అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా, కలియుగ దైవంగా, భక్తుల నుంచి విశేష నీరాజనాలందుకునే శ్రీ శ్రీనివాసుడు కొలువైన దివ్యక్షేత్రం..తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్ల మంది హిందూవులకు ఇది పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతోంది. అటువంటి క్షేత్రం, అందులోనూ శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే అమితమైన గౌరవం.. ఇష్టం..
అలాంటిది తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాల పట్ల తెలుగు ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. లడ్డూ తయారీలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పగించిన గుత్తేదార్లు సరఫరా చేసిన నెయ్యి.. నాణ్యత లేనిది అని తేలగా.. అందులోనూ వనస్పతి, వృక్ష, జంతు కొవ్వులతో కల్తీ అయిందని ఎన్‌డీడీబీ తాజా నివేదికలో బయటపడడంతో… శ్రీవారి భక్తులతో పాటు, యావత్ ప్రపంచం నివ్వెరపోతోంది. ఈ వ్యవహారంపై దేశ, విదేశాల్లోని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు తిరుమల లడ్డూ ఘుమఘుమలాడే నేతి సువాసనలతో, అత్యంత రుచికరంగా ఉండేది. కానీ ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో లడ్డూపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లడ్డూ రుచి, వాసన బాగుండటం లేదని, రెండు రోజులకే చెడిపోతోందని అనేక విమర్శలు వచ్చాయి. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలకు గానీ, తితిదే పాలకమండలికి గానీ, జగన్‌కు ఆత్మబంధువైన అప్పటి ఈఓకి గానీ అవేమీ చెవికెక్కలేదు. లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీలో వాడుతోంది కల్తీ నెయ్యి అని తెలిసి కూడా భక్తులు కొన్నారు కాబట్టే… అప్పటి విపక్ష పార్టీల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఎవ్వరూ కిమ్మనలేదు.
లడ్డూ ధర పెంచినా.. నాణ్యత లేదు..
అరాచక శక్తులు అధికారంలో ఉంటే.. ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు, సంక్షేమం ఎలా ఉంటుందో అని చెప్పేందుకు గత ఐదేళ్లలో వైకాపా పాలన, తిరుమలలో జరిగిన అపచారాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. జగన్ తన సామాజికవర్గానికి చెందినవారికి తిరుమలను అడ్డాగా మార్చేశారు. ధర్మారెడ్డిని అర్హత లేకపోయినా తితిదే ఈఓగా చేశారు. సుబ్బారెడ్డి హయాంలో పాలకమండలి సమావేశాన్ని చేపల మార్కెట్‌లా మార్చేసి… స్వామివారి సేవల ధరలకు వేలం పాట పెట్టడం, మంచిగా ఉన్న భవనాల్నీ కూలగొట్టి, అవసరం ఉన్నా, లేకపోయినా స్వామివారి సొమ్ముల్ని సివిల్ వర్క్స్ పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టేశారు.
ఆ క్రమంలో భారీగా ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, లడ్డూ సహా అన్నింటి ధరలూ పెంచేశారు. రూ.25 ఉన్న లడ్డూ ధరను రూ.50కి పెంచేశారు. రూ.100 ఉన్న పెద్ద లడ్డూ ధరను రూ.200కి పెంచేశారు. సహజంగా ధర పెరిగితే నాణ్యత కూడా బాగుండాలి. కానీ కల్తీ నెయ్యి దట్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. గత ఐదేళ్లలో అనేక కుంభకోణాలకు తెరతీశారు. కల్తీ నెయ్యి ఒక్క అంశంమాత్రమే అని… గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాల్లో ఇది ఒక్కటి మాత్రమే.. త్వరలోనే చాలానే బయటపడతాయని తెదేపా సహా వివిధ పార్టీల నాయకులు చెబుతున్నారు.
50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని వద్దనడమేంటి..?!
‘నందిని’ బ్రాండ్‌తో పాల ఉత్పత్తులు విక్రయించే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) గత 50 ఏళ్లుగా తితిదేకి నెయ్యినీ సరఫరా చేస్తోంది. అది కర్ణాటక ప్రభుత్వరంగ సంస్థ. ఎక్కువ ధరకు కోట్ చేసిందన్న కారణంతో జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి తితిదే పాలకమండలి కేఎంఎఫ్‌ను పక్కన పెట్టేసింది. తితిదే చెబుతున్న ధరకు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ అప్పట్లో తెలిపారు. అదే నిజమని, తక్కువ ధరకు కొంటున్నామన్న పేరుతో, తితిదే కల్తీనెయ్యి కొనుగోలు చేసిందని ఇప్పుడు బయటపడింది. 50 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్‌ను పక్కన పెట్టి… తితిదే కల్తీనెయ్యి కొనడం వెనుక మర్మమేంటన్న సందేహాలు మరింత వ్యక్తమవుతున్నాయి.
