NRI NewsTelugu Featured News

ప్రవాసాంధ్రు(NRI)లు కూటమికి కొండంత బలం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. తన తొమ్మిదేళ్ల అమెరికా అనుభవాన్ని పంచుకుంటూ, డల్లాస్‌లో తనకు లభించిన ఘన స్వాగతం తన యువగళం పాదయాత్ర రోజులను గుర్తుచేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి తమ కుటుంబానికి కొండంత బలం ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక్కడకు వచ్చిన వారి ఉత్సాహాన్ని చూస్తే తాను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నానా, అమెరికాలో ఉన్నానా అనే అనుమానం వచ్చిందని, వారి ఈ ఘన స్వాగతం చూసిన తర్వాత ‘టీమ్ 11’కి (ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ) నిద్ర పట్టదని వ్యాఖ్యానించారు.

  • ఐటీ నుండి క్వాంటమ్ వరకు

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్ గారిని, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచి, ఐటీని పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ కొనియాడారు. ఐటీ చదువులు ఉద్యోగాలు తెస్తాయని చంద్రబాబు చెప్పినప్పుడు విమర్శించిన వారు, ఇప్పుడు కంప్యూటర్లు అన్నం పెడుతున్నాయా లేదా అని ప్రశ్నించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు దార్శనిక నాయకుడని, 75 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారని, భవిష్యత్తులో తాను ఆయన వేగానికి దరిదాపుల్లోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ గురించి ఆయన ముందుచూపుతో ఆలోచిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి నాయకులు శాశ్వతం కాదని, కార్యకర్తలే బలం అని, కార్యకర్తల త్యాగాలను లోకేష్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

  • ఎంఆర్‌ఐల మద్దతు, 20 లక్షల ఉద్యోగాలు

గత ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రవాసాంధ్రులు గమనించారని లోకేష్ అన్నారు. ‘వై నాట్ 175’ అన్న ప్రతిపక్షాన్ని ప్రజలు ‘వై నాట్ 11’ అని తిరస్కరించారని, కూటమి రికార్డులు బద్దలు కొట్టి 175కి 164 స్థానాలు గెలిచిందని తెలిపారు. ప్రవాసాంధ్రులు కేవలం ఎన్‌ఆర్‌ఐలు (నాన్-రెసిడెంట్ ఇండియన్స్) కాదని, ఎంఆర్‌ఐలు (మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్) అని అభివర్ణించారు. సొంత రాష్ట్రంపై ప్రేమ, ఎన్నికలకు ముందు వచ్చి కూటమికి అండగా నిలబడడం వల్లే ఈ అపూర్వ విజయం సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంలో కేంద్రంలో మోదీ, ఏపీలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నాయకత్వంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్పీడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని అన్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ నినాదమని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని, దీనికి సంబంధించి ఇప్పటికే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటిని మూడు నెలల్లో గ్రౌండ్ చేస్తామని హామీ ఇచ్చారు.

  • జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ క్రియేటర్స్‌గా ఎదగాలి..

రాష్ట్రంలో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, విడాకులు ఉండవు, మిస్ ఫైర్‌లు ఉండవు, క్రాస్ ఫైర్‌లు ఉండవు అని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి ‘కలలకు రెక్కలు’ పేరుతో విదేశాల్లో చదువుకునే వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రవాసాంధ్రులు జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ క్రియేటర్స్‌గా ఎదగాలని పిలుపునిచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని, ‘రెడ్ బుక్’ తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. రాజకీయాలకు రాని తన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అయితే తాము మాత్రం స్త్రీలను గౌరవిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Show More
Back to top button