Telugu Cinema

తొలితరం తెలుగు దర్శకులలో బహుముఖ ప్రజ్ఞశాలి.. కె.యస్.ప్రకాశరావు

కె.యస్.ప్రకాశరావు తాను సుఖపడడం చేతగాని మనిషి ఇతరులను ఎలా సుఖపెడుతుంది. తన సుఖం చూసుకోలేని మనిషి ఇతరుల సుఖం ఎలా చూస్తుంది. ఈ పరమ సత్యాన్ని ఇప్పుడే తెలుసుకున్నా.

అగ్గిలో పోస్తేనే నెయ్యి హోమం అవుతుంది, బూడిదలో పోస్తే.. త్యాగం కూడా అంతే. నాకు అహంభావం ఉందని ఇన్నాళ్లు గ్రహించాను. ఆ గర్వంతోనే అన్నీ కాలదన్నుకున్నాను”.

“తెలివి తక్కువ దాన్ని, నేను నాది అంటే అర్థం తెలియని దానికి అహంభావమేమిటి. ఇప్పుడు తెలుసుకున్నాను. నేనంటే ఏమిటో నాకు కావాల్సిందేమిటో.

నాకే కాదు నాలాంటి ఆడపిల్లలకు కావాల్సిందేమిటి. ఏ వయస్సులో ఎక్కండుండాలో ఇప్పుడు తెలుసుకున్నాను. తెలుసుకున్న తరువాత తెంచుకోవడం చాలా తేలిక”.

ప్రేమనగర్ సినిమా లో వాణీశ్రీ చెప్పే సంభాషణ ఇది. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందంటే మళ్ళీ వెనక్కి వెళ్లి వ్యవసాయం చేసుకుందామనుకున్న నిర్మాతను శతాధిక చిత్రాలను నిర్మించి, 21 మంది కొత్త దర్శకుల్ని, ఆరుగురు హీరోలను పరిచయం చేసేలా చేసింది. ఆ నిర్మాత డి.రామానాయుడు గారు అయితే, ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కోవెలమూడి సూర్య ప్రకాశరావు గారు.

కోవెలమూడి సూర్యప్రకాశరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, స్టూడియో అధినేతగా, కథకునిగా పలు విన్యాసాలు చేసి అలరించిన ఘనులు కె.ఎస్.ప్రకాశరావు గారు.

ఆయన తనయుడే దర్శకేంద్రునిగా జనం మదిలో నిలచిన కె.రాఘవేంద్రరావు గారు. ఆయన వారసులందరూ చిత్రసీమలోనే రాణించారు. పెద్దకొడుకు కె.కృష్ణమోహనరావు నిర్మాతగా అనేక చిత్రాలు నిర్మించారు.

చిన్న కొడుకు కె.ఎస్.ప్రకాశ్ పేరు మోసిన సినిమాటోగ్రాఫర్, కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా చేశారు.

ప్రకాశరావు అన్న కొడుకు కె.బాపయ్య కూడా దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. రాఘవేంద్రరావు తనయుడికి తండ్రి పేరే సూర్యప్రకాశ్ అని పెట్టుకున్నారు.

ప్రకాశరావు మనవడు ప్రకాశ్ కూడా తాతలాగే కొన్ని చిత్రాలలో నటునిగా కనిపించారు.

కె.ఎస్. ప్రకాశరావు రూపొందించిన చిత్రాలలో ఏదో ఒక వైవిధ్యం కనిపించేది. అదే ఆయనను ప్రత్యేకంగా నిలిపిందని చెప్పవచ్చు.

తెలుగు టాకీ సినిమాకు 91 ఏళ్ళు. అందులో దాదాపు 75 ఏళ్ళుగా ఈ రంగంతో మమేకమైన కుటుంబం కోవెలమూడి వారిది.

నటుడిగా మొదలై, నిర్మాతగా మారి, దర్శకుడిగా, స్టూడియోఅధినేతగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ రంగాల్లో పేరు తెచ్చుకున్న ఘనత స్వర్గీయ కె.ఎస్. ప్రకాశరావు గారిది.

