CINEMATelugu Cinema

విలనిజం, మేనరిజం, హీరోయిజం కలబోసుకున్న విలక్షణ నటులు.. మోహన్ బాబు

తెలుగు చిత్ర పరిశ్రమలో తనది ఓ విలక్షణమైన శైలి. దేనికీ వెరవని తత్వం, ఎవ్వరికీ లొంగని మనస్తత్వం తనది. తెలియని వాళ్ళకి తాను ఒక కోపదారి మనిషి, కాస్త తెలిసిన వాళ్ళకి తాను ముక్కుసూటి మనిషి, బాగా తెలిసిన వాళ్ళకి తాను మనసున్న మంచి మనిషి. ఆయనే కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నటప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారు. నటుడుగా 500 పైన చిత్రాలు, నిర్మాతగా 50 పైన సినిమాలు తనకొక రికార్డు. ఓ సినిమాలో తాను పలికిన సంభాషణ లాగే నా రూటే సపరేటు అన్నట్టు విలనిజం, మేనరిజం, హీరోయిజం కలబోసుకున్న విలక్షణ నటులు మోహన్ బాబు గారు.

మోహన్ బాబు గారి అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. తన సినీ ప్రస్థానానికి రహదారి వేసిన తొలి గురువు దాసరి నారాయణ రావు గారు తన పేరును మోహన్ బాబుగా మార్చారు. దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు గారి శిష్యుడిగా గుర్తింపు పొంది, దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన “స్వర్గం నరకం” సినిమాలో మోహన్‌ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించడంతో 1975 లో నటుడుగా అడుగుపడిన తరువాత తాను అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు గారు 2015 వరకు సుమారు 520 చిత్రాలకు పైగా నటించారు, అలాగే 181 చిత్రాలలో కథనాయకుడిగా నటించి నవరసాలు పండించారు.

తాను హీరోగా నటించిన అల్లుడుగారు , అసెంబ్లీ రౌడి , రౌడీ గారి పెళ్ళాం , మోహన్ బాబు ని హీరోగా నిలబెట్టాయి. ఆ తరవాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ , మేజర్ చంద్రకాంత్, సినిమాలతో స్టార్ హీరోగా కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తరవాత వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రి హిట్ గా నిలిచింది. శ్రీ రాములయ్య , అడవిలో అన్న సినిమాలతో మోహన్ బాబు గారు తనలోని మరో నటుడిని చూపించారు. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్‌కింగ్‌గా కొలువయ్యారు. అలాగే నిర్మాతగా మారి “శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్” ను స్థాపించి 50కి పైగా చిత్రాలు నిర్మించి, విజయవంతమైన నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్న తాను మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా కూడా పనిచేశారు.


అనుకున్నామని జరుగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ అన్నారు ఆత్రేయ గారు. అది అక్షర సత్యం. మోహన్ బాబు గారి మొత్తం 49 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో అనుభవాలు, జయపజయాలు రెండు చూశారు. దేవుడు పట్ల విశ్వాసం ఉన్న తాను సాయిబాబా భక్తులు. రాత్రి, పగలు లాగానే జీవితంలోని చీకటి, వెలుగులు రెండు ఉంటాయి. పాపం పుణ్యం, స్వర్గం నరకం అన్నీ ఇక్కడే అనేది సత్యాన్ని నమ్ముతూ ఉంటారు మోహన్ బాబు గారు. తన కళాప్రతిభకు పద్మ శ్రీ పురస్కారం కూడా లభించింది. తాను తిరుపతికి 14 కిలోమీటర్ల దూరంలో రంగంపేటలో శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. ఎన్టీఆర్ గారి అభిమానాన్ని చురగొన్న తాను రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.