స్వచ్ఛమైన ఆవు నెయ్యి రూ.320కే ఎలా వస్తుంది..?
తితిదే పాలకమండలి మాజీ ఛైర్మన్, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఇటీవలి విలేకర్ల సమావేశంలో తమ చర్యల్ని సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్‌లోని ఫతేపూర్ నుంచి రోజుకు 60 కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొనేవారమని, 60 కిలోలకు రూ.లక్ష ఖర్చయ్యేదని తెలిపారు. అంటే ఆ రకంగా చూసుకుంటే, కిలో నెయ్యి ధర రూ.1,667 అన్నమాట..! అదే సమయంలో లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే వేల కిలోల నెయ్యిని కిలో రూ.320 చొప్పున కొన్నారు. అలాంటప్పుడు ఎలాంటి కల్తీ చేయకుండా కిలో ఆవు నెయ్యి రూ.320కి సరఫరా చేయడం ఎలా సాధ్యం? ఒక కిలో ఆవు నెయ్యి తయారీకి 17-18 లీటర్ల పాలు అవసరమవుతాయి. లీటరు ధర రూ.40 వేసుకున్నా… రూ.720 అవుతుంది. మార్కెట్‌లో గేదె నెయ్యే కిలో రూ.800 పలుకుతోంది. అలాంటప్పుడు ఎక్కడో ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ వంటి ప్రాంతాల్లోని సంస్థలు రవాణా ఖర్చులు కూడా భరించి, కిలో నెయ్యి రూ.320కి ఎలా సరఫరా చేయగలవు? ఆ నెయ్యిలో కచ్చితంగా కల్తీ జరిగిందని సాధారణ ప్రజలకు కూడా దాని ధరను బట్టే అర్థమవుతుంది.
ఇకపోతే శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల నిమిత్తం తితిదే సుమారు 48 రకాల సరకులను నిత్యం కొంటుంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, కొండ దిగువన ఉన్న ఆలయాల్లో ప్రసాదాలకూ వీటినే వినియోగిస్తారు. నెయ్యి సహా ఆ పదార్థాలన్నీ తిరుపతిలోని గోడౌన్‌లోనే భద్రపరుస్తారు. వాటి నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌ను మాత్రం తిరుమల కొండపై ఏర్పాటుచేశారు. నమూనాల్ని తీసుకెళ్లి అక్కడ పరీక్షిస్తుంటారు. దీంతో ఆ పరీక్షలు తూతూమంత్రంగా జరుగుతున్నాయని తెలుస్తుంది. తితిదేకి రోజూ పదివరకు నెయ్యి ట్యాంకర్లు వస్తాయి. ఒక్కో ట్యాంకర్‌లో 12,000 లీటర్ల నెయ్యి ఉంటుంది.
కొన్ని ట్యాంకర్ల నుంచి ర్యాండమ్‌గా నమూనాలు తీసుకుని తిరుమలకు తీసుకెళ్ళి శాంపిల్ ను పరీక్షిస్తారు. వాటిలో ఎలాంటి కల్తీ జరిగిందో నిగ్గుతేల్చే అధునాతన పరికరాలు ఆ ల్యాబ్‌లోనేమో లేవు. వచ్చిన ప్రతి ట్యాంకర్‌లో నెయ్యీ బాగుందని నిర్ధరిస్తే అనుమానం వస్తుంది కాబట్టే.. అప్పుడప్పుడూ కొన్ని ట్యాంకర్లను తిప్పి పంపినట్లు, తితిదే సిబ్బంది రికార్డుల్లో రాస్తారని, అలా పంపిన ఆ ట్యాంకర్లను తిరుపతి బైపాస్ రోడ్డులోకి తీసుకెళ్లి వేరే నంబరు ట్యాంకర్లలోకి మార్చి, మళ్లీ తీసుకొస్తారని సమాచారం. ముందు తిప్పిపంపిన అదే నెయ్యిని, తితిదే సిబ్బంది నాణ్యత బాగుందని సర్టిఫై చేస్తారని కూడా అక్కడివారు చెబుతున్నారు.
ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలసి ఉండొచ్చని.. ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని.. అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు (ఫారిన్ ఫ్యాట్స్) కలగలిసి ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైంది. సాధారణ ఇంటివాడకానికి కూడా వీటిని ఎవరూ అంగీకరించని స్థాయిలో ఉన్నాయి. కోట్ల మంది భక్తులు పరమపవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలోనే ఇలాంటివి ఉన్నాయంటే ఎంత ఘోరమోఅన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇదివరకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
ఈ సందర్భంగా తిరుమలకు ఏర్పడిన దోషాలను తొలగించేందుకు నేడు ఆయన తిరుమలలో శాంతిహోమం నిర్వహించారు.