
“కుక్కకి యజమానుడు ఎంత అవసరమో, ఆడపిల్లకి మొగుడు అంత అవసరం. కాని, ప్రతి స్త్రీకి ఇట్లా ఏదో ఒక భర్త ఎలాంటివాణ్ణో ఒకణ్ణి దానం చేసితీరే సంఘం, భర్త లేకపొతే ఒప్పుకోని సంఘం, ఆ భర్త పోతే మళ్ళీ దానం చెయ్యదేమి? స్త్రీకి భర్త ఉండటమే అంత అవసరమైతే, ఎప్పుడూ ఉండనక్కర్లేదూ? భర్త ఒద్దని ఏడుస్తున్న చిన్న పిల్లలకి బలవంతంగా కట్టబెడుతుంది, భర్త కావాలని గోలపెడుతున్న వితంతువులకి నిరాకరిస్తుంది సంఘం. ఏం తెలివి? అని 1930 – 40 ప్రాంతంలో ఒక నవలలో స్త్రీ గురించి వ్రాశారు ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం. ఆయన చలంగా ప్రసిద్ధులు. ఆయన సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకరు. గుడిపాటి వెంకటాచలం ఎక్కువగా స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని రచనలు చేశారు. ఆ రచనలలో ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక, మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే తీరును, ఎదుర్కొనే విధానాలను చర్చించారు. ఆధునిక తెలుగు రచనా రంగంలో చలం రచనలలోని ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయని చెప్పవచ్చు.
సాధారణంగానే గుడిపాటి వెంకటాచలం రచనల్లో తాను వ్యక్తపరచిన భావాలు గానీ, ఆయన ప్రతిపాదించిన విషయాలు గానీ, అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి అనేది ఒప్పుకోదగ్గ వాస్తవం. కానీ, అప్పటి సమాజం అతన్ని అపార్థం చేసుకున్నది. స్త్రీ స్వేచ్ఛ పేరుతో అతను విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని, అతని కథల్లో బూతులు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆరోజుల్లో చలం పుస్తకాలను బహిరంగంగా చదవటానికి పాఠకులు భయపడేవారు. కానీ ఆసక్తి గల పాఠకులు మాత్రం, చలం పుస్తకాలని దాచుకుని చదివేవారు. చలం తన కథలు, నవలల్లో వ్రాసిన విషయాలను చూసి అప్పటి సమాజం తట్టుకోలేకపోయింది. మొత్తం మీద, చలం సంఘంలో ఒక “విపరీతమైన చెడ్డ వ్యక్తి”గా పేరు తెచ్చుకున్నారు. దాంతో అతనితో ఎవరూ మాట్లాడేవారు కాదు. తనకు ఇల్లు అద్దెకిచ్చేవారు కాదు. ఆఖరుకు తన దగ్గరి బంధువులు కూడా అతన్ని తమ ఇండ్లకు రానిచ్చేవారు కాదు. తన రచనల వలన, చలం కొంతవరకు తన అసాధారణ వ్యక్తిగత ప్రవర్తన వలన సంఘం నుండి వేరుపడ్డారు ఒంటరివాడయ్యారు. తన భార్య కూడా అతని మూలాన ఆమె బంధువులకు దూరమయ్యింది.
నేపథ్యం…
చిన్నతనంలో సంధ్యావందనం వంటి ఆచారాలను నిష్టగా పాటించిన చలం, ఉన్నత పాఠశాల చదువులు పూర్తి కాకముందే ఇతిహాస పురాణాలను క్షుణ్ణంగా చదివారు. తన తల్లిని వేధించిన తన తండ్రి తీరు, చిన్నవానిగా ఉన్న చలం హృదయంపై బలమైన ముద్ర వేసింది. అలాగే చలం చెల్లెలు “అమ్మణ్ణి” పెళ్ళి కూడా అర్థంతరంగా ఆగిపోవడం కూడా స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలపైకి చలం దృష్టిని గాఢంగా మళ్ళించింది. గుడిపాటి వెంకటచలం 18 మే 1894 నాడు మద్రాసు నగరంలో జన్మించారు. ఆయన తల్లి వేంకటసుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివరావు. అయితే తన తాత గుడిపాటి వేంకటరామయ్య చలంను దత్తత తీసుకోవడంతో, కొమ్మూరి అనే తన ఇంటిపేరు మారి గుడిపాటి వెంకటచలంగా ప్రసిద్ధికెక్కింది.
