
అనాదిగా ప్రజలు పాడుకొనే జానపద సంగీత నుంచి పుట్టి,”సంస్కృతీకరించబడి” ప్రస్తుతపు రూపాన్ని సంతరించుకున్న మన శాస్త్రీయ సంగీతం ఈనాటి “ప్రజల” సంగీతమైన సినీగీతాలనూ, “లలిత” సంగీతాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. శతాబ్దాలుగా తెలుగు సంస్కృతిలో సంగీత రూపాల శ్రేణి ఉనికిలో ఉంది, వీటిలో శాస్త్రీయ సంగీతం (హిందూస్థానీ మరియు కర్నాటిక్)తో పాటు ఒగ్గు కథ, యక్షగానం మరియు హరి కథలు ఉన్నాయి.
భారతీయ సినిమాలలో సంగీతానికి ఉండే ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అందులోనూ తెలుగు సినిమాలలో అయితే సంగీతం యొక్క ప్రాముఖ్యత మరీ ఎక్కువ. ఒక సినిమా విజయవంతం అవ్వాలన్నా, ఒక సినిమా ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వాలన్నా సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక సినిమా లో పాటలు సూపర్ హిట్ అయితే ఆ సినిమా ప్రేక్షకులు చూడడానికి పాటలు ఎంతో ప్రేరణనిస్తాయి. అలా సినిమా థియేటర్ వరకు వచ్చినా కూడా అక్కడ ప్రేక్షకులను రంజింప జేసి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలంటే నేపథ్య సంగీతం బాగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సినిమాకు ప్రాణం సంగీతం. అద్భుతమైన పాటలు, బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి చిత్రాన్ని ముందుకు పోనిచ్చి వెనుకే ఉండి పోతారు సంగీత దర్శకులు. లలితగీతం కావచ్చు, లేక సినీగీతం కావచ్చు కర్ణపేయంగా స్వరాలు కూర్చి తెలుగు సినిమా ప్రపంచాన్ని మంచి సంగీతం తో నింపిన ఎందరో ప్రముఖు దర్శకులు ఉన్నారు. వారిలో పాతతరం తెలుగు చలనచిత్ర సంగీత దర్శకులు ఓగిరాల రామచంద్ర రావు గారు ఒకరు. వాహిని వారి చిత్రాలెన్నింటికో తాను సంగీతం అందించారు. ఓగిరాల గారు తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు కూడా. ఆయన మళ్ళీ పెళ్ళి (1939) చిత్రంలో వై.వి.రావుకి పాడారు. ఆయన శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939) చిత్రంలో శివుని వేషం కూడా వేశారు.
జీవిత విశేషాలు…
జన్మ నామం : ఓగిరాల రామచంద్రరావు
ఇతర పేర్లు : ఓగిరాల, ఓ.రామచంద్రరావు
జననం : 10 సెప్టెంబర్ 1905
స్వస్థలం : బెజవాడ, కృష్ణా జిల్లా, మద్రాసు రాష్ట్రం
నివాసం : మద్రాసు
తండ్రి : ఓగిరాల జనార్దనశర్మ
తల్లి : ఓగిరాల సుబ్బమ్మ
వృత్తి : తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు, నటుడు
భార్య : వరలక్ష్మి
పిల్లలు : ఓగిరాల నరసింహమూర్తి, మాచిరాజు కల్పకవల్లి
మతం : హిందూ మతం
మరణ కారణం : ఫ్లూ జ్వరం
మరణం : 1957 జూలై 17, మద్రాసు
జననం…
ఓగిరాల రామచంద్ర రావు గారు 10 సెప్టెంబర్ 1905 నాడు జనార్దన శర్మ మరియు సుబ్బమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించారు. తన పూర్వికులు కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, చిరువోలు గ్రామానికి చెందినవారు.
సినీ నేపథ్యం...
సంగీతం…
సంగీత దర్శకునిగా ఓగిరాల రామచంద్ర రావు గారు దాదాపు ఇరవై చిత్రాలకు పనిచేశారు. సంగీతపరంగా తాను పనిచేసిన చిత్రాలలో దాదాపు అన్నీ విజయం సాధించాయి.
