CINEMATelugu Cinema

కుటుంబ బాంధవ్యాలను నిజాయితీగా ప్రతిబింబించిన చిత్రం.. తోడికోడళ్ళు (1957).

తెలుగు సినిమా స్వర్ణయుగంగా పరిగణినించే 1950, 1960, 1970 దశకాలలో కుటుంబగాథ చిత్రాల నిర్మాణానికి ప్రత్యక్ష చిరునామాగా వెలుగొందినటువంటి ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ “అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్”. వారు నిర్మించిన రెండవ చిత్రం “తోడికోడళ్ళు”. ఈ సినిమా 1957 వ సంవత్సరంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి యోగ్యతా పత్రం లభించింది. దీనికి చారిత్రక ప్రాధాన్యత చాలా ఉంది. పల్లెలు, పట్టణాల సరిహద్దులు చెరిగిపోయిన ఈ రోజులలో గ్రామీణ వాతావరణంలో కుటుంబ సంబంధాలను స్వచ్ఛందంగా నిజాయితీగా ప్రతిబింబించినందుకు ఈరోజు మనం “తోడికోడళ్ళు” చిత్రం విశేషాలను గూర్చి చర్చించుకుంటున్నాం.

పల్లెలు, పట్టణాల సరిహద్దులు చెరిగిపోయి పల్లెటూరి జీవనంలో స్వచ్ఛతను, నిజమైన నాగరికతను కొత్త పుంతలు తొక్కించి పట్టణాలతోబాటు, పట్టణాలకు పట్టణాలు కాంక్రీట్ జంగిల్ లా మారిపోతున్న ఈ రోజులలో అరవై అయిదు సంవత్సరాల నాటి గ్రామీణ వాతావరణం ఎలా ఉండేదో, ఆ రోజుల్లో అన్నదమ్ములు బంధాలు తోడికోడళ్ళ మధ్య సఖ్యత ఒక్కొక్కసారి అసూయ ఎలా ఉండేదో ఇవన్నీ తెలుసుకోవడానికి తోడికోడళ్ళు లాంటి సినిమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సమష్టి కుటుంబంలో అన్నదమ్ముల మధ్యా, తోడి కోడళ్ళ మధ్యా ఉత్పన్నమయ్యే సంఘర్షణలు తోడికోడళ్ళు సినిమా ఇతివృత్తం.

ప్రసిద్ధ బెంగాలీ నవలాకారుడు శరత్ చంద్ర ఛటర్జీ నవల “నిష్కృతి” ఆధారంగా స్వీకరించి ఈ సినిమా కథ వ్రాశారు. అయితే నవలలోని పాత్రలు, కథాకథనాలను తెలుగు సినిమాకు అనుగుణంగా మార్పులు చేసుకున్నారు. సినిమాలోని కథ, పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను అలరించడంతో మంచి విజయాన్ని సాధించింది. కారులో షికారుకెళ్ళే, ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే వంటి పాటలు తెలుగు ప్రేక్షకుల మదిలో తరాలుగా విశేష ఆదరణ పొందాయి. 11 జనవరి 1957 నాడు విడుదలైన తోడికోడళ్ళు సినిమా ఘనవిజయం సాధించింది.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దంలో విడుదలైనటువంటి ఈ సినిమా కథలో అప్పట్లో ప్రజలకు దేశభక్తి, సామాజిక బాధ్యత, పల్లెల జీవితాల్లో నిజాయితీ ఇలాంటివన్నీ పుష్కలంగా ఉన్నాయి. అలాగే పల్లె జీవితానికి, పట్టణ జీవనానికి చాలా వ్యత్యాసం ఉండేది. పల్లెల నుండి పట్టణాలకు వెళ్లాలంటే అది ఒక విదేశీ ప్రయాణంలాగా ఉండేది. 1917లో బెంగాలీ రచయిత శరత్ బాబు వ్రాసిన చిన్న నవల “నిష్కృతి” ఈ సినిమా కథకు మూలం. 1917లో “నిష్కృతి” మూల రచన మొదలైతే 1957లో “తోడికోడళ్ళు” సినిమా రూపొందిందంటే ఆ నలభై యేండ్ల ప్రజల జీవన విధానంలోని మానసంబంధాలలోనూ విపరీతమైన మార్పు రాలేదని అర్థం చేసుకోవాలి.

