Telugu News

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ అరంగేట్రం..

కుటుంబాన్ని పోషించడానికి తన తల్లి కోరిక మేరకు నటనా జీవితాన్ని అయిష్టంగానే ప్రారంభించినప్పటికీ, బహుముఖ ప్రజ్ఞ మరియు నృత్య నైపుణ్యాలతో ఒక అద్భుతమైన నటిగా ప్రశంసలు అందుకుని “తమిళ సినిమా రాణి” అనే మారుపేరును సంపాదించుకున్నారు తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత. ఒక భారతీయ నటిగా, రాజకీయ నాయకురాలిగా, మరియు దాతగా, తమిళ ప్రజలకు అమ్మగా ప్రసిద్ధి చెందిన జయలలిత 1991 నుండి 2016 మధ్య పద్నాలుగు సంవత్సరాలకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె సేవలందించారు. భారతదేశంలో పదవిలో ఉండగా మరణించిన మొదటి మహిళా ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణించే వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ప్రస్తుత కర్ణాటక రాష్ట్రములోని మాండ్య జిల్లా, పాండవపుర తాలూకా, మేలుకోటే గ్రామంలో హిందూ తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జయరామ్ మరియు వేదవల్లి (సంధ్య) దంపతులకు ఆమె జన్మించారు. ఆమెకు జయకుమార్ అనే సోదరుడు కూడా ఉన్నారు. ఆమె తాత నరసింహన్ రెంగాచారి, మైసూర్ మహారాజా నాలుగవ కృష్ణ రాజ వడియార్ కి ఆస్థాన వైద్యుడిగా పనిచేశారు. ఆమె తల్లి తరపు తాత రంగసామి అయ్యంగార్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పనిచేయడానికి శ్రీరంగం నుండి మైసూరుకు వెళ్లారు.

న్యాయవాది అయిన తండ్రి జయరామ్, కూతురు జయలలిత రెండేళ్ల వయస్సులో ఉన్నప్పుడే మరణించారు. దాంతో వితంతువుగా మారిన “వేదవల్లి”  1950 వ సంవత్సరంలో బెంగళూరులోని తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న చెల్లెలు అంబుజవల్లి తన పేరును విద్యావతిగా మార్చి నాటకాలు మరియు చిత్రాలలో నటించడం ప్రారంభించారు. ఆమె ప్రోద్భలంతో జయలలిత తల్లి “వేదవల్లి” కూడా మద్రాసుకు మకాం మార్చి 1953 నుండి సంధ్య అని పేరు మార్చుకుని నటనలో దూసుకెళ్లారు. జయలలిత 1950 నుండి 1958 వరకు మైసూర్‌లో వేదవల్లి సోదరి పద్మవల్లి దగ్గర ఉంటూనే, తరువాత కాలంలో బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. 1958లో పద్మవల్లి వివాహం తరువాత, జయలలిత తన తల్లితో కలిసి మద్రాసుకు వెళ్లింది. అక్కడ పాఠశాల విద్యను అభ్యసించి, తమిళనాడు రాష్ట్రంలో 10వ తరగతిలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఆమె రాష్ట్ర బంగారు పతకం అందుకున్నారు. ఆ తరువాత ఆమె చెన్నైలోని స్టెల్లా మేరిస్ కళాశాలలో చేరారు, కానీ ఆర్థిక ఇబ్బందులు మరియు తల్లి ఒత్తిడి కారణంగా చదువును ఆపేసి చలనచిత్ర రంగంలో నటిగా కొనసాగారు.

జయలలిత వాక్చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే 20 జూన్ 1982 నాడు కడలూరులో జరిగిన ఏ.ఐ.ఏ.డి.యం.కె రాజకీయ సమావేశానికి అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మరియు రాజ్యసభ సభ్యుడు ఖుష్వంత్ సింగ్ కూడా ఆమె ప్రసంగాన్ని వీక్షించడానికి వచ్చారు. అంతటి వాగ్ధాటిని ముందే గ్రహించిన యం.జి.ఆర్ తన పార్టీలో సభ్యత్వాన్ని ఇచ్చి, రాజకీయ అంతరంగికురాలిగా తనను చేర్చుకున్నారు. 1977 నుండి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యం.జి.ఆర్ 28 జనవరి 1983 నాడు జయలలితను పార్టీకి ప్రచార కార్యదర్శిగా నియమించారు.

