
సినిమా అనేది మూడక్షరాల పదమే, కానీ అది ఇవాళ మన జీవితంలో ఒక విడదీయరాని భాగం అయ్యింది. మనల్ని, మన మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మాధ్యమం సినిమా నిలిచిపోయింది. సినిమా అనేది ఒక గొప్ప కల్పన, ఎందరికో ఉపాధి కల్పన. సినిమా మామూలు మనుషుల నుండి మహా మహా గొప్ప వాళ్ళ వరకు అతి గొప్ప వినోద సాధనం. అది ఎందరో మహానుభావుల అవిశ్రాంత కృషితో ఈ తరానికి అందించిన బహుమానం కూడా. అందుకే సినిమా మార్గదర్శకులకు ఇప్పటివారు ఎంతో ఋణపడి ఉండాల్సిన అవసరం ఉంది. మన దేశపు తొలి మూగ సినిమా “పుండలీక్” (1912) ను, మరాఠీ భక్తిరస నాటక ప్రదర్శనను యధాతథంగా ఫిలిం పైకి ఎక్కించి పౌరాణిక చిత్రంగా నిర్మించి 18 మే 1912 నాడు బొంబాయి లోని కొరొనేషన్ సినిమాటోగ్రాఫ్ హాలులో విడుదల చేశారు.
ఆ తరువాత 03 మే 1913 శనివారం నాడు పూర్తి నిడివి గల భారతీయ మూగ సినిమా “రాజా హరిశ్చంద్ర” ను తెరకెక్కించిన “దాదా సాహెబ్ ఫాల్కే”, ఆ చిత్రాన్ని బొంబాయిలోని కొరొనేషన్ సినిమాటోగ్రాఫ్ హాలులో వాణిజ్యపరంగా విడుదల చేశారు. అప్పటి సినిమాల లాగా ఒకటి రెండు రోజులు కాకుండా, రికార్డు స్థాయిలో ఏకంగా 23 రోజులు ఆ సినిమా ప్రదర్శింపబడడమే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి విజయం సాధించింది. అలా తన చిరకాల స్వప్నాన్ని సఫలం చేసుకొని భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమకు ప్రాణం పోశారు “దాదా సాహెబ్ ఫాల్కే”. ఆయన “రాజా హరిశ్చంద్ర” సినిమాతో సరికొత్త సినీ మాధ్యమానికి భారతీయ వ్యాకరణ సూత్రాలను సిద్ధం చేశారు. ఈ సినిమాను చూసిన జనాలను సమ్మోహితులను చేయడమే కాకుండా, ఆడిన మాట తప్పకుండా సత్యానికి కట్టుబడ్డ హరిశ్చంద్ర చక్రవర్తి గాథను ఆయన తెరకెక్కించడంతో అది వెండితెరపై అఖండ విజయం సాధించింది. ఇది భారతదేశంలో తయారైన పూర్తినిడివి గల తొలి మూకీ కథనాత్మక చిత్రంగా ఖ్యాతి దక్కించుకుంది.
భారతీయ పురాణ గాథలకు ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పౌరాణిక గాథలను అత్యధికంగా వెండితెరకెక్కించిన ఘనత కచ్చితంగా తెలుగు వారిదే. ఈ విషయాన్ని ప్రతీ తెలుగువాడు గర్వంగా చెప్పుకుంటాడు. పౌరాణిక గాథలను తెరకెక్కించాలంటే కేవలం తెలుగు వారికి మాత్రమే సాధ్యం అని అనిపించుకున్న ఘనత కూడా తెలుగు చిత్రసీమదే. “మాయాబజార్” లాంటి పౌరాణిక చిత్రాల వలన మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో జయకేతనం ఎగురవేసిన సంగతి మన తెలుగువారు ఎప్పటికీ మర్చిపోరు. తెలుగు సినిమాలు పౌరాణిక గాథల రూపకల్పనతోనే మొదలయ్యాయి. అంతెందుకు భారతీయ చలనచిత్ర పితామహులుగా కీర్తింపబడే “దాదాసాహెబ్ ఫాల్కే” కూడా తన తొలి మూగ సినిమా పురాణ కథ హరిశ్చంద్ర తోనే భారతీయ తొలి సినిమా “రాజా హరిశ్చంద్ర” నిర్మించారు.
అప్పటికే హాలీవుడ్ తరహాలో చిత్రాలను అధ్యయనం చేసిన మన తెలుగువాడు “రఘుపతి వెంకయ్య” కూడా ప్రారంభంలో పౌరాణిక కథలతోనే మూగ చిత్రం నిర్మించారు. పరదేశీయులు, హాలీవుడ్ చిత్రాలకు బైబిల్ కథలను కథాంశాలుగా ఎన్నుకున్నట్టే, తెలుగు దర్శక నిర్మాతలు ప్రారంభంలో భాగవత, రామాయణ, మహాభారత గాథల్లోని ఇతివృత్తాలతో సినిమాలను నిర్మించారు. శబ్ద చిత్రాలు మొదలైన తొలి రోజులలో తెలుగు సినిమాపై నాటకాల ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రేక్షకులు ఎరుగని ఇతివృత్తాలతో సినిమాల తీసి, నాటకాల నుండి ప్రేక్షకుల దృష్టిని మళ్లించడం ఆ రోజుల్లో చాలా కష్టం. అందుకే ఆనాటి దర్శకులు పౌరాణిక నాటకాలనే సినిమాలుగా తీసి తెలుగు సినిమా ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాను రాను కాలగమనంలో క్రమక్రమంగా తెలుగు పౌరాణికాలు, నాటకాల ప్రభావం నుంచి బయటపడి తమ అస్తత్వాన్ని స్థిరపరచుకున్నాయి. అయితే పౌరాణిక సినిమా వైభవం కేవలం మూడు దశాబ్దాల పాటు మాత్రమే విరాజిల్లింది. ఆ తరువాత పౌరాణికాలు అసంఖ్యాకంగా వచ్చిన సాంఘిక చిత్రాలతో పోటీ పడలేకపోయాయి.
తెలుగు తొలి పౌరాణికం “భక్త ప్రహ్లాద” (1932)…
భారతీయ తొలి శబ్ద చిత్రం ఆలం ఆరా 1931 లో విడుదలైంది. అలాగే తెలుగులో “భక్త ప్రహ్లాద” చిత్రం 06 ఫిబ్రవరి 1932 లో విడుదలై విజయం సాధించింది. తెలుగులో తొలి శబ్ద చిత్రంగా విడుదలైన ఈ చిత్రానికి హనుమప్ప మునియప్ప రెడ్డి (హెచ్.ఎం.రెడ్డి) దర్శకత్వం వహించారు. ఆయన సురభి నాటక సమాజం కళాకారులను ఆనాటి బొంబాయికి తీసుకెళ్లి “భక్త ప్రహ్లాద” నాటకాన్ని సినిమాగా చిత్రీకరించి విడుదల చేశారు. బొంబాయిలోని దాదర్ లో ఉన్న ఇంపీరియల్ స్టూడియోలో 20 వేల రూపాయల వ్యయంతో కేవలం 20 రోజుల్లో ఆ చిత్రం తయారుచేయడం అప్పట్లో చెప్పుకోదగ్గ విషయం. ఆ తరువాత బొంబాయికి చెందిన సాగర్ స్టూడియోస్ పతాకం వారు “శ్రీ రామ పాదుకా పట్టాభిషేకం” (1932), శకుంతల (1932) నాటకాలను సర్వోత్తం బాదామి దర్శకత్వంలో చిత్రాలుగా నిర్మించి విడుదల చేశారు. ఈ రెండు చిత్రాలను ప్రేక్షకులు సమాదరించారు. అదే సంవత్సరం కలకత్తాలో ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ ఏర్పడి తెలుగుతో పాటు బెంగాలీ, తమిళ చిత్రాల నిర్మాణం చేపట్టింది. మరోవైపు సరస్వతీ సినీటోన్ స్థాపించిన తెలుగు వారు, స్థానికంగా వారే పెట్టుబడి పెట్టి తీసిన తొలి తెలుగు సినిమా పృథ్వీపుత్ర (1933). విజయవాడకు చెందిన దర్శకులు పోతిన శ్రీనివాసరావు 1933 లో నాటక కళాకారులు కళ్యాణం రఘురామయ్య, పారెపల్లి సత్యనారాయణ, సురభి కమలాభాయి మొదలగు వారిని బొంబాయి తీసుకెళ్ళి నరకాసురుని వధ ఇతివృత్తం ఆధారంగా “పృథ్వీపుత్ర” చిత్రం తీశారు. ఇది తెలుగువారి పెట్టుబడితో తయారైన తొలి సినిమాగా చెప్పుకోవచ్చు.