జీవిత విశేషాలు…

జన్మ నామం :  మంచు భక్తవత్సలం నాయుడు

ఇతర పేర్లు   :    మంచు మోహన్ బాబు

జననం    :    19 మార్చి 1952

స్వస్థలం   :    మోదుగులపాళెం, ఏర్పేడు మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

తండ్రి  :  మంచు నారాయణ స్వామి

తల్లి  :  మంచు లక్ష్మమ్మ

జీవిత భాగస్వామి :  శ్రీ విధ్యాదేవి మరియు నిర్మలా దేవి

పిల్లలు   :   విష్ణు , మనోజ్ , లక్ష్మీప్రసన్న

వృత్తి      :   నటుడు , నిర్మాత , రాజకీయ వేత్త

బిరుదు  :  కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నటప్రపూర్ణ, విద్యాలయ బ్రహ్మ


నేపథ్యం…

మోహన్ బాబు గారు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 19 మార్చి 1952 నాడు జన్మించారు. మోహన్ బాబు గారి జన్మనామం మంచు భక్తవత్సలం నాయుడు. అంతకన్నా ముందు బత్తెయ్య. ఆ తరువాత మోహన్ బాబుగా మారిపోయింది. మోహన్ బాబు గారి తండ్రి గారి పేరు నారాయణ స్వామి నాయుడు. తాను ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. తల్లి లక్ష్మమ్మ గృహిణి. తన తల్లిదండ్రులకు అయిదుగురు సంతానం. మోహన్ బాబు గారే మొదటి వారు. ఆ తరువాత ముగ్గురు తమ్ముళ్లు. రంగనాధ్ చౌదరీ, రామచంద్ర చౌదరీ, కృష్ణ. చివరిగా ఒక సోదరి విజయ ఉన్నారు.

మోహన్ బాబు గారి స్వగ్రామం ఏర్పేడు కు దగ్గరలో ఉంది. ఏర్పేడు గ్రామము తిరుపతికీ, శ్రీకాళహస్తికి మధ్యలో ఉంది. అటు గ్రామము కాదు, ఇటు పట్టణము కాదు. ఏర్పేడు నుండి లోపలికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మోదుగులపాలెం “ద్వీపం”.  మోదుగులపాలెం చుట్టూ కూడా “సువర్ణముఖి నది” ఉండేది. అప్పట్లో పెద్ద వర్షాలు వస్తే నదిలో ఈదుకుంటూ వెళ్లాల్సిందే. ఆ గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు మోహన్ బాబు గారు. ఐదు రూపాయల జీతంతో వాళ్ళ నాన్నగారి ఉద్యోగం ప్రారంభమైంది. ఒక ప్రక్క ఉద్యోగం చేస్తూనే మరోప్రక్క తమకున్న నాలుగు ఎకరాల వ్యవసాయం చూసుకునేవారు మోహన్ బాబు గారి నాన్న గారు.

మోహన్ బాబు గారు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారు. రోడ్డున పోయే గొడవలు మనకెందుకురా అంటున్న తన చిన్ననాటి స్నేహితులు త్యాగరాజ రెడ్డి, జనార్ధన రెడ్డి, హనుమంత రెడ్డి, భాస్కర రెడ్డి, మునుస్వామి యాదవ్ వారించేవారు. అల్లరి చేసేవారు.తాను చిన్నప్పటి నుండే ఆవేశపరులు. కానీ  తప్పుడు పనులు చేయలేదు. తన నాన్నగారు బడిపంతులు కావడం వలన మోహన్ బాబు గారికి చెడు అలవాట్లు అబ్బలేదు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు తెలియవు.  క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవారు. వాళ్ళ నాన్నగారు ఐదు గంటలకు నిద్రలేచి పొలానికి వెళ్లి పనులు చూసుకుని ఇంటికి వచ్చి అల్పాహారం తినేసి పాఠశాలకు కి వెళ్లేవారు. మళ్లీ సాయంత్రం పాఠశాల నుండి నేరుగా పొలంకు వెళ్లి పనులు చూసుకుని ఇంటికి వచ్చేవారు. అలా వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి నేర్చుకున్న క్రమశిక్షణనే ఈరోజుకి పాటిస్తూ పని ఉన్నా లేకున్నా, చిత్రీకరణ ఉన్నా లేకున్నా ఉదయం నాలుగున్నర తర్వాత మోహన్ బాబు గారు పడుకోరు.


