Telugu Special Stories

ఓఅనాథ + ఓఆలోచన = ఓబ్రాండ్.. రోలెక్స్!

మార్కెటింగ్ పై అపారమైన పట్టు, వాచ్ లను తయారు చేయడంలో దిట్ట.. అదీకాక అప్పట్లో పాకెట్ వాచ్ లే ఉండటం.. ఇందుకు భిన్నంగా రోలెక్స్ పేరుతో రిస్ట్ వాచ్ కంపెనీని స్థాపించిన ఘనత విల్ డార్ఫ్, డేవిస్ లది..

1905లో లండన్ లో మొదలు పెట్టిన ఈ రిస్ట్ వాచ్ ల తయారీ కంపెనీ అసలు పేరు రోలెక్స్ కాదు.. విల్స్ డార్ఫ్ & డేవిస్. కానీ పేరు పెద్దగా ఉండటంతో.. తర్వాతి రోజుల్లో రోలెక్స్ అని మార్చారు. నిజానికి రోలెక్స్ అంటే అర్ధం కూడా తెలీదు. డిక్షనరీలోనూ ఈ పదానికి అర్ధం లేదని తెలుస్తోంది. ఈ కంపెనీ స్థాపన అప్పట్లో ఓ సంచలనమే చెప్పాలి. ఎందుకంటే? పాకెట్ వాచ్ లు ఆ సమయానికి మార్కెట్ ను ఏలుతున్నాయి. ఇది గమనించిన విల్ డార్ఫ్.. రాబోయే తరం రిస్ట్ వాచ్ లదేనని ముందుగానే ఊహించి.. రోలెక్స్ కంపెనీని ప్రారంభించాడు. బాల్యంలోనే అమ్మానాన్నలను కోల్పోయి.. రకరకాల ఉద్యోగాలు చేస్తూ.. వాచ్ ల తయారీ మీద ఉన్న విపరీతమైన ఆసక్తితో మొదలు పెట్టిన ఈ సంస్థ.. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇంతకీ ఈ హన్స్ విల్స్ డార్ఫ్ ఎవరూ..? ఏం చేశాడు.. రోలెక్స్ వాచ్ కు ఎందుకంత క్రేజ్ అండ్ కాస్ట్లీ నో ఇప్పుడు తెలుసుకుందాం…

బాల్యం, చదువు, ఉద్యోగాలు

1881 మార్చి 22న జర్మనీలో బవేరియా అనే నగరంలో సాధారణ కుటుంబంలో జన్మించారు హన్స్ విల్స్ డార్ఫ్. అందరి పిల్లల్లాగే ఇతడి బాల్యం కూడా సాఫీగా సాగలేదు. వీళ్లు ఉంటున్న నగరంలోనే చిన్న వ్యాపారం చేసుకుంటూ గడిపేది వీరి కుటుంబం. 12 ఏళ్ల వయసులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. డార్ఫ్ తల్లి అనారోగ్యంతో చనిపోవడం.. ఆ బాధను తట్టుకోలేక తండ్రి కూడా మరణించడం డార్ఫ్ జీవితాన్ని ఒక్కసారిగా కుంగదీసింది. ఈ విషాదం అతడ్ని మానసికంగా డిప్రెషన్ లోకి నెట్టేసింది. తల్లిదండ్రుల మరణం తర్వాత ఆస్తి మెుత్తం అమ్మి.. ముగ్గురు పిల్లలను స్కూల్లో చేర్పించారు బంధువులు. కానీ స్కూల్లో ఎవ్వరితోనూ సరిగా మాట్లాడేవాడు కాదు విల్. ఆ డిప్రెషన్ నుంచి మెల్లగా తన ఫోకస్ ని చదువు మీద కి మార్చాడు. తనకిష్టమైన సబ్జెక్ట్స్ ని మాత్రమే బాగా చదివేవాడు. కొత్త కొత్త లాంగ్వేజస్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. ఆ ఇంట్రెస్ట్ తోనే జర్మన్ తో పాటు, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలను నేర్చుకున్నాడు.

