
సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) చట్టం కంటే వేగంగా దూసుకుపోతున్నంత కాలం ఆన్లైన్ పైరసీని పూర్తిగా అరికట్టడం అసాధ్యం. ఒక పైరసీ సైట్‌ను అడ్డుకుంటే, మరొకటి పుట్టుకొస్తుంది – ఇది ‘వేక్-ఎ-మోల్’ ఆటలాంటిది. ప్రత్యేకించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమను ముప్పుతిప్పలు పెట్టింది ‘ఐబొమ్మ’ అనే వెబ్సైట్. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే, టికెట్ కొనే స్థోమత లేని ‘పేదల కోసం’ అంటూ హెచ్డీ నాణ్యతతో సినిమాలను ఉచితంగా అందించిన ఈ నిర్వాహకులు తమను తాము డిజిటల్ పరోపకారిగా చిత్రీకరించుకున్నారు.
పోలీసులు, నిర్మాతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా డొమైన్లను నిరంతరం మారుస్తూ, చట్టం తమకు వర్తించదన్నట్టుగా వీరు వ్యవహరించారు. ఈ అంతర్జాతీయ సంస్థల విస్తరణ కేవలం కాపీరైట్ ఉల్లంఘన స్థాయిని దాటి, వ్యవస్థీకృత ఆర్థిక నేరంగా పరిణమించి, చలనచిత్ర పరిశ్రమకు మృత్యుఘాతంలా మారింది. అందుకే ఇటీవల ఐబొమ్మ వెబ్సైట్ ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేయడం తాత్కాలిక విజయమే తప్ప, ఈ పైరసీ సామ్రాజ్యపు వేర్లను పూర్తిగా పెకిలించినట్టు కాదు.
యాంటీ వీడియో పైరసీ సెల్ మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవి, ప్రస్తుతం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం కలిగి ఉండటం ఈ నేరాల అంతర్జాతీయ స్వభావాన్ని తెలియజేస్తుంది. భారతదేశంలో సృజనాత్మక హక్కులను పరిరక్షించడానికి సినిమాటోగ్రఫీ చట్టం, 1952 (సవరణ 2019) ప్రకారం నిర్మాత లిఖితపూర్వక అనుమతి లేకుండా సినిమాను కాపీ చేయడం లేదా ప్రసారం చేయడం తీవ్ర నేరం. నిందితులపై ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), మరియు కాపీరైట్ చట్టం వంటి కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
ఈ పైరసీ నెట్వర్క్ కేవలం కంటెంట్‌ను అప్లోడ్ చేసి వదిలేయడం లేదు. డొమైన్లను నిరంతరం మారుస్తూ, వీపీఎన్‌లు, క్లౌడ్ ఫ్లేర్ హోస్టింగ్ ద్వారా అనామకత్వాన్ని, అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు (క్రిప్టోకరెన్సీ, ఆఫ్ షోర్ బ్యాంకింగ్), మరియు అత్యాధునిక ఎన్క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగించి చట్టం కళ్లుగప్పి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పటిష్టమైన అంతర్జాతీయ నెట్వర్క్ వల్లే సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్డీ నాణ్యతతో కంటెంట్ ఆన్లైన్లో ప్రత్యక్షమవుతోంది.
పైరసీపై ఈ నిరంతర న్యాయ యుద్ధంలో గెలవడానికి కేవలం అరెస్టులు, బ్లాకింగ్లు సరిపోవు, ఒక సమగ్ర, బహుముఖ కార్యాచరణ ప్రణాళిక అవసరం. ఇందులో భాగంగా న్యాయపరమైన సంస్కరణలు చేయాలి మరియు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో కూడిన రాపిడ్ రెస్పాన్స్ సైబర్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలి. నిబంధనలను కఠినతరం చేయడం ద్వారా నిందితుల్లో చట్టం పట్ల భయాన్ని పెంచాలి. కొత్త పైరసీ కంటెంట్‌ను, మిర్రర్ డొమైన్లను ప్రసారం చేసే ప్రయత్నాలను కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ద్వారా తక్షణమే గుర్తించి బ్లాక్ చేయగల జీరో-టాలరెన్స్ వ్యవస్థను అమలు చేయాలి.
ముఖ్యంగా, పైరసీ నెట్వర్క్ ఆర్థిక మూలాలను స్తంభింపజేయడానికి విదేశీ సర్వర్లు, చెల్లింపుల గేట్వేలు, క్రిప్టో లావాదేవీల డేటాను పంచుకోవడానికి ఇంటర్‌పోల్ సహకారాన్ని, అంతర్జాతీయ సైబర్ ఏజెన్సీలతో ఒప్పందాలను పటిష్టం చేయాలి. సృజనాత్మక హక్కుల విలువపై ప్రజల్లో చైతన్యాన్ని పెంచాలి. ఈ సంక్లిష్ట సమస్యను ఎదుర్కోవడానికి సినీ పరిశ్రమ, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, న్యాయ వ్యవస్థ కలిసికట్టుగా పోరాడాలి. ఈ డిజిటల్ మాఫియాను ప్రతి స్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.










