కృత్రిమ మేధ ఉద్యోగాలను మింగేస్తుందా? లేక కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ఏఐపై జరుగుతున్న చర్చలో భారత్ నుంచి ఆసక్తికరమైన గణాంకాలు బయటకు వచ్చాయి. టెక్ కంపెనీల్లో వరుస లేఆఫ్‌లు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, భారత్‌లో మాత్రం AI కారణంగా కోల్పోయిన ఉద్యోగాల కంటే కొత్త AI ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయని నోమురా తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఏఐ ఆధారిత నియామకాలు, ఉద్యోగ కోతలతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తొలగించడం కంటే ఉద్యోగాల స్వభావాన్ని మార్చుతోందనే అభిప్రాయం మరింత బలపడుతోంది.
భారత్‌లో ఏఐ ఉద్యోగాలపై ఆసక్తికరమైన ట్రెండ్
2022 నుంచి 2026 ఆగస్టు మధ్య భారత్‌లోని కంపెనీలు ఏఐ వినియోగం కారణంగా 31,921 ఉద్యోగాలను తగ్గించగా, ఇదే సమయంలో ఏఐకి సంబంధించిన 83,100 కొత్త నియామకాలు చేపట్టినట్లు అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా చాట్‌బాట్‌లు, ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్ వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో కొన్ని కంపెనీలు సపోర్ట్ టీమ్‌లలో ఉద్యోగులను తగ్గించాయి. మరోవైపు ఏఐ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, డేటా నిర్వహణ, క్లౌడ్ సేవలు, ఆటోమేషన్ వంటి రంగాల్లో నిపుణుల అవసరం పెరగడంతో కొత్త ఉద్యోగాలు కూడా భారీగా ఏర్పడ్డాయి. ఐటీ సేవల రంగంలో కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని ఏఐ సంబంధిత పనులకు అనుగుణంగా నియమించుకోవడం కూడా పెరుగుతున్నట్లు నోమురా పేర్కొంది.
AI ప్రభావం ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ఎక్కువగా?
అయితే ఏఐ ప్రభావం అన్ని స్థాయిల ఉద్యోగులపై ఒకేలా లేదని అధ్యయనం స్పష్టం చేసింది. భారత్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో రెండు స్థాయిల కార్మిక మార్కెట్ ఏర్పడుతోందని పేర్కొంది. సాధారణ, పునరావృత పనులు చేసే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ఆటోమేషన్ ప్రభావం ఎక్కువగా ఉండగా, అనుభవం కలిగిన ఉద్యోగులు, ఏఐ నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో ఆసియా వ్యాప్తంగా 1.3 లక్షలకు పైగా ఏఐ ఆధారిత ఉద్యోగాలు ఏర్పడగా, వాటిలో దాదాపు 90 శాతం టెక్నాలజీ రంగంలోనే ఉన్నాయి. ఇదే సమయంలో ఆసియా కంపెనీలు 60,654 ఉద్యోగాలను తొలగించగా, వాటిలో ఎక్కువ కోతలు ఆర్థిక సేవల రంగంలో నమోదైనట్లు అధ్యయనం తెలిపింది.
AI వల్ల ఉద్యోగాలు పోతున్నా కొత్త అవకాశాలు ఎవరికి?
అయితే కొత్త ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉందనే ఒక్క గణాంకంతో ఏఐ ప్రభావాన్ని పూర్తిగా సానుకూలంగా చూడలేమని నోమురా హెచ్చరిస్తోంది. ఏఐ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి అదే సమయంలో కొత్తగా ఏర్పడిన ఏఐ ఇంజనీరింగ్ ఉద్యోగంలో చేరడం సాధారణంగా జరగడం లేదు. ఎందుకంటే కొత్త అవకాశాలకు ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు అవసరం అవుతున్నాయి. దీంతో ఒకవైపు అధిక నైపుణ్యం ఉన్న వారికి జీతాలు, అవకాశాలు పెరుగుతుంటే.. మరోవైపు సాధారణ నైపుణ్యాలతో పనిచేసే ఉద్యోగులకు ప్రమాదం పెరుగుతోంది. భవిష్యత్తులో ఉద్యోగాలను ఏఐ పూర్తిగా తొలగిస్తుందనే దానికంటే, ఏఐని ఉపయోగించగల నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా లభించే పరిస్థితి ఏర్పడే అవకాశమే స్పష్టంగా కనిపిస్తోంది.






