Telugu News

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘క్లాడ్ మైథోస్’ ఏఐ..!

ఆంథ్రోపిక్ సంస్థ రూపొందించిన ‘క్లాడ్ మైథోస్’ అనే ఏఐ మోడల్ ప్రపంచ బ్యాంకింగ్, ఫైనాన్స్ వ్యవస్థలకు పెను సవాలుగా మారింది. ఇది ఇంకా అధికారికంగా విడుదల కాకముందే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి భారత ప్రభుత్వం వరకు ఉన్నత స్థాయి వర్గాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. వాస్తవానికి సైబర్ సెక్యూరిటీలోని లోపాలను గుర్తించి, వాటికి పరిష్కారాలను చూపడానికి దీనిని అభివృద్ధి చేశారు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, బ్రౌజర్‌లలో దశాబ్దాలుగా ఎవరికీ దొరకని లోపాలను కూడా ఇది క్షణాల్లో కనిపెట్టగలదని నిరూపితమైంది. అయితే, ఇదే సాంకేతికత నేరగాళ్ల చేతికి చిక్కితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలను హ్యాక్ చేసి చిందరవందర చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన టెక్ నిపుణులలో మొదలైంది.

క్లాడ్ మైథోస్ ఏఐ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలకు ముప్పు

ఈ ఏఐ మోడల్ అంత ప్రమాదకరం కావడానికి ప్రధాన కారణం ప్రపంచంలోని బ్యాంకులన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉండటమే. పేమెంట్లు, స్టాక్ మార్కెట్, ఫారెక్స్ ట్రేడింగ్ వంటి వ్యవస్థలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి. ఒకవేళ మైథోస్ సాయంతో హ్యాకర్లు ఏదైనా ఒక పెద్ద బ్యాంకు ఐటీ సిస్టమ్‌పై దాడి చేస్తే.. ఆ ప్రభావం గొలుసుకట్టులా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆర్థిక సంస్థలపై పడుతుంది. ఆపిల్, గూగుల్ వంటి 12 ప్రధాన టెక్ కంపెనీలు దీన్ని పరీక్షించినప్పుడు, ఇది మనుషుల కంటే వేగంగా హ్యాకింగ్ టాస్కులను పూర్తి చేయడంతో పాటు అత్యంత క్లిష్టమైన సైబర్ దాడులకు పాల్పడగలదని తేలింది. అందుకే దీని పబ్లిక్ విడుదలను నిలిపివేసినప్పటికీ.. దీనికి అనధికారిక యాక్సెస్ జరిగిందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి.

ప్రభుత్వాల అప్రమత్త చర్యలు

ఈ ముప్పును ముందే పసిగట్టిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఇప్పటికే అత్యవసర సమావేశాలు నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశాయి. భారత దేశంలో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బ్యాంకింగ్ రంగ ఉన్నతాధికారులతో కలిసి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఏఐ మోడల్స్ వల్ల కలిగే డేటా సెక్యూరిటీ ముప్పును ఎదుర్కోవడానికి బ్యాంకులు తమ ఐటీ వ్యవస్థలను వెంటనే బలోపేతం చేసుకోవాలని సూచించారు. వినియోగదారుల డేటాను కాపాడటానికి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తో నిరంతరం సమన్వయం చేసుకోవాలని, ఇటువంటి సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ఇతర కథనాలు:

ఇంటర్నెట్ లేకున్నా ఉపయోగించే ఏఐ ఎడ్జ్ యాప్.!

ఏమిటీ ఏఐ డీప్‌సీక్?

గూగుల్ ఏఐ ప్రో.. ఏడాదిపాటు ఫ్రీగా!

Show More
Back to top button