Telugu Opinion Specials

మగాడు ఏడవకుండా సంకెళ్లు ఎందుకు? భావోద్వేగాలను అణచివేయడం ప్రమాదమా?

మగాడు ఏడవకుండా సంకెళ్లు ఎందుకు? భావోద్వేగాలు అణచడం ఎందుకు ప్రమాదకరం? నిత్య జీవితంలో సుఖాలు, దు:ఖాలు, నవ్వు,  ఏడుపు ప్రతీ ఒక్కరి జీవితంలో సర్వసాధారణం అయిపోయాయి.  భావోద్వేగాలకు అనుగుణంగా మనిషి నవ్వుతాడు, ఏడుస్తాడు, ఆనందిస్తాడు, బాధపడతాడు. తాను సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాడు, తనకు బాధైనప్పుడు ఏడుస్తాడు. అయితే మనిషి మనసును నవ్వు తేలిక పరిస్తే, తన ఏడుపు మాత్రం మనసులోని దుఃఖాన్ని బయటకు పంపుతుంది. మనిషి ఏడ్చిన తరువాత శరీరంలోని మెదడు మరియు నాడీ వ్యవస్థ ఉత్పత్తి చేసే సహజ రసాయనాలు లేదా హార్మోన్లు అయిన ఎండార్ఫిన్లు శారీరక, భావోద్వేగ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఆ హార్మోన్లు ఏడుపు నొప్పిని తగ్గించుకోవడానికి సహాయపడతాయి. అలాగే ఏడుపు విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే ఎవరైనా నొప్పితో బాధపడుతూ ఏడుస్తుంటే వారిని ఆపవద్దు అంటుంటారు. ఎవ్వరైనా ఏడుస్తుంటే ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. మనిషి మనసులోని ఆలోచనలు, బాధలు ఎంత ఎక్కువగా ఉంటే అంత నిద్ర కూడా అంత తక్కువగా  వస్తుంది. బాధలు మనసును ఛిద్రం చేసి నిద్రపట్టకుండా చేస్తాయి. కానీ ఏడుపు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడుతుంది.

మనిషికి బాధ కలిగినప్పుడు ఏడవడం సాధారణమే, కానీ ఆ ఏడుపును ఆపుకోవడం మాత్రం చాలా కష్టమైన పని. నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగవాడిని నమ్మకూడదని అంటారు. అందుకేనేమో మగవారు ఏడవడానికి సిగ్గుపడుతుంటారు. మగవారు ఏడవకూడదని ఆడవాళ్లే ఏడవాలని అంటుంటారు. మగవారైనా, ఆడవారైనా బాధ వచ్చినప్పుడు కళ్లల్లోంచి కన్నీళ్లు రావడం సహజం. అయితే మగవానికి బాధ వచ్చినప్పుడు, ఒత్తిడి కలిగినప్పుడు, కన్నీళ్లను దిగమింగుకుని, దుఃఖాన్ని ఆపుకుని బయటకు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఎందుకంటే తాను మగాడు కాబట్టి.

సమాజం తన ఏడుపును చూసి తాను బలహీననుడు అనుకుంటారని, కన్నీళ్లు కళ్ళను దాటకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. సాధారణ మగాడి దగ్గరి నుండి ప్రపంచంలో అత్యంత మేధావుల వరకు కూడా ఇదే పరిస్థితి. ఆస్ట్రియన్ నరాలు మరియు కండరాల సంబంధిత వ్యాధుల నిపుణులు మరియు మనోవిశ్లేషణ వ్యవస్థాపకుడు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది, ప్రకృతి శాస్త్రవేత్తగా, భూగర్భ శాస్త్రవేత్తగా, జీవ శాస్త్రవేత్తగా, రచయితగా ప్రసిద్ధులు అయిన చార్లెస్ డార్విన్ మొదలగు వారందరూ అంతర్గతంగా ఏడుపును, బాధను దాచిపెట్టిన వారే. అసలు మగాడు ఎందుకు ఏడవకూడదు? ఏడవకపోవడం వలన కలిగే నష్టాలు ఏమి? ఏడవకుండా తనలో ఒత్తిడిని అనుభవిస్తే ఏమవుతుంది?

ప్రపంచంలో అత్యంత ఒంటరి జీవి మగాడు…

శారీరక బలంతో ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించి కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం పురుషుని లక్షణం. తన కుటుంబ బాధ్యత తీసుకోవడం, తన సమూహాన్ని రక్షించడం కోసం తన భావోద్వేగాలను సమన్వయ పరుచుకుంటూ, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం,  పోటీతత్వం ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం, అనుకున్న లక్ష్యాలను సాధించడంలో చొరవ చూపడం మగవాని లక్షణాలు, మగతనానికి నిదర్శనాలు. అంటే మగాడు ఏడవడు, మగాడికి బాధ కలిగినా చెప్పడు, మగాడు కూలిపోతున్నా కూడా నిటారుగా నిలుచుంటాడు, మగాడు ఏ ఒక్కడిని సహాయం అడగడు. అంటే ఇవన్నీ మగాడికి నియమాలు కాదు, సంకెళ్లు. ఆ సంకెళ్లు బంగారంతో చేసినట్టే కనిపిస్తాయి. అందువలన మగాళ్లు ఆ సంకెళ్ళను గర్వంగా ధరిస్తారు. ఈ ప్రపంచంలో అత్యంత ఒంటరి జీవి ఎవరైనా ఉన్నారు అంటే అది మగాడు మాత్రమే. తాను చావు బ్రతుకులో ఉండి కూడా తనకు ఏమి కాలేదు అని చెప్పుకునేది కేవలం మగాడు మాత్రమే. అతనికి నొప్పి అనేది తెలుసు, కానీ దానిని తన బలహీనత అనుకుంటాడు, నిజానికి అది తప్పు. అతనికి భయం అనేది కూడా తెలుసు. కానీ దానిని పిరికితనం అని తప్పుగా నేర్చుకుంటాడు. ప్రకృతిలో అందరిలాగే అతనికి కూడా ప్రేమ కావాలి, కానీ తనకి ప్రేమ కావాలి అని తాను అడగడం తనకు గొప్పతనం కాదు అని తాను నేర్చుకున్నాడు.

ఒత్తిడిని వ్యక్తపరచకపోవడమే గుండె పోటుకు కారణం…

అయితే మగాడు నేర్చుకున్న ఈ తప్పుడు పాఠాలు అన్నీ కూడా ఎవరు నేర్పారు అనే సందేహం రావచ్చు. ఎవరో కాదు ఆ మగాడి తండ్రే అతనికి ఈ తప్పుడు పాఠాలు నేర్పించాడు. ఆ తండ్రికి వాళ్ళ తండ్రి తప్పుడు పాఠాలు నేర్పించాడు. అలాగే అవే తప్పుడు పాఠాలు ఈ సమాజం నేర్పింది. అలాగే తరతరాల నుండి తనకు సినిమా నేర్పింది. తాను చదువుకున్న చదువు నేర్పింది. అయితే అలా తప్పుడు పాఠాలు నేర్చుకోవడం వలన అవి ఆచరిస్తున్న కారణంగా మగాళ్లు గుండెపోటుతో చస్తున్నారు. ఎందువలన అనగా మగ జీవితం  తన ఒత్తిడిని వ్యక్తపరచకూడదు. గుండె పోటుకు అదే కారణం.

నిజానికి ఆడవారి కంటే మగాళ్లు ఎక్కువగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అదే. ప్రపంచంలోని అన్ని దేశాలలో వున్న ఆడవారి కంటే, మగవారు ఆత్మహత్య చేసుకోవడంలో నాలుగు శాతం ఎక్కువగానే ఉంటున్నారు. ఎందుకంటే మగవారు సహాయం అడగరు. మగవారు బాధను పంచుకోరు. మగాళ్లు తమ బాధ ఉపశమనం కోసం చికిత్సకి వెళ్లరు. ఎందుకంటే తనకు ఏ సమస్య లేదు అని తనను తాను నమ్మించుకుంటాడు. ఈ సమస్య అనేది కేవలం సాధారణమైన మగాళ్లది మాత్రమే మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అత్యంత తెలివైన మనస్తత్వం గల వారికి కూడా వర్తిస్తుంది. అలాంటి తెలివైన వాళ్ళు మానవుల బాధలు, వేదనలు, ఇబ్బందుల గురించి, భావోద్వేగాలు గురించి బంధాల గురించి సంపుటి (పుస్తకం) వ్రాశారు. కానీ వారు తన సొంత నొప్పి గురించి బయటకు మాట్లాడలేకపోయారు.

భావోద్వేగాలను అణచివేయడం ప్రమాదమా?

ఎంత మేథావైనా పురుషత్వ పరిస్థితిని దాటడం అంత సులువు కాదు. దానికి మంచి ఉదాహరణ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేవాడు మనుషుల అపస్మారక స్థితిని ఆసరాగా చేసుకుని తన బాధను తాను దాచుకున్న మనిషి అతను. తాను చెప్పిన మనస్తత్వశాస్త్రం మొత్తం కూడా వ్యక్తపరచలేని భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. అతను వ్యక్తపరచలేని భావోద్వేగాల గురించే వ్రాశారు. మనం బాధలను అణచివేస్తే అవి రోగ లక్షణాలుగా బయటకు వస్తాయని చెప్పారు. కానీ మగతనం గురించి సమాజం లేదా సంస్కృతి రూపొందించిన నియమాలను అనుసరించి సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మనస్తత్వశాస్త్రానికి తనే కట్టుబడి లేరు.

ఫ్రాయిడ్ కి “జా” క్యాన్సర్ వచ్చింది. 33 శస్త్రచికిత్సలు జరిగాయి. దాదాపుగా పదహారు సంవత్సరాలు ఆ నొప్పితోనే బ్రతికారు. అతని “జా” ను దాదాపు పూర్తిగా తొలగించేశారు. దాని స్థానంలో కొత్త “జా” పెట్టారు. దానిని తీయడం, తిరిగి పెట్టడం విపరీతమైన నొప్పిగా ఉండేది. అందువలన తనకు మాట్లాడడమే కష్టంగా ఉండేది. కానీ తాను ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా కావాలనే దాచారు. ఎందుకంటే మగతనానికి ఫ్రాయిడ్ కూడా అతీతుడు కాదు. మగతనం లక్షణాలకు ఇది పరిపూర్ణమైన ఉదాహరణ. భావోద్వేగాలను అణచివేయబడడం ప్రమాదకరమని అతనికి తెలుసు. కానీ కానీ తన బలహీనత బయటపడకూడదని ఫ్రాయిడ్ వాటిని అణచివేశారు.

డార్విన్ ఆందోళనకు రెండు కారణాలు…

ఒక ప్రకృతి శాస్త్రవేత్తగా, భూగర్భ శాస్త్రవేత్తగా, జీవ శాస్త్రవేత్తగా, రచయితగా ప్రసిద్ధులు అయిన చార్లెస్ డార్విన్ కూడా తనకున్న ఆందోళనను మానసిక రుగ్మత పేరుతో మారువేషం వేసుకొని తిరిగిన మనిషి తను. ఆయన గురించి చాలామందికి తెలిసిన కోణం పరిణామ సిద్ధాంతం, గాలాపాగోస్ అనే అగ్నిపర్వత ద్వీపసమూహం, బలవంతుడే బ్రతుకుతాడు అనే సిద్ధాంతం. అయితే చాలా మందికి తెలియని కోణం ఏమిటంటే డార్విన్ తన నలభై సంవత్సరాల వయస్సు వరకు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడ్డారు. వాంతులు, గుండె దడ, చర్మ శోథ,  తీవ్రమైన భయాందోళనలతో బాధపడ్డారు. ఆధునిక చరిత్రకారులు మరియు మనస్తత్వవేత్తలు విశ్లేషణ చేసి అతని సమస్యకు ఒక ముగింపు తెచ్చి ఒక విషయం చెప్పారు. డార్విన్ కు చాలా భయం ఉండేది, అపరాధ భావం ఉండేది. ఆ భయాన్ని తాను అణిచివేశారు. 

అలా ఆ భయాన్ని అణిచివేయడం వల్ల అది రోగ లక్షణాలుగా రూపాంతరం చెందేది. నిజానికి డార్విన్ కు ఆందోళన రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. తాను చెప్పిన సిద్ధాంతం సమాజాన్ని, చర్చ్ ని, తనకు ఎంతో ఇష్టమైన తన భక్తిగల భార్య అయిన ఎమ్మాని కలవరపెడుతుంది అని, 19వ సెంచరీలో విక్టోరియన్ ఇంగ్లాండ్ లో దేవుని ప్రశ్నించడం, దేవుడు లేడని చెప్పడం, అసలు ఆ ఆలోచన రావడం ఎంత ఒత్తిడికి గురించేసింది అంటే, అది ఇప్పటి మనిషి ఊహకు కూడా అందదు. రెండవది ఏమిటంటే డార్విన్ కు ఎప్పుడూ కూడా ఒక సందేహం ఉండేది. తన సిద్ధాంతం తప్పైతే తన పరిస్థితి ఏంటి? తన కుటుంబ పరిస్థితి ఏంటి? అందువలన తనకు ఆందోళన కలుగుతుంది అనే భయం ఉండేది. అందుకని ఆ భయాన్ని తాను బయటకు చెప్పుకోలేదు. దానికి ఒకే ఒక కారణం అతను ఒక మగాడు. అందుకే తన బాధను ఎవ్వరికీ చెప్పుకోలేకపోయారు డార్విన్. చెప్పుకుంటే తాను బలహీనుడు అయిపోతాడు గనుక.

“మార్కస్ ఓరీలియస్ ఆంటోనినస్” నేర్పిన పాఠం…

ఇకపోతే ఈ మగతనం అనేది మేధావుల దగ్గరికి వచ్చేసరికి ఇంకా దారుణంగా తయారవుతుంది. ఒక మేధావి తన  తన బలహీనతను, భయాన్ని బయటకు చెప్పుకుంటే సమాజం అతనిని ఎలా చూస్తుందో  అతనికి బాగా తెలుసు. అందుకే డార్విన్ తాను ఒక్కరే తోటలో తాను ఒంటరిగా నడిచేవారు. దానికి ఆలోచన మార్గంఅనే పేరు పెట్టారు. నిజానికి ఆయన తన ఓటమిని ఆ తోటపై పరిచేవారు. తాను చెప్పుకోలేని బాధ ఆ దారి మీద ఎన్నో రోజులు నడిచింది. మగాడు బాధపడకూడదు అనే నిబంధన మాత్రమే. అది తెలివిని చూడదు, స్థానం చూడదు, నొప్పిని చూడదు, అది అందరినీ సమానంగా బంధిస్తుంది. ఇంకో ప్రధానమైన విషయం ఏమిటంటే? ఈ మగతనం అనే మిత్తికి స్టోయిసిజంను కలిపేస్తున్నారు. ఈమధ్య వాస్తవం ఎక్కువగా కనిపిస్తుంది. నిజమైన మగాడు ఏడవడు, బాధ పెట్టుకోడు అన్నీ తనే భరిస్తాడు అనే అసంబద్ధమైన మాటలు, నమ్మకానికి, దేశభక్తి తత్వశాస్త్రానికి స్టోయిసిజం అనే చీటి అంటిస్తున్నారు. రోమన్ చక్రవర్తి, స్టోయిక్ తత్వవేత్త అయిన “మార్కస్ ఓరీలియస్ ఆంటోనినస్” తన ధ్యానంలో భావోద్వేగాలు అణిచివేయమని ఎక్కడ చెప్పలేదు. ఇంకా తాను ఏం చెప్పాడంటే భావాలని అర్థం చేసుకోమని చెప్పారు.

వేగంగా విచారణ చేయకుండా కారణాలతో చూడమన్నారు. నేను బాధపడకూడదు అనే మూర్ఖపు కథలు కాదు, బాధ ఎందుకు వస్తుందో నాకు తెలుసు. కాబట్టి దానికి నా ప్రతిస్పందన నిర్ణయించుకుంటాను అని అర్థం. అసలు స్టోయిసిజం అంటే భావోద్వేగ అణిచివేత కాదు, భావోద్వేగ నియంత్రణ. వీటి మధ్య తేడా చాలా సూక్ష్మంగా ఉండొచ్చు, కానీ దాని అర్థం లోతుగా ఉంటుంది. అణిచివేత అంటే ఒక అనుభూతిని ఉకిరి బిక్కిరి చేసి పైన ముసుగు వేయడం లాంటిది. నియంత్రణ అంటే ఆ అనుభూతిని గుర్తించి అర్థం చేసుకొని తెలివిగా నిర్వహణ చేయడం. కానీ ఆధునిక మగతనం ఏం చేస్తుందంటే స్టోయిసిజం పేరు చెప్పి అణిచివేతని ప్రచారం చేస్తుంది. అయితే ఆధునిక మగతనం వల్ల మగాళ్లు పైకి ధైర్యంగా, బలంగా కనిపించొచ్చు. కానీ లోపల కుళ్ళి కుళ్ళి చస్తారు. రాయిలా ఉండడం బలం కాదు, అది మొద్దుబారడం. అంటే తనలో ఏమి జరుగుతుందో తెలుసుకోగలగడం. దానిని మరొకరికి పంపిణీ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండడం. ఇదే రోమన్ చక్రవర్తి, స్టోయిక్ తత్వవేత్త అయిన “మార్కస్ ఓరీలియస్ ఆంటోనినస్” నేర్పిన పాఠం.

ఇతర కథనాలు:

డిప్రెషన్‌కు ముందస్తు లక్షణాలు

అలర్ట్: ఉద్యోగులకు బర్న్‌అవుట్ సిండ్రోమ్

శరీరకంగా ఒకే.. మరి మానసికంగా దృఢంగా ఉన్నారా..?

ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా లక్షణాలు: మెదడు హ్యాంగ్ అయితే పరిస్థితి ఏంటి?

Show More
Back to top button