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :   ఆదుర్తి సుబ్బారావు,

వీరమచనేని మధుసూధన రావు(సహాయకుడు)

నిర్మాణం   :      దుక్కిపాటి మధుసూదనరావు

రచన     :    శరత్ బాబు

చిత్రానువాదం   :  ఆదుర్తి సుబ్బారావు, ఆత్రేయ, దుక్కిపాటి మధుసూధనరావు

తారాగణం  :   అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, ఎస్.వి.రంగారావు, కన్నాంబ, సూర్యకాంతం, రేలంగి వెంకట్రామయ్య, జగ్గయ్య, చదలవాడ కుటుంబరావు, రాజసులోచన, మాస్టరు శరత్ బాబు, అల్లు రామలింగయ్య

సంగీతం    :    మాస్టర్ వేణు

నేపథ్య గానం   :    ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, జిక్కీ, కె.రాణి, మాధవపెద్ది సత్యం

నృత్యాలు   :    ఇ.వి.సరోజ, ఎ.కె.చోప్రా

గీతరచన   :    ఆత్రేయ

సంభాషణలు   :   సముద్రాల రాఘవాచార్య

ఛాయాగ్రహణం  :  పి.సెల్వరాజ్

కళ   :    ఎస్.కృష్ణారావు

కూర్పు    :     ఆదుర్తి సుబ్బారావు,

ఎ.వెంకటరత్నం(సహాయకుడు), టి.కృష్ణ(సహాయకుడు)

నిర్మాణ సంస్థ    :    అన్నపూర్ణ పిక్చర్స్

నిడివి      :     180 నిమిషాలు

విడుదల తేదీ   :    11 జనవరి 1957

భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

ఇది ముగ్గురు తోడికోడళ్ల కథ.  వాళ్ళు అన్నపూర్ణ, అనసూయ, సుశీల. పెద్దావిడ అన్నపూర్ణ మాట కరుకు, మనసు నవనీతం. పేరుకు తగ్గ మనిషి. భర్త కుటుంబరావు దండిగా ప్రాక్టీసున్న న్యాయవాది. కోర్టు విషయాలు తప్ప ఇంటి విషయాలు పట్టవు. కోర్టు కార్యాలయం విషయాల్లో తప్ప మిగతా అన్నిటా తనకు మతిమరుపు. రెండో ఆవిడ అనసూయ. పేరుకూ ఆవిడ బుద్ధికి హస్తిమశకాంతరం. మొగుడు రమణయ్య వృత్తి రీత్యా పేకాటరాయుడు, ప్రవృత్తిరీత్యా నిక్షేపరాయుడు. మూడో ఆవిడ సుశీల. తాను నిజంగా సౌశీల్య. అంత పెద్ద ఇంటిని అవలీలగా నడిపించుకొస్తోంది. ఆ ఇంట్లో సుశీల మాట సుగ్రీవాజ్ఞ. మొగుడు సత్యం కూడా పేరుకు తగ్గట్టే సత్యవాది. అన్యాయాన్ని లేశ మాత్రంగా కూడా సహించడు.

రమణయ్య దంపతులు సొంత ఊర్లో వ్యవసాయం చూస్తుంటారు. మిగతావారంతా బస్తీలో ఉంటారు. పండక్కి రావలసిందిగా రమణయ్య దంపతులకు బస్తీ నుంచి పిలుపు వస్తుంది. ముందుగా వెళ్లిన అనసూయ అక్కడ సుశీలకు దక్కుతున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతుంది. వాళ్ళ బంధువు వైకుంఠం కూడా ఆమెను ఎగేస్తాడు. రమణయ్య చేత వ్యాపారం చేయిద్దామంటాడు. పిల్లల మధ్యలో వచ్చే చిన్న చిన్న తగాదాలకు ఆజ్యం పోసి కుటుంబంలో చిచ్చు పెడుతుంది అనసూయ. ఫలితంగా సత్యం, సుశీల పల్లెకుపోయి వ్యవసాయం బాధ్యత తాము తీసుకుంటారు. అన్నపూర్ణమ్మకు మొదటి నుంచి సుశీల కొడుకు అంటే వల్లమాలిన ప్రేమ. పసిబిడ్డ దూరం అయ్యాడని చింత ఆవిడని అమితంగా భావిస్తుంది. పండక్కి బాబు కోసం సున్నుండలు పంపిస్తుంది పల్లెకు. కానీ అనసూయ కుట్ర వల్ల అవి తిరిగి ఇంటికి వచ్చేస్తాయి. మనస్పర్థలు మరింత ఎక్కువవుతాయి.