1933 నుండి 1938 వరకు పౌరాణిక సినిమాలే…
అలాగే 1933 వ సంవత్సరంలో “సతీసావిత్రి” పేరుతో రెండు చిత్రాలు పోటా పోటీగా నిర్మాణం చేయబడ్డాయి. ఈ రెండు చిత్రాలను తూర్పు ఇండియా ఫిల్మ్ కంపెనీ నిర్మాణంలో నిర్మించబడినవే. ఒకటి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కగా, మరో సినిమాకి పుల్లయ్య దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలలో పుల్లయ్య దర్శకత్వం వహించిన చిత్రం విజయం సాధించింది. 1934 లో ఈస్టిండియా ఫిలిం కంపెనీ పతాకంపై మోతీలాల్ ఛబ్రియా నిర్మాతగా సి. పుల్లయ్య దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “లవకుశ” (1934), రామాయణం కథ నుండి కొచ్చర్లకోట రంగారావు దర్శకత్వంలో తెరకెక్కిన అహల్య (1934), చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన సీతాకళ్యాణం (1934), రాధ ఫిల్మ్ కంపెనీ వారు కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వంలో నిర్మించిన “భక్త కుచేల” (1935), మదన్ థియేటర్స్ వారి శ్రీకృష్ణ తులాభారం (1935), వేల్ పిక్చర్స్ నిర్మాణంలో శ్రీకృష్ణ లీలలు (1935), భరణీ పిక్చర్స్ పతాకంపై దాసరి కోటిరత్నం నిర్మించిన “సక్కుబాయి” (1935), అరోరా ఫిల్మ్స్ పతాకం పై దాసరి కోటిరత్నం నిర్మించిన సతీ అనసూయ (1935), స్టార్ కంబైన్స్ వారు నిర్మించిన “హరిశ్చంద్ర” (1935) లాంటి పౌరాణికాలు విడుదలయ్యాయి.
“మాలపిల్ల” (1938) వరకు కొనసాగిన పౌరాణికాల హవా..
అలాగే 1936 లో ద్రౌపదీ మానసంరక్షణం, ద్రౌపదీ వస్త్రాపహరణం, ధృవవిజయం, ప్రేమవిజయం, భక్త కబీరు, మాయాబజార్, లంకాదహనం, వీరాభిమన్యు, సంపూర్ణ రామాయణం, సతీ అనసూయ, సతీ తులసి, సతీ సులోచన మొదలగు పౌరాణిక తెలుగు చిత్రాలు నిర్మించాబడ్డాయి. అందులో దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి చలనచిత్ర స్టూడియో “దుర్గా సినీటోన్” (1936) ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో స్థాపించిన నిడమర్తి సూర్యయ్య నిర్మించిన సంపూర్ణ రామాయణం (1936) చిత్రం తెలుగు గడ్డపై తయారైన తొలి చిత్రంగా సినిమా చరిత్రలో చోటు సంపాదించుకుంది. ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది మానస సంరక్షణము చిత్రాలు పోటాపోటీగా తయారవ్వగా వాటిలో ద్రౌపది వస్త్రాపహరణం విజయం సాధించింది. 1936 వ సంవత్సరంలో విడుదలైన తొలి సాంఘిక చిత్రం “ప్రేమ విజయం” సినిమాకు ప్రేక్షకులను అంతగా అలరించకపోవడంతో సాంఘిక చిత్రాల జోలికి వెళ్లడానికి నిర్మాతలు ఎవ్వరూ సాసించలేదు. ఇలా 1938 లో సారధి ఫిలిమ్స్ నిర్మాణంలో గూడవల్లి రామబ్రహ్మం “మాలపిల్ల” చిత్రం తెరకెక్కేవరకు పౌరాణిక చిత్రాల హవా కొనసాగింది.
పౌరాణిక చిత్రాలకు సమాంతరంగా సాంఘిక చిత్రాలు..