విద్యాభ్యాసం…

మోహన్ బాబు గారు చదువుకోవడానికి తన ఊరు మోదుగులపాళెం నుండి పొరుగూరు ఏర్పేడు కు  సైకిల్ మీద వెళ్లడానికి కుదిరేది కాదు. దారి పొడవునా చిన్న చిన్న కాలువలు ఉండడంతో సుమారు ఆరు కిలోమీటర్లు నడిచే వెళ్లేవారు.  ఏర్పేడు లో తాను చదువుకునేటప్పుడు వాళ్ళ అమ్మ ఓ చిన్న క్యారియర్ పెట్టేవారు. అందులో పెరుగన్నం, మిరపకాయ, చింతపండు పులుసన్నం ఉండేవి. ఆ రోజులలో నిమ్మకాయలతో తయారు చేసిన పులుసున్నం అంటే చాలా బావుండేది. మోహన్ బాబు గారు అది తినేసి బడి ఎగ్గొట్టి బావి దగ్గరికి వెళ్లి ఈత నేర్చుకునేవారు. అది తెలిసిన వాళ్ళ నాన్నగారు ఒకసారి చితకబాది, తాను బుద్దిమంతుడు అవ్వాలని వ్యాసాశ్రమంలో చేర్చారు. దాంతో అక్కడే సంస్కృతం నేర్చుకున్నారు. అక్కడ నుండి పాపానాయుడు పేటకు ఎనిమిది మైళ్ళు, అక్కడికీ నడిచే వెళ్లేవారు. అందువలన మోహన్ బాబు గారిని వాళ్ళ నాన్నగారు పాపానాయుడు పేట లో ఇజ్రాయెల్ మాస్టారు గారి ఇంట్లో పెట్టారు. దాంతో వారు బాగా చూసుకునేవారు. తప్పు చేస్తే బెత్తంతో చితక బాదేవారు. 8వ, 9వ తరగతి మరియు ఎస్.ఎస్.ఎల్.సి తిరుపతిలో హై స్కూల్ లో చదివారు. ఉన్నట్టుండి ఒకసారి ఆ మాస్టరు గారి ఇంట్లో దీపావళికి ఇంటి గదిలోనే టపాసులు కాల్చారు. దాంతో అవాక్కయిన ఆ మాస్టారు గారు తనను తన ఇంటి నుండి పంపించేశారు.


పి.ఈ.టి శిక్షణ…

మోహన్ బాబు గారు మద్రాసు వై.ఎం.సి.ఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో 10 నెలల శిక్షణ తీసుకున్నారు. తనకు చదువుమీద శ్రద్ధ కన్నా కూడా సినిమా వాళ్ళని చూడడం మీదనే అమితమైన ఇష్టం ఉండేది. ముఖ్యంగా నందమూరి తారకరామారావు గారిని చూడాలని తహతహలాడేవారు. పొద్దుపొద్దున్నే సినిమా చిత్రీకరణ వద్దకు వెళ్లి ద్వారం వద్ద నిలబడి చూసేవారు మోహన్ బాబు గారు. అలా మొదటిసారి తాను కృష్ణుడి వేషంలో ఉన్న అన్నగారిని చూశారు. తనను చూడగానే మంత్రముగ్దుడయ్యారు. పురాణ పురుషులను తలపించే మహోన్నతమైన ఆ నటన, ఆ ఆహార్యం మరొకకరికి సాధ్యం కాదు.  ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఎన్టీఆర్ గారికి అలాంటి జన్మ ఉండదు, పూర్వజన్మ సుకృతం అని ఆ సమయంలో మోహన్ బాబు గారు భావించారు.

తాను కూడా ఎలాగైనా సినిమాలలో నటించాలని ఆ సమయంలో అనుకున్నారు. తన పి.ఇ.టి శిక్షణ పూర్తి అయ్యింది. శిక్షణ పూర్తి అయిన వెంటనే ఉద్యోగం దొరకలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో పి.ఇ.టి మాస్టర్ గా ఉద్యోగం చేస్తూ పొలం పనుల్లో తనకు చేదోడు వాదోడుగా ఉండాలన్నది మోహన్ బాబు గారి నాన్న గారి ఉద్దేశం. కానీ మద్రాసులోనే ఉంటూ, ఉద్యోగం చేస్తూ సినిమాలలో వేషాలకోసం ప్రయత్నం చేయవచ్చనేది అన్నది మోహన్ బాబు గారి అభిలాష. మోహన్ బాబు గారి నాన్న గారు అయిన నారాయణ స్వామి నాయుడు గారు కూడా అప్పట్లో వీధి నాటకాలు వేసేవారు. ఆ వీధి నాటకాలలో నక్షత్రకుడు, నారదుడు లాంటి వేషాలు వేసేవారు. ఆయనతో బాటుగా మోహన్ బాబు గారు కూడా నాటకాలు వేసేవారు. తాను పాఠశాలలో కూడా మోనో యాక్షన్  చేస్తుండేవారు. అలా తనకు తెలియకుండానే నటన పట్ల తనకు ఆసక్తి ఏర్పడింది.


