Entertainment & CinemaTelugu Cinema

తెలుగు వెండితెర సోగ్గాడు.. నటభూషణ శోభన్ బాబు..

శోభన్ బాబు (ఉప్పు శోభనా చలపతి రావు).. (14 జనవరి 1937 – 20 మార్చి 2008)

తెలుగువారి అలనాటి అందాలనటుడు. అందమైన నటనకు ప్రతిరూపం. ఆరడుగుల అందం. మొహం మీద పడే తల వెంట్రుకల రింగు. ఆడపిల్లలకు అంతకంటే ఏం కావాలి. అందుకే అప్పట్లో ఆడపిల్లలు శోభన్ బాబు అంటే విపరీతమైన అభిమానం. అందం గురించి చెప్పేటప్పుడు శోభన్ బాబులా ఉన్నాడు, అలాంటి భర్త కావాలి అనేవారు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా, డీ గ్లామర్ రోల్స్ లోనూ నటించి మెప్పించినా అది కేవలం శోభన్ బాబు గారికి మాత్రమే సాధ్యమైంది.

ఆస్థిలో సంపన్నుడు. గుణంలో సౌమ్యుడు. తన సినిమాలలో ఇద్దరు కథనాయికలకు సంసారంలో సమాన న్యాయం చేసే పాత్రలో అద్భుతమైన అభినయం కనబరిచినా, తన నిజ జీవితంలో ఏక పత్నీవ్రతుడు. ఎక్కడ మొదలు పెట్టాలో,  ఎక్కడ ముగింపు పలకాలో, అతి కొద్ది మందికే స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత ఉన్న  కొద్ది మందిలో శోభన్ బాబు గారూ ఒకరు. మూడు సార్లు అభిమన్యుడి పాత్ర చేసినా, నిజజీవితంలో మాత్రం ఆయన అర్జునుడే. ఆయనకు లోపలకు ప్రవేశించడమే కాదు, ఎక్కడ ఎలా నిష్క్రమించాలో కూడా తెలుసు. తన ముప్పై యేండ్ల సినీ జీవితంలో 220 పైగా చిత్రాలలో నటించిన శోభన్ బాబు గారూ తన 59వ యేటనే సినీ జీవితానికి స్వస్తి చెప్పారు.

సీనియర్ నటుడు చంద్రమోహన్ గారూ మాట్లాడుతూ ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఒక్కరూ కూడా సోగ్గాడు శోభన్​ బాబు ఆస్తులకు దరిదాపుల్లో కూడా లేరంటే మీరు నమ్ముతారా నమ్మి తీరాల్సిందే అన్నారు. మద్రాసులోనే ప్రసిద్ధి చెందిన అన్నానగర్ ప్రాంతంలో సింహభాగం ఆస్తులు కలిగిన ఒకే ఒక్కడు శోభన్ బాబు గారు అంటే అవాక్కవ్వాల్సిందే అని అంటారు చంద్రమోహన్ గారూ. 1970వ ప్రాంతంలోనే అన్నానగర్​లో శోభన్ బాబు గారి పేరిట ఏకంగా 18 రకాల ఆస్తులు ఉండేవట. వాటన్నింటినీ కూడా కారులో చుట్టి రావడానికే ఒక పూట పట్టేదట.

ఆ తర్వాత కాలంలో మద్రాసుతో పాటు శోభన్​ బాబు గారి ఆస్తులు కూడా విస్తరిస్తూ వచ్చాయి. ఇలాంటి ఆస్తులు చెన్నై వ్యాప్తంగా ఎన్నో చోట్ల కొనుగోలు చేశారు శోభన్ బాబు గారూ. ప్రస్తుతం టాలీవుడ్​లో అగ్ర కథనాయకులు ఒక్క సినిమాకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. బాలీవుడ్​లో అయితే సుమారు 100 కోట్ల రూపాయలు పైనే పారితోషికం ఉంటుంది. అయినా కూడా వారు శోభన్ బాబు గారి దారిదాపుల్లోకి కూడా రాలేనంత ఆస్తులున్నాయంటే తన ముందు చూపు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

బాల్యం..

శోభన్ బాబు గారూ కృష్ణా జిల్లా మైలవరం దగ్గరలో ఉన్న చిన నందిగామలో , 14 జనవరి  1937 నాడు జన్మించారు. శోభన్ బాబు గారూ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. శోభన్ బాబు గారి తండ్రి ఉప్పు సూర్యనారాయణ రావు గారూ, తల్లి రామ తులసమ్మ. శోభన్ బాబు గారికి ముగ్గురు సోదరీమణులు ధనరంగ, ఝాన్సీ మరియు నిర్మల మరియు సోదరుడు సాంబశివరావు ఉన్నారు. తన పదవ తరగతి వరకు చదువు మైలవరంలోనే కొనసాగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మచిలీపట్నంలోను, రెండవ సంవత్సరం విజయవాడలోనూ చదువుకున్నారు. చిన్నప్పటి నుండే వాళ్ళ బంధువులు, తెలిసిన వాళ్లు నీవు చాలా అందంగా వున్నావు. నీవు సినిమాలో హీరోగా ప్రయత్నించమని సలహా ఇచ్చేవారట. దాంతో శోభన్ బాబు గారికి సినిమాలలోకి వెళ్లాలానే కోరిక బలంగా మనసులో నాటుకుపోయింది. డిగ్రీ చదువు కోసం గుంటూరు ఏ.సి కళాశాలలో చేరారు. ఆ కళాశాలలో చదివే రోజులలో కొన్ని నాటకాలు కూడా వేసేవారు.

సినీ ప్రస్థానం..

వివాహనంతరం లా చదవడానికి మద్రాసు వెళ్లారు. తన భార్యతో సహా మద్రాసు వెళ్లిన శోభన్ బాబు గారూ ఒక పూట లా కళాశాలకు వెళ్లి చదువుకుంటూ, మిగతా సమయమంతా కూడా సైకిల్ వేసుకుని, ఫోటో ఆల్బమ్ పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరిగేవారు. అలా ఎనిమిది నెలలు గడిచిన పిదప 1958 మొదట్లో ఎన్టీఆర్ గారూ కథానాయకుడిగా నటించిన దైవబలం అనే చిత్రంలో చిన్న పాత్ర దొరికింది. పాత్ర చిన్నదయ్యేసరికి శోభన్ బాబు గారిని ఎవ్వరూ కూడా గుర్తించలేదు.

ఆ తరువాత కొద్ది రోజులకి భక్త శబరి అనే చిత్రంలో మరొక వేషం లభించింది. ఆ చిత్రంలో నటించినా కూడా శోభన్ బాబు గారికి పెద్దగా గుర్తింపు రాలేదు. తనకు ఆ పాత్ర స్థిరత్వాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత ఎన్టీఆర్ తో వున్న పరిచయం కొద్దీ సీతారామకళ్యాణం లో లక్ష్మణుడి పాత్ర వరించింది. అలాగే తరువాత చిత్రం లో ఎన్టీఆర్ గారి సిఫారసుల మేరకు శోభన్ బాబు గారికి భీష్మ చిత్రంలో అర్జునుడి పాత్ర లభించింది.

ఆ చిత్రాలలో పాత్రలకు గానూ వచ్చే మూడు వందలు, ఐదు వందలు రూపాయలతోనే తన కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ కాలం వెళ్ళిబుచ్చేవాడు. ఇంతలోనే వాళ్లకు ఒక అబ్బాయి జన్మించారు. ఎప్పుడో ఒక్కసారి సినిమాలలో పాత్రలు వచ్చేవి. మిగతా సమయమంతా బాబుతో ఆడుకుంటూ, సంభాషణలు సాధన చేసుకుంటూ, రేడియో వినుకుంటూ కాలక్షేపం చేసేవారు. కాలక్రమేణా కొందరు మిత్రులతో పరిచయం ఏర్పడింది. వాళ్లలో ఒకరు తెనాలి నుండి వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే ఘట్టమనేని శివ రామ కృష్ణ గారూ.

గుంటూరు నుండి కూడా ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళ పేర్లు కొమిరేణి అప్పారావు, కొమిరేణి శేషగిరి రావు. అలాగే విజయవాడ నుండి మాగంటి రాజబాబు అనే అతను కూడా వచ్చాడు. నర్సాపురం నుండి ఒకతను వచ్చాడు. వీళ్లంతా ఒకచోట కలుసుకుని వాళ్లకు వచ్చిన సినిమా అవకాశాలు, చిత్ర విశేషాల గురించి మాట్లాడుకునేవారు. ఆ తరువాత రోజుల్లో శివరామకృష్ణ గారూ సూపర్ స్టార్ కృష్ణ అయ్యారు. కొమిరేణి అప్పారావు గారూ సంగీత దర్శకులు చక్రవర్తి గారయ్యారు. మాగంటి రాజబాబు గారేమో హీరో మురళీమోహన్ అయ్యారు. నరసాపురం నుండి వచ్చిన కుర్రాడు తరువాత రోజులలో హీరో కృష్ణంరాజు అయ్యారు.

