Telugu News

ప్రజలభాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర సాకారం: సీఎంచంద్రబాబుపిలుపు

ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా శాశ్వత ఫలితాలను ఇవ్వాలంటే అందులో ప్రజల భాగస్వామ్యం అనివార్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ప్రధాని మోదీ కోరిక మేరకు స్వచ్ఛ భారత్‌పై నివేదిక రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పారిశుద్ధ్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రజలందరూ తమ ఆరోగ్యం కోసం ఈ స్వచ్ఛత ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ‘రికవరీ, రీయూజ్, రీసైక్లింగ్’ విధానాన్ని ప్రభుత్వం బలంగా అమలు చేస్తోందని సీఎం వివరించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే సచివాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించామని, ప్రజల నుంచి వాడిన ప్లాస్టిక్‌ను సేకరించి వారికి తిరిగి నగదు ఇచ్చేలా ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం పేరుకుపోయిన 86 లక్షల టన్నుల చెత్తను ఇప్పటికే తొలగించామని, జనవరి 26 నాటికి రాష్ట్రంలోని ఏ రోడ్డుపైనా చెత్త కనిపించకూడదని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు అదనంగా మరిన్ని స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

పారిశుద్ధ్యం విషయంలో ప్రజల్లో సామాజిక స్పృహ పెరగాలని, ఇంటి చెత్తను రోడ్డుపై వేసే అలవాటు మానుకోవాలని చంద్రబాబు సూచించారు. పట్టణాల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణను పకడ్బందీగా నిర్వహిస్తామని, అలాగే గ్రామాల్లోనూ ప్రజలు తమ సొంత ఇళ్లలోనే చెత్తను కంపోస్ట్ (ఎరువు)గా మార్చుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లలో, గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్ట్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, ఉత్తమంగా పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం గౌరవించి అవార్డులు అందజేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Show More
Back to top button