ఆయన కుమారుడు కె. రాఘవేంద్రరావు గారు శతాధిక చిత్ర దర్శకుడై, తెలుగు సినిమా వాణిజ్య విశ్వరూపాన్ని చూపెట్టారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    కోవెలమూడి సూర్యప్రకాశరావు

ఇతర పేర్లు  :    కె.యస్.ప్రకాశరావు

జననం    :   27 ఆగష్టు 1914

స్వస్థలం   :    కృష్ణా జిల్లాకు చెందిన కోలవెన్ను

వృత్తి      :    తెలుగు సినిమా దర్శక నిర్మాత

పిల్లలు  :    కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ప్రకాష్

భార్య     :     జి. వరలక్ష్మి

అవార్డు    :    రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత

మరణ కారణం  :   సహజ మరణం

మరణం    :  1996

జననం…

ప్రముఖ దర్శకులు కోవెలమూడి సూర్య ప్రకాశరావు గారు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో 27 ఆగష్టు 1914 లో జన్మించారు. తాను పుట్టడమే సంపన్నుల ఇంట కావడంతో బాల్యం నుంచీ ఆయనకు ఆడింది ఆటగా సాగింది. ఆ రోజుల్లో పదవ తరగతి చదివిన వారికి కూడా అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడటం వచ్చేది. సూర్య ప్రకాశరావు గారు పదవ తరగతి చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేయాలన్న కోరిక కలిగింది. దాంతో కొన్నాళ్ళు భీమా ఏజెంట్ గా పనిచేశారు. తరువాత ఓ బంగారు నగల దుకాణంలోనూ ఉద్యోగం చేశారు. మొదటి నుండి సూర్య ప్రకాశరావు గారి మనసులో అభ్యుదయ భావాలు తాండవం చేసేవి. అలా తనను ప్రజానాట్యమండలి ఆకర్షించింది. అందులో చేరిన తరువాత తన మనసు నాటకాలవైపు మళ్ళింది. ఆ అభిరుచి తరువాత సినిమాల వైపుకు కొనసాగేలా చేసింది.

చిత్ర రంగ ప్రవేశం…

కె.యస్.ప్రకాశరావు గారిలోని చురుకుదనాన్ని పసికట్టిన గూడవల్లి రామబ్రహ్మం గారు 1941లో తాను రూపొందించిన “అపవాదు” చిత్రంలో ప్రకాశరావు గారిని కథానాయకునిగా ఎంచుకున్నారు. ఆ చిత్రం ప్రకాశరావు గారికి నటుడిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. తరువాత గూడవల్లి గారు నిర్మించిన “పత్ని”, “ద్రోహి” చిత్రాల్లో కూడా నటించారు ప్రకాశరావు గారు. అప్పటికే “గృహప్రవేశం” చిత్రంలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఎల్.వి.ప్రసాద్ గారు, ప్రకాశరావు గారు మంచి స్నేహితులయ్యారు.

దాంతో ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో “ద్రోహి” చిత్రాన్ని ప్రకాశరావు గారు నిర్మించారు. ఇందులో జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం నాయికలుగా నటించారు. ఈ సినిమా తరువాత కూడా ప్రకాశరావు గారు నిర్మించిన చిత్రాలలో జి.వరలక్ష్మి గారు కీలక పాత్రలు పోషించారు. దాంతో వారిరువురి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే వివాహితుడైన ప్రకాశరావు గారు, జి.వరలక్ష్మిని గారిని రెండో పెళ్ళి చేసుకున్నారు. ఈ దంపతుల తనయుడే ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శకులు కె.ఎస్.ప్రకాశ్.

కె.యస్.ప్రకాశరావు గారు తొలుత “స్వతంత్ర” పతాకంపై చిత్రాలు నిర్మించారు. తరువాత ప్రకాశ్ ప్రొడక్షన్స్ స్థాపించారు. ప్రతిభ ఉన్న కళాకారులను ప్రోత్సాహించడానికి ముందుండే తాను దర్శకత్వం వహించి, నిర్మించిన ‘దీక్ష’ చిత్రం ద్వారా ఆచార్య ఆత్రేయ గారిని సినిమా రంగానికి పరిచయం చేశారు. అందులో ఆత్రేయ గారు వ్రాసిన “పోరా బాబూ పో.. పోయి చూడు లోకం పోకడ”పాట అప్పట్లో జనాన్ని విశేషంగా అలరించింది. జి.వరలక్ష్మి, ఏయన్నార్, నంబీయార్ ముఖ్యపాత్రధారులుగా “కన్నతల్లి” చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు ప్రకాశరావు గారు.

