Telugu Special Stories

దేశాభివృద్ధికి సవాలుగా పరిణమించిన జాతీయ విపత్తు కరువు

ప్రగతి పథంలో దూసుకుపోతున్న భారతదేశానికి కరువు, ఎడారీకరణ నేడు పెను సవాళ్లుగా మారాయి. ఒక ప్రాంతంలో సుదీర్ఘ కాలం పాటు వర్షపాతం గణనీయంగా తగ్గి, పంటలు పండని దారుణ పరిస్థితినే మనం కరువుగా పేర్కొంటాము. భారత వాతావరణ శాఖ ప్రమాణాల ప్రకారం, వార్షిక వర్షపాతంలో 25 శాతం కంటే ఎక్కువ తగ్గుదల నమోదైతే అది కరువుగాను, అదే 50 శాతం కంటే ఎక్కువ లోటు ఉంటే దానిని ‘తీవ్రమైన కరువు’గాను పరిగణిస్తారు. ఇది కేవలం నీటి కొరతతో ముగిసేది కాదు. ఇది వాతావరణం నుండి ప్రారంభమై వ్యవసాయ, జల, పర్యావరణ కరువులుగా రూపాంతరం చెందుతూ మన జీవవైవిధ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి మన దేశం 1965-67, 1972-73, 1979-80, 1985-88 కాలాల్లో సంభవించిన అత్యంత భయంకరమైన కరువులను చవిచూసింది. గణాంకాల ప్రకారం, దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 68 శాతం ప్రాంతం ఏదో ఒక స్థాయిలో కరువు ముప్పును ఎదుర్కొంటోందని తెలుస్తోంది.

మానవ తప్పిదాలు – ప్రకృతి వైపరీత్యాల కలయిక:

కరువును కేవలం ప్రకృతి వైపరీత్యంగా చూడటం మన ప్రాథమిక పొరపాటు. కరువుకు బలహీనమైన రుతుపవనాలు, అల్పపీడనాలు ఏర్పడకపోవడం వంటి సహజ వాతావరణ కారణాలు ఉన్నప్పటికీ, మానవ తప్పిదాల పాత్ర అంతకంటే ఎక్కువగా ఉంది. అడవుల నరికివేత, అనియంత్రిత మానవ కార్యకలాపాలు, వాతావరణంలో సంభవిస్తున్న తీవ్ర మార్పుల వల్ల సారవంతమైన భూములు బంజరుగా మారుతున్నాయి. పశువుల అతి మేత, సహజ వృక్ష సంపద దుర్వినియోగం, దీర్ఘకాలికంగా ఒకే రకమైన పంటలను పండించడం భూమి నిస్సారమవడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుత కాలంలో గ్లోబల్ వార్మింగ్‌తో పాటు ఎల్-నినో వంటి అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులు రుతుపవనాల గమనాన్ని మార్చివేస్తూ, దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులకు కారణమవుతున్నాయి. సగటు వర్షపాతం నమోదైనప్పటికీ అనేక ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కోవడం వెనుక అస్తవ్యస్తమైన నీటి యాజమాన్య పద్ధతులే దాగి ఉన్నాయి. సాంప్రదాయ వనరులైన చెరువులు, కుంటలను నిర్లక్ష్యం చేయడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వృథాగా పోతోంది, ఇది మానవ నిర్మిత సంక్షోభానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. 

ఎడారీకరణ దిశగా అడుగులు- గ్లోబల్ హెచ్చరికలు:

ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరం నుండి కరువుల సంఖ్య 29 శాతం పెరిగిందని ఐక్యరాజ్యసమితి నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ప్రపంచ జనాభాలో 75 శాతం మంది కరువు బారిన పడే ప్రమాదం ఉంది. మన దేశంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఎందుకంటే భారతీయ వ్యవసాయం ప్రధానంగా రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇస్రో నివేదికల ప్రకారం, దేశంలోని సుమారు 29.7 శాతం భూమి అంటే దాదాపు 9.785 కోట్ల హెక్టార్లు క్షీణతకు గురైంది. నీతి ఆయోగ్ సమాచారం ప్రకారం, ప్రతి సంవత్సరం మనం 1.2 కోట్ల హెక్టార్ల సారవంతమైన భూమిని నష్టపోతున్నాము, ఇది దాదాపు 2 కోట్ల టన్నుల ధాన్యపు ఉత్పత్తికి సమానం. రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పాటు, దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 14.35 శాతం, తెలంగాణలో 31.40 శాతం భూములు నిరుపయోగంగా మారడం భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

సామాజిక – ఆర్థిక ప్రభావాలు:

కరువు సృష్టించే సామాజిక పరిణామాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఒక మారుమూల గ్రామంలో కురవని వర్షం, దేశ ఆర్థిక గమనాన్ని మందగింపజేసే శక్తిని కలిగి ఉంటుంది. వర్షపాతంలో వచ్చే స్వల్ప మార్పు సైతం కోట్ల మంది రైతుల జీవనోపాధిని దెబ్బతీసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. ఇది ఆహార భద్రతకు సవాలుగా మారడమే కాకుండా, తాగునీటి ఎద్దడి వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పశుగ్రాసం లభించక మూగజీవాలు మరణించడం వల్ల పాడి పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ పరిస్థితులు గ్రామీణ ప్రజలను నగరాలకు వలస వెళ్లేలా ప్రేరేపిస్తున్నాయి. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లోని పరిమిత వనరులపై అదనపు భారం పడుతోంది. ఆర్థిక కోణంలో చూస్తే, కరువు వల్ల సాగు విస్తీర్ణం తగ్గి వ్యవసాయోత్పత్తి పడిపోతుంది. ఇది మార్కెట్లో ధరల పెరుగుదలకు, తద్వారా ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. పేదరికం పెరగడంతో పాటు దేశ స్థూల జాతీయోత్పత్తిపై ఇది గొడ్డలి పెట్టుగా మారుతుంది. 

శాస్త్రీయ పరిష్కారాలు-పౌర భాగస్వామ్యం:

ఈ జాతీయ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కేవలం ప్రభుత్వ పథకాలపైనే కాకుండా ప్రజా ఉద్యమంపై దృష్టి సారించాలి. దీర్ఘకాలిక ప్రణాళికలు, శాస్త్రీయ పరిష్కారాలు అత్యంత ఆవశ్యకం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కరువు రాకను ముందే పసిగట్టడం అనేది మొదటి కీలక అడుగు. రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి ఉపగ్రహ సాంకేతికతల ద్వారా వాతావరణంలో సంభవించే మార్పులను, మేఘాల గమనాన్ని, భూమిలోని తేమ శాతాన్ని నిరంతరం పర్యవేక్షించి ఈ సమాచార విశ్లేషణ ఆధారంగా ఏ ప్రాంతాలు కరువు బారిన పడే అవకాశం ఉందో ముందే గుర్తించి, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా రైతులను ప్రభుత్వాలు అప్రమత్తం చేయాలి.

డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ ద్వారా కరువును ఎదుర్కోవచ్చు. గత కొన్ని దశాబ్దాల వాతావరణ సమాచారాన్ని విశ్లేషించి, రాబోయే కరువు తీవ్రతను కృత్రిమ మేధ నమూనాలు ముందే అంచనా వేయగలవు. దీనివల్ల ప్రభుత్వాలు పంట బీమా, ఆహార నిల్వలపై ముందస్తు నిర్ణయాలు తీసుకోవాలి. ఉపగ్రహ చిత్రాల నుండి సేకరించిన భారీ డేటాను ఎ.ఐ ద్వారా విశ్లేషించి ఏ ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయో, ఎక్కడ నీటి ఎద్దడి ప్రారంభమైందో రియల్ టైమ్‌లో తెలుసుకోవాలి. రైతులకు సహాయం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కృత్రిమ మేధ ఆధారిత యాప్‌లు రైతులకు వారి భూమి రకాన్ని బట్టి ఏ రకమైన పంటలు వేస్తే కరువును తట్టుకోవచ్చో సూచిస్తాయి.

