Telugu Featured News

రూ.12.75 లక్షల వరకు టాక్స్ కట్టనవసరం లేదు..! అది ఎలా అంటే..?

ఈరోజు వచ్చిన బడ్జెట్‌లో ఎన్నో విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ మధ్య తరగతి వారికి ఆనందం కలిగించే విషయం పన్ను విభాగం. అయితే దీని విషయంలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ రూ.12.75 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు అని చెప్పారు కదా..? మళ్లీ ఎందుకు రూ.4 లక్షల నుంచి 5% టాక్స్ కట్టాలని అని అంటున్నారు అసలు ఏంటి? ఈ విధానం వివరంగా తెలుసుకుందాం.. పదండి. 

ప్రస్తుతం స్లాబ్స్ ఇలా..

రూ.4,00,000 వరకు  0

రూ.4,00,001-8,00,000 వరకు 5%

రూ.8,00,001-12,00,000 వరకు 10%

రూ.12,00,001-16,00,000 వరకు 15%

రూ.16,00,001-20,00,000 వరకు 20%

రూ.20,00,001-24,00,000 వరకు 25%

రూ.24,00,001 దాటితే 30%

పన్ను విధానం మీకు వివరంగా అర్థం కావాలంటే కొన్ని పదాల అర్థాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవే స్టాండర్ట్ డిడక్షన్, రిబేట్.

* స్టాండర్ట్ డిడక్షన్ అంటే ఏమిటి?

స్టాండర్ట్ డిడక్షన్ శాలరీ వచ్చే వారికి, రిటైర్‌ అయ్యి పెన్షన్ వస్తూ.. పన్ను చెల్లించే వారికి ఉపయోగపడుతుంది. వీరికి వచ్చే ఆదాయంలో ఒక నిర్దిష్ట అమౌంట్‌ని డిడక్ట్ చేసుకుని పన్ను చెల్లించాలి. ప్రస్తుతం స్టాండర్ట్ డిడక్షన్‌ రూ.75 వేలు ఉంది. ఉదాహరణకు మీకు రూ.8 లక్షల వేతనం వస్తున్నట్లయితే, అందులో ముందుగానే రూ.75 వేలు కట్ చేసి మిగిలిన రూ.7,25,000కు పన్ను చెల్లించాలి. 

* రిబేట్ అంటే ఏమిటి?

రిబేట్ అంటే క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ లాంటిది. సెక్షన్ 87ఏ ప్రకారం మనం చెల్లించిన పన్ను తిరిగి మనకు వస్తుంది. ఇది గతంలో రూ.25 వేలు ఉండేది. దీనిని ప్రస్తుతం రూ.60 వేలకు పెంచారు. అంటే మీరు రూ.60 వేలు లేదా అంతకంటే తక్కువ పన్ను చెల్లించినట్లయితే .. ఆ డబ్బంతా మీకు తిరిగి వస్తుంది. సాధారణంగా మనం పన్ను చెల్లించిన 4 లేదా 5 వారాల్లో మనకు రిబేట్ అవుతుంది.

పన్ను విధానం

అసలు విషయానికి వస్తే… ప్రస్తుత ఇన్‌కామ్ స్లాబ్స్ ప్రకారం వచ్చే ఏప్రిల్ నుంచి రూ.12.75 లక్షల ఆదాయం వచ్చే వారు కూడా రూ.0 పన్ను చెల్లించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు లెక్క వేద్దాం. రూ.12.75 లక్షల ఆదాయం వస్తుందంటే అందులో రూ.75 వేలు స్టాండర్ట్ డిడక్షన్ మినహాయింపు లభిస్తుంది. అంటే కేవలం రూ.12 లక్షలకే మీరు పన్ను చెల్లించాలి. కొత్త టాక్స్ స్లాబ్స్ ప్రకారం రూ.4,00,000 వరకు  0% పన్ను చెల్లించాలి. తర్వాత రూ.4,00,001-8,00,000 వరకు 5% అంటే కేవలం రూ.4 లక్షలకు మాత్రమే పన్ను చెల్లించాలి..

అంటే రూ.20,000. ఆ తర్వాత రూ.రూ.8,00,001-12,00,000 వరకు 10% అంటే మళ్లీ రూ.4 లక్షలకు మాత్రమే పన్ను చెల్లించాలి అంటే రూ.40,000. మొత్తం కలిపి(రూ.0+ రూ.20,000+రూ.40,000) రూ.60 వేలు మాత్రమే రూ.12.75 లక్షల ఆదాయానికి మనం పన్ను చెల్లించాలి. కానీ, మనకు రిబేట్‌ను రూ.60 వేలకు పెంచడంతో ఈ డబ్బు కూడా మనకు రిబేట్ అవుతుంది. మనం చెల్లించే పన్ను రూ.60 వేలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా స్టాండర్ట్ డిడక్షన్(SD) రూ.75 వేలు + రిబేట్‌ రూ.60 వేల వల్ల రూ.12.75 లక్షల ఆదాయం వచ్చినా రూ.1 కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Show More
Back to top button