1911 వ సంవత్సరంలో పిఠాపురం మహారాజా కళాశాలలో చేరిన చలం, తరువాత బి.ఎ. చదువు కోసం మద్రాసుకు వెళ్ళారు. మద్రాసు వెళ్లే కంటే ముందే చిట్టి రంగనాయకమ్మతో చలం వివాహం జరిగింది. ఒకవైపు తాను మద్రాసులో డిగ్రీ చదువుతూనే తన భార్యను కాన్వెంట్లో చేర్చారు. తాను కళాశాలకు వెళ్ళేటప్పుడు ఆమెను సైకిల్ పై పాఠశాలలో దించేవారు. అప్పటికి చలం భార్య వయసు 13 సంవత్సరాలు. ఇట్టి విషయాన్ని అక్కడ ఉన్నవారు వింతగా చూసేవారు. ఇది తెలిసిన తన మామ గారు చలాన్ని తన ఇంటి గడప కూడా తొక్కవద్దన్నాడు. చదువు తరువాత కాకినాడలో ట్యూటర్‌గా ఉద్యోగంలో చేరారు. టీచరుగా హోస్పేటలో పనిచేసి తిరిగి రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కొన్నాళ్ళకు పాఠశాల తనిఖీ అధికారిగా పనిచేశారు.
మీలోకి మీరు నగ్నంగా తొంగిచూసుకోండి…
చలం రచనల్లో వ్యక్తపరచిన భావాలు, అతను ప్రతిపాదించిన విషయాలు, అప్పటి సమాజం మీద ఎంతగా ప్రభావం చూపాయంటే ఆరోజుల్లో చలం రచనలను ముఖ్యంగా ఆడపిల్లలను చూడనిచ్చేవారు కాదు, చదవనిచ్చేవారు కాదు, ఆలాగనే తాకనిచ్చేవారు కాదు. ఇన్నిరకాల విమర్శలు ఉన్నా, ఎంతమంది తనను దుమ్మెత్తి పోసినా, తనపై ఎంత వ్యతిరేకత పోగవుతున్నా, తన గురించి ఎంత దుమారం చెలరేగినా కూడా చలం తన ధోరణిని మాత్రం జీవితాంతం మార్చుకోలేదు. మగ జాతికి ఒక నీతి, స్త్రీ జాతికి ఒకనీతి ఎందుకు ఉండాలి అనేది చలం అభిప్రాయం.
పెళ్లయిన మగవాడు ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకుంటే ఏమీ అనని సమాజం, స్త్రీ విషయంలో ఎందుకు భుజాలు తడుముకుంటుంది? అని స్త్రీ విషయంలో నీతి సూత్రాలను వల్లించే వారిని నిలదీసేవారు, ధైర్యంగా ప్రశ్నించేవారు చలం. అదేవిధంగా స్త్రీ విషయంలో నీతి సూత్రాలను వల్లించే వారిని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి! మీలోకి మీరు నగ్నంగా తొంగిచూసుకోండి! మీరు పైకి చెప్పిన మాటలు నిజంగానే నిజజీవితంలో ఆచరిస్తున్నారా! మీలో కపటత్వంఉన్నదా? లేదంటే మీకు నిజం ఒప్పుకునే ధైర్యం ఉందా? అని చలం తన రచనల ద్వారా ఎదురుదాడి చేశారు. చలం తాను వ్రాసిన రచనలు మొత్తం ఇదే ధోరణిలో ఉన్నాయి, ఇదే మార్గంలో తాను రచనలు చేశారు. చివరి వరకు ఇదే వాదాన్ని బలపరిచారు, ఇదే వరుసలో తాను రచనలు చేస్తూ వచ్చారు.
స్త్రీకి శరీరం ఉంది, తనకి వ్యాయామం ఇవ్వాలి…
ఆయన వ్రాసిన సాహిత్యంలో ప్రతీ వాక్యంలో గానీ, ప్రతీ పేరాలో కూడా తాను ఏదైతే చెప్పదలుచుకున్నారో, ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడానికి వెనుకాడేవారు కాదు. “స్త్రీకి కూడా శరీరం ఉంది, తనకి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి. సృష్టిలో తినడం తప్ప ఏమీ ఎరగనివి జంతువులు మాత్రమే, మనుషులు కాదు. కానీ ఆడది అనాదిగా ఇంకా జంతువుగానే ఉంది. ఇన్ని శతాబ్దాలుగా ఆడది ఇంట్లో వంట చేయడం, నగలు మోయడం, ఇలాంటి రెండు పనులే ఎక్కువగా నేర్చుకుంది”. ఇత్యాది విషయాలను 1920 – 1950 సంవత్సరాల ప్రాంతాలలో గుడిపాటి వెంకటాచలం చెప్పారు.