“రేణుకాదేవీ మహాత్మం”, “గుళ్ళో పెళ్ళి”, “మోహినీ రుక్మాంగధ” వంటి చిత్రాల తరువాత యన్టీఆర్ హీరోగా రామానాయుడు గారు నిర్మించిన “స్త్రీజన్మ” కు దర్శకత్వం వహించారు ప్రకాశరావు గారు. ఆ తరువాత తన భార్య జి.వరలక్ష్మి, శివాజీగణేశన్ లతో తమిళంలో “హరిశ్చంద్ర” రూపొందించారు. ఏయన్నార్, జమునతో తెరకెక్కించిన “బందిపోటు దొంగలు” అంతగా అలరించలేకపోయింది. తరువాత నందమూరి తారకరామారావు గారు కథనాయకులు గా ప్రకాశరావు గారు రూపొందించిన “విచిత్ర కుటుంబం” విజయం సాధించింది.

నిజానికి నందమూరి తారకరామారావు గారు పుట్టినరోజు అయిన మే 28న విడుదలైన తొలి చిత్రంగా “విచిత్ర కుటుంబం” ఘనతను నిలుపుకుంది. విడుదల అవ్వడమే కాకుండా ఘనవిజయం సాధించడంతో ఆనాటి నుండీ తెలుగు చిత్రసీమలో కథనాయకుల పుట్టినరోజు నాడు కానుకలుగా వారు నటించిన సినిమాలు విడుదలయ్యే సంప్రదాయానికి తెరలేచింది. దీనికి ఆద్యులు కె..యస్.ప్రకాశరావు గారేనని చెప్పాలి.

ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) గారు వ్రాసిన నవల ఆధారంగా ప్రేమనగర్ సినిమా నిర్మింపబడింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలా చిత్రాలలో ప్రేమనగర్ ఒకటి. అంతకు ముందు కొన్ని సినిమాలు తీసి నష్టాలు చవిచూసిన డి.రామానాయుడు గారిని నిర్మాతగా సినీరంగంలో నిలిపిన చిత్రం ప్రేమనగర్. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తమిళం, హిందీలలో కూడా పునర్నిర్మించారు.

ఈ చిత్రం తమిళంలో “వసంత మాళిగై” గా శివాజీగణేశన్ తో రూపొందింది. శివాజీ గణేశన్ కెరీర్ లో ఎక్కువ కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా “వసంతమాళిగై” నిలిచింది. హిందీలో ఇదే చిత్రాన్ని రాజేశ్ ఖన్నాతో “ప్రేమ్ నగర్” గా రూపొందించారు ప్రకాశరావు గారు. ఈ మూడు చిత్రాలను సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థనే నిర్మించింది. అలా ఆ సంస్థకు అచ్చివచ్చిన దర్శకునిగా నిలిచారు ప్రకాశరావు గారు. అలాగే సత్యచిత్ర నిర్మాణ సంస్థ తొలి చిత్రం “తాసిల్దార్ గారి అమ్మాయి” కూడా ప్రకాశరావు గారి దర్శకత్వంలోనే రూపొందింది.

ఈ సినిమాతోనే శోభన్ బాబు గారిని స్టార్ డమ్ తీసుకువచ్చింది. ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారితో ప్రకాశరావు గారు రూపొందించిన “చీకటివెలుగులు” మ్యూజికల్ హిట్ గా నిలచింది. శోభన్ బాబు గారితో ప్రకాశరావు గారు రూపొందించిన “నా తమ్ముడు”, “పెద్దకొడుకు”, “జీవితం”, “ఇదాలోకం”, “కోడెనాగు” చిత్రాలు కూడా అలరించాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రం అక్కినేని నాగేశ్వరావు గారి “సెక్రటరీ” కూడా ప్రకాశరావు గారి దర్శకత్వంలోనే తెరకెక్కింది విశేషం.

ప్రయోగాల దర్శక, నిర్మాత…

దర్శకుడిగా, నిర్మాతగా ప్రకాశరావు గారు మొదటి నుంచి చేసినవన్నీ ప్రయోగాలే. తాను హీరోగా నటిస్తున్న రోజుల్లోనే, సి.హెచ్.నారాయణ రావును కథనాయకుడు గా పెట్టి, తాను విలన్‌గా నటిస్తూ “మొదటి రాత్రి” (1950) స్వీయదర్శకత్వంలో నిర్మించారు.  తమిళ, కన్నడ, హిందీ చిత్రాలూ తీశారు. పిల్లలను పాత్రధారులుగా పెట్టి, “కొంటె కృష్ణయ్య”, “బూరెల మూకుడు” అనే సాంఘికాలు, “రాజయోగం” అనే జానపదం కలిపి “బాలానందం”గా విడుదల చేశారు.