అయితే ఆయన నేర్చుకున్న ఈ భాషలే, ఆయన జీవితానికి మేలు చేశాయి. జర్మనీలో చదువు పూర్తి చేసుకున్నాడు విల్.. 19ఏళ్ల వయసులో హన్స్ కి స్విట్జర్ లాండ్ లోని పేరల్స్ ఎక్స్ పోర్టింగ్ కంపెనీలో జాబ్ వచ్చింది. అక్కడే కొన్ని మెలకువల్ని నేర్చుకున్నాడు. ముత్యాలు, వజ్రాలు అనేవి తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయి.. వాటిని ఎలా కొనుగోలు చేసి.. తిరిగి ఎక్కువ ధరకు ఎలా అమ్మాలి, మార్కెట్ లో డిమాండ్ సృష్టించి ఎలా క్యాష్ చేసుకోవాలో వంటి విషయాలను వ్యక్తిగతంగా గమనించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రీమియం వాచ్ లకు సంబంధించిన సంస్థలో చేరాడు. అప్పట్లో డిమాండ్ లో ఉన్నవి పాకెట్ గడియారాలే.. రోజులో వందల కొద్దీ పాకెట్ వాచెస్ ని వెరిఫై చేయాలి. కచ్చితంగా సరైన టైంను చూపెడుతున్నాయా? లేదా? అని వాటి క్వాలిటీని చెక్ చేయడం తన పని. దీంతోపాటు మార్కెటింగ్ ఎలా చేయాలో అనే విషయాన్ని ఇక్కడే ఔపోసన పట్టాడు విల్ డార్ఫ్. 

22ఏళ్లకు స్విట్జర్ లాండ్ నుంచి లండన్ కు వెళ్లి అక్కడ ఒక లగ్జరీ వాచ్ మేకింగ్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగంలో చేరాడు. ఇక్కడ కొత్త కస్టమర్లను అట్రాక్ట్ చేయడం.. 

వారితో డీల్స్ చేయించి, ఆ కంపెనీ సేల్స్ ను పెంచడం అతడి పని. దాదాపు రెండేళ్ల పాటు ఆ కంపెనీలో చేశాక మార్కెటింగ్ విషయంలో పూర్తి అవగాహన వచ్చింది. ఈ క్రమంలోనే సొంతంగా ఒక వాచ్ మేకింగ్ కంపెనీని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఇందుకు ఆయన చేసిన పని అనుభవం ఎంతో ప్లస్ అయ్యింది. కానీ అందుకు కావాల్సిన పెట్టుబడి మాత్రం ఆయన దగ్గర లేదు. అయితే తన ఆలోచనను నమ్మి ఆల్ఫ్రెడ్ డేవిస్.. హన్స్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. పైనల్ గా వీరిద్దరూ కలిసి1905లో విల్స్ డార్ఫ్ అండ్ డేవిస్ అనే కంపెనీని స్థాపించారు. 

పాకెట్ వాచెస్ కు భిన్నంగా రిస్ట్ వాచెస్ తయారీ..

స్టార్టింగ్ డేస్ లో ఈ కంపెనీ జర్మనీకి వాచెస్ ను ఇంపోర్ట్ చేసుకొని, వాచ్ కేసెస్ లో ఫిట్ చేసి అమ్ముతుండేది. అలా కొన్ని రోజులు గడిచాక,  హన్స్ ఈ బిజినెస్ లో ఒక ప్రాబ్లెమ్ ని నోటీస్ చేశారు. 1905 నాటికి చాలామంది కేవలం పాకెట్ వాచెస్ ను మాత్రమే వాడేవారు. అప్పట్లో రిస్ట్ వాచెస్ అనేవి చాలా ఎక్స్ పెన్సివ్. చూడ్డానికి రిస్ట్ వాచెస్ అనేవి పాకెట్ వాచెస్ కన్నా చిన్న సైజులో ఉండడం వల్ల అవి తయారు చేయడానికి చాలా ఖర్చు అయ్యేది. అందుకే అప్పట్లో రిస్ట్ వాచెస్ ని కేవలం ఆడవారూ మాత్రమే ధరించేవారు. అయితే పాకెట్ వాచెస్ తో ఉన్న సమస్య ఏంటంటే..

మనం టైం చూడాలనుకున్న ప్రతిసారి, చేసే పనిని ఆపేసి పాకెట్ లో ఉన్న వాచ్ ను ఓపెన్ చేసి, టైం చూడాల్సి వచ్చేది.. కానీ రిస్ట్ వాచ్ మన చేతికి ఉంటే టైం చూడడానికి చేసే పని ఆపాల్సిన అవసరం లేదు. ఈ చిన్న లాజిక్ గమనించిన హన్స్ అందరూ ఈజిగా ధరించగల ఒక పర్ఫెక్ట్ రిస్ట్ వాచ్ ని తయారు చెయ్యాలనుకున్నారు. దీనికోసం ఎన్నో దేశాలలో వాచెస్ తయారు చేసే కంపెనీలన్ని చుట్టేశారు. అక్కడ చిన్న చిన్న వాచెస్ ని ఎలా తయారు చేస్తారో, కొన్ని మెలకువలు నేర్చుకొని ఫైనల్ గా, సొంతంగా రిస్ట్ వాచెస్ ని తయారు చేయడం మొదలుపెట్టాడు. ఫ్యూచర్ లో రిస్ట్ వాచెస్ పాకెట్ వాచెస్ ని రీప్లేస్ చేయగలవని పూర్తిగా బలంగా నమ్మిన హన్స్ ను చూసి చాలామంది క్రిటిసైజ్ చేశాయి. ఎందుకంటే మార్కెట్ లో ఉన్న 90% కస్టమర్లు పాకెట్ వాచెస్ కొంటూంటే, హన్స్ మాత్రం తన కంపెనీ మొత్తాన్ని రిస్ట్ వాచెస్ తో నింపేశారు. ఆయన నమ్మింది తర్వాతి రోజుల్లో నిజమైంది. రిస్ట్ వాచెస్ కంప్లిట్ గా మార్కెట్ ను డామినేట్ చేసి, అసలు పాకెట్ వాచెస్ ని కనపడకుండా చేసేశాయి. 