అంటే సుమారు 70 – 80 యేండ్ల క్రిందటి మాటలు అన్నమాట. తనకు 55 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు సుమారు 30 సంవత్సరాల పాటు తన సాహిత్యంలో అక్షరాలను అగ్ని కెరటాల్లాగా ప్రవహింపచేసిన చలం, తన జీవితంలోని చివరి 30 సంవత్సరాలు మాత్రం ఒక్కసారిగా చల్లారిపోయి ఆత్మ శోధనలోకి వెళ్లిపోయారు. ఏ సమాజాన్నయితే ఎదిరించారో, ఏ స్త్రీ జాతినైతే కట్టు, బొట్టు, కట్టుబాట్ల కారాగారం నుంచి బయటికి రండి, ఆ బంధనాలను తెంచుకోండి, మీరు స్వేచ్ఛగా విహరించండి, మీ జీవితాన్ని మీరు అనుకున్న రీతిలో జీవించండి అని చలం ఘోషించారో, వారందరికీ దూరంగా వెళ్లిపోయారు.
చలం తన ఒంటరితనం వలన తన స్నేహితులతో గానీ, బంధువులతోగానీ గాఢమైన సంబంధాలు లేవు. ఒంటరితనం ఆయన చుట్టూ ఉన్నవారికి కూడా సోకివుండవచ్చు, అదే ఆయన్ను రమణాశ్రమం చేర్చింది. ఒంటరితనం పరాకాష్టకు వచ్చి చివరకు తనువు చలించాల్సి వచ్చింది. నన్ను నేను తెలుసుకునే అన్వేషణ అంటూ జీవిత మలిసంధ్యలో ఆశ్రమ జీవితాన్ని గడిపి తన 85 సంవత్సరాల వయస్సులో అనగా 04 మే 1979 లో మరణించారు.
ఆడది భయపడేంత వరకే మగాడికి ధైర్యం…
చలం ఎవరు అనేది, నేనెవరు అనే ప్రశ్న అంత జటిలం. బాల్యంలో ఉన్న చలం వేరు, బ్రహ్మ సమాజంలో తిరిగిన చలం వేరు. ఛిత్రాంగి, పురూరవ, జయదేవ, హరిశ్చంద్ర లాంటి సాహిత్యాలను వ్రాసిన చలం వేరు. మైదానం, బ్రాహ్మణీకం హంపి కన్యలు, ఇత్యాది నవలలూ, కథలూ వ్రాసి ఆంధ్ర దేశాన్ని మంచికో చెడుకో, అటూ ఇటూ తీవ్రంగా వూపించి, సంచలనంరేపిన చలం వేరు. ఏ రచయిత కూడా, స్త్రీ రచయితలు కూడా స్త్రీల గురించి తెలుగులో ఇంతగా వ్రాయలేదు. ఆయన వ్రాసినదాంట్లో శతసహస్రాంశం కూడా ఇంతవరకు వ్రాయలేకపోయారు.
అదేవిధంగా తాను స్త్రీ గురించి ఈవిధంగా వ్రాస్తూ “భర్త నీచుడైతే అతడిని గుర్తించని తన భార్య కూడా అంతకన్నా నీచురాలు అని, అతని నీచత్వాన్ని కనిపెట్టి తన భర్తను ఆ నీచత్వంలో నుంచి తప్పించడానికి ప్రయత్నించని స్త్రీ ఒక వ్యర్థురాలు అని, ఆమె మార్చడానికి ప్రయత్నించినా భర్త మారకపోతే ఇంకా వాడికి లోబడే స్త్రీ వ్యభిచారి” అని మరీ తీవ్రంగా తన రచనలలో ఆయన చెప్పారు.