చలనచిత్ర రంగ ప్రవేశం…

పి.ఈ.టి శిక్షణ పూర్తి అయిన కొద్ది రోజులకు బి.ఆర్.రెడ్డి గారు కేసరి పాఠశాలలో వెంకన్న చౌదరి గారికి సిఫారసు చేసి మరీ మోహన్ బాబు గారికి ఉద్యోగం ఇప్పించారు. నెలకు జీతం 197 రూపాయలు. పాండి బజార్ పక్కననే తాను ఉద్యోగం చేసే పాఠశాల. పాఠశాల అయిపోగానే పాండీ బజారులో కాసేపు తిరిగేవారు. అక్కడ తనకు త్యాగరాజు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గిరిబాబు గారు పరిచయమయ్యారు. గిరిబాబు గారి అసలు పేరు శేషారావు. ఆయన అక్కడ వేషాల కోసం ప్రయత్నాలు చేసేవారు. గిరిబాబు గారు తెల్లగా ఉండి ఉంగరాల జుట్టుతో పంచ కట్టుకొని సినిమా హీరోలాగా ఉండేవారు. వారిని చూసి మోహన్ బాబు గారు “ఆహా ఏమి జీవితం, వీళ్లంతా ఎంత గొప్పవాళ్లు” అనుకునే వారు. తరువాత కాలంలో గిరిబాబు, అశోక్ కుమార్, మోహన్ బాబు గార్లు ఓకే రూములో ఉండేవారు.


గురువు దాసరి గారితో పరిచయం…

ఇలా సంవత్సరం గడిచింది. కేవలం కులం కారణంతో మోహన్ బాబు గారిని ఉద్యోగం నుండి తీసేసారు. ఎంతో వేడుకున్నా కూడా ఫలితం లేకపోయింది. పి.ఈ.టి ఉద్యోగం పోయేసరికి తనకు తల కొట్టేసినట్టయ్యింది. సిగ్గుతో ఇంటికి వెళ్లలేకపోయేవారు. అప్పుడప్పుడు ఇంటి దగ్గరినుండి బియ్యం తెప్పించుకునేవారు. ఒక కారు షెడ్ లో ఉండేవారు. అద్దె నలభై రూపాయలు. కానీ వర్షం వస్తే వర్షపు నీళ్లన్నీ లోపలే ఉండేవి. ఆ సమయంలో రజినీకాంత్ గారు కూడా మోహన్ బాబు గారికి జత కలిశారు. రజనీకాంత్ గారు ఓ ఫిలిం సంస్థలో శిక్షణ తీసుకుంటున్నారు. కొద్ది రోజులకే త్యాగరాజు గారితో మోహన్ బాబు గారి అనుబంధం బలపడింది. దాంతో తన ఆవాసం త్యాగరాజు గారి ఇంటికి మారింది.

ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా మోహన్ బాబు గారికి దర్శకులు లక్ష్మీ దీపక్ గారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే తన వద్ద “కూతురు – కోడలు” సినిమాకి తన దగ్గర మోహన్ బాబు గారు అప్రెంటిస్ గా చేరిపోయారు. ఆ సినిమాలో శోభన్ బాబు, గీతాంజలి హీరో హీరోయిన్లు. ఆ సినిమాకు వాసు దర్శకులు. అక్కడే మోహన్ బాబు గారికి తన గురువు దాసరి గారితో తొలిసరిగా పరిచయం ఏర్పడింది. ఆ సినిమాకు దాసరిగారు కో డైరెక్టర్. ఆ సినిమాకి ఆరు నెలలు పనిచేస్తే మోహన్ బాబు గారికి 50 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఆ తరువాత ప్రత్యగాత్మ, తాతినేని రామారావు, కె.ఎస్.ఆర్ దాస్ ఇలా పలువురు దర్శకుల వద్ద సహాయకులుగా పని చేశారు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు తనకు కథనాయకుడిగా అవకాశం ఇవ్వకపోతారా అనే ఆశతో అలా పనిచేస్తూ పోతున్నారు.


