CINEMATelugu Cinema

తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి మాటల మాంత్రికుడు.. పింగళి నాగేంద్రరావు..

పింగళి నాగేంద్రరావు (29 డిసెంబరు 1901 – 06 మే 1971)..

మనం ఈ మధ్య అమితంగా వాడుతున్న మాట “మాటల మాంత్రికుడు” అన్న పదం ఈనాటిది కాదు, అది ఏనాడో. ఈ పదానికి సరిగ్గా సరిపోయే వ్యక్తి పింగళి నాగేంద్ర రావుగారు. పింగళి వారి కలం, బలానికి ఆనాటి ప్రేక్షకులు నచ్చి మెచ్చి ఇచ్చిన బిరుదం అది. పింగళి గారు కేవలం మాటల మాంత్రికుడు మాత్రమే కాదు, పాటల మాంత్రికుడు కూడా.. ఈనాటికీ వారి మాటలు, పాటలు తెలుగు నేల నలుమూలలా మారు మ్రోగుతూనే ఉన్నాయి అంటే వారి కలం బలం ఏమిటో తెలుస్తుంది. పింగళి గారు సినిమాలకు కథ, మాటలు, పాటలు, వ్రాసిన రచయిత. 1940 నుండి 1970 వరకు 30 సంవత్సరాల పాటు చలన చిత్ర సీమలో ఉన్నప్పటికీ కేవలం 25 సినిమాలకు మాత్రమే కథలు, పాటలు వ్రాశారు.

కేవలం రాశి లోనే కాకుండా తాను వ్రాసిన సినిమాలు వాసి ద్వారా ప్రసిద్ధికెక్కాయి. 60 సంవత్సరాల తరువాత కూడా తెలుగు వారు ఆ సినిమాలను విరగబడి చూస్తున్నారు. అది ఆయన కలం బలం. తాను వ్రాసిన సినిమాలలో పౌరాణికాలు, సాంఘికాలు, జానపదాలు ఉన్నాయి. తెలుగు భాష పరిణామ శాస్త్ర ప్రకారం తెలుగు భాషను పెంచి పోషించిన సినీ కవి, రచయిత. కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త వాక్యాలు సృష్టించి వాటిని జనాకర్షణీయమైన చిత్రాల ద్వారా, పాత్రల ద్వారా ఆమోదయోగ్యమైన సన్నివేశాల ద్వారా, సందర్భోచితంగా వాటిని ప్రవేశపెట్టి దాదాపుగా వాటిని తెలుగులో కలిపేసి, వాటికి ప్రాచుర్యం కలిపించిన రచయిత పింగళి నాగేంద్రరావు గారు.

ఈతరంలో పింగళి గారు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ తన సినిమా పేర్లు చెప్తే చాలా తేలికగా గుర్తుపట్టగలరు. పింగళి నాగేంద్రరావు గారు సినిమాలోకి రావడానికి ముందే తాను అపారమైన పాండిత్యం గలవారు. 1950 లలో చలనచిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలిగిపోయి జానపదాలు, చారిత్రకాలు, సాంఘికాలు, పౌరాణికాలు అన్నింటిలో తనదైన ముద్ర వేయడమే కాకుండా ఆ సినిమాలకు శాశ్వతత్వాన్ని ఆపాదించారు. సాంఘికాల్లో “పెళ్లినాటి ప్రమాణాలు”, “పెళ్లి చేసి చూడు”, “గుండమ్మ కథ”, “మిస్సమ్మ”, “అప్పుచేసి పప్పుకూడు” ; జానపదాల్లోకి వస్తే “గుణసుందరి కథ”, “చంద్రహారం”, “పాతాళభైరవి”, “జగదేకవీరుని కథ”, “భాగ్యచక్రం” ; పౌరాణికాల్లోకి వస్తే “మాయాబజార్”, “హరిశ్చంద్ర”, “శ్రీకృష్ణార్జున యుద్ధం”, “శ్రీకృష్ణ విజయం”, “శ్రీకృష్ణసత్య” ; చారిత్రక చిత్రాల విషయానికొస్తే “మహాకవి కాళిదాసు”, “మహామంత్రి తిమ్మరసు”, “చాణక్య చంద్రగుప్త”, ఇన్ని అద్భుతమైన సినిమాల రచయిత పింగళి నాగేంద్ర రావు గారు.

పింగళి గారు రెండుసార్లు సినిమా రంగంలోకి వెళ్లి విజయవంతం కాలేక వెనక్కి వచ్చేసారు. మూడోసారి వెళ్లి అత్యంత విజయవంతమైన రచయితగా చరిత్ర సృష్టించారు. ప్రాచీన సాహిత్యంతో పరిచయం ఉన్న వారికి పింగళి అనగానే పింగళి సూరన్న గారు గుర్తొస్తారు. తాను 15వ శతాబ్దంలో “కళాపూర్ణోదయం” అనే కావ్యం వ్రాశారు. మహారాష్ట్రలోని “పింగళ” అనే ఊరు నుండి వలస వచ్చినందున వీరి ఇంటిపేరు వేరే పింగళి అని వచ్చింది. పింగళి వారి కలం బలం తెలిసిన దిగ్దర్శకుడు కె.వి.రెడ్డి గారు వారిని చిత్ర పరిశ్రమలోనికి మద్రాసు కి ఆహ్వానించారు. అంతకు ముందు ఆయన కొన్ని పత్రికలకు సంపాదకునిగా కొన్ని నాటకాలు రచించి పేరు మోశారు. వారు రచించిన “వింధ్యరాణి” వంటివి ఎన్నో నాటకాలు దిగ్విజయంగా ప్రదర్శించబడ్డాయి.

జీవిత విశేషాలు…

  • జన్మ నామం :    పింగళి నాగేంద్రరావు 
  • ఇతర పేర్లు  :  పింగళి, మాటల మాంత్రికుడు  
  • జననం    :    29 డిసెంబరు 1901   
  • స్వస్థలం   :    రాజాం , బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ 
  • వృత్తి      :     రచయిత, పత్రికా ఉపసంపాదకుడు
  • తండ్రి     :   గోపాలకృష్ణయ్య
  • తల్లి      :    మహాలక్ష్మమ్మ 
  • జీవిత భాగస్వామి :   బ్రహ్మచారి ( అవివాహితులు ) 
  • మరణ కారణం   :    కాన్సర్ 
  • మరణం   :   06 మే 1971

@ నేపథ్యం…

పింగళి నాగేంద్రరావు గారు 29 డిసెంబరు 1901 న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న తాండ్రపాపారాయుడు జన్మించిన రాజాంలో జన్మించారు. తన తండ్రి పేరు గోపాల కృష్ణయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. తన తండ్రి యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉంటూ నాగేంద్రరావు గారి జననానికి పూర్వమే కరణీకాన్ని వదులుకుని విశాఖలో ఉన్న ఆయన తమ్ముళ్ల దగ్గరికి వచ్చేశారు. నాగేంద్రరావు పినతండ్రులలో ఒకరు డిప్యూటీ కలెక్టర్ మరొకరు ప్లీడర్. నాగేంద్రరావు గారి అన్న శ్రీరాములు 1913 లోనే భారతదేశాన్ని వదిలి 1926 నుంచి ఆస్ట్రేలియాలో పంచదార ఎగుమతి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తల్లి గారిది దివి తాలూకు కావడంతో పింగళి గారు మచిలీపట్నంలో ఉంటూ నేషనల్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు.

పింగళి తల్లి కవయిత్రి అవ్వడం వలన చెళ్ళపిళ్ళ, ముట్నూరు కృష్ణారావు గార్ల సాహచర్యం వలన పింగళికి సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆ రోజుల్లో ఆంధ్రదేశానికి గర్వకారణంగా వెలిసిన నేషనల్ కళాశాల తొలి విద్యార్థులలో పింగళి గారు ఒకరు కావడంతో కోపల్లె హనుమంతరావు, డాక్టర్ ముట్నూరు కృష్ణారావు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి వారి పరిచయం పింగళి వారికి లభించింది. తన చదువును పూర్తిచేసిన పింగళి గారు 1918లో ఖరగ్ పూర్ వెళ్లి అక్కడ రైల్వే వర్క్ షాప్ లో అప్రెంటిస్ గా చేరారు. యువకుడు అయిన పింగళి గారు ఆ రోజులలో ప్రముఖ యోగా వ్యాయామవేత్త బులుసు రామజోగారావు గారు ఖరగ్ పూర్ లో జాతీయోత్సాహం రేకెత్తించే ఉపన్యాసాలు ఇస్తుండగా విని ప్రేరేపితుడై 1920లో తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఉత్తరదేశ యాత్ర ప్రారంభించారు.

@ కాంగ్రెస్ నిర్వాహకునిగా ఉద్యోగం…

1918లో ఖరగ్‌పూర్ లోని రైల్వే వర్క్‌షాపులో అప్రెంటీస్ గా చేరిన పింగళి గారికి వర్క్‌షాప్ లో పనిచేసేందుకు తన ఆరోగ్యం సహకరించదని తనను ఆఫీసు పనికి మార్చారు. పింగళి గారు ఉండగానే బి.ఎన్ రైల్వే కార్మికుల తొలి యూనియన్ ఏర్పాటు అయింది. నాగేంద్రరావు గారు తన బావమరిది యైన దండపాణితో కలిసి ఈ యూనియన్ స్థాపనకు విశేషమైన కృషి చేశాడు. దండపాణి ఆ యూనియన్ కు అధ్యక్షుడు. అదే సమయానికి “చిత్తరంజన్ దాస్” రైల్వే ఫెడరేషన్ కు అధ్యక్షుడు. ఖరగ్ పూర్ లో ప్రసిద్ధ యోగవ్యాయామవేత్త అయిన రామజోగారావు గారి  జాతీయోత్సాహం రేకెత్తించే ఉపన్యాసాలకు 1920లో నాగేంద్రరావు తన ఉద్యోగానికి ఉద్వాసన చెప్పిన పింగళి గారు ఉత్తరదేశ యాత్ర ప్రారంభించారు. ఖరఘ్ పూర్ లో వుండగానే పింగళి గారు దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) సభ్యులు అయ్యారు.

దివ్యజ్ఞాన సమాజం వారి మకాములలో బసచేస్తూ ఉత్తరదేశం పర్యటించిన పింగళి గారు చివరకు సబర్మతీ ఆశ్రమం చేరుకున్నారు. తాను అసలే బ్రహ్మచారి (వివాహం చేసుకోలేదు). అందులో వైరాగ్యం కుదిరింది. కాని ఆశ్రమం వారు అనుమతించలేదు. అదే జరిగి ఉంటే ఒక అద్భుత రచయిత సినిమా రంగానికి పరిచయం అయ్యి ఉండేవారు కాదేమో. సబర్మతి ఆశ్రమ నిర్వాహకుడు కాకా కలేల్కర్ గారు పింగళి నాగేంద్రరావు ఆశ్రమవాసిగా వుండేకన్నా కూడా కాంగ్రెస్ సంస్థలో చేరితేనే ఎక్కువ దేశసేవ చేయగలుగుతాడనుకున్నారు. దాంతో కాకా కలేల్కర్ గారు కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ధన్వాడ రామచంద్రరావు గారికి పింగళి గారిని సిఫారసు చేస్తూ ఒక ఉత్తరం వ్రాసిచ్చారు. దాని సహాయంతో నాగేంద్రరావు గారికి కాంగ్రెసులో నిర్వాహకునిగా వేతనంతో కూడిన ఉద్యోగం లభించింది.

ఉద్యోగం చేస్తూ పింగళి గారు కొన్ని దేశభక్తి పద్యాలు రచించి జన్మభూమి అనే పుస్తకంగా ప్రచురించారు. ఈ పని చేసినందుకు నాగేంద్రరావు గారిని బెజవాడలో అరెస్టు చేశారు. అయితే జిల్లా కలెక్టరు తనను హెచ్చరించి విడిచిపెట్టారు. అలా రోజులు గడుస్తున్న తరుణంలో ఒకసారి బందరు కు వచ్చిన డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు పింగళి గారిని చూశారు. తనకు పార్టీ వేతనం చెల్లిస్తుంది అని తెలుసుకొన్న పట్టాభి ఆర్థిక స్థోమత కలిగిన వారు మాత్రమే కాంగ్రెస్ సంస్థకు సేవలు చేయాలని, బతుకుతెరువు కోసం పార్టీలపై ఆధారపడితే భారమని చెప్పారు. తన సలహా పై పింగళి గారు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.

