
‘లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. ఆయన నటించిన తాజా సినిమా ‘డ్యూడ్’. ఇందులో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్. తెలుగు చిత్రసీమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది?
కథాంశం
పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె కుందన (మమితా బైజు). ఆమె మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్)ను ప్రేమిస్తుంది. గగన్ ఆమె ప్రేమను రిజెక్ట్ చేయడంతో, కుందన బ్రేకప్ బాధ నుంచి బయటపడటానికి బెంగళూరు వెళుతుంది. ఆమె దూరం అవ్వగానే గగన్‌కు ప్రేమ చిగురించి, మావయ్యకు విషయం చెప్పి పెళ్లికి సిద్ధమవుతాడు. అయితే, గగన్ తల్లి (రోహిణి)కి, కుందన తండ్రికి మధ్య మాటలు లేకపోవడానికి కారణమేంటి? పెళ్లికి వచ్చిన అడ్డంకులు, చివరకు గగన్ చేసిన త్యాగం ఏంటి? అనేది మిగతా కథ.
నటీనటుల ప్రదర్శన
ప్రదీప్ రంగనాథన్ స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఆయన నటన, మేనరిజమ్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఈ తరం యువకులు తమను తాము చూసుకునేలా రిలేటబుల్‌గా మారాయి. మమితా బైజు నటన చాలా చక్కగా, సహజంగా ఉంది. శరత్ కుమార్ మంత్రి పాత్రకు ఫన్నీ టచ్ ఇచ్చి, అవసరమైన చోట సీరియస్‌గా కనిపించి మెప్పించారు. హృదూ హరూన్, రోహిణి తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
సాయి అభ్యంకర్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. ఆయన అందించిన చార్ట్ బస్టర్ ఆల్బమ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా, ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు కీర్తిశ్వరన్ కథలో కొత్త పాయింట్ తీసుకోకపోయినా, ఆయన రాసిన సన్నివేశాలు, హీరో క్యారెక్టరైజేషన్, మేనరిజమ్స్ బాగున్నాయి. ప్రదీప్ నటన చాలా వరకు దర్శక రచయిత లోపాలను కవర్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
చివరిగా..
‘డ్యూడ్’ సినిమా కథ పాతదే అయినా, ప్రదీప్ రంగనాథన్ నటన మరియు సాయి అభ్యంకర్ మ్యూజిక్ వల్ల కొత్తగా అనిపిస్తుంది. రెగ్యులర్ కథ, మధ్యలో బోరింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ, ఈ జనరేషన్ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పీఆర్ (ప్రదీప్ రంగనాథన్) ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా.