1961లో శోభన్ బాబు గారికి పాప జన్మించింది. మహమంత్రి తిమ్మారుసులో ఒక పాత్ర దొరికింది. ఆ తరువాత ఎన్టీఆర్ గారి లవకుశ చిత్రంలో శతృజ్ఞుడు పాత్రకు అవకాశం దొరికింది. ఆ తరువాత ఇరుగు పొరుగు అనే సాంఘిక చిత్రంలో చిన్న వేషం లభించింది. సోమవార వ్రత మహత్యం అనే చిత్రంలో చిన్న వేషం వచ్చింది. కొద్దిరోజుల తరువాత అక్కినేని గారి సిఫారసుతో చదువుకున్న అమ్మాయిలు చిత్రంలో చిన్న గుర్తింపు వచ్చే పాత్ర వరించింది. ఈ చిత్రాలలో నటిస్తే వచ్చే డబ్బులతో ఇంటి అద్దె, కరెంటు బిల్లు, కనీస అవసరాలు తీరలేక పోవడంతో తిరిగి ఇంటికి వెళ్లి వ్యవసాయం చేసుకుందామని నిర్ణయించుకుని సామాను సర్దేసుకుని మరునాడు వెళ్లిపోదామనుకున్నారు.

ఆ రోజు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో రాజ్యం పిక్చర్స్ తీయబోయే నర్తనశాల చిత్రంలో ఒక పాత్రను ఎంపికచేసుకోవడానికి ఒకతను శోభన్ బాబు గారి ఇంటి తలుపు తట్టాడు. కర్ణ అనే తమిళ సినిమాలో చంద్రుని పాత్ర, నవగ్రహ పూజా మహిమలో చిన్న పాత్ర, మైరావణ, దేశాద్రోహులు, సుమంగళి లో ఒక పాట, ప్రమీలార్జునీయంలో చిన్న వేషం, ప్రతిజ్ఞాపాలన లో చిన్న వేషం ఇలా చిన్న చిన్న వేశాలే తప్ప పూర్తిస్థాయిలో నటుడిగా నిరూపించుకునే అవకాశాలు ఇంకా రాలేదు.

అలాంటి సమయంలో పెద్ద మలుపు తిప్పిన చిత్రం వీరాభిమన్యు. 1965 లో తీసిన ఈ చిత్రంలో మొదటిసారి పూర్తిస్థాయిలో కథనాయకుడి పాత్రతో అద్భుతమైన నటన ప్రదర్శించారు శోభన్ బాబు గారూ. ఈ చిత్రం 12 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. పరమానందయ్య శిష్యుల కథ లో చిన్న పాత్ర. ఈ చిత్రంలో 1500 రూపాయల పారితోషికం కోసం కొన్ని గంటలపాటు పామును మెడలో వేసుకోవాలి. శోభన్ బాబు గారికి ఇది తప్పింది కాదు. కృష్ణ గారూ కథనాయకుడిగా వచ్చిన గూఢచారి 116 లో చిన్న పాత్ర.  శోభన్ బాబు గారి తరువాత చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కృష్ణ గారూ తారాజువ్వ లాగా దూసుకుపోతున్నారు. చంద్రమోహన్ గారికి కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ శోభన్ బాబు గారికే అవకాశాలు ఇంకా దోబూచులాడుతూనే ఉన్నాయి.

వీరాభిమన్యు తరువాత ఒక నిర్మాత గారూ శోభన్ బాబు గారూ కథనాయకుడిగా, జయలలిత కథానాయికగా ఒక చిత్రం నిర్మించదలచి కొంత డబ్బు అడ్వాన్సుగా ఇచ్చారు. ఆ తరువాత ఎంతకూ చిత్రం మొదలుపెట్టక పోయేసరికి సదరు నిర్మాతను శోభన్ బాబు గారూ సంప్రదించగా కొత్తవారు హీరోగా జయలలిత గారి అమ్మ గారూ ఒప్పుకోవడం లేదు. అందుకే అందులో మిమ్మల్ని హీరోగా వద్దనుకున్నాము అని తేల్చిచెప్పేసరికి నిరాశగా వెనుదిరిగి వచ్చేశారు శోభన్ బాబు గారూ.

1965 నుండి 1969 వరకు ఐదు సంవత్సరాలు సుమారు 33 చిత్రాలలో అన్నీ కూడా సహాయనటుడు, సహా కథనాయకుడు, చిన్న చిన్న ప్రాధాన్యం లేని పాత్రలలో నటిస్తూ వచ్చారు. 1969లో తన 52వ చిత్రం మనుషులు మారాలి అనే చిత్రం శోభన్ బాబు గారిని కథనాయకుడిగా నిలదొక్కుకునేలా చేసింది. అప్పటివరకు కూడా చిన్న పాత్రలతో సరిపెట్టుకున్న నటి శారద కూడా ఈ చిత్రంతోనే కథానాయికగా చిత్రసీమలో స్థిరపడిపోయింది.

