తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన యుగపురుషుడు నందమూరి తారకరామారావు ఆశయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ సిద్ధాంతాల పునాదులపైనే నడుస్తున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఆయన ఆశయ సాధనలో భాగంగానే మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం సీట్లు కేటాయిస్తామని చేసిన సంచలన ప్రకటన ఎన్టీఆర్ ఆశయాల వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మహానాడు డిమాండ్
రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారానే నిజమైన సామాజిక వికాసం సాధ్యమని నమ్మిన మహనీయుడు ఎన్టీఆర్ ఆశయాలకు ఈ నిర్ణయం పూర్తి అద్దం పడుతోంది. చరిత్ర ఉన్నంత కాలం తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇటువంటి గొప్ప నాయకుడికి దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ప్రదానం చేయాలనేది కేవలం ఒక పార్టీ కోరిక కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజల ఏకైక డిమాండ్ అని మహానాడు వేదికగా చంద్రబాబు కొనియాడారు.
ఎన్టీఆర్ రాజకీయ, సినీ వారసత్వాన్ని గుర్తు చేసిన చంద్రబాబు
సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం భారతదేశ చరిత్రలోనే ఒక అసాధారణ అధ్యాయంగా నిలిచిపోతుంది. వెండితెరపై ఆయన పోషించిన పౌరాణిక, చారిత్రక, సాంఘిక పాత్రలు కేవలం నటనకు పరిమితం కాకుండా తెలుగు సంస్కృతిలో భాగమైపోయాయి, ఆయన వేసిన పాత్రలలో మళ్లీ జీవించాలంటే తిరిగి ఆ తారకరాముడే పుట్టాలి తప్ప ఇతరులకు అది సాధ్యం కాని అసాధ్యమైన విషయం. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన కేవలం తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే రికార్డు స్థాయి మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోవటం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అద్భుత రికార్డు.
“సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు” అంటూ ఎన్టీఆర్ పార్టీకి ఇచ్చిన శాశ్వత సిద్ధాంతం ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మనుగడకు దిక్సూచిగా కొనసాగుతుందని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించే అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను ఆయన నాడు ప్రవేశపెట్టారు. ఇవి నేటి తరం పాలకులకు కూడా పరిపాలనా పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి.
మహానాడు ఏకగ్రీవ తీర్మానంతో ఎన్టీఆర్‌కు జాతీయ గౌరవం డిమాండ్
దేశానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ అందించిన విశేష సేవలను స్మరించుకుంటూ ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మహానాడు ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా చారిత్రక తీర్మానం ఆమోదించింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి, ప్రాంతీయ పార్టీల కూటమితో కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్ జాతీయ స్థాయి గౌరవానికి అన్ని విధాలా అర్హుడు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ముఖ్యమంత్రిగా ప్రజా రంజక పాలన అందించి, వెనుకబడిన వర్గాలకు రాజకీయ అధికారాన్ని కల్పించిన ఆయన చారిత్రక నిర్ణయాలు నేటికీ సామాజిక న్యాయానికి పునాదులుగా ఉన్నాయి.
తెలుగుజాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఆత్మగౌరవాన్ని తెచ్చిన ఈ మహనీయుడి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మహానాడు తీర్మానం ద్వారా కోట్ల మంది తెలుగువారి హృదయాల్లోని ఆవేదనను, ఆకాంక్షను కేంద్రానికి బలంగా వినిపించడం జరిగింది, ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించడం ద్వారానే తెలుగుజాతికి నిజమైన గౌరవం దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు:
ఢిల్లీ గద్దెపై తెలుగోడి సత్తా చాటిన మహానాయకుడు… ఎన్టీఆర్…
శత వసంతాల యుగ పురుషుడి మరణం లేని జననం… నందమూరి తారక రామారావు..
ప్రజా సంకల్పాలకు చేతోడు-టీడీపీ మహానాడు