మాలపిల్ల (1938) సినిమా మంచి విజయం సాధించడంతో 1940 వ దశకంలో పౌరాణిక చిత్రాలకు సమాంతరంగా సాంఘిక చిత్రాలు వచ్చాయి. దాంతో పౌరాణిక చిత్రాలకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గకపోయినప్పటికీ పౌరాణిక చిత్రాలు సాంఘిక, జానపద చిత్రాలతో పోటీపడాల్సి వచ్చేది. అయితే రంగస్థలం కళాకారులతో సినిమాలు తీయడం ఆపేసి, సినిమాని నమ్ముకుని వచ్చిన కళాకారులతో పౌరాణికాలు తీయడం మొదలైంది. కానీ సినిమా మాత్రం నాటక ధోరణిలను వదులుకోలేకపోయింది. 1950 వ దశకంలో వచ్చిన “మల్లీశ్వరి” (1951) సినిమా సంగీత పరంగా, పాటలు అద్భుతంగా రావడంతో, సినిమా ప్రేక్షకులకు సినిమా పాటల మీద మోజు పెరిగింది. దీనిని పరిగణలోకి తీసుకుని దర్శక, నిర్మాతలు సినిమాలో పద్యాల సంఖ్య తగ్గించి, పాటలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు.
అంతే కాకుండా శాస్త్రీయ సంగీతానికి అంతకుముందు సినిమాపై ఉన్న పాత్ర క్రమక్రమంగా తరలిపోయింది. పౌరాణిక చిత్రాలకు కూడా ఇది తప్పలేదు. 1950 వ దశకం ద్వితీయార్థంలో పౌరాణిక సినిమా నాటక చక్రం నుంచి బయటపడింది. పౌరాణిక చిత్రాల అలంకరణ, సెట్స్ నిర్మాణం, నటనల్లో మార్పు రావడమే కాకుండా పౌరాణిక పాత్రలు అద్భుతంగా పోషించగల నటీనటులు పరిశ్రమలలోకి ప్రవేశించారు. సంభాషణ రచనలో కూడా నాటక ధోరణి పోయి వ్యవహారిక భాషను ఉపయోగించడం ఎక్కువైంది. అంతకుముందు నాటక కథలతో రూపొందిన చిత్రాలు “భూకైలాస్”, “దీపావళి”, “లవకుశ”, “నర్తనశాల” మొదలగు సినిమాలు కొత్త కథలతో, సరికొత్త సాంకేతిక నైపుణ్యంతో తిరిగి నిర్మితమై ఘనవిజయం సాధించాయి.
ఆణిముత్యాల్లాంటి సినిమాల ముందు నిలబడని పౌరాణికాలు…
ఇకపోతే 1960 దశకంలో పౌరాణిక చిత్రాల సంఖ్య బాగా తగ్గి ఆణిముత్యాల్లాంటి సినిమాలు వచ్చాయి. ఈ పది సంవత్సరాల కాలంలో “శ్రీ వెంకటేశ్వర మహత్యం” (1960), “సీతారామ కళ్యాణం” (1961), “దక్షయజ్ఞం” (1962), “భీష్మ (1962)”, “శ్రీకృష్ణార్జున యుద్ధం” (1963), “నర్తనశాల” (1963), “పాండవ వనవాసం” (1965), “వీరాభిమన్యు” (1965), “ప్రమీలార్జునీయం” (1965), “శ్రీకృష్ణ పాండవీయం” (1966), “శ్రీకృష్ణావతారం” (1967), “భక్త ప్రహ్లాద” (1967), “వీరాంజనేయ” (1968) వంటి చిత్రాలు విడుదలై విజయం సాధించాయి. ఇకపోతే 1970 నుంచి 2000 మధ్య కాలంలో పౌరాణిక చిత్రాల సంఖ్య ఊహించనంతగా పడిపోయింది. ఈ సంవత్సరాల మధ్య కాలంలో కనీసం 30 పౌరాణిక చిత్రాలు కూడా లేవన్నది కఠోర సత్యం. వచ్చిన పౌరాణిక చిత్రాలలో ప్రజాదరణ పొందిన చిత్రాలు కూడా చాలా తక్కువనే. వాటిల్లో “శ్రీకృష్ణసత్య” (1971), “సంపూర్ణ రామాయణం” (1972), “బాలభారతం” (1972), “యశోద కృష్ణ” (1975), “సీతా కళ్యాణం” (1976), “దానవీరశూరకర్ణ” (1977), “కురుక్షేత్రం” (1977), “శ్రీరామ పట్టాభిషేకం” (1978), “శ్రీమద్విరాటపర్వం” (1979), “ఏకలవ్య” (1982), “బ్రహ్మర్షి విశ్వామిత్ర” (1991), “శ్రీకృష్ణార్జున విజయం” (1996), “రామాయణం” (1997) లాంటి మాత్రమే చెప్పుకోదగ్గ పారాణిక చిత్రాలు.