ఆంగ్లంలో ఆమెకున్న ప్రావీణ్యం కారణంగా జయలలితను రాజ్యసభ సభ్యురాలిగా చేయాలని యం.జి.ఆర్ కోరుకున్నారు. 1984 రాజ్యసభ ఎన్నికల్లో డి.యం.కె సీనియర్ నాయకులు ఆర్కాట్ ఎన్. వీరస్వామిని ఓడించిన జయలలిత రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో అంతర్గత భద్రతతో సహా పలు అంశాలపై ఆమె చేసిన వివిధ ప్రసంగాలను ఇందిరా గాంధీ ప్రశంసించారు. తన 41 సంవత్సరాల వయసులో జయలలిత యం.జి.ఆర్ రాజకీయ వారసురాలిగా 1989 ఎన్నికలలో బోడినాయకనూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి శాసనసభకు ఎన్నికై తమిళనాడు అసెంబ్లీలోకి ప్రవేశించారు.

1989 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత నేతృత్వంలోని ఏ.ఐ.ఏ.డి.యం.కె వర్గం 27 సీట్లు గెలుచుకుని తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. భారతదేశంలో ప్రతిపక్ష నాయకురాలిగా మారిన మొదటి భారతీయ నటి జయలలిత, మొదటి మహిళ కూడా ఆమెనే.  25 మార్చి 1989 నాడు డి.యం.కె మరియు ఏ.ఐ.ఏ.డి.యం.కె ఎమ్మెల్యేల మధ్య జరిగిన గొడవలో జయలలితపై దాడి జరిగింది. మహాభారతంలో ద్రౌపది అవమానకరంగా వస్త్రాపహరణం చేయబడిన సంఘటనకు సమాంతరంగా జయలలిత తన చిరిగిన చీరతో అసెంబ్లీ నుండి నిష్క్రమించారు. ఆ పరిస్థితిలో జయలలిత ఇంటి నుండి బయటకు వెళ్లబోతున్నప్పుడు “ముఖ్యమంత్రి అయ్యే వరకు ఇంట్లోకి ప్రవేశించను” అని ఆమె ప్రతిజ్ఞ చేశారు. అనుకున్నట్లుగానే 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌తో ఆమె పొత్తుపెట్టుకుని, ఏ.ఐ.ఏ.డి.యం.కె కూటమి పోటీ చేసిన 234 సీట్లలో 225 గెలుచుకుని అసెంబ్లీకి తిరిగి ఎన్నికైన ఆమె, తమిళనాడు రాష్ట్రంలో అతి పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రి అయ్యారు. 24 జూన్ 1991 నుండి 12 మే 1996 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆమె పూర్తి కాలం పనిచేసిన మొదటి మహిళ ముఖ్యమంత్రిగా ఖ్యాతి గడించారు.

పార్టీలో చేర్చుకునే ముందే జయలలితపై విశ్లేషణ..

సినిమా నటిగా కొనసాగుతూ ఉన్న జయలలిత తన 34 సంవత్సరాల వయస్సులో 04 జూన్ 1982 నాడు ఒక రూపాయి చెల్లించి, ఎం.జీ.ఆర్ ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహించిన ఏ.ఐ.ఏ.డి.యం.కె పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. రెండు రోజుల తరువాత 06 జూన్ 1982 నాడు ఏ.ఐ.ఏ.డి.యం.కె పార్టీ ప్రధాన కార్యదర్శి దానిని ధృవీకరించారు. నిజానికి జయలలిత మీద ఉన్న అభిమానంతోనో, లేక ఆమెకు ప్రజలలో ఉన్న ఆకర్షణతోనో ఎం.జీ.ఆర్ ఆమెను పార్టీలో చేర్చుకున్నారు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆమెపై ఉన్న నమ్మకంతోను మాత్రమే ఎం.జీ.ఆర్ ఆమెను పార్టీలో చేర్చుకున్నారు. ఏ విషయాన్నీ అంత సులువుగా నమ్మని ఎం.జీ.ఆర్, ఆమెను పార్టీలో చేర్చుకునే ముందే పూర్తిగా విశ్లేషణ చేశారు.

చేనేత కార్మికుల కష్టాలపై ప్రసంగం…

1982 ఏప్రిల్ నెలలో మద్రాసు లోని ఎగ్మోర్ లో చేనేత వస్త్రాల వార్షిక ప్రదర్శన జరిగింది. ఆ సభకు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న యం.జీ.ఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సభలో ప్రసంగించడానికి ఒక ప్రసంగకర్తగా జయలలితను కూడా ఆహ్వానించారు. అప్పటికే ఆమె ప్రజలలో, ప్రేక్షకులలో విపరీతమైన ప్రజాదరణ కలిగిన సినిమా నటి. అప్పటికీ ఆమె ఇంకా ఏ.ఐ.ఏ.డి.యం.కె పార్టీలో చేరలేదు. ఎం.జీ.ఆర్ తో పాటుగా మరికొందరు ప్రముఖులతో కలిసి ఉన్న వేదికను ఆమె అలంకరించారు. ఆ వేదికపై ప్రసంగించడానికి 15 నిమిషాల సమయం ఆమెకు కేటాయించారు. మాట్లాడానికి మైకు దగ్గరికి వచ్చిన జయలలితను చూసి చేనేత పరిశ్రమ గురించి సినిమా నటి ఏమి మాట్లాడగలదు అని ప్రేక్షకులు అనుకున్నారు. రెండు నిమిషాల ప్రసంగం అయ్యేసరికి సినిమా నటి మాటలు వింటున్నామనే సంగతి కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. కొన్నేళ్లుగా చేనేత పరిశ్రమను అతి దగ్గరుండి పరిశీలించినట్లుగా తన ప్రసంగంలో చూపించారు జయలలిత. చేనేత కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను,  ఎం.జీ.ఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చాలా చక్కగా వివరించి, తనకు కేటాయించిన 15 నిమిషాల సమయంలో అద్భుతమైన ప్రసంగాన్ని శ్రోతలకు అందించారు జయలలిత.

ప్రసంగం రికార్డును పదే పదే విన్న యం.జి.ఆర్…

ఆమె ప్రసంగిస్తున్నంత సేపు ఆమె గొంతులో ఉన్న గాంభీర్యత, స్వర విక్షేపాన్ని, ప్రేక్షకుల ప్రతి స్పందనను ఎం.జీ.ఆర్ జాగ్రత్తగా గమనించారు. నిజానికి ఆమె ప్రసంగాన్ని “అన్న” పత్రికకు సంపాదకులైన కామాక్షి సుందరం రికార్డు చేశారు. కానీ ఆ విషయం జయలలితకు తెలియదు. ఎం.జీ.ఆర్ సూచన మేరకే ఆయన జయలలిత ప్రసంగాన్ని రికార్డు చేశారు. ఆ సభ అయిపోయిన తరువాత ఆ రికార్డు తెప్పించుకొని ఎం.జీ.ఆర్ ఒకటికి నాలుగు సార్లు విన్నారు. ఆ రికార్డు విన్న తరువాత జయలలిత ప్రజలను ఆకర్షించడంలో, ఆకట్టుకునేలా మాట్లాడడంలో ముందంజలో ఉంటారనే నమ్మకం ఎంజీఆర్ కి కలిగింది. మళ్లీ మళ్లీ ఆ ప్రసంగం విన్న తరువాత 04 జూన్ 1982 నాడు జయలలితకు ఏ.ఐ.ఏ.డి.యం.కె సభ్యత్వం తీసుకోవడం జరిగింది.

జయలలిత రాజకీయ ప్రవేశం…

1984 వ సంవత్సరంలో “కుముదం” అనే తమిళ పత్రిక కథనం ప్రకారం “ఎంజీఆర్ రాజకీయ జీవితంలో, ఆయన చేస్తున్న ఒంటరి పోరాటానికి తోడుగా రాజకీయంలోకి ప్రవేశించాలి అని అనిపించింది” అని జయలలిత చెప్పారని వారు ఒక వ్యాసం ద్వారా ఆ పత్రికలో ప్రచురించారు. ఆమె రాజకీయ రంగప్రవేశానికి ముందు 1982 వ సంవత్సరం అరంభంలో ఎం.జీ.ఆర్ తో తన ఆలోచనలు పంచుకుంటున్నప్పుడు ముందుగా తొందర పడవద్దు అని తెలియజేస్తూ, ఏ.ఐ.ఏ.డి.ఎం.కే పార్టీ సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాలను చదవమని ఆమెకు ఇచ్చారు అని జయలలిత ఒకానొక సందర్భంలో చెప్పారు.

మరొక  సందర్భంలో “చుట్టుపక్కల పూర్తిగా నమ్మదిగిన వారు లేరని, ఒక నమ్మదిగిన సహాయకురాలు కావాలని అందువలన ఎం.జీ.ఆర్  తనను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారు. కనుక నిజంగా ఆయనకు సహాయం చేద్దామనే ఒక ఉద్దేశ్యంతోనే రాజకీయాలలోకి వచ్చానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఎట్టకేలకు ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం 04 జూన్ 1982 నాడు  జరిగింది. ఆరోజు ఆమె ఒక రూపాయి సభ్యత్వము చెల్లించి ఏ.ఐ.ఏ.డి.ఎం.కె పార్టీలో సభ్యురాలు అయ్యారు. ఆ సభ్యత్వం రానున్న రోజులలో  తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం శ్రీకారం చుడుతుందని ఎవ్వరూ ఊహించలేదు.

కరుణానిధిని ఢీకొట్టడమే యం.జి.ఆర్ లక్ష్యం…

నిజానికి జయలలిత రాజకీయ రంగప్రవేశం అనేది ఎం.జీ.ఆర్ ఆహ్వానం మేరకే జరిగి ఉండాలనేది అప్పటి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అప్పటివరకు రాజకీయంలో ఎం.జీ.ఆర్ కు చాలా మంది సన్నిహితులు ఉన్నారు. కానీ ఆయనకు అంతరంగికులు లేరు. ఆయన మొదటినుండి కూడా తన కుటుంబ సభ్యులలో ఎవ్వరినీ కూడా రాజకీయాల దరిదాపులకు కూడా రానివ్వలేదు. ఒకవైపు ప్రత్యర్థులు కరుణానిధి ప్రసంగాన్ని గమనించినట్లయితే ఆయన మాటలు తూటాల్లాగా పేలిపోతూ, సింహం గర్జించినట్లే ఉంటుంది. ఎం.జీ.ఆర్ కు కూడా ప్రజలలో అంతే ఆకర్షణ కలిగి ఉన్నారు, కానీ అన్ని చోట్ల బహిరంగ సభలకు వెళ్లలేరు. రోజురోజుకి రాజకీయ బాధ్యతలు పెరిగిపోతుండడంతో, పార్టీలో తనలాగా ప్రజలను ఆకర్షించే వారు కావాలని, ప్రసంగాలతో కరుణానిధిని ఢీకొట్టే వారు ఉండాలని ఎం.జి.ఆర్ యోచిస్తుండగా, తనకు జయలలితలో ఆ లక్షణాలు పుష్కళంగా ఉన్నాయని అనిపించింది.

జయలలితలో ఉన్న తెలివితేటలు, స్వతంత్ర వ్యక్తిత్వం, ప్రపంచ సమస్యల పట్ల ఆమెకు ఉన్న అవగాహన, అద్భుతమైన వాగ్దాటి, మొక్కవోని ధైర్యం ఇవన్నీ పార్టీకి గొప్ప అండగా నిలుస్తాయని యం.జి.ఆర్ భావించారు. ఆమెను రాజకీయంగా తన పార్టీలోకి ఆహ్వానించాలని అనుకుంటుండగా, ఆ పార్టీకే చెందిన వీరప్పన్ లాంటి నాయకులు అభ్యంతరపెట్టారు. ఆమె పార్టీలోకి వస్తే ఏ.ఐ.ఏ.డి.ఎం.కె పార్టీలోని ఇతర నాయకులకు  ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని వీరప్పన్ తో బాటు కొందరు ప్రభృతుల భావన. అందువలన  ఏ.ఐ.ఏ.డి.ఎం.కె పార్టీలోని చాలా మంది నాయకులకు జయలలిత పార్టీలోకి రావడం ఇష్టం లేదు. కానీ పార్టీ నాయకులు ఎం.జీ.ఆర్ కు ఆమెను పార్టీలోకి తీసుకోవడం ఇష్టం గనుక జయలలిత పార్టీలోకి వచ్చేసింది. ఆమె సభ్యత్వాన్ని 06 జూన్ 1982 నాడు ఏ.ఐ.ఏ.డీ.ఎం.కే ప్రధాన కార్యదర్శి పత్రికా ప్రకటన ద్వారా ధృవీకరించారు. దాంతో జయలలిత ఏ.ఐ.ఏ.డీ.ఎం.కే సభ్యురాలు అయ్యింది.

వివిధ నియోజకవర్గాల్లో జయలలిత సభలు…

1982 జూన్ లో కడలూరులో ఏ.ఐ.ఏ.డీ.ఎం.కే పార్టీ సదస్సు జరిగింది. పార్టీ కార్యకర్తలు వేయిలలో హాజరయ్యారు. జయలలిత పార్టీలో చేరి అప్పటికీ కేవలం రెండు వారాలు మాత్రమే అయ్యింది. అప్పటికింకా ఆమె పార్టీలో కేవలం కార్యకర్త మాత్రమే, ఏ పదవీ లేదు. కడలూరులో జరిగిన ఆ సభలో స్త్రీ జాతి ఔన్నత్యం, స్త్రీ జాతి చైతన్యం అనే అంశంపై మాట్లాడమని ఆమెను ఎం.జీ.ఆర్ కోరారు. అప్పటికే ఆమె రథం మాదిరి అలంకరించిన ఒక వాహనంలో కడలూరు వీధుల్లో ఊరేగింపుగా సభకు వెళ్లారు. అంతవరకు తమ హీరో ఎం.జీ.ఆర్ ను మాత్రమే దగ్గరగా చూసిన తమిళ ప్రజలు, ఇప్పుడు హీరోయిన్ జయలలిత కూడా దగ్గరగా కనిపించేసరికి ప్రజలు ఆనంద పరవశులయ్యారు.

తన వాక్చాతుర్యంతో ఆ సభలో జయలలిత ప్రసంగం అద్భుతంగా కొనసాగడంతో ఏ.ఐ.ఏ.డీ.ఎం.కే కార్యకర్తలకు తమ పార్టీలో మరొక స్టార్ ఉదయించారు అనే సంకేతాలు అందాయి. తన ప్రసంగంలో చివరలో జయలలిత “చెప్పండి మీరంతా ఎల్లప్పుడూ పురట్చి తలైవర్ తోనే ఉంటారా” అని అడుగగా వారంతా ఉంటామని ఎలుగెత్తి చాటారు. ఇవన్నీ తిలకించిన ఎం.జీ.ఆర్ కి జయలలిత పట్ల ఉన్న నమ్మకాన్ని మరింతగా పెంచేశాయి. ఆ రోజు నుండి ప్రతీ రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లడం, 15 రోజులకు ఒక్కసారి వివిధ నియోజకవర్గాల్లో పర్యటించడం జయలలితకు నిత్యకృత్యం అయ్యింది.

ఏక సంతాగ్రాహి జయలలిత…

17 అక్టోబర్ 1982 నాడు జయలలితకు తొలిసారి పూర్తిగా రాజకీయ ప్రసంగం చేసే అవకాశం  దొరికింది. అప్పటివరకు ఆమె కేవలం రాజకీయ ఉపన్యాసాలు మాత్రమే ఇచ్చారు. కానీ ఆమె తొలిసారిగా రాజకీయ ప్రసంగం చేయబోతున్నారు. కాబట్టి ఎం.జీ.ఆర్ సూచన మేరకు”అన్న” పత్రిక సంపాదకులు “కామాక్షి సుందరం” ఆ ఉపన్యాసాన్ని ముందుగానే సిద్ధం చేశారు.  ఆయన సిద్ధం చేసిన ప్రసంగాన్ని జయలలితకు ఇవ్వడానికి వెళ్లగా, దానిని ఒక్కసారి చదివి వినిపించమని కామాక్షి సుందరాన్ని జయలలిత కోరారు. ఆయన చదువుతున్నంత సేపు ఆమె కళ్ళు మూసుకొని విన్నారు. ఆయన చదవడం అయిపోగానే మళ్ళీ చదవమని అడిగారు జయలలిత. అలా ఆమె మూడుసార్లు ఆ ప్రసంగాన్ని విన్నారు. అంతే..  ఆయన ఇవ్వబోయిన ప్రసంగ కాగితాలను తీసుకోకుండా, ఆమె తాను చెప్పదలుచుకున్న మొత్తం ప్రసంగాన్ని ఆయనకు వినిపించింది. దాంతో ఆశ్చర్యపోవడం కామాక్షి సుందరం వంతైంది. కావేరి జలాల గురించి కర్ణాటకలో జరుగుతున్న వివాదం గురించి ఇందిరాగాంధీతో చర్చించడానికి న్యూఢిల్లీ వెళ్లారు యం.జి.ఆర్. ఆయన స్థానంలో జయలలితను మాట్లాడాల్సిందిగా మైలాపురంలో సభ సిద్ధం చేశారు.

కావేరీ జలాలపై జయలలిత తొలి ప్రసంగం…

17 అక్టోబర్ 1982 నాడు మైలాపురంలో సభ. కర్ణాటక – తమిళనాడు ల మధ్య కావేరి జలాల గురించి జరుగుతున్న వివాదం గురించే బహిరంగ సభ.  దానిపైనే జయలలిత తొలి రాజకీయ ప్రసంగం. ఆ సభలో ఎం.జీ.ఆర్ పాల్గొనలేదు. ఆ సభకు జయలలిత ప్రధాన ఆకర్షణ. ఆనాడు మైలాపురంలో సభ జరిగిన తీరు గురించి ఆనంద వికటన్ పత్రిక వారు వ్రాసిన వార్త వివరములు ఇలా వున్నాయి.

సభ ప్రాంగణం చుట్టూ సాయుధ పోలీసులు మానవహారం లాగా కాపలా కాస్తున్నారు.  స్థానికులెవరినీ ఇళ్లలో నుండి బయటకు రావద్దనే ఆంక్షలు విధించారు. జయలలిత నల్ల జాకెట్టు, ఎర్ర చీర ధరించి పార్టీకి ప్రాణం పోసుకున్న పతాకం లాగా అనిపించారు. ఆరోజు జయలలిత ప్రసంగించారు అనే కంటే ఆమె గర్జించారు అనడం బాగుంటుంది. ఈ సమస్యను పరిష్కరించవలసిన అవసరం కేంద్రానిదే అయినా కేంద్రం ఎందుకు మౌనం వహిస్తుందో మనకు తెలియడం లేదు. కర్ణాటకలో రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తూ కేంద్రం మనకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుంటున్నారు. కర్ణాటకలో ఉన్న కావేరి వెనుక జలాల్లో మనకు వాటా లేదంటే, ఆ నదీ తీరంలో వెలువడిన చమురు నిల్వలు కూడా మనవే అని మనం ఉద్యమిద్దాం.  

ఇలా సాగినటువంటి ఆ ఉపన్యాసంలో జయలలిత చెప్పిన లెక్కలు, సంఖ్యలు వివరాలన్నీ ఒక ఐ.ఏ.ఎస్ అధికారి చెప్పినట్లుగా చెప్పారు. దీనిని ఎలా పరిష్కరించవచ్చో కూడా జయలలిత తన ప్రసంగంలో వివరించారు. ఈ విషయం గురించి ఏమాత్రం పట్టింపులేదు అని  ప్రతిపక్షాల మీద ఆమె విరుచుకుపడ్డారు. జయలలిత కేవలం రాజకీయ ప్రసంగం మాత్రమే కాకుండా, సమస్య విశ్లేషణ, దాని పరిష్కారం, ఈ పద్ధతిలో సాగినటువంటి తన ఉపన్యాసాన్ని వింటూ పోలీసులు నోట్స్ కూడా వ్రాసుకున్నారు. కొంతమంది రికార్డు కూడా చేశారు. ప్రసంగం ముగిసి బయటకు వచ్చేసరికి జోరున వర్షం కురుస్తోంది. బయట ఉన్న ప్రజలు మాత్రం “వదినమ్మ నీకోసం ఆకాశం పూల వర్షం కురిపిస్తుంది” అంటూ నినాదాలు చేశారు.. వేదిక మీద తనకు వేసిన పూల దండలను ప్రజల మీదకు విసిరేశారు జయలలిత. అది అత్యంత విజయవంతమైన జయలలిత రాజకీయ ప్రసంగం. ఇలా పత్రికల వాళ్ళు వ్రాసుకున్నారు.

తమిళనాడుకు ఆరు సార్లు ముఖ్యమంత్రిగా జయలలిత…

ఏక సంతాగ్రహి అయిన జయలలిత తాను లేకుండా సభను విజయవంతం చేసిన జయలలిత రాజకీయ సామర్థ్యం మీద యం.జి.ఆర్ కి రోజురోజుకీ విశ్వాసం  బలపడసాగింది. 1977 తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఎం.జి.ఆర్. తన నేతృత్వంలోని ఏ.ఐ.ఎ.డి.ఎం.కె కూటమిని విజయం వైపుకు నడిపించి, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మొదలు, ఆయన నేతృత్వంలో ఏ.ఐ.ఏ.డి.ఎం.కె 1980 లోనూ, 1984 లోనూ మరో రెండు పర్యాయాలు రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించింది. 1980లో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలన విధించిన ఆరు నెలలు మినహాయిస్తే, 1987లో మరణించేవరకూ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలోనే యం.జి.ఆర్ కొనసాగారు. ఆయన మరణాంతం ఆయన భార్య జానకి రామచంద్రన్ తమిళనాడుకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై 23 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు.

1991లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న ఏ.ఐ.ఏ.డి.యం.కె 234 సీట్లలో 225 గెలుచుకోవడంతో తమిళనాడు రాష్ట్రానికి జయలలిత అతి పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 2001 లో ముఖ్యమంత్రిగా రెండవసారి, మద్రాస్ హైకోర్టు కొన్ని అభియోగాల నుండి నిర్దోషిగా విడుదలై, తన పదవీకాలాన్ని పూర్తి చేయడానికి తిరిగి 2002 లో ముఖ్యమంత్రిగా మూడవసారి, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన జయలలిత ముఖ్యమంత్రిగా నాల్గవసారి, 23 మే 2015 నాడు జయలలిత ఐదవసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆమె ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్‌ 2016 లో తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత 75 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత 05 డిసెంబరు 2016 నాడు గుండెపోటు కారణంగా మరణించారు.

Show More
Back to top button