
‘చిత్ర గాన లహరి’ కార్యక్రమం న్యూజెర్సీలోని ప్లెయిన్‌ఫీల్డ్ హైస్కూల్ ఆడిటోరియంలో తానా, కళావేదిక, గుడ్ వైబ్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. ఈ తెలుగు సంగీత విభావరిలో పద్మభూషణ్ కె.ఎస్. చిత్ర, గాయకుడు శ్రీకృష్ణ, ఇతర సంగీత వాద్యకారులు కలిసి ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పాత తెలుగు పాటలు, అద్భుతమైన సంగీత సమ్మేళనంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
ఈ సందర్భంగా గాయని చిత్రకు న్యూజెర్సీ రాష్ట్ర ప్రతినిధులు, ఎడిసన్ నగర మేయర్ శ్యామ్ జోషి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల డెట్రాయిట్ తానా కాన్ఫరెన్స్‌లో చిత్ర పాల్గొనలేకపోయినా, ఈ ప్రదర్శనతో ఆ లోటును భర్తీ చేశారని తానా కోశాధికారి రాజా కసుకుర్తి అన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చిత్రకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కళాకారులు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు కళావేదిక అధ్యక్షురాలు స్వాతి అట్లూరిని, కార్యక్రమాన్ని సమన్వయం చేసిన గుడ్ వైబ్స్ ఈవెంట్స్ అధ్యక్షురాలు స్రవంతి చుక్కపల్లిని అభినందించారు. ఈ సంగీత కార్యక్రమానికి సహకరించిన ప్రేక్షకులు, స్థానిక సంస్థలకు స్వాతి అట్లూరి, తానా బోర్డు సభ్యుడు రవి పొట్లూరి ధన్యవాదాలు తెలిపారు.
తానా న్యూజెర్సీ రీజనల్ కో-ఆర్డినేటర్ సుధీర్ నరేపాలుపు, ఎడిసన్ సిటీ కల్చరల్ కో-ఆర్డినేటర్ ఉజ్వల్ కస్తాల, తానా కోశాధికారి రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీలు శ్రీనివాస్ ఒరుగంటి, సతీష్ మేకా, యూత్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈ విజయవంతమైన కార్యక్రమానికి కృషి చేసిన తానా బృందానికి, భాగస్వామ్య సంస్థలకు, వాలంటీర్లకు తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు అభినందనలు తెలిపారు.