ఓగిరాల రామచంద్ర రావు గారికి సంగీత దర్శకునిగా మళ్ళీ పెళ్ళి (1939) మొదటి చిత్రం. కాంచనమాల, వై.వి.రావు గార్ల పైన చిత్రీకరించిన “నా సుందర సురుచిర రూపా” అనే పాటను ఓగిరాల గారు, నటి కాంచనమాలతో కలిసి పాడారు. బెజవాడ రాజారత్నం గాయనిగా చలనచిత్రరంగంలో స్థిరపడటానికి ఓగిరాల రామచంద్ర రావు గారి సంగీతమే ముఖ్య కారణం. మళ్ళీ పెళ్ళి చిత్రంలో “గోపాలుడే మన గోపాలుడే”, “చెలి కుంకుమమే పావనమే” లాంటి గీతాలను ఓగిరాల గారు రాజారత్నంతో పాడించారు. ఆ రోజులలో ఆ పాటలన్నీ కూడా జనం నాలుకలపై నిత్యం నాట్యం చేస్తూ ఉండేవి. విశ్వమోహిని (1940) చిత్రంలో ఓగిరాల గారు రాజారత్నంతో పాడించిన “ఈ పూపొదరింటా”, “భలే ఫేస్”, “మేళవింపగదే చెలియా వీణ” వంటి పాటలు తన సంగీతానికి ఒక గొప్ప ఉదాహరణ. 1940 లో అటువంటి చక్కటి ఆహ్లాదకరమైన సంగీతంతో కూడిన పాటలు అందించిన ఘనత ఓగిరాల గారికే దక్కింది.

వాహినీ సంస్థ వారు నిర్మించిన చాలా చిత్రాలకు ఓగిరాల రామచంద్ర రావు సంగీత దర్శకత్వం వహించారు. అందులో స్వర్గసీమ (1945) చిత్రానికి చిత్తూరు నాగయ్య మరియు బాలాంత్రపు రజనీకాంతరావు గార్లకు సహాయకునిగా, యోగి వేమన (1947) చిత్రానికి చిత్తూరు నాగయ్య తో కలిసి పనిచేశారు. పేరుకు వాళ్ళతో కలిసి ఉమ్మడిగా సంగీతం దర్శకత్వం వహించినా ఆ చిత్రాల యొక్క పాటలలో ఓగిరాల రామచంద్ర రావు గారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే తాను స్వతంత్రంగా గుణసుందరి కథ (1949), పెద్దమనుషులు (1955) వంటి చిత్రాలకు పనిచేశారు. అయితే ఆ చిత్రాలకు సహాయకునిగా, వాయిద్య నిర్వాహకునిగా అద్దేపల్లి రామారావు గారు పని చేయడం విశేషం.
1941 నుండి ఓగిరాల రామచంద్ర రావు గారు ఘంటసాల బలరామయ్య గారు నిర్వహిస్తున్న “ప్రతిభ పిక్చర్స్” చిత్రాలకు సంగీతం అందించడం మొదలు పెట్టారు. తాను సంగీతం అందించిన ప్రతిభ పిక్చర్స్ చిత్రాలు పార్వతీ కళ్యాణం (1941), గరుడ గర్వభంగం (1943), సీతారామ జననం (1944), ముగ్గురు మరాటీలు (1946). అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన తన రెండవ చిత్రం సీతారామ జననం (1944) లో, నాగేశ్వరరావు గారితో గురుబ్రహ్మ గురువిష్ణు శ్లోకం పాడించారు ఓగిరాల రామచంద్ర రావు గారు. ఘంటసాల బలరామయ్య గారు చిత్రీకరించిన ముగ్గురు మరాటీలు (1946) చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, టి.జి.కమలాదేవి గారి చేత చేత ఛల్ ఛలో వయ్యారి షికారి అనే యుగళగీతం పాడించారు. అదే చిత్రం ముగ్గురు మరాటీలు (1946) చిత్రంలో కన్నాంబ చేత “సతీ భాగ్యమే భాగ్యము”, “తీరుగదా ఆశ” అనే రెండు పాటలు పాడించారు. ఇదే చిత్రంలో బెజవాడ రాజారత్నం గారు “జీవనము యమునా జీవనము”, “రాటము భారతనారి కవచము” అనే రెండు పాటలు పాడారు. ఈ చిత్రంలో “జీవనము యమునా జీవనము” అనే పాట ప్రేక్షకాదరణ పొందింది. అది రాజారత్నం గారు ఆలపించారు.