బస్తీ షోకులతోబాటు రమణయ్యకు అడగాలి కూడా తగిలిస్తాడు వైకుంఠం. ఆ గాలి పేరు నవనీతం. ఆమె మగవారిని పీల్చేయడంలో తిమింగళం. నవనీతం మోజులోపడి రమణయ్య మొత్తం గుల్ల అవుతాడు. ఆమెను వదులుకోలేక చివరికి అన్నగారి పేరిట దొంగ ప్రామిసరీ నోటు వ్రాయడానికి కూడా సిద్ధపడిపోతాడు. ఆ నోటుమీద అప్పిచ్చిన తిరుపతయ్య వాళ్ళ ఊరివాడే. గ్రామంలో అతను ఈ నోటు విషయంలో గొడవచేయడంతో పెద్దాయన పరువు కాపాడేందుకు సుశీల తన నగలను ఇచ్చేస్తుంది. కానీ నిజం ఎన్నాళ్ళు దాగుతుంది. కుటుంబరావుకి ఈ విషయం తెలిసి రమణయ్యను నిలేస్తాడు. అసలు విషయాలన్నీ అప్పుడు వెలుగు చూస్తాయి. అనసూయ పశ్చాత్తాపపడుతుంది. మనస్పర్థలు మరచి తోడికోడళ్ళు ముగ్గురు మళ్ళీ ఒక్కటవుతారు.

కథాన్వేషణ…

సినిమా విజయవంతం అవ్వాలంటే కథ బలంగా ఉండాలి. దానికనుగుణంగా కథాన్వేషణ ఆరంభమైంది. దుక్కిపాటి మధుసూదన రావు గారికి బెంగాలీ రచయిత శరత్ సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఆయన నవలలన్నీ దుక్కిపాటి గారు క్షుణ్ణంగా చదివారు. అందులో “నిష్కృతి” అన్న నవలిక తనను బాగా కట్టుకుంది. దానిని సినిమాగా తీస్తే బావుంటుంది అనుకున్నారు. ఆ విషయం ఆదుర్తికి గారికి చెప్పి ఆ నవలను చదవమన్నారు. ఆ కథ ఆదుర్తి గారికి కూడా నచ్చింది. దాంతో ఇద్దరూ కలిసి కె.వి.రెడ్డి గారికి ఆ పుస్తకం ఇచ్చి చదివి అభిప్రాయం చెప్పమన్నారు. నాలుగు రోజుల తర్వాత కె.వి.రెడ్డి గారి ఇంటికి వెళ్లారు. నిష్కృతి కథ కె.వి.రెడ్డి గారికి కూడా బాగా నచ్చింది. వెంటనే కథా చర్చలు మొదలు పెట్టమన్నారు కె.వి.రెడ్డి గారు. అప్పుడు వీళ్ళిద్దరూ తాము ఆ కథను సినిమాకు ఎలా మలుచుకోదలచింది ఆయనకు వివరించారు.

కె.వి.రెడ్డి గారు సావకాశంగా విన్నారు. ఓ మంచి సలహా ఇచ్చారు. ఈ కథలో హాస్యం చాలా తక్కువగా ఉంది. రెండో కోడలు చుప్పనాతి కదా. ఉమ్మడి కుటుంబంలో చిచ్చు పెట్టేది తానే కాబట్టి ఆవిడ శూర్పనక బుద్ధులకు వత్తాసు పలుకుతూ ఆవిడ చేత మరిన్ని దుర్మార్గాలు చేయించేందుకు మీరు కొత్తగా ఓ పాత్ర సృష్టించండి. ఈ రెండో కోడలు కు భర్త వెంగళప్ప కాబట్టి కొత్తగా సృష్టించే ఈ పాత్ర ద్వారా అతని చేత కూడా మనం హాస్యం రాబట్టుకోవచ్చు అని చెప్పారు కె.వి.రెడ్డి గారు. అలా వాళ్ల ఆలోచనల నుంచి తయారైందే “వైకుంఠం” పాత్ర. దుక్కిపాటి మధుసూదన రావు గారు వెంటనే రంగంలోకి దిగి ఆత్రేయ గారిని పిలిపించి కథా చర్చలు ఆరంభించారు. దుక్కిపాటి, ఆదుర్తి, ఆత్రేయ గార్లు కలిసి కథ తయారుచేసుకున్నారు. ఆత్రేయ గారు సంభాషణలు వ్రాశారు. తోడికోడళ్ళు కథ కాబట్టి సినిమాకు కూడా తోడికోడళ్ళు అనే పేరే పెట్టారు.

కె.వి.రెడ్డి ని దర్శకుడిగా అనుకున్న దుక్కిపాటి…

అన్నపూర్ణ పతాకంపై నిర్మించిన రెండవ చిత్రం తోడికోడళ్ళు. వీరి మొదటి సినిమా “దొంగరాముడు” (1955) అటు సంపన్న వర్గాలవారిని, ఇటు వాడలోని వారినీ సమానంగా ