకారం చుట్టాను. నేడు 14 లైన్ల వరకూ రోడ్లు వేస్తున్నారు. నాడు హైదారాబాద్‌లో 163 కిలోమీటర్ల రింగ్‌ రోడ్డుకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సంపద సృష్టే. వీటివల్లే ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంలో గుర్తు చేశారు.

ఇక గతేడాదికంటే ఈ ఏడాది 4.03 శాతం వృద్ధి రేటు పెరిగింది. తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్ధి 13.21 శాతం ఉండగా గత ప్రభుత్వంలో అది 9.06 శాతమే ఉంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. ఆదాయం పెరిగితేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అందుకే విజన్‌ రూపొందించి దానికనుగుణంగా పనిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు. టీడీపీ వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. సుమారు ఏడు నెలల్లోనే రూ.1500 కోట్ల బకాయిలు చెల్లించామని వివరించారు.

పీ-4:
ఉమ్మడి రాష్టంలో అమలు చేసిన సంస్కరణలు, తెచ్చిన పాలసీలతో కోట్లాదిమంది జీవితాలు, రాష్ట్ర భవిష్యత్తు రెండూ మారాయి. ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా నాడు తీసుకువచ్చిన పీ3 (పబ్లిక్‌, ప్రైవేట్‌, పార్టనర్‌ షిప్‌) విధానంతో ఉపాధి, సంపద సృష్టి మెండుగా జరిగింది. 

ఇప్పుడు స్వర్ణాంధ్ర- 2047 విజన్‌ను ఆవిష్కరించాం. ఇందులో పేర్కొన్న పది సూత్రాల అమలు ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ చేసేందుకు అడుగులేస్తున్నాం. 

వీటిలో మొదటి సూత్రం జీరో పావర్టీ. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించిందే పీ4 కాన్సెప్ట్‌ (పబ్లిక్‌- ప్రైవేటు- పీపుల్‌- పార్టనర్షిప్‌). 

ఉత్పాదకత, సుస్థిరత సాధించేందుకు…

టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మార్చడంతో పాటు ఖర్చు తగ్గించే విధానాలపై దృష్టి సారించడం, ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ వహించడంతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుని పారదర్శకమైన, మంచి పరిపాలనను అందించాలని స్వర్ణాంధ్ర విజన్‌-2047 ను ప్రభుత్వం రూపొందించింది.

అందులో భాగంగా కోత అనంతర నష్టాలు తగ్గించేందుకు ఏఐ, ఐఓటీ, రొబోటిక్స్, డ్రోన్స్, ఉపగ్రహ సాంకేతికత వినియోగం పెరగాలని విజన్‌ డాక్యుమెంట్‌ సూచించింది. 

*చిన్న రైతులకు డిజిటల్‌ సేవలు, మైక్రో క్రెడిట్‌ సౌకర్యాలు, పంటల బీమా, రియల్‌టైమ్‌ రాయితీలు అందించనున్నారు. డిజిటల్‌ అక్షరాస్యతపై శిక్షణ ఇవ్వనున్నారు. 2047 నాటికి 40శాతం భూముల్ని ప్రకృతి సేద్య విధానంలోకి మార్చాలని నిర్దేశించింది.

*నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ఆధారిత విద్య ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 

*AI విశ్వవిద్యాలయం, AIజాతీయ కేంద్రం, మూడు నుంచి ఐదు ప్రపంచ స్థాయి బహుళ విభాగాల విద్య, పరిశోధన విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలను నాలెడ్జ్‌ సిటీలుగా అభివృద్ధి చేయనుంది. 

*పాఠశాల, ఉన్నత విద్యను నైపుణ్య కోర్సులతో అనుసంధానం చేయనుంది. ఇందులో భాగంగా 6 నుంచి 8తరగతుల్లో వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెడతారు. ఇవి ఉన్నత విద్య వరకు కొనసాగుతాయి.

*ఏడు యాంకర్‌ హబ్‌లు, మరో 40 టూరిస్ట్‌ సర్క్యూట్ల ఏర్పాటు ద్వారా పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది. దేశీయ, విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని పెద్దఎత్తున సందర్శించేలా ప్రణాళికలు రూపొందించింది. తిరుపతిని ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. అమరావతి, నాగార్జునకొండ, బౌద్దగయతో కలిపి బుద్దిస్ట్‌ సర్క్యూట్‌ని అభివృద్ధి చేయనున్నారు.

*ఇకపోతే అమరావతి రాజధాని ప్రాంతంలో సాంకేతికత, విద్య, ఆర్థిక, క్రీడ, ఆరోగ్య, ఎలక్ట్రానిక్స్, న్యాయసేవలు, పాలన, పర్యాటకం సమగ్రస్థాయిలో వృద్ధి చెందేలా చేయనున్నారు. అమరావతిని భవిష్యత్‌ మహానగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా నౌకాశ్రయాలు, రహదారులు, విమానాశ్రయాలు, అంతర్గత జలమార్గాలను ఇంటిగ్రేటెడ్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించి, రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మార్చనున్నారు. 

*ఉత్తరాంధ్రలో విశాఖను ఆర్థిక దిక్సూచిగా నిలపనున్నారు. కర్నూలులో విత్తన కేంద్రం, రక్షణ- పౌర విమానయానం, సౌర, పవన విద్యుత్ కేంద్రాల వృద్ధి చేయనున్నారు. 

*తిరుపతిలో ఫుడ్‌ ప్రాసెసింగ్, విద్య, మొబైల్‌- ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ, పర్యాటకం, రియల్‌ ఎస్టేట్‌ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. 

*గోదావరి ప్రాంతంలో కాకినాడను ఆర్థిక దిక్సూచిగా మలచుకుని.. ఈ ప్రాంతంలో ఆక్వా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, షిప్పింగ్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్ గా అభివృద్ధి చేస్తారు. ఇలా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ 2047 నాటికి సుస్థిరతతో కూడిన భవిష్యత్తును కల్పించాలని రాష్ట్రప్రభుత్వం సంకల్పించింది.

Show More
Back to top button