1970 – 2000 మధ్య గణణీయంగా తగ్గిన పౌరాణికాలు…
1970 – 2000 మధ్య కాలంలో పారాణిక చిత్రాల జయప్రజయాల విషయం పక్కనబెడితే ప్రముఖ దర్శకులు బాపు తెరకెక్కించిన “సంపూర్ణ రామాయణం” (1972), “సీతా కళ్యాణం” (1976), సి.హెచ్. ప్రకాశరావు నిర్మాణంలో కమలాకర కామేశ్వరరావు బాల నటినటులతో తెరకెక్కించిన “బాల భారతము” (1972) మాత్రమే వైవిధ్యం గల చిత్రంగా పేరుపొందింది. సాంకేతికంగా అట్టహాసంతో మాధవి పద్మాలయ కంబైన్స్ పతాకంపై తీసిన “కురుక్షేత్రం” (1977) చిత్రం, అదే ఏడాది ఎన్టీరామారావు దర్శకత్వంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన “దాన వీర శూర కర్ణ (1977) మందు నిలబడలేకపోయింది. 1970 వ దశకం కాలంలో అలంకరణాట్టహాసం తీవ్రరూపం దాల్చింది. దాన వీర శూర కర్ణ సినిమాలో అలంకరణాట్టహాసానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. చివరికి బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991) సినిమాకు కూడా ఈ అట్టహాసం తప్పలేదు.
ఈ కాలంలో 1970 – 1999 సంవత్సరాలలో తీసిన పౌరాణిక చిత్రాలు మరియు జానపద చిత్రాలలో స్టంట్ ధోరణి కూడా చోటుచేసుకున్నాయ. అలాగే 1990 దశకంలో “శ్రీకృష్ణార్జున విజయం” (1996) పరాజయం పాలైతే, బాల నటులతో మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మాతగా, గుణశేఖర్ దర్శకత్వంలో తీసిన “బాలల రామాయణం” పర్వాలేదనిపించుకుంది. ఈనాడు పౌరాణిక చిత్రాలు తీయమంటే దుస్సహాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పౌరాణిక పాత్రలు చేయగల నటీనటులు సాంకేతిక నిపుణులు కరువయ్యారు. ప్రజలకు పురాణ గాథల్ని తెలుసుకోవడానికి ఎన్నో కల్పనలు, కథలు, పుస్తకాలు ఉన్నప్పటికీ సినిమా అనేది ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఉంది. కానీ పౌరాణిక చిత్రాలు లేని ఈ తరానికి ఆ అవకాశమే లేకుండా పోయిందని చెప్పవచ్చు.
పౌరాణిక చిత్రాల పట్ల ఆసక్తి తగ్గడానికి గల కారణం…
సినిమా పుట్టిన తొలినాళ్ళలో కొత్తతరం ప్రేక్షకులకు, కాలానుగుణంగా మారుతూ వస్తున్న ప్రేక్షకులు అభిరుచి, అంతరాలు, అంచనాలు కూడా సినిమా ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకోవడానికి దోహదపడుతుంది. శబ్ద చిత్రాలు మొదలైన (1930 దశకంలో) తొలి తరం ప్రేక్షకులకు పురాణాల పట్ల, పురాణ పురుషుల పట్ల ఉన్న భక్తి భావం ఆ తరువాత తరాల ప్రేక్షకులకు క్రమక్రమంగా తగ్గిపోవడం కూడా దశాబ్ద, దశాబ్దానికి మధ్య పౌరాణిక చిత్రాల సంఖ్య తగ్గడంలో ప్రధాన పాత్ర వహించింది. అలాగే పౌరాణిక గాథలని సమగ్రంగా చర్చించడానికి నేటి సినిమా నిడివి కూడా సరిపోదు. కానీ అంతకంటే ఎక్కువ నిడివితో పౌరాణిక గాథల చిత్రాలను రూపొందిస్తే వాటిని చూసే సహనం ప్రేక్షకులకు ఉంటుందా, ఉండదా అనేది కూడా చిక్కువీడని ప్రశ్ననే. అదేవిధంగా ప్రత్యేకించి పౌరాణిక గాథల పట్ల ఆసక్తి మరియు సాధికారత ఉన్న కళాకారులు, దర్శకులు కూడా నేటి తరంలో లేకపోవడం, మారిన ప్రేక్షకుల అభిరుచి, సహజత్వం ఉన్న చిత్రాలకు లభించే ఆదరణ కాల్పనిక గాథలకు లేకపోవడం, ప్రత్యక్ష పౌరాణిక చిత్రాల రూపకల్పనకు అవసరమయ్యే ఖర్చు ఇవన్నీ కూడా పౌరాణిక చిత్రాలు నిర్మించడానికి ప్రధాన అవరోధంగా మారిపోయింది. ఇవన్నీ కలిసి నేడు పౌరాణిక సినిమా అనేది కేవలం ఒక గతంగా మిగిలిపోవడానికి కారణమయ్యాయి.