విత్తనాలు వేయడానికి అనువైన సమయం నుండి, నీటిని ఆదా చేసే పద్ధతుల వరకు వ్యక్తిగతీకరించిన సలహాలను ఇస్తాయి. డ్రోన్ సాంకేతికతను ఎ.ఐ తో జోడించడం ద్వారా తక్కువ నీటితో పంటలకు మందులు చల్లడం, నేల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం వంటివి మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. సాగు నీటి నిర్వహణలో స్మార్ట్ సెన్సార్ల వినియోగం మరొక ఆధునిక పద్ధతి. ఇవి మట్టిలోని తేమను నిరంతరం కొలుస్తూ, మొక్కకు ఎప్పుడు, ఎంత నీరు అవసరమో ఖచ్చితంగా లెక్కగట్టి ఆటోమేటిక్గా నీటిని విడుదల చేస్తాయి. అలాగే ఇజ్రాయెల్ వంటి దేశాలు అనుసరిస్తున్న సముద్రపు నీటి డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి కరువు ప్రాంతాలకు తరలించవచ్చు. “జలమే జీవనాధారం” అన్న సూత్రాన్ని నమ్మాలి.

నదుల అనుసంధానం ద్వారా నీటి మిగులు ఉన్న బేసిన్ల నుండి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు జలాలను మళ్లించడం ద్వారా కరువు తీవ్రతను తగ్గించవచ్చు. అలాగే నగర ప్రాంతాల్లో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడిని తగ్గించవచ్చు. తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించడంతో పాటు, కరువును తట్టుకునేలా జన్యుపరంగా అభివృద్ధి చేసిన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. సాంప్రదాయక పద్ధతులకు స్వస్తి పలికి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటి పారుదల పద్ధతులను అనుసరించడం వల్ల ప్రతి నీటి చుక్కనూ గరిష్ఠంగా వినియోగించుకోవచ్చు. దీనివల్ల సాగు విస్తీర్ణం పెరగడమే కాకుండా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.

పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనేది కరువుకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తుంది. అడవుల విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా స్థానిక ఉష్ణోగ్రతలను తగ్గించి మేఘాలు వర్షించడానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించవచ్చు. నేల కోతను నివారించడం, భూమిలోని పోషకాలను కాపాడటం ద్వారా భూమి తేమను పట్టి ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. స్థానిక స్థాయిలో చెక్ డ్యామ్‌ల నిర్మాణం, భూగర్భ జలాల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ పద్ధతులను విరివిగా అమలు చేయాలి. బిందు సేద్యం వంటి ఆధునిక సాగు పద్ధతులను, కరువును తట్టుకునే విత్తన రకాలను ప్రోత్సహించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. అడవులను కాపాడుకోవడంతో పాటు నేల స్థిరీకరణకు ‘షెల్టర్ బెల్ట్‌లు’ వంటి చెట్ల వరుసలను పెంచాలి.

భూగర్భ జలాలు క్షీణించకుండా ఉండేందుకు పరిమితికి మించిన బోర్లు త్రవ్వడాన్ని నియంత్రించాలి. ప్రభుత్వం ఇప్పటికే ‘జల శక్తి అభియాన్’, ‘కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్’ వంటి కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావాలి. కరువుపై విజయం సాధించడం అంటే ప్రకృతిని జయించడం కాదు, ప్రకృతితో మమేకమై వనరులను విజ్ఞతతో వాడుకోవడమే. సుస్థిర అభివృద్ధి మార్గంలో పయనిస్తూ, ఆధునిక సాంకేతికతను స్థానిక నిర్వహణ పద్ధతులతో సమ్మిళితం చేసినప్పుడే మనం రాబోయే తరాలకు సస్యశ్యామలమైన భవిష్యత్తును అందించగలము. సుస్థిర అభివృద్ధి మార్గంలో పయనిస్తూ, ప్రకృతితో మమేకమై వనరులను విజ్ఞతతో వాడుకోవడమే కరువు రహిత భారతదేశానికి ఏకైక మార్గం.

Show More
Back to top button