@ “శారద” పత్రికకు సారధిగా…

“మోడరన్ రివ్యూ”, “ప్రవాసి” పత్రికల తరహాలో కౌతా రామశాస్త్రి గారు ఒక సాహిత్య పత్రికను తీసుకురావాలని ప్రయత్నాల్లో ఉన్నారు. 1923లో “శారద” పేరుతో పత్రిక ప్రారంభమైంది. డాక్టర్ పట్టాభి గారి సిఫారసుతో పింగళి గారు ఆ పత్రికలో చేరారు. ఆ పత్రికను వెలువరించడంలో చాలా చురుకైన పాత్రను పోషించారు పింగళి గారు. అక్కడ పనిచేస్తున్న డి.ఎల్.రాయ్  నాటికలు “మేవాడీపతన్”, “పాషాని” తెలుగులోకి అనువదించి కృష్ణా పత్రికలో ప్రచురించారు. పింగళి గారు వ్రాసిన “జేబున్నిసా”, “వింధ్యరాణి” నాటకాల కృష్ణా పత్రికలోను, “రారాజు” భారతి లోను ప్రచురితమయ్యాయి. వీటిని ఆనాటి రంగస్థల ప్రముఖులు డి.వి.సుబ్బారావు గారు రంగస్థలంపై ప్రదర్శించేవారు. కాలక్రమేణా రెండేళ్ల అనంతరం “శారద” పత్రిక ఆగిపోగానే మరే పత్రికలోనూ చేరకుండా డి.వి.సుబ్బారావుకు చెందిన “ఇండియన్ డ్రమటిక్ కంపెనీ” లో  కార్యదర్శి గా చేరారు. పింగళి గారికి 1946లో సినిమా అవకాశం వచ్చేవరకు “ఇండియన్ డ్రమటిక్ కంపెనీ” లోనే కొనసాగారు.

@ సినీ నేపథ్యం…

@ తొలి రచన “భలే పెళ్లి”…

పింగళి గారు వ్రాసిన “వింధ్యరాణి” నాటకం యొక్క విజయం ఎంతదాకా వెళ్ళిందంటే, బందరులో డాక్టర్ వి.దుర్గా నాగేశ్వరరావు గారు ఆ నాటకాన్ని డి.వి.సుబ్బారావు గారితో సహా సినిమాగా తీయటానికి వైజయంతి ఫిలింస్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపించిన కొద్ది రోజులకే ఎన్. జగన్నాధ్ గారు బందరు వచ్చారు. జగన్నాధ్‌ గారికి అంతకు పూర్వం “తారుమారు” అనే ఆరు రీల్ల చిత్రాన్ని తీసిన అనుభవం ఉంది. మరో పదివేల అడుగుల చిత్రం తీసి రెంటినీ కలిపి విడుదల చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ రెండో చిత్రం తీయటంలో వైజయంతి ఫిలింస్ వారు తమకు భాగస్వాములుగా ఉండాలని కోరటానికి జగన్నాధ్ గారు బందరు వచ్చి, ఇప్పుడీ రెండవ చిన్న చిత్రం తీసి, ఆ అనుభవంతో వింధ్యరాణి తీస్తే బాగుంటుందని దుర్గా నాగేశ్వరరావు గారిని ఒప్పించారు.

జగన్నాథ్ తీయదలచినది మోలియర్ నాటకానికి అనుసరణ “భలే పెళ్ళి”. ఈ చిత్రానికి రచయితగా పనిచేసే బాధ్యత “వింధ్యరాణి” రచయిత అయిన పింగళి నాగేంద్రరావు గారి మీదనే పడింది. “భలే పెళ్లి” సినిమా పింగళి నాగేంద్రరావు గారికి తొలి సినిమా అనుభవం. భలే పెళ్ళి సినిమాకి పాటలూ, మాటలూ ఆయనవే. ఈ చిత్రంలో డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య, జయంతి గంగన్న, గరికపాటి రాజారావు, సురభి గోవిందరావు కూతుళ్ళూ, తదితరులు నటించారు. ఎందుకనో “భలే పెళ్ళి” సినిమా పింగళి నాగేంద్రరావు గారిని సినిమా ప్రపంచంలో నిలబెట్టలేకపోయింది.

