
ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అద్బుత సెంటిమెంట్ రాజకీయ నాయకులకు ఆయుధంగా మారింది. గెలవగానే మంత్రి పదవి ఇస్తామని తమ అభ్యర్థులకు ప్రధాన రాజకీయ పార్టీలు వల వేస్తున్నాయి. కొన్నేళ్లుగా ఈ సెంటిమెంట్ బందరు నియోజకవర్గంలో కొనసాగుతూ వస్తోంది.
1999లో నడకుదుటి నరసింహారావు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆయనకు చంద్రబాబు మంత్రి వర్గంలో మత్స్యశాఖ మంత్రి పదవి దక్కింది. 2004, 2009 ఎన్నికల్లో పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మంత్రి పదవి రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో ఆయనకు విప్ పదవి లభించింది. తెలంగాణ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గెలిచారు.
ఆయనకు మంత్రి పదవి లభించింది. 2019 ఎన్నికల్లో కొల్లు రవీంద్రపై వైసీపీ అభ్యర్థి పేర్ని నాని గెలిచి మంత్రి పదవిని పొందారు. ముఖ్యంగా 1999 నుంచి బందరు కోటలో కాపు , పల్లెకారు నేతల మధ్యనే పోటీ నడుస్తోంది. ఈ వర్గాలకు మంత్రి పదవులు అనూహ్యంగా దక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు.
ఆయన గెలిస్తే మంత్రి పదవి వస్తుందా అన్నది డౌటే. మరోవైపు టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గెలిస్తే మరోసారి మంత్రి పదవి ఖాయమని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. మరి బందరులో సెంటిమెంట్ వర్కవుటై గెలిచిన నేతకు మంత్రి పదవి వస్తుందో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.