1908 నాటికి హన్స్ తన అనుభవాన్ని అంతా రంగరించి హై క్వాలిటీ రిస్ట్ వాచెస్ ని తయారు చేయడం మొదలు పెట్టాడు. ఆయన ఊహించినట్లే మార్కెట్లో రిస్ట్ వాచెస్ డిమాండ్ పెరిగి, బిజినెస్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే విల్స్ డార్ఫ్ అండ్ డేవిస్ అనే కంపెనీ ఇంగ్లాండ్ లో వన్ ఆఫ్ ధి లార్జెస్ట్ వాచ్ మేకింగ్ కంపెనీగా ఎదిగింది. అయితే యూరప్ లో ఆయన బిజినెస్ అయితే పెరిగింది కానీ తన కంపెనీకి తను తయారు చేసే వాచ్ లకి మార్కెట్లో సరైన గుర్తింపు రాలేదు. కస్టమర్లు గుర్తుపెట్టుకునేలా ఆయన తయారు చేసే వాచెస్ కి ఎలాంటి బ్రాండ్  లేదు. ఇది గమనించిన హన్స్ అన్ని భాషల్లో పలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలా ఒక బ్రాండ్ నేమ్ ని డిజైన్ చేశారు. అదే రోలెక్స్..

రోలెక్స్.. సంచలనాలు..

అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. నిజానికి యూరప్ లో నెంబర్ 1 కంపెనీగా పేరు తెచ్చుకుంది. కొద్ది కాలంలోనే యూరప్ లో అగ్రగామిగా నిలిచింది. ఈ క్రమంలో రోలెక్స్ సంస్థ ఉన్నట్టుండి ఆర్థికంగా కుదేలైంది. ఈ కంపెనీకి వచ్చే లాభాలకంటే వాటికి కట్టే ట్యాక్స్ లే ఎక్కువగా ఉండటంతో ఆర్థికంగా లాస్ చూసింది. దీంతో లండన్ లోని ఆఫీస్ ను 1919లో మూయక తప్పలేదు. ఇది రోలెక్స్ ప్రస్థానంలో అతిపెద్ద దెబ్బ. అయితే ఇక్కడ కంపెనీ మూసేసే సమయానికి 11 ఏళ్ల ముందుగానే 1908లో స్విట్జర్ లాండ్ లోని జెనీవా పట్టణంలో కొత్త కార్యాలయ్యాన్ని ప్రారంభించారు హన్స్. ఇది వారికి ఎంతో మేలు చేసింది. ప్రస్తుతం జెనీవాలో ఉన్న ఈ ఆఫీస్ రోలెక్స్ వాచ్ హెడ్ క్వార్టర్ గా కొనసాగుతోంది.

రోలెక్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రధాన కారణం వారి క్వాలిటీ అయితే.. మరో కారణం వారి మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెట్ లో పోటీ కంపెనీలకు ధీటుగా, వెరైటీగా తమ ప్రచారాన్ని చేసేవారు. ఈ క్రమంలోనే ఓ నూతన ఇన్నోవేషన్ కు శ్రీకారం చుట్టారు విల్స్ డార్ఫ్- డేవిస్ లు. ప్రపంచంలోనే మెుట్టమెుదటి వాటర్ ఫ్రూఫ్ రిస్ట్ వాచ్ ను తయారు చేసింది. 1926లో ‘రోలెక్స్ ఓయ్ స్టర్’ అనే వాటర్ ఫ్రూఫ్ వాచ్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

ఇది వాచ్ ల రంగంలోనే పెను సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఇలా ఈ వాచ్ ను కనిపెట్టిన సంవత్సరం తర్వాత అంటే.. 1927లో మార్కెట్ లో దీని గురించి మాట్లాడుకోవడం మెుదలు పెట్టారు. దానికి కారణం.. ఓ స్విమ్మర్. మెర్సిడెస్ గ్లిట్జే అనే మహిళ స్విమ్మర్. ఫ్రాన్స్-ఇంగ్లాండ్ మధ్య ఉన్న ఇంగ్లీష్ ఛానల్ అనే సముద్రాన్ని ఈదడానికి రెడీ అయ్యింది. ఈ సమయంలో ఆమెను కలిసి తమ వాచ్ ను టైమ్ చూసుకోవడానికి ఇచ్చారు. మెర్సిడెస్ 10 గంటల పాటు ఆ ఇంగ్లీష్ ఛానల్ ను ఈదింది. ఈ 10 గంటలు కూడా వాచ్ కచ్చితంగా టైమ్ ను చూపించడం విశేషం. సముద్ర ఒత్తిడిని తట్టుకుని అక్యూరేట్ గా టైమ్ చూపించడంతో.. మరుసటి రోజు పేపర్లో స్విమ్మర్ తో పాటుగా రోలెక్స్ ఓయ్ స్టర్ కూడా మెయిన్ హెడ్డింగ్ గా నిలిచింది.