@ ఆకట్టుకోని “వింధ్యారాణి”… 

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో, సినిమాలు తీయటానికి ఫిల్ము కూడా కరువైన ఆ రోజుల్లో మద్రాసు అంతా ఖాళీ అయ్యి సినిమా చిత్రనిర్మాణం బాగా కుంటుపడగా, పింగళి నాగేంద్రరావు గారు తిరిగి నాటకాలాడించుకోవటానికి బందరు వెళ్ళిపోవలసివచ్చింది. యుద్ద వాతావరణం సద్దుమణిగిన తరువాత 1946లో “వింధ్యరాణి” చిత్రికరణ మొదలయ్యింది. జెమిని స్టూడియో సహకారంతో వైజయంతి ఫిలింస్ సంస్థ ఈ చిత్రం తయారు చేయబూనుకున్నది. దీనికి చిత్తజల్లు పుల్లయ్య గారు దర్శకత్వం. ఇందులో డి. వి. సుబ్బారావు, పుష్పవల్లి, రేలంగి, జి. వరలక్ష్మి, పండిట్ రావు ప్రభృతులు పాత్రధారులుగా నటించారు. పింగళి నాగేంద్రరావు గారు తిరిగి సినిమా రంగానికి వచ్చి సి. పుల్లయ్యగారి పర్యవేక్షణలో చిత్రీకరించిన “వింధ్యరాణి” స్క్రిప్టు తయారుచేసాడు. అయితే “వింధ్యారాణి” చిత్రం విజయం సాధించకపోయినా పింగళి గారికి తిరిగి బందరు వెళ్లే అవసరం కలగలేదు.

@ రచయిత గా తొలి విజయం “గుణసుందరి కథ”… 

“వింధ్యారాణి” తయారవుతున్న తరుణంలో తమ ఊరివాడే అయిన “కమలాకర కామేశ్వరరావు” గారు కలిసి పింగళి గారిని తీసుకెళ్ళి కె.వి.రెడ్డి గారికి పరిచయం చేశారు. ఆ పరిచయం వీరిద్దరికే కాదు ఆంధ్ర ప్రేక్షకులకు కూడా ఎంతో ఉపకారం చేసింది. ఆ సమయంలో “గుణసుందరి కథ” చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారు కె.వి.రెడ్డి గారు. పింగళి గారి ప్రతిభను గమనించి కె.వి.రెడ్డి గారు “గుణసుందరి కథ” చిత్రానికి మాటలు, పాటలు వ్రాసే బాధ్యతను పింగళి గారికి అప్పగించారు. “గుణసుందరి కథ” చిత్రంలో కొత్తగా వినిపించిన మాటలు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పింగళి ప్రతిభ ఏమిటో అందరికీ అర్థమైంది. “గుణసుందరి కథ” చిత్రానికి దర్శకుడు కె. వి. రెడ్డి గారు కానట్టయితే పింగళి నాగేంద్రరావు గారి సినిమా రచన “భలేపెళ్ళి”, “వింధ్యరాణి” కి మించి ఎంతో పైకి వెళ్ళలేక పోయివుండవచ్చు. ఈ ఇద్దరి సమ్మేళంతో తయారైన “గుణసుందరి కథ” అంతకు పూర్వం ఏ తెలుగు చిత్రమూ ఎరగనంత గొప్పవిజయాన్ని సాధించింది.

@ విజయా సంస్థలో శాశ్వత రచయితగా..

ఆ సమయంలో విజయా సంస్థ ప్రారంభం కావడం కె.వి.రెడ్డి గారితో పాటు కమలాకర కామేశ్వరరావు, పింగళి గార్లు ఆ సంస్థలో చేరడం జరిగింది. శాశ్వత రచయితగా “పాతాళభైరవి”, “చంద్రహారం”, “మాయాబజార్”, “జగదేకవీరుని కథ”, “సత్యహరిచంద్ర”, “ఉమా చండీ గౌరీ శంకరుల కథ” వంటి విజయా చిత్రాలకు పింగళి గారే రచన చేశారు. పింగళి గారు విజయ సంస్థ తీసిన “మిస్సమ్మ”, “అప్పుచేసి పప్పుకూడు”, “గుండమ్మ కథ” చిత్రాలకు పాటలు వ్రాశారు. మాటలు వ్రాసినా, పాటలు వ్రాసినా అందులో పింగళి బాణీ ప్రత్యేకంగా కనిపించేది. “పెళ్లినాటి ప్రమాణాలు”, “శ్రీకృష్ణార్జునయుద్ధం”, “మహాకవి కాళిదాసు”, మహమంత్రి తిమ్మరసు”, “శ్రీకృష్ణ విజయం”, “శ్రీకృష్ణసత్య”, “నీతి – నిజాయితీ” వంటి బయట చిత్రాలకు కూడా పింగళి గారు రచనలు చేశారు.

@ చిత్ర సమాహారం…

రాజకోట రహస్యం (1971), అగ్గిమీద గుగ్గిలం (1968), సి.ఐ.డి (1965), శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963), మహామంత్రి తిమ్మరుసు (1962), గుండమ్మ కథ (1962), జగదేకవీరుని కథ (1961), మహాకవి కాళిదాసు (1960), అప్పు చేసి పప్పు కూడు (1959), పెళ్ళినాటి ప్రమాణాలు (1958), మాయా బజార్ (1957), మిస్సమ్మ (1955), చంద్రహారం (1954), పాతాళ భైరవి (1951), గుణసుందరి కథ (1949), వింధ్యరాణి (1948), భలే పెళ్లి (1941), శ్రీకృష్ణ లీలలు (1935)

@ సొంత ఇంట్లోనే అద్దెకు నివసించిన పింగళి…

పింగళి నాగేంద్ర రావు గారు బ్రహ్మచారి. తనతో బాటు తన తల్లి గారు (వయస్సు 90 సంవత్సరాలు) ఉండేవారు. వంటకి, తల్లిని చూసుకోవడానికి అనసూయమ్మ అనే ఆవిడని ఏర్పాటు చేశారు పింగళి గారు. తల్లిగారు మరణించిన తర్వాత కూడా అనసూయమ్మ కొనసాగారు. ఆమె కొడుకు రామ్మూర్తికి చదువు చెప్పించి వయోలిన్ నేర్పించారు. వాళ్ళ దగ్గర బంధువుల కంటే కూడా మిన్నగా పింగళి నాగేంద్రరావు గారు వారిని చూసుకున్నారు. పింగళి గారికి వ్యాధి ముదిరింది. డబ్బు అవసరాన్ని బట్టి తన ఇంటిని ఘంటసాల గారికి అమ్మేశారు. అమ్మిన ఇంట్లోనే పైన ఒక గదిని అద్దెకి తీసుకొని ఉండేవారు. మద్రాసులో మరేం పనిలేదని తన ఊరికి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో ఉన్నారు గానీ, వ్యాధి తీవ్రత “ధనం” కోరుతూనే ఉంది. ఎన్నో చిత్రాలకు వచ్చిన శత దినోత్సవ బహుమతులు (ఆ రోజుల్లో వెండి పతకాలు ఇచ్చేవారు) అమ్మేశారు.

@ భూలోక చాపచుట్టి…

తన దగ్గర ఉన్న పెద్ద గ్రంథాలయం కూడా అమ్మేయాలని ఆరుద్ర గారితో చెప్పి ఉంచారు. నరసరాజు గారితో కూడా ఆ మాట అంటే గ్రంథాలయం అమ్మ వద్దని ఆయనకు ఎంత అవసరమో అడిగి ఆ డబ్బు ఇచ్చారు నరసరాజు గారు.  “శ్రీకృష్ణసత్య”, “చాణక్య చంద్రగుప్త” చిత్రాలకు చేసిన రచనలకు సంబంధించి కొంత బకాయి ఉన్నట్టుంది గానీ అడగలేకపోయారు. పింగళి నాగేంద్ర రావు గారి ఆరోగ్య స్థితి, ఆర్థిక పరిస్థితి తెలిసి ఉంటే బి.నాగిరెడ్డి గారు, రామారావు గారు సాయం అందించే వారే. కానీ వారికి తెలియలేదు. తన దగ్గరి మిత్రులు కూడా పింగళి గారు డబ్బు అడుగుతారేమో అని కాబోలు  తన అనారోగ్య పరిస్థితి తెలిసి కూడా తన వద్దకు రాలేదు.

ఎప్పుడో పింగళి గారి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరో ఇచ్చిన ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. వాటిని రామ్మూర్తి పేర వ్రాశారు. రామ్మూర్తి ని దత్తత తీసుకున్నాడు. తను సంపాదించుకున్న ఇంట్లోనే అద్దెకు ఉన్న పింగళి నాగేంద్రరావు గారు క్యాన్సర్ వ్యాధికి పడి 06 మే 1971 నాడు భూలోక చాపచుట్టి పరలోకానికి పయనమయ్యారు. తాను దత్తత తీసుకున్న రామ్మూర్తి దహన సంస్కారాలు నిర్వర్తించాడు. తెలుగు సినిమా రచనకి కొత్తదారి వేసి, ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న పింగళి వారి చివరి రోజులు ఇబ్బందికరంగా గడిచాయి. పింగళి గారు మరణించినా కూడా ఆయన చిరంజీవి. ఒక్క “మాయాబజార్” (1957) చాలదా పింగళి వారి చిరంజీవిత్వానికి !!!

Show More
Back to top button