కేంద్ర బడ్జెట్ 2026: రూ. 53.47 లక్షల కోట్లతో నవ భారత నిర్మాణానికి బలమైన పునాది!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమర్పించిన బడ్జెట్, భారతదేశాన్ని ‘వికసిత భారత్ – 2047’ దిశగా నడిపించే ఒక బృహత్తర ప్రణాళికగా నిలిచింది. వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన నిర్మలమ్మ, ఈసారి పవిత్ర మాఘ పూర్ణిమ రోజున తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే కాంజీవరం చీరలో మెరిసిన ఆమె, భారత ఆర్థిక ప్రయాణం అత్యంత స్థిరంగా సాగుతోందని, దేశం 7 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతోందని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
* బడ్జెట్ స్వరూపం
* బడ్జెట్ పరిమాణం – రూ. 53.47 లక్షల కోట్లు
* రెవెన్యూ లోటు – రూ. 5,92,344 కోట్లు
* ద్రవ్యలోటు – రూ. 16,95,768 కోట్లు
రంగాల వారీగా కేటాయింపులు ఇవే…
* ట్రాన్స్‌పోర్ట్ – రూ. 5,98,520 కోట్లు
* డిఫెన్స్ – రూ. 5,94,585 కోట్లు
* రూరల్ డెవలప్‌మెంట్ – రూ. 2,73,108 కోట్లు
* హోం అఫైర్స్ – రూ. 2,55,234 కోట్లు
* వ్యవసాయం, అనుబంధ రంగాలు – రూ. 1,62,671 కోట్లు
* విద్యా రంగం – రూ. 1,39,289 కోట్లు
* ఎనర్జీ సెక్టార్ – రూ. 1,09,029 కోట్లు
* వైద్యారోగ్య రంగం – రూ. 1,04,599 కోట్లు
* అర్బన్ డెవలప్‌మెంట్ – రూ. 85,522 కోట్లు
* ఐటీ, టెలికాం – రూ. 74,560 కోట్లు
* కామర్స్ అండ్ ఇండస్ట్రీ – రూ. 70,296 కోట్లు
* సోషల్ వెల్ఫేర్ – రూ. 62,362 కోట్లు
* సైంటిఫిక్ డిపార్ట్‌మెంట్స్ – రూ. 55,756 కోట్లు
* ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ – రూ. 45,500 కోట్లు
* విదేశీ వ్యవహరాలు – రూ. 22,119 కోట్లు
* ఆర్థిక రంగం – రూ. 20,649 కోట్లు
* ఈశాన్య ప్రాంత అభివృద్ది – రూ. 6,812 కోట్లు
సంస్కరణలు
ఈ బడ్జెట్‌ను ప్రధానంగా మూడు కర్తవ్యాల ప్రాతిపదికన తీర్చిదిద్దారు. ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానించడం, ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం మరియు యువత ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలను సృష్టించడం ఈ బడ్జెట్ మూలస్తంభాలు. ‘సబ్ కా సాత్ – సబ్ కా వికాస్’ అనే నినాదమే ఈ బడ్జెట్‌కు ప్రాణం. పేదలు, దళితులు, ఆదివాసీలు మరియు బలహీన వర్గాల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తూ, కర్తవ్య భవన్‌లో రూపొందించిన మూడో బడ్జెట్ ఇది. 2025 ఆగస్టు తర్వాత ప్రభుత్వం సుమారు 350కి పైగా ఆర్థిక సంస్కరణలను అమల్లోకి తెచ్చిందని, జీఎస్టీ మరియు లేబర్ కోడ్ వంటి రంగాల్లో మార్పులు దేశ ఉత్పాదకతను పెంచాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
సాంకేతిక విప్లవం
పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘బయో ఫార్మా శక్తి’ అనే వినూత్న పథకాన్ని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో రూ. 10,000 కోట్ల కేటాయింపులతో ఔషధ రంగంలో పరిశోధనలు, తయారీని ప్రోత్సహించనున్నారు. దీని కోసం జాతీయ స్థాయిలో మూడు కొత్త విద్యా సంస్థలను స్థాపించనున్నారు. అలాగే, ‘సెమీకండక్టర్ 2.0’ విధానం ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో కీలక ఖనిజాల వెలికితీతకు ప్రత్యేక నిధులు కేటాయించారు. దేశంలో కొత్తగా మూడు రసాయన పార్కుల స్థాపన, కంటైనర్ తయారీ పరిశ్రమకు ప్రోత్సాహం మరియు జాతీయ ఫైబర్ విధానం ద్వారా జౌళి రంగాన్ని ఆధునీకరించనున్నారు. ఎంఎస్ఎంఈల కోసం రూ. 2,000 కోట్లతో ‘స్వయం సమృద్ధ భారతం’ ఫండ్‌ను ఏర్పాటు చేయడం చిన్న పరిశ్రమలకు గొప్ప ఊరట.