తొలి సినిమా స్వర్గం – నరకం…

మోహన్ బాబు గారు సినిమా వేషాలకోసం ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. అప్పుడప్పుడు తెల్లవారుజామున దాసరి గారి ఇంటికి వెళ్లి వసారాలో వేచిచూసేవారు. కానీ నిరాశతోనే వెనుదిరిగేవారు. రోజులు గడుస్తున్నాయి. ఎలాగైతేనే నిరీక్షణ ఫలించింది. ఉన్నపళంగా ఒకరోజు మోహన్ బాబు గారికి తన గురువుగారు దాసరి గారి నుండి కబురు వచ్చింది. విజయవాడలో నటుల ఎంపిక. మోహన్ బాబు గారికి పోటీగా ఏడుగురు వచ్చారు. విజయవాడలోని పటమట లంకలో ప్రవేశ పరీక్ష పెట్టి ఫిలిం డెవలప్ చేయడానికి మద్రాసు పంపించారు. తన గురువుగారి భార్య దాసరి పద్మ గారు మోహన్ బాబు గారిని చూసి “ఈ కుర్రాడు బాగున్నాడు కదండి, ఇతన్ని వదిలేసి ఇంకెవరినో ఎందుకు చూస్తున్నారు” అన్నారు. అలా మోహన్ బాబు గారు ఆ సినిమాలో ఎంపిక అవ్వడానికి దాసరి పద్మ గారే కారణం. ఆ సినిమా పేరు “స్వర్గం నరకం” (1975). శ్రీ లక్ష్మీ నరసింహ ఫిల్మ్స్ పతాకంపై ఎం.కె.మావులయ్య, పి.ఎస్.భాస్కరరావులు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. 22 నవంబరు 1975 నాడు ఆ సినిమా విడుదలయ్యింది.

ఆ తర్వాత “భలే దొంగలు” సినిమా. మోహన్ బాబు గారికి ఆ సినిమా పెద్ద బ్రేక్. హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి పక్కన విలన్ వేషం. జేమ్స్ బాండ్ చిత్రాల శిల్పి కె.ఎస్.ఆర్.దాస్ దర్శకులు. డూండీ, బాబ్జి, సాంబశివరావు గార్లు నిర్మాతలు. మోహన్ బాబు గారు మొదటిసారిగా డూండీ గారిని కలిశారు. తన ఫోటోలు చూసిన డూండీ గారు తనను బాగున్నావయ్యా ఈ చిత్రంలో వేషం నీకే, రేపు రా అన్నారు. మర్నాడు ఆ సినిమాలో తనకు వేషం ఇచ్చారు. ఇక అప్పటినుంచి మోహన్ బాబు గారికి తిరుగులేదు. ఎన్నో సినిమాలు, ఎన్నెన్నో పాత్రలు. విభిన్నమైనవి, విలక్షణమైనవి. ఓ గుర్తింపు అంటూ వచ్చాక ఎన్ని అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చినా నటుడిగా తాను ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మోహన్ బాబు గారిని ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక కథనాయకుడిగా పరిచయం చేసిన వ్యక్తి మాత్రం తన గురువు దాసరి నారాయణ రావు గారే అని చెప్పాలి.


నిర్మాతగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్”..

1982 లో మోహన్ బాబు గారు “శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్” సంస్థను నెలకొల్పే నాటికి మనోజ్ ఇంకా పుట్టలేదు. చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి 40 ఏళ్ల పాటు నిర్మాతగా కొనసాగడమంటే అంత సులభం కాదు. “శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్” పతాకంపై మొదటగా “ప్రతిజ్ఞ” సినిమా ప్రారంభించారు. ముందుగా సినిమా నిర్మాణం విషయమై తన గురువు దాసరి నారాయణరావు గారికి తెలుపగా ఆయన నటుడిగా సినిమాలు చేసుకుంటున్నావు ఇప్పుడు నీకు సినిమా నిర్మాణం ఎందుకు అని సలహా ఇచ్చారు. కానీ ప్రక్కనే ఉన్న దాసరి పద్మ గారు నీకెందుకు నేను ఉన్నాను “ఆల్ ది బెస్ట్” అని ప్రోత్సహించారు. దాసరి పద్మ గారిని సొంత అక్కగా భావించేవారు మోహన్ బాబు గారు. ఎం.డి. సుందరం గారు చెప్పిన కథ నచ్చిడంతో సినిమా మొదలుపెట్టారు. నిజానికి ఆ కథ కన్నడంలో ఫెయిల్ అయ్యింది. అయినా పర్లేదు చేద్దామన్నారు మోహన్ బాబు గారు. ఆ సమయానికి అంతగా సక్సెస్ లేని బోయిన సుబ్బారావు గారినే దర్శకుడిగా తీసుకున్నారు.

ఆ సినిమాలో కవితను నాయికగా తీసుకున్నారు. అప్పుడు కవిత అంత బిజీగా లేదు వద్దన్నారు. పెద్ద కథానాయికను తీసుకోమన్నారు. కానీ న్యాయంగా, ధర్మంగా, స్నేహంగా ఒకటి అనుకుంటే దానికే కట్టుబడి ఉండే మోహన్ బాబు గారు కవితనే కొనసాగించారు. సత్యనారాయణ, గిరిబాబు త్యాగరాజు, సాక్షి రంగారావు తదితరులు నటీనటులుగా గా పెట్టుకుని సినిమా మొదలుపెట్టారు. మద్రాసు వాహినీ స్టూడియోలో పాటల రికార్డింగ్. గురువుగారు దాసరి గారిని ఆహ్వానిస్తే బొబ్బిలి పులి చిత్రీకరణ ఉండడంతో కుదరదన్నారు. చెన్నైకి 20 కిలోమీటర్ల దూరంలో ఉదయం ఏడు గంటలకు చిత్రీకరణ. మోహన్ బాబు గారికి అక్కయ్య అయిన దాసరి పద్మ గారు వస్తానన్నారు. నందమూరి తారకరామారావు గారు బొబ్బిలి పులి షూటింగ్ ఉండడంతో బొబ్బిలి పులి గెటప్ లో మోహన్ బాబు గారి సినిమా ప్రారంభానికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు. దాసరి పద్మ గారు దీపం వెలిగించి దేవుడు విగ్రహాలకు పూజ జరిపారు. నువ్వు పెద్ద హీరో అవుతావు. ఈ సినిమా విజయవంతం అవుతుంది అని ఆమె ఆశీర్వదించారు.

తిరుపతి సమీపంలో “కొటాల” గ్రామంలో చిత్రీకరణ మొదలుపెట్టారు. అప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దాసరి పద్మ గారు క్లాప్ కొట్టారు. 26 రోజులలో సినిమా పూర్తి చేశారు. సినిమాను సూపర్ హిట్ అయ్యింది. వంద రోజులు ఆడింది. వందరోజుల వేడుక మద్రాసులో “మ్యూజిక్ అకాడమీ” నిర్వహించారు. శివాజీ గణేష్ గారు, అక్కినేని నాగేశ్వరావు గారు, దాసరి నారాయణరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. 01 జులై 1982లో నిర్మాతగా మోహన్ బాబు గారు తీసిన తొలి చిత్రం ఘనవిజయం పొంది నిర్మాతగా తన ప్రస్థానానికి బాటలు వేసింది. అలా మొదలైన తన సినీ నిర్మాణ ప్రస్థానం 40 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతూనే వుంది. ఇప్పటికీ 56  పైగా చిత్రాలు తీశారు.  అల్లుడుగారు, అసెంబ్లీరౌడీ, రౌడీ గారి పెళ్ళాం, కలెక్టరు గారు, అల్లరి మొగుడు, పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశారు.


శ్రీ విద్యానికేతన్ పాఠశాల…

మోహన్ బాబు గారు తిరుపతికి 14 కిలోమీటర్ల దూరంలో  “శ్రీ విద్యానికేతన్ సంస్థ” ను స్థాపించారు. తనను కులం కారణంగా పి.ఈ.టి ఉద్యోగంలోంచి తీసేసినప్పుడు రగిలిన ఆవేశం, తనకు రేకెత్తిన ఆలోచనల నుండి రూపుదిద్దుకున్న స్వప్న సౌధమే  “శ్రీ విద్యానికేతన్ సంస్థ”.   కులమతాలకతీతంగా దీన్ని తీర్చిదిద్దారు. కులానికి ప్రాధాన్యం ఇచ్చే ఆస్కారం లేకుండా పాఠశాలలో చేరినప్పుడు గానీ, హాజరు పట్టికలో కానీ కులం అనే అంశాన్ని తీసేశారు. ఈ విద్యా సంస్థలో 25% సీట్లలో పేద విద్యార్థులను చేర్చుకుంటున్నారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఈ పాఠశాలలో మొదట్లో నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు మాత్రమే ఉండేది. “చుట్టు ప్రక్కన చాలా గ్రామాలు ఉన్నాయి. స్టేట్ సిలబస్ కూడా పెట్టి ఫీజులు తగ్గించి అందరినీ చేర్చుకుందాం” అని హీరో విష్ణు బాబు సలహా ఇవ్వడంతో 1వ తరగతి నుండి మొదలుపెట్టారు.

ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్, బీఫార్మసీ, నర్సింగ్, యం.బి.ఏ లాంటి అన్నీ కోర్సులు ఉన్నాయి. వెయ్యి మంది ఉపాధ్యాయులు, అరవై వేల మంది విద్యార్థులతో సరస్వతీ తల్లి కొలువై శోభాయమానంగా వెలుగొందుతుంది. అక్కడ చదివి ప్రతీ విద్యార్థిని వారు కన్నబిడ్డ లాగే చూసుకుంటారు. హైదరాబాదు నగరంలోని పోచారంలో ఓ అంతర్జాతీయ పాఠశాలను ప్రారంభించారు. గాంధీ గారు వ్రాసిన ప్రార్థన గీతమే శ్రీ విద్యానికేతన్ లో ప్రతిధ్వనిస్తుంటుంది. నిజానికి ఇది ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఆ గీతాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ వారు రికార్డ్ చేయించారు. అది మార్కెట్లోకి రాకముందే మొదటగా ఇళయరాజా గారి ద్వారా “శ్రీ విద్యానికేతన్ సంస్థ” పాఠశాలకు ఇవ్వడం విశేషమే అని చెప్పాలి. “ఈ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు జీవితంలో చక్కగా స్థిరపడి తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడమే నాకు కావాల్సింది” అని అంటుంటారు మోహన్ బాబు గారు.


రాజ్యసభ సభ్యునిగా..

నందమూరి తారకరామారావు గారి మీద ఉన్న అభిమానంతో 1983 లో మోహన్ బాబు గారు రాజకీయాలలోకి వచ్చారు. “ఏక గర్భమున మేము జన్మించకపోయినా మేమిద్దరం అన్నదమ్ములమే, వారి ప్రేమ నన్ను ఆకట్టుకుంది వారి ఆవేశమే నన్ను దగ్గర చేసింది” అని ఎన్టీఆర్ గారు అనేవారు. ఆ అభిమానంతోనే మోహన్ బాబు గారిని రాజ్యసభకు పంపించారు. మోహన్ బాబు గారు రాజ్యసభలో తన పదవీకాలాన్ని కొనసాగిస్తున్నప్పుడు 1996 నుండి 1997 వరకు మానవ వనరుల అభివృద్ధి కమిటీ, పట్టణ మరియు గ్రామీణాభివృద్ధిపై కమిటీ మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సలహా కమిటీలో సభ్యుడు గా వున్నారు.

తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత మోహన్ బాబు గారు సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని కొనసాగించారు. తాను శ్రీరాములయ్య అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన బాంబు ప్రేలుడులో 23 మంది మృతి చెందగా, 35 మంది గాయపడటంతో మోహన్ బాబు గారు తృటిలో తప్పించుకున్నారు. మోహన్ బాబు గారు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది నిరుపేద కళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఎంతో దోహదపడ్డారు.

ఎన్టీఆర్ గారి మరణానంతరం మోహన్ బాబు గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాను 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం ప్రచారం కూడా చేశారు. తాను రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనకపోయినా కూడా సమాజంలో జరిగే ఎలాంటి అన్యాయాన్నైనా ప్రశ్నిస్తారు. 2020 వ సంవత్సరం ప్రారంభంలో మోహన్ బాబు గారు తన కుటుంబంతో సహా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గారిని కలుసుకున్నందున భారతీయ జనతా పార్టీలో చేరాలని బిజెపి ఆహ్వానించిందని ఊహాగానాలు తలెత్తాయి.


కుటుంబం..

బిడ్డ ఏడుపు విని ఆకలి తీరుస్తుంది మాతృమూర్తి. కానీ మా అమ్మగారికి పుట్టుచెవుడు. మా మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది, నడక నేర్పింది, నడత నేర్పింది, ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్దచేసింది అని గర్వంగా చెబుతారు మోహన్ బాబు గారు. తాను ముందుగా విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు మంచు విష్ణు , మరియు మంచు లక్ష్మి ప్రసన్న ఉన్నారు. వీరిద్దరు సినీ పరిశ్రమలో నటులు. విద్యాదేవి మరణానంతరం, మోహన్ బాబు గారు విద్యాదేవి చెల్లెలు నిర్మలా దేవిని వివాహం చేసుకున్నారు. ఆమెకు ఒక కుమారుడు మంచు మనోజ్ జన్మించారు. తాను కూడా సినిమా రంగంలో రాణిస్తున్నారు. నిజానికి కుమారులు ఇద్దరిలో విష్ణు బాబు ని ఐపీఎస్ గా చూడాలనుకున్నారు మోహన్ బాబు గారు. మనోజ్ ను సినిమా రంగంలోకి తీసుకువద్దాం అనుకున్నారు. కానీ యాదృచ్ఛికంగా ఇద్దరికీ సినిమారంగమే ఆసక్తిగా మారింది. తెలుగు ప్రేక్షకులు విష్ణు బాబుని, మనోజ్ ని ఇద్దరినీ ఆశీర్వదించారు. ఇక లక్ష్మీప్రసన్న కు పెళ్లయ్యింది, తాను అమెరికాలో స్థిరపడింది.


భక్తవత్సలం నుండి మోహన్ బాబు గా…

దాసరి నారాయణ రావు గారు మోహన్ బాబు గారిని “స్వర్గం నరకం” సినిమాకు ఎంపిక చేసిన తరువాత ఇకనుంచి నీ పేరు “మోహన్ బాబు” అన్నారు. వెంటనే తాను కనకదుర్గమ్మ గుడికి వెళ్లి “అమ్మా ఈరోజు నుంచి నా పేరు మోహన్ బాబు అంట. మా అమ్మ నాన్నలకు కూడా ఈ విషయం చెప్పాలి దీవించమ్మా” అని దండం పెట్టుకున్నారు. నిజానికి మోహన్ బాబు గారి అమ్మ నాన్నలకు పిల్లలు పుట్టి చనిపోతుంటే వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న బత్తినయ్య స్వామికి మొక్కుకున్నారు. ఓ కొండ గుహలో ఆ దేవుని విగ్రహం లింగాకారంలో ఉండేది. అక్కడ ఓ రాత్రి పడుకుంటే పిల్లలు పుడతారని నమ్మకం. మోహన్ బాబు గారు అలా పుట్టిన వాడే కాబట్టి తనకు బత్తెయ్య అని పేరు పెట్టారు. బత్తెయ్య అంటే ఈశ్వరుడు అని అర్థం. దానిని వాళ్ళ నాన్నగారు భక్తవత్సలంగా మార్చారు. ఇది కూడా శంకరుడి పేరే. చిత్రంగా దాసరి గారు పెట్టిన “మోహన్ బాబు” అన్న పేరు కూడా నీలకంఠుడు పేరే. అంతా ఈశ్వరేచ్ఛ అని అంటుంటారు మోహన్ బాబు గారు.

మోహన్ బాబు గారు ఎక్కువగా ఎవ్వరితోనూ బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు పెంచుకోరు. ఎందుకంటే నటనా జీవితంలో అద్భుతంగా నటించినా కూడా నిజ జీవితంలో మాత్రం నటించడం నాకు చేతకాదు అంటారు. తాను గతాన్ని ఎప్పుడూ మర్చిపోరు. తాను సున్నాతో తన జీవితాన్ని ప్రారంభించారు, హీరోగా ఎదిగారు. అద్భుతమైన విజయాలను అందుకున్నారు, ఓటములను చవిచూశారు. సంపాదించింది అంతా పోగొట్టుకున్నారు, జీరోగా మారారు. అయితేనేమి మళ్ళీ నిలబడ్డారు. మూడు రూపాయలు లేక దొంగ బండి ఎక్కి వెళ్ళారు. వందల కోట్ల రూపాయలతో కదంతొక్కారు. ఈరోజు కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉన్నాయి, ఇళ్లు ఉన్నాయి. అయినా సంపాదనకు ఎంత ఉన్నా ఎక్కడో ఒకచోట దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. తనను ఇంతటి వాడిని చేసిన ప్రజలకు కొంతైనా సేవ చేయాలనేది మోహన్ బాబు గారి ఆకాంక్ష.

Show More
Back to top button