Telugu Special Stories

ఢిల్లీ నుంచి గల్లీ వరకుకదిలించిన లిక్కర్ స్కాంఅసలు ఏంటి దీని స్టోరి..?

దేశంలో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి పలువురు నేతలను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఎప్పటి నుంచో ఈ స్కాంలో విచారణ జరుగుతున్నా సడెన్‌గా జరుగుతున్న వరుస అరెస్టులు ఎన్నికల స్టంట్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఏంటీ ఢిల్లీ లిక్కర్ స్కాం? దీని కథ ఎప్పుడు మొదలైంది? పదండి ఓ లుక్ వేద్దాం.

ఢిల్లీ లిక్కర్ స్కాం ఇలా..!

ఢిల్లీలో 2020 వరకు 40 శాతం మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో.. 60 శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. 2020లో కేజ్రీవాల్ ప్రభుత్వం వీటిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి 2021లో జనవరి 5న కొత్త లిక్కర్ పాలసీ కోసం మంత్రుల బృందంతో కూడిన ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలో అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. అయితే రెండు నెలల తర్వాత ఈ కమిటీ రిపోర్టును ఇచ్చింది. దీంతో అదే ఏడాది మార్చి నెలలో ఢిల్లీ క్యాబినెట్ కమిటీ రిపోర్టుకు అంగీకారం  తెలిపింది. తర్వాత ఆ రిపోర్టును లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆమోదం కోసం పంపింది. దీంతో ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు అప్పచెప్పడం వల్ల  ప్రభుత్వానికి ఆదాయం రూ.9500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ వల్ల వచ్చిన మార్పులు

ఢిల్లీ లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీలో వచ్చిన మార్పులు ఏంటంటే.. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం వచ్చింది. తెల్లవారుజామున 3గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు, మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు పెర్మిషన్ లభించింది. అయితే అప్పుడే కొత్తగా వచ్చిన ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నరేష్ కుమార్ లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసి.. లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించి దానికి సంబంధించిన నివేదికను లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఇచ్చారు. గవర్నర్‌ సీబీఐ విచారణకు ఆదేశించారు. దీంతో పాలసీ విధాన రూపకల్పనలో అవకతవకలకు సీబీఐ, పాలసీ విధాన రూపకల్పన దాని అమలుపై దర్యాప్తునకు ఈడీ.. విచారణను ప్రారంభించాయి.

అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము అనుకున్నంతగా ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదని తెలిపింది. అయితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర లంచాలు తీసుకుని మద్యం దుకాణాల లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఈ మద్యం పాలసీ పేరుతో మనీ లాండరింగ్ కూడా జరిగిందని ED తెలిపింది. సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్‌గా ఏర్పడి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారని ED పేర్కొంది. ఇందుకోసం ఆ వ్యక్తులు ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారని కూడా చెప్పింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర అరుణ్ పిళ్ళైదని సీబీఐ వెల్లడించింది. 

అంతేకాదు ఈ కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని.. కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచన మేరకే ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య హోటల్‌లో డీల్ కుదిరిందని బీజేపీ ఎంపీ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. కవిత కోసం ఢిల్లీలో ఒబెరాయ్ హోటల్‌లో పిళ్ళై ఆరు నెలలు ఒక గదిని బుక్ చేసి ఉంచారని అన్నారు. ఈ రూ.150 కోట్ల డీల్‌లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు అందాయని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బేస్ చేసుకుని దర్యాప్తు చేసిన ఈడీ తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కవితను అరెస్ట్ చేసింది.

ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు..?

ఈ స్కామ్‌‌లో అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్రు, పి శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్రా, మాగుంట రాఘవ, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కవిత అరెస్ట్ అయ్యారు. వీరిలో అరుణ్ పిళ్ళై, మనీష్‌ సిసోడియా, సంజయ్ సింగ్‌ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అటు కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా, మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు.

నిపుణులు ఏం చెబుతున్నారంటే..

2022 నుంచే ఈ స్కాంలో విచారణ జరుగుతున్నా సడెన్‌గా జరుగుతున్న వరుస అరెస్టులు ఎన్నికల స్టంట్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు 2014 నుంచి 2022 వరకు సీబీఐ డేటాను చూస్తే.. 95% ప్రతిపక్ష నేతలపైనే కేసులు ఉన్నాయని, ఇవి ఎన్నికలు జరగడానికి ముందే విచారణలోకి వచ్చేవని విశ్లేషకులు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ఈ అరెస్టులు ఎంత వరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.

Show More
Back to top button