క్లైమాక్స్‌లో పాట ఉండకూడదని ఎవరెంతగా వారించినా, “ప్రేమనగర్” లో “ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం” పాట పెట్టారు. ఆ ప్రయోగం విజయవంతం అయ్యాక, అనేక చిత్రాల్లో పతాక సన్నివేశంలో పాటలు వచ్చాయి. ఏ కథ తీసుకున్నా మనసుకు హత్తుకొనేలా, సాఫీగా తెరపై చెప్పేవారు. కథాకథనంలో ఫ్లాష్‌బ్యాక్‌లు బాగా వాడేవారు. ఒక దశలో ఆయనను “ఫ్లాష్‌బ్యాక్‌ల దర్శకులు” అని ఛలోక్తిగా పిలిచినవారూ కూడా ఉన్నారు. కానీ, ఎన్ని ఫ్లాష్‌బ్యాక్‌లున్నా సినిమాలో ఎక్కడా గందరగోళం ఉండేది కాదు. ఉదాహరణకు, “తాసీల్దార్ గారి అమ్మాయి” సినిమాను గనుక తీసుకుంటే, అందులో ఏకంగా 8 ఫ్లాష్‌బ్యాక్‌లున్నాయి. అయినా సరే, ఆ కథ తెరపై ఎంత బాగా చెప్పారన్నది ఇవాళ్టికీ ఒక మంచి స్క్రీన్‌ప్లే పాఠం.

సాహిత్య పిపాసి, రచయిత…

కె.యస్.ప్రకాశరావు గారికి సాహిత్య పిపాస ఎక్కువ. నటులు జగ్గయ్య, ప్రకాశరావు గార్లు మంచి సాహితీ ప్రియులు. అప్పట్లో ప్రకాశరావు గారి రచనలు “భారతి” మాసపత్రికలో కూడా వచ్చేవి. అలాగే, పేక ముక్కలతో ఆడే బ్రిడ్జి ఆటలో తాను అద్భుతమైన ఆటగాడు. నిర్మాత, దర్శకుడిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాక ప్రకాశరావు గారు ఉదయం పూట స్క్రిప్టులు రాసుకుంటూ, సాయంత్రం పూట కాలక్షేపం కోసం బ్రిడ్జి మొదలుపెట్టారు. కొద్దిరోజుల్లోనే జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగిన మేధావి తాను. ప్రకాశరావు గారి వంశంలో మూడు తరాలు తమ కుటుంబమంతా సినీ రంగంలోనే నిర్మాణ, దర్శకత్వ, సాంకేతిక విభాగాల్లో కృషి చేస్తూనే ఉంది. ఇలాంటి అరుదైన గౌరవం ఎల్.వి. ప్రసాద్, ఏయన్నార్, ఎన్టీఆర్, రామానాయుడు గారు, సూపర్ స్టార్ కృష్ణ ఇలా కొన్ని కుటుంబాలకే అది దక్కింది.

ప్రకాశరావు గారికి రచనలు చేయడం అలవాటు. ఉదయం నిద్ర లేస్తే చాలు పెన్ను పట్టుకొని కూర్చొని రాసుకుంటూ ఉండేవారు. ఖాళీగా ఉండేవారు కాదు. 8 నుంచి పది పేజీల్లో కథ వ్రాసుకునేవారు. అందులో బాగా నచ్చిన కథను మాత్రం ఇంకా వివరంగా వ్రాసుకొనేవారు. అలా తాను “సౌందర నందనం”, “శాంతల” (మైసూర్ మహారాజా ఆస్థానంలోని డ్యాన్సర్ కథ), “కృష్ణభక్తి” లాంటివి తాను వ్రాసుకున్న స్క్రిప్టులు. అలాగే, ‘ప్రేమనగర్’ చిత్రానికి ఆచార్య ఆత్రేయ గారు స్క్రిప్టు ప్రకాశరావు గారు తన ముత్యాల లాంటి దస్తూరీలో వ్రాసుకున్నారు. తాను చదివింది ఎస్.ఎస్.ఎల్.సి. అయినా, బి.ఏ (లిటరేచర్) వాళ్లు కూడా వ్రాయలేనంత చక్కటి ఇంగ్లీషు వ్రాసేవారు. తాను రోజూ దినచర్య వ్రాసుకునే వారు. భీమా సంస్థలో పనిచేసే రోజుల నుంచి అది తనకు అలవాటు. తన డైరీలు చాలా వరకు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయని రాఘవేంద్ర రావు గారు చెబుతుంటారు.

కుటుంబం…

కోవెలమూడి సూర్యప్రకాశ రావు గారి ప్రాథమిక చదువు కేసరపల్లిలో జరిగింది.

గన్నవరంలో హైస్కూల్‌తో తన చదువు ఆగిపోయింది. ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారు.

అలా సూర్యప్రకాశ రావు గారు పై చదువులు చదవలేకపోయారు. తనకు కోటీశ్వరమ్మ తో పెళ్లయిపోయింది. పెళ్ళయ్యాక తన మకాం విజయవాడకు మార్చారు. 1940లో జన్మించిన తన పెద్ద కుమారుడు కె. కృష్ణమోహనరావు గారు నిర్మాత. తాను నిర్మాతగా భారీ చిత్రాలు అందించారు.

కె. కృష్ణమోహనరావు గారి తరువాత రెండేళ్లకు రాఘవేంద్రరావు జన్మించారు. తరువాత కూతుళ్లు స్వతంత్ర, మంజుల జన్మించారు.

ప్రముఖ సినీ నటి జి.వరలక్ష్మి గారు కె.యస్. ప్రకాశరావు గారికి రెండవ భార్య. వరలక్ష్మి గారి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. కె.రాఘవేంద్రరావు గారు అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్రరంగములో బాగా పేరుతెచ్చుకున్నారు. ఇక తాత పేరే పెట్టుకున్న మనుమడు కోవెలమూడి సూర్యప్రకాశ్ (కె.రాఘవేంద్రరావు గారి కుమారుడు) అచ్చంగా తాత లాగే నటుడు, నిర్మాత, దర్శకులు. ప్రకాశరావు గారి అన్న కుమారుడు కె. బాపయ్య గారు కూడా ప్రసిద్ధి పొందిన సినిమా దర్శకులు.

చిత్ర సమాహారం..

★ నటించిన సినిమాలు..

అపవాదు (1941) , పత్ని (1942) , బభ్రువాహన (1942) ,ద్రోహి (1948) , ప్రేమనగర్ (1971)..

★ నిర్మించిన సినిమాలు..

ద్రోహి (1948) , మొదటిరాత్రి (1950), దీక్ష (1951) , కన్నతల్లి (1953) , బాలానందం (1954), అంతేకావాలి (1955).

మేలుకొలుపు (1956) , రేణుకాదేవి మహత్యం (1960)

★ దర్శకత్వం వహించిన సినిమాలు..

మొదటిరాత్రి (1950) ,దీక్ష (1951) , కన్నతల్లి (1953) ,బాలానందం (1954) ,అంతేకావాలి (1955) .

మేలుకొలుపు (1956) , రేణుకాదేవిమాహాత్మ్యం (1960) , స్త్రీజన్మ (1967), బందిపోటు దొంగలు (1968)

భార్య (1968) , విచిత్రకుటుంబం (1969) , తాసిల్దారు గారి అమ్మాయి (1971) , ప్రేమనగర్ (1971)

ఇదాలోకం (1973) , కోడెనాగు (1974) ,చీకటి వెలుగులు (1975) , కొత్తనీరు (1982).

నిర్యాణం…

మొదట్లో కె.యస్.ప్రకాశరావు గారు అభ్యుదయ చిత్రాలే ఎక్కువగా తీశారు. డబ్బు కోసం చూడలేదు. 1953లో స్టూడియో కట్టినా, ఇబ్బందులు చుట్టుముట్టాయి. 1960 నుంచి 67 దాకా సుమారు ఏడేళ్ళు గడ్డుకాలం. తనకు ఏడు కార్లున్నా కూడా తన పిల్లలు  నడుచుకుంటూ బడికి వెళ్ళిన రోజులున్నాయి.

బడి ఫీజుకు డబ్బు కట్టలేక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. క్రమంగా పరిస్థితి మారింది.

కె.యస్.ప్రకాశరావు గారు చేతులు కాలాక తన పంథా మార్చి వాణిజ్య విజయం మీద కూడా దృష్టిపెట్టి, “విచిత్ర కుటుంబం” (1969), “ప్రేమనగర్” (1971), “సెక్రటరీ” (1976) లాంటి బయటి చిత్రాలు తీశారు.

ఎంతోమందిని చిత్ర పరిశ్రమ కు పరిచయం చేసి, ఎన్నో విజయవంతం అయిన చిత్రాలు రూపొందించిన ప్రకాశరావు గారు 1996 లో ఈ లోకాన్ని వదిలి పంచభూతాలలో కలిసిపోయారు.

తనకు రఘుపతి వెంకయ్య పురస్కార ప్రదానం చేసే సమయానికి (1997 యేప్రిల్) ప్రకాశరావు గారు చనిపోవడంతో.

తన పేరే పెట్టుకున్న తన మనుమడు కోవెలమూడి ప్రకాష్ చేతులకు ఆ పురస్కారం అందించారు.

Show More
Back to top button