“ఆడది భయపడేంత వరకే మగాడికి ధైర్యం అని, విద్య లేని అనాగరికమైన స్త్రీ తన కాపురం మరీ దుర్లభం అయితే పారిపోతుందని, ఎక్కడో ముష్టిపని, దాసి పని, వేశ్య వృత్తి చేసుకుని ఎలాగైనా జీవించగలదు. కానీ చదువుకున్న స్త్రీలు నాగరికులు అని, వారు పైన పేర్కొన్న మూడింటిలో దేనికి పనికిరారు అని, అసలు బండి లేనిదే ఇంట్లోంచి కదలలేరు అని, రాముడితో కలిసి సీత అడవికి వెళ్లిపోయిందని, సావిత్రి యముడితో తగువులాడిందని, దుర్గమ్మ చీరలు తగలబెట్టి ఖద్దరు సైని కట్టిందని, సూరమ్మ పాతివ్రత్యం మీద ఉపన్యాసం ఇచ్చిందని లొట్టలు వేసే మహానుభావుల పవిత్ర నేత్రాలకు దినదినము, నిమిష నిమిషము మనోవ్యాఖ్యాయ కర్మల మీద, ఏ పత్రిక మీద పేరు పడని స్త్రీలు తెలిపే నిగ్రహం కనపడదు అని తన సాహిత్యంలో చెప్పేవారు చలం.
కపటత్వానికి, దాపరికానికి లొంగని చలం…
సహజంగా ఆడవారి గురించి ఇంత తీవ్రమైన భావాలను వెలిబుచ్చిన చలాన్ని అందరు ఆమోదించారా అంటే, లేదనే చెప్పాలి. ఆయనను ఆమోదించిన వారికంటే ఆయనను వ్యతిరేకించిన వాళ్లు ఎన్నో రెట్లు ఎక్కువ. అతని స్త్రీవాదమూ, స్వేచ్ఛా, హిపోక్రసీనెదిరించే తత్వమూ, లెక్కలేనంత మందిని అతనికి శతృవులుగా మార్చాయి. చలం సాహిత్యాన్ని, చలం కుటుంబాన్ని, చలంను సమాజం నుంచి వెలివేసిన వాళ్ళు, ఆయనను పూర్తిగా బహిష్కరించబడిన వాళ్లు, ఆయనను ఒక భ్రష్టుడిగానూ, ఆయన భావాలను సమాజానికి పట్టిన చీడపురుగులుగా భావించిన వాళ్ళు, ఆవిధంగా ప్రచారం చేసిన వాళ్ళు, ఆయనను ఎదిరించిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు.
ఆ రోజుల్లోనైనా, ఈ రోజుల్లోనైనా స్త్రీకి స్వేచ్ఛనివ్వండి అంటారు చలం. నువ్వంటోంది స్వేచ్ఛ కాదు అది విశృంఖలత అంటారు తనని వ్యతిరేకించేవారు. కానీ చలం మాత్రం స్త్రీ జాతిలో ఏమాత్రమైనా చైతన్యం తీసుకురావాలనేది నా ప్రయత్నం అంటారు చలం. ఆయనను వ్యతిరేకించేవారు మాత్రం ఆయనను “స్త్రీలను తప్పుదోవ పట్టిస్తున్నావు, వారిని చెడగొడుతున్నావు” అంటారు. మీలాగా నేను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు, నేను చేసింది చెబుతాను, ఇలాగే వ్రాస్తాను అంటారు చలం. నీకు స్థిరత్వం లేదు, ఇతరులకు బోధించే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయనని వ్యతిరేకించే వారు, విమర్శించేవారు అంటారు.
నిజానికి చలం జీవితం, చలం సాహిత్యం రెండు కూడా వైరుధ్యాలకు నిలయం. అయితే చలం ఏనాడూ కూడా కపటత్వానికి, దాపరికానికి లొంగలేదు. అందుకే ఆయనను తీవ్రంగా విమర్శించే వాళ్ళు కూడా ఒక్కోసారి ఆయన నిజాయితీకి నమస్కారం పెట్టకుండా ఉండలేరు. ఇప్పటికీ కూడా చలం కొందరికి ఆశ్చర్యార్థకం, కొందరికి ప్రశ్నార్థకం, ఇంకొందరికి నూటికి నూరు శాతం, మరికొందరికి ఎందుకు పనికిరాని శూన్యం. గుడిపాటి వెంకటాచలం ఒక శాంతి సముద్రం, నిరంతరం జ్వలించే ఒక అగ్నిగుండం.