మౌలిక సదుపాయాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈసారి ఏకంగా రూ. 12.2 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది ఇది రూ. 11.2 లక్షల కోట్లుగా ఉండేది. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం దేశంలోని ఏడు ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లను ప్రకటించారు. ఇందులో భాగంగా ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, దిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి మరియు బెంగళూరు-చెన్నై మార్గాల్లో వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. దీనితో పాటు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, వారణాసి మరియు పట్నాల్లో షిప్ రిపేర్ కర్మాగారాల ఏర్పాటు ద్వారా జల రవాణాకు నూతన జవజీవాలు అందించనున్నారు.
ఆరోగ్యం, విద్య మరియు సామాజిక సంక్షేమం
వైద్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఐదు ప్రాంతీయ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా మూడు కొత్త ఆయుర్వేద ఆసుపత్రుల స్థాపనతో పాటు, సంప్రదాయ వైద్య పరిశోధన కోసం జామ్‌నగర్‌లో ప్రత్యేక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, ప్రైవేటు రంగంలో పశువైద్య సేవలను ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. సామాజిక రంగంలో భాగంగా ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దివ్యాంగుల కోసం ‘దివ్యాంజన్ కౌశల్ యోజన’ మరియు ‘దివ్యాంగ్ సహకార యోజన’ ద్వారా ఉపాధి, నైపుణ్య శిక్షణ అందించనున్నారు. మానసిక ఆరోగ్య చికిత్సల కోసం నిమ్హాన్స్ నేతృత్వంలో రాంచీ, తేజ్‌పుర్‌లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
వ్యవసాయం
వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో అధిక విలువ కలిగిన పంటలకు (High-value crops) ప్రోత్సాహకాలు ప్రకటించారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల సాగుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. ‘కొబ్బరి ప్రోత్సాహక పథకం’ ద్వారా రైతులను ఆదుకోనున్నారు. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని అభివృద్ధి చేయడం, పశుసంవర్ధక శాఖ ద్వారా భారీ రాయితీలు ఇవ్వడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీడిపప్పు, కోకో, బాదం మరియు పైన్ నట్స్ సాగు కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారు.
సాంస్కృతిక వైభవం
పర్యాటక రంగానికి ప్రాధాన్యతనిస్తూ 20 పర్యాటక ప్రాంతాల్లో పదివేల మంది గైడ్‌ల నియామకాన్ని ప్రకటించారు. ఆతిథ్య రంగం కోసం జాతీయ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. మన వారసత్వ సంపదను కాపాడుకునేందుకు 15 పురావస్తు ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్ సరస్సులో పక్షులను వీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం రాష్ట్ర పర్యాటకానికి తోడ్పడుతుంది. అలాగే, తూర్పు భారతంలోని ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక క్లస్టర్లను అభివృద్ధి చేస్తారు. గేమింగ్, యానిమేషన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ (AVGC) రంగాలకు ప్రోత్సాహం అందిస్తూ యువతకు ఉపాధి కల్పించనున్నారు.
పరిశోధనలు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు ఖగోళ పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించారు. నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్ మరియు హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ వంటి అత్యాధునిక పరికరాల ఏర్పాటుకు నిధులు కేటాయించారు. కాస్మోస్-2 ప్లానిటోరియం ఏర్పాటు ద్వారా విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంచనున్నారు.
ఆదాయపు పన్ను
సామాన్య పన్ను చెల్లింపుదారులకు ఈ బడ్జెట్ భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానుంది. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే విధానాన్ని అత్యంత సరళతరం చేస్తూ కొత్త ఫారాలను ప్రవేశపెట్టనున్నారు.
TDS తగ్గింపు: విదేశీ విద్య మరియు వైద్యంపై టీడీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఎల్‌ఆర్‌ఎస్ కింద కూడా ఇదే వర్తిస్తుంది.
గడువు పెంపు: సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు.
మినహాయింపులు: రహదారి ప్రమాదాల పరిహారంపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఇచ్చారు.
కార్పొరేట్ పన్నులు: కంపెనీల బైబ్యాక్ కొనుగోళ్లపై కార్పొరేట్లకు 22 శాతం, నాన్-కార్పొరేట్లకు 30 శాతం పన్ను విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
డేటా సెంటర్లు: 2047 వరకు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ‘ట్యాక్స్ హాలిడే’ ప్రకటించడం ద్వారా ఐటీ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.
ధరల తగ్గుదల
క్యాన్సర్ రోగులకు ఊరటనిస్తూ 17 రకాల ప్రాణరక్షక ఔషధాలపై పన్నును తగ్గించారు. మైక్రోవేవ్ ఓవెన్లు, పౌర విమాన విడిభాగాలపై కూడా పన్ను భారం తగ్గింది. బయో గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే సీఎన్జీకి సెంట్రల్ ఎక్సైజ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దేశ ఆర్థిక క్రమశిక్షణను కాపాడుతూ ద్రవ్యలోటును (Fiscal Deficit) 4.3 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రూ. 1.04 లక్షల కోట్ల నిధులను బదిలీ చేయనున్నారు.