శోభన్ బాబు గారితో పి. చిన్నపరెడ్డి గారూ నిర్మాతగా ఉషశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై 1970 సంవత్సరంలో పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం చిత్రాలు నిర్మించారు. చిన్న చిత్రాలైనా మంచి విజయాలు సాధించాయి. 1972లో చిన్నపరెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో తీసిన “మానవుడు దానవుడు” చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. డాక్టరు వేణుగా, జగన్ గా నటించిన ఆ చిత్రం శోభన్ బాబు గారికి ఎనలేని స్టార్ డమ్ ను తెచ్చి పెట్టడమే కాదు, వారి పారితోషికం ఒకేసారి ఎనిమిది రెట్లు పెంచేశారు. శోభన్ బాబు గారూ అక్కడినుండి హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు.

శోభన్ బాబు గారి కేరీర్ లో చివరి చిత్రం “హలో గురు” (1996). అవకాశాలు తగ్గుతుండడంతో అదే తన చివరి చిత్రంగా భావించి నటనకు స్వస్తి చెప్పారు. 2005లో అతడు చిత్రంలో 60 ఏళ్ళు దాటిన సత్యనారాయణమూర్తి అనే ముఖ్యమైన పాత్రకోసం శోభన్ బాబు గారితో, చేయించాలని నిర్మాత మాగంటి మురళీమోహన్ గారూ ఆశించారు. అందుకోసం శోభన్ బాబు గారికి బ్లాంక్ చెక్ ని కూడా పంపారు. అయితే ఒకసారి సినిమాలలో నటించనని నిర్ణయం తీసుకున్నాక తిరిగి నటించబోనని శోభన్ బాబు గారూ నిరాకరించారు.

వివాహం..

శోభన్ బాబు గారూ 15 మే 1958 నాడు శాంత కుమారిని వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు కరుణ శేషు, మరియు ముగ్గురు అమ్మాయిలు మృదుల, ప్రశాంతి మరియు నివేదిత. శోభన్ బాబు గారూ తాను సినీ రంగములో ఎదుర్కొన్న ఒతిళ్లను దృష్టిలో ఉంచుకొని కుమారుడిని గానీ, కుమార్తెలను గానీ సినీ రంగ ప్రవేశం చేయడానికి ఇష్టపడలేదు.

వ్యక్తిగత జీవితం..

శోభన్ బాబు గారరూ మొదటి నుండి క్రమశిక్షణగా ఉండేవారు. ఉదయం పది గంటలకు షూటింగ్ మెదలు పెడితే సాయంత్రం ఆరు గంటలకు ఖచ్చితంగా షూటింగ్ పూర్తి చేసేవారు. పండుగలకు, ఆదివారంలు తప్పనిసరిగా సెలవు తీసుకునేవారు. ఇలాంటి నియమ నిబంధనలు పెట్టుకుని, వాటికి లోబడి ఉండే నిర్మాతలకే సినిమాలు తీసేవారు.

సాయంత్రం షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చి కుటుంబంతో గడిపేవారు. సినిమా సంగతులేవీ ఇంట్లో అస్సలు చర్చించేవారు కాదు. తోటి నటీనటులతో కూడా “సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కుటుంబంతో గడపండి. మన వృత్తి మన కుటుంబానికి ఎట్టిపరిస్థితులలోనూ ఆటంకం కాకూడదు” అని చేప్పేవారట.  చాలామంది కథనాయికలు శోభన్ బాబు గారిని “జెంటల్మన్” గానూ, పరిపూర్ణమైన భర్త గానూ అభివర్ణిస్తారట.

శోభన్ బాబు గారూ ఎటువంటి వ్యాసనాలకు లోను కాకుండా క్రమశిక్షణ జీవితాన్ని గడిపేవారు. వయసు పైబడుతున్నప్పుడు చాలామంది హీరోలు తన స్థాయిని తగ్గించుకుని చిన్నపాత్రలు కూడా వేసేవారు. కానీ శోభన్ బాబు గారూ ఇందుకు భిన్నంగా హీరో పాత్రలు మాత్రమే వేసేవారు. ఏనాడూ ఆడంబరాలకు లోనుకాకుండా నిరాడంబర జీవితం గడిపేవారు. డబ్బు బాగా పొదుపు చేసేవారు.

శోభన్ బాబు గారూ తన వృత్తిపరంగా పడిన కష్టాలను దృష్టిలో ఉంచుకుని అతను తన జీవితాన్ని పక్కా ప్రణాళిక ప్రకారం పద్ధతిగా ప్లాన్ చేసుకున్నారు. తన సంపాదనలో అధిక భాగం వ్యవసాయ భూమి, ఇండ్ల స్థలాలను కొనడం ప్రారంభించారు. తన తోటి నటీనటులతో కూడా తరుచూ ఒకమాట చెబుతుండేవారు. “జనాభా రోజురోజుకు పెరుగుతూవుంది. కానీ దానికి అనుగుణంగా భూమి పెరగడం లేదు. కాబట్టి భవిష్యత్తులో భూమి విలువ చాలా పెరిగిపోతుంది. కాబట్టి మీ వద్ధ వున్న డబ్బుతో వీలయినంత ఎక్కువ భూమిని కొని పెట్టుకోండని సలహా ఇచ్చేవారు.

తోటి నటులు మురళీమోహన్ గారు శోభన్ బాబు గారి సలహాతోనే రియల్ ఎస్టేట్ రంగంలో దిగి, చాలా ఆస్తులు కూడబెట్టుకున్నారు. శోభన్ బాబు గారూ మద్రాసులో స్టార్ హీరోగా ఉన్నపుడు కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేశారని, అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని మురళీమోహన్ గారూ చెప్పుకొచ్చారు. వాస్తవం చెప్పాలంటే శోభన్ బాబు గారూ చనిపోయే నాటికి వారి ఆస్తి దాదాపు రూ.  80 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు.

పురస్కారములు…

సౌత్ ఇండియన్ ఫిలింఫేర్ అవార్డ్స్..

1974లో “ఖైదీ బాబాయి” తెలుగు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.

1975లో జీవన జ్యోతి తెలుగుచిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు తీసుకున్నారు..

1976లో సోగ్గాడు తెలుగు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందియున్నారు..

1979లో కార్తీక దీపం తెలుగు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు స్వీకరించారు..

మరణం..

వంద సంవత్సరాలు అవలీలగా బ్రతుకుతాను నేను అంటూ, శోభన్ బాబు తన బంధువుల వద్ధ, సన్నిహితుల వద్ద చెబుతుండేవారు. వారు పాటించే ఆహార నియమాలు చాలా కఠినంగా ఉండేవి.  కొలస్ట్రాల్ పెంచే ఆహారన్ని  తీసుకునేవారు కాదు. మా తాత గారూ 107 సంవత్సరాలు బ్రతికాడు. మా నాన్న గారూ వందేళ్లు జీవించారు. నేను కూడా సుమారు వంద సంవత్సరములు బ్రతికేస్తాను అని శోభన్ బాబు గారూ చెప్పుకొచ్చేవారు.

2008 మార్చి 20వ తారీఖు. తన ఏకైక కుమారుడు అయిన కరుణ శేషుతో చాలా సేపు సంభాషించారు. వారు తమ సొంత స్థలంలో నిర్మిస్తున్న బంగాళాకు ఏ రంగులు వేయాలి, ఏ టైల్స్ ఎక్కడినుండి తెప్పించాలి ఇలాంటివి తండ్రీ కొడుకులిద్దరూ మాట్లాడుకున్నారు. శోభన్ బాబు గారూ అమితంగా ఇష్టపడే తన రాకింగ్ ఛెయిర్‌లో కూర్చుని భార్యను మజ్జిగ తెమ్మని చెప్పారు. వార్తలు చూద్దాం అని టీవీ పెట్టేశారు. ఊహించని విధంగా శోభన్ బాబు గారికి గుండెపోటు వచింది. కుర్చీలోంచి పైకి లేవబోయి ముందుకు బోర్లా పడిపోయారు. వారి ముక్కుకు దెబ్బ తగిలింది. తక్షణమే అక్కడికక్కడే ఆయన మరణించారు.

అది చూసిన భార్య అవాక్కయ్యింది. అక్కడికక్కడే ఏడుస్తూ కుప్పకూలిపోయింది. అప్పటివరకు తన తండ్రి గారితో మాట్లాడి బయటకు కారులో వెళ్లిన వాళ్ళ అబ్బాయి కరుణ శేషుకు విషయం తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. నిమిషాల వ్యవధిలోనే ఆయన మరణించడం జరిగింది. ఏమాత్రం అనారోగ్యం లేకుండానే కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే నిమిషాల వ్యవధిలోనే శోభన్ బాబు గారికి మరణం సంభవించడం కడు శోచనీయం.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button