ఓగిరాల రామచంద్ర రావు గారు 1949 లో హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రితో కలిసి “రక్షరేఖ” చిత్రానికి సంగీతం అందించారు. అదే ఏడాది విడుదలైన వాహిని వారి “గుణసుందరి” కథ అతి పెద్ద విజయం సాధించింది. 1950లో విడుదలైన “పరమానందయ్య శిష్యులు” చిత్రానికి ఓగిరాల రామచంద్ర రావు గారు, సుసర్ల దక్షిణామూర్తి గారితో కలిసి సంగీతం అందించారు. కానీ అనుకోకుండా ఆ చిత్రం పరాజయం పాలైంది. ఆ తర్వాత ఓగిరాల గారు మాయా రంభ (1950), సతీ సక్కుబాయి (1954) చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత విడుదలైన పెద్ద మనుషులు (1954) చిత్రం కూడా గుణసుందరి కథ అంతటి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత టి.వి.రాజు గారితో కలిసి శ్రీ గౌరీ మహత్యం (1956) చిత్రానికి సంగీతం సమకూర్చారు. భక్త రామదాసు (1964) చిత్రానికి ఓగిరాల గారు, నాగయ్య, అశ్వత్థామ, హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి గార్లతో కలిసి సంగీత శాఖలో పనిచేశారు. 1957లో ఆ చిత్ర నిర్మాణం ప్రారంభమైన కొన్ని రోజులకే ఓగిరాల గారు అనారోగ్యంతో మరణించారు.
గుణసుందరి కథ…

ఓగిరాల రామచంద్ర రావు గారు సంగీతం అందించిన చిత్రాలలో ముఖ్యంగా పేర్కొనవలసినవి గుణసుందరి కథ (1949). ఈ చిత్రం వాహిని వారు నిర్మించారు. దీనికి అద్దేపల్లి రామారావు గారు, ఓగిరాల గారికి సహాయకునిగా, వాద్య నిర్వాహకునిగా పనిచేయడం విశేషం. ఈ చిత్రానికి దర్శక, నిర్మాత కె.వి.రెడ్డి గారు. ఇందులో కథనాయికగా శ్రీరంజని జూనియర్ గారు నటించారు. “గుణసుందరి కథ” అనే చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. ఓగిరాల గారు పి.లీల, టి.జి.కమలాదేవి, కస్తూరి శివరావు, మాలతి, శాంతకుమారి, ఘంటసాల తదితరులతో పాడించిన పాటలు అశేష జనాదరణ పొందాయి.
“గుణసుందరి కథ” చిత్రంలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు గారు వ్రాశారు. ఓగిరాల గారు పి.లీల చేత పాడించినవన్నీ కూడా భక్తి పాటలే కావడం, వాటిలో “శ్రీ తులసి ప్రియ తులసి” పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది. ఆ గేయం పాడుతూ ప్రతీ స్త్రీ కూడా తులసి మాతను ఆరాధించేది. నటి శాంతకుమారి, మాలతి కలిసి పాడిన “కలకలా ఆ కోకిలేమో”, “చల్లని దొరవేలె చందమామ” పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఘంటసాల గారు ఈ చిత్రంలో అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా అనే నేపథ్యగీతం అద్భుతంగా పాడారు. అలాగే కస్తూరి శివరావు, టి.జి.కమలాదేవి, వి.శివరాం గార్లు పాడిన పాటలు కూడా పేరు పొందాయి.
పెద్ద మనుషులు (1954)…
ఈ చిత్రం కూడా వాహిని వారే నిర్మించారు. దీనికి కూడా అద్దేపల్లి రామారావు గారు, ఓగిరాల గారికి సహాయకునిగా, వాద్య నిర్వాహకునిగా పనిచేయడం విశేషం. ఈ చిత్రానికి దర్శక, నిర్మాత గారు కూడా కె.వి.రెడ్డి గారే. ఇందులో కూడా కథనాయికగా శ్రీరంజని జూనియర్ గారు నటించారు. “గుణసుందరి కథ” అనే చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. రేలంగి గారికి ఘంటసాల గారు “పెద్ద మనుషులు” చిత్రంలో పాడిన “నందామయా గురుడ నందామయా”, “శివశివ మూర్తివి గణనాథా” బాగా జనాదరణ పొందాయి.
ఆ రెండూ పాటలను కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వ్రాశారు. ఈ చిత్రంలో పి.లీల గారు మూడు పాటలు పాడారు. హిందీ చిత్రం అల్బేలాలోని పాటకు అనుకరణగా తాను పాడిన పాట “నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ” సంగీతం అందించారు. ఈ గేయాన్ని లీల గారే పాడిన “అంత భారమైతినా అంధురాలనే దేవ” పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతాన్ని ఓగిరాల గారు అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఆ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల రామచంద్ర రావు గారు కీర్తి పొందారు.
వ్యక్తిగత జీవితం…
ఓగిరాలకు రామచంద్ర రావు గారు వరలక్ష్మి ని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇద్దరూ తమ తండ్రి ఓగిరాల రామచంద్ర రావు వద్ద లలిత సంగీతం నేర్చుకున్నారు. అయినా కూడా వారు సినిమా రంగం వైపు చూడలేదు. ఓగిరాల కుమారుడు నరసింహమూర్తి కార్పొరేషన్ బ్యాంకులో ఉన్నత పదవి నుండి విరమణ పొందారు. నరసింహమూర్తి కొన్ని చిత్రాలలో బాలనటునిగా నటించారు. బ్రతుకుతెరువు (1953)లో సూర్యకాంతం గారికి కొడుకుగా, దొంగరాముడు (1955)లో చిన్ననాటి రాముడికి స్నేహితునిగా, అప్పు చేసి పప్పు కూడు (1959)లో సూర్యకాంతం, రమణారెడ్డి ల కొడుకుగా నటించారు. అప్పు చేసి పప్పు కూడు చిత్రంలో రేలంగి, నరసింహమూర్తి గార్లు కలిసి పండించిన హాస్యం మరువలేనిది.
ఓగిరాల చిత్రసమాహారం..
★ సంగీత దర్శకుడిగా..
మళ్ళీ పెళ్ళి (1939)
విశ్వమోహిని (1940)
పార్వతీ కళ్యాణం (1941)
గరుడ గర్వభంగం(1943)
సీతారామ జననం (1944)..
స్వర్గసీమ (1945)..
ముగ్గురు మరాటీలు (1946)
త్యాగయ్య (1946)…
యోగి వేమన (1947)…
గుణసుందరి కథ (1949)..
రక్షరేఖ (1949)…
పరమానందయ్య శిష్యులు (1950)..
మాయా రంభ (1950)
రాజేశ్వరి (1952)
సతి సక్కుబాయి (1954)
పెద్దమనుషులు (1954)
శ్రీ గౌరీ మహత్యం (1956)..
భక్త రామదాసు (1964)..
★ నటునిగా..
శ్రీ వెంకటేశ్వర మహత్యం (1939)..
★ నేపథ్యగాయకుడిగా..
మళ్ళీ పెళ్ళి (1939) …
మరణం…
1957 సంవత్సరంలో భక్త రామదాసు (1964) చిత్ర నిర్మాణ సమయంలో ఓగిరాల రామచంద్ర రావు గారు ఫ్లూ జ్వరం బారినపడ్డారు.
ఆ జ్వరం తోనే చాలా రోజులు బాధ పడ్డారు. అలా బాధపడుతూనే అనారోగ్యంతో మద్రాసులో 17 జూలై 1957 నాడు కన్నుమూశారు.
ఓగిరాల రామచంద్ర రావు గారు మరణించినప్పుడు ఆయన వయస్సు కేవలం యాభై రెండేళ్ళే. ఘంటసాల గారికి ఓగిరాల గారు అంటే ఏంతో అభిమానం.
ఆ అభిమానం తోనే తాను ఓగిరాల రామచంద్ర రావు గారి అంతిమయాత్రలో పాల్గొని సుమారు రెండు మైళ్ళు దూరం నడిచారు.