ఆ తర్వాత తమ దృష్టిని పర్వతారోహణ చేసే వారిపై పడింది. 1953లో ఎడ్మండ్ హిల్లరీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ను అధిరోహించారు. ఆ సంఘటన వరల్డ్ వైడ్ గా సంచలనం రేపడంతో.. అప్పటినుంచి ఎవరెస్ట్ ను ఎక్కే పర్వతారోహకులకు తమ వాచ్ లను ఇవ్వడం మెుదలు పెట్టింది. అంత మంచులోనూ, అంత ఎత్తులోనూ రోలెక్స్ వాచ్ లు కచ్చితంగా టైమ్ ను సూచించడంతో మార్కెట్ లో ఈ కంపెనీ వాచ్ లపై ఎనలేని ఆదరణ పెరిగింది. 

ఆ తర్వాత కార్లలో కూడా వీటిని పరీక్షించారు. 1960లో ఓ ప్రాజెక్ట్ లో భాగంగా సముద్రంలో 100 అడుగుల లోతులోకి రోలెక్స్ వాచ్ ను పంపించారు. అంత ప్రెజర్, ఉప్పునీరు, చల్లటి వాతావరణంలో కూడా రోలెక్స్ అద్భుతంగా పనిచేసి ప్రపంచాన్ని సైతం అబ్బురపరిచింది.

రోలెక్స్ ఎందుకంత ఖరీదు?

ఇకపోతే ఇంతటి ప్రాముఖ్యత, ఆదరణ పొందిన ఈ రోలెక్స్ ధర కూడా ప్రత్యేకమే.. ప్రపంచ మార్కెట్ లో రోలెక్స్ కంపెనీతో పాటుగా మరెన్నో అగ్రగామి వాచ్ ల కంపెనీలు ఉన్నాయి. కానీ వాటికంటే ఎక్కువగా వినిపించే పేరు ‘రోలెక్స్’. అత్యంత ఖరీదైన వాచ్ గా రోలెక్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి ఈ వాచ్ కు ఎందుకంత రేటు? దానికి ఒకే ఒక్క కామన్ రీజన్ ‘బ్రాండ్’. ఆ బ్రాండ్ కే విలువెక్కువ. ఇదొక్కటే కాక ఈ వాచ్ ల్లో వాడే స్టీల్ మిగతా కంపెనీల కంటే కాస్ట్లీ. మిగతా వాచ్ ల్లో 3161 స్టీల్ వాడితే.. రోలెక్స్ లో మాత్రం 9401 స్టీల్ ను వాడతారట. వీటి తయారీలో వాడే మిగతా ఎలిమెంట్స్ కూడా అత్యంత ఖరీదైనవే. వీటితో పాటు సముద్రంలోనూ, మంచు పర్వతాల మీద, దుమ్మూ, ధూళీ లాంటి ప్రదేశాల్లో కచ్చితమైన టైమింగ్ చూపించడం రోలెక్స్ ప్రత్యేకత వేరు. అందుకే రోలెక్స్ కు ప్రపంచవ్యాప్తంగా సపరేటు క్రేజ్ ఉంది.

పైగా ఈ వాచ్ లను ఇష్టానుసారం తయారు చేయరు. ఆర్డర్ల ప్రకారమే వీటిని మ్యాను ఫ్యాక్చర్ చేస్తారు. అందుకే ఇవి ఆర్డర్ పెట్టిన కొన్ని సంవత్సరాలకు మాత్రమే వారి చేతికి వస్తాయి. 

పైగా రోలెక్స్ వాచ్ లను స్టేటస్ సింబల్ గా చూస్తున్నారు. ఇది కూడా వాటి ధర పెరగడానికి పరోక్షంగా కారణం అవుతోంది. ఆన్లైన్ లో రోలెక్స్ వాచ్ లు మనం వెతికినా దొరకవు. మార్కెట్ లో ఎక్కువ దొరకుండా చేయడం కూడా ఈ వాచ్ డిమాండ్ ను మరింత పెంచింది. డబ్బున్న వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసుకుని తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈ సంస్థ నేటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది.

Show More
Back to top button