పౌరాణిక పాత్ర పోషణలో తండ్రికి తగ్గ తనయుడు బాలకృష్ణ..
నేటి తెలుగు సినిమా దర్శక, నిర్మాతలు నేరుగా పౌరాణికాలను నిర్మించకపోయినా, సాంఘిక చిత్రాల్లో పౌరాణిక పాత్రలను ప్రవేశపెట్టి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. “బుద్ధిమంతుడు” (1969), దేవుడి దిగి వస్తే (1975) చిత్రాల్లో కృష్ణుడు పాత్రలో, మా ఊళ్లో మహా శివుడు (1979) చిత్రంలో శివుడి పాత్రలో, “వెంకన్న బాబు” (1992) చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రలో సాంఘిక చిత్రాలలో నటులు కనిపించి ప్రేక్షకులని అలరించారు. ఇకపొతే ఎన్నో సాంఘిక చిత్రాలలో యముడి పాత్ర కనిపించి వాణిజ్యపరంగా విజయం పొందిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. పౌరాణిక అంశాలను మిళితం చేసి సాంకేతిక చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకులు ఎందరో ఉన్నారు. రామాయణం చిత్రం విడుదలైన తరువాత ఈ మధ్య కాలంలో మరో రెండు పౌరాణిక చిత్రాలు విడుదలయ్యాయి. ఆ రెండింటిలోనూ బాలకృష్ణ కథానాయకుడు కావడం విశేషం. ఆ రెండు చిత్రాలలో ఒకటి పాండురంగడు (2008), రెండోది “శ్రీరామరాజ్యం” (20 11). గతంలో నందమూరి తారకరామారావు నటించిన “పాండురంగ మహత్యం” (1957), “లవకుశ” (1963) చిత్రాలకు కొత్త హంగులు దిద్ది రూపొందించారు. తండ్రి ఎన్టీఆర్ నటనని వారసత్వంగా పొందిన బాలకృష్ణ ఈ రెండు చిత్రాలలో పౌరాణిక పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.
పౌరాణిక చిత్రాలను పోలిన సాంఘిక చిత్రాలు…
పౌరాణిక చిత్రాలే కాకుండా పౌరాణిక చిత్రాలను పోలిన సాంఘిక చిత్రాలు కూడా నిర్మితమైనవి ఉన్నాయి. ఉత్తర రామాయణాన్ని పోలిన కథలతో “ముత్యాలముగ్గు” (1975), కర్ణుని కథ ఆధారంగా “కటకటాల రుద్రయ్య” (1978), భారత గాథని తలపించే కలియుగ మహాభారతం (1979), మన ఊరి పాండవులు (1978) చిత్రాలు రూపుదిద్దుకుని ప్రేక్షకులు విపరీతంగా అలరించాయి. అయితే ప్రస్తుతం యువతరం, కొత్త రక్తం తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతోంది. తెలుగు సినిమా మార్కెట్ పరిధి కూడా విస్తృతంగా పెరిగిపోయింది. తెలుగు సినిమా రంగం, ప్రపంచం సినిమా రంగంలో ఓ వెలుగు వెలుగుతూ, హాలీవుడ్ తో సరితూ గల స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. అందుకే తెలుగువారి గర్వకారణంగా నిలిచిన మన పురాణ గాథలను ఈనాటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు కూడా తెరకెక్కిస్తే, ఈతరం ప్రేక్షకులకు కూడా మన పురాణాల పట్ల మంచి అవగాహన ఏర్పడుతుందని చెప్పవచ్చు. పౌరాణికాలు తెలుగు వారి సొత్తు అని మనం మరొకసారి గర్వంగా చెప్పుకునే నాటి వైభవం పునారావృతం అవుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.










