CINEMATelugu Cinema

ఓజీ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది ఫుల్ మీల్స్ సినిమానేనా?

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కాస్త నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ హిట్ దాహం తీర్చడానికి ఇప్పుడు ఓజీ రూపంలో మరోసారి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు. యువ దర్శకుడు సుజీత్ రూపొందించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను డీవీవీ దానయ్య గ్రాండ్‌గా నిర్మించారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 25న) విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పవన్ ఫ్యాన్స్‌కి ఇది ఫుల్ మీల్స్ సినిమానేనా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథాంశం

ఓజస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్) జపాన్‌లో జరిగిన ఓ దాడి నుంచి తప్పించుకుని షిప్‌లో ఇండియాకు బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో సత్యదాదా (ప్రకాశ్ రాజ్) ను ప్రాణాపాయం నుంచి రక్షించి, అతనితో ముంబైకి చేరుకుంటాడు. అక్కడ అండర్‌వరల్డ్ డాన్‌గా ఎదిగే సత్యదాదాకి ఓజీ కుడిభుజం అవుతాడు. సత్యదాదాకి ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ, ఓజీని మూడో కొడుకులా భావిస్తుంటాడు. అయితే, అనుకోని సంఘటనల కారణంగా ఓజీ ఆ కుటుంబం నుంచి దూరమై అజ్ఞాతంలోకి వెళ్తాడు. అక్కడ డాక్టర్ కన్మణి (ప్రియాంక అరుల్ మోహన్) ని పెళ్లి చేసుకుంటాడు.

ఓజీ ముంబై వదిలి వెళ్లిన తర్వాత, సత్యదాదా పాత స్నేహితుడు మిరాజ్‌కర్ కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) అండర్‌వరల్డ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో కొడుకులను కోల్పోయిన సత్యదాదాకి మళ్లీ ఓజీ అవసరం అవుతుంది. మరి ఓజీ తిరిగి ముంబైకి వచ్చాడా? మిరాజ్‌కర్ కొడుకులకు ఏం చేశాడు? అతను ఎందుకు అజ్ఞాతం పాలయ్యాడు? చేయని తప్పుకి తనను తానే ఎందుకు శిక్షించుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా మిగతా కథలో తెలుస్తుంది.

విశ్లేషణ

ముంబై అండర్‌వర్ల్డ్ నేపథ్యంలో సినిమాలు రావడం కొత్తేమీ కానప్పటికీ, దర్శకుడు సుజీత్ దీనిని కాస్త డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసి థియేటర్స్‌లో రచ్చ రేపాడు. కథలో కొత్తదనం లేకపోయినా, హీరో, విలన్‌తో పాటు ఇతర పాత్రలకు ఇచ్చిన ఎలివేషన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. సుజీత్ స్క్రీన్‌ప్లే మ్యాజిక్, ఓజీ ఫ్యామిలీ లైఫ్, భార్యతో అనుబంధం, కూతురుపై ప్రేమ వంటి అంశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కనెక్ట్ చేసేలా ఉన్నాయి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ని ఒరిజినల్ మాస్ లుక్‌లో చూసిన ఫీల్ ఖచ్చితంగా కలుగుతుంది. హింస ఎక్కువగా ఉండటం వల్ల సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఫస్టాఫ్ గూస్ బంప్స్ తెప్పించగా, సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కాస్త ల్యాగ్ కనిపించింది.

మొత్తం మీద కథ బలంగా ఉంటే ఓజీ రేంజ్ ఇంకాస్త పెరిగేది. ఇకపాత్రల విషయానికి వస్తే.. ఓజస్ గంభీర- ఓజీ పాత్రలో పవన్ కళ్యాణ్ అదరగొట్టేశారు. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ బలంగా మిళితం చేస్తూ అభిమానుల చేత ఈలలు వేయించారు. పవన్ స్వాగ్, స్టయిల్, ఫైట్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా బాగానే ఇంప్రెస్ చేశాడు. ప్రకాష్ రాజ్ పాత్రను సుజీత్ బాగా రాసుకున్నారు. ప్రియాంక మోహన్ చిన్న పాత్రలోనూ ఆకట్టుకుంది. శ్రేయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన బలం. సాధారణ సన్నివేశాలకూ ఆయన బీజీఎం కొత్త వాతావరణాన్ని తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ వావ్ అనిపించింది. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు తెలుగు తెర మీద రానిటువంటి స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది.

చివరిగా..

ఓజీ ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ అనే చెప్పుకోవాలి. “ఇదిరా సినిమా అంటే” అనేలా ఉంది. హింస ఎక్కువగా ఉన్నా కూడా ఇది పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం పండగే. ఓజీతో తన ఆకలి, అభిమానుల ఆకలి తీర్చేశాడు పవన్ కళ్యాణ్.

Show More
Back to top button