Telugu Politics

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారా?

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి కళ్లు కేంద్రీకృతమై కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో పిఠాపురం పేరు రాష్ట్రమంతా మార్మోగిపోతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ ఉన్న ఈ నియోజకవర్గంలో కాపు నేతలే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది. 2004లో బీజేపీ, 2009లో కొత్త పార్టీ ప్రజారాజ్యం విజయం సాధించాయి. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన SVSN వర్మ 47వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయదుందుభి మోగించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

వచ్చే ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్ కేటాయించడంతో ఆ పార్టీ నుంచి పవన్ పోటీ చేస్తున్నారు. ఆయనకు వర్మ మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ తరఫున వంగా గీత బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని వైసీపీ అధినేత జగన్ ఆమెకు టిక్కెట్ కేటాయించారు. పవన్ బరిలో ఉండటంతో వైసీపీ ముఖ్య నేతలందరూ పిఠాపురంలో కాపు కాస్తున్నారు. దీంతో పవన్ గెలుస్తారా లేదంటే వంగా గీత విజయఢంకా మోగిస్తారో వేచి చూడాల్సిందే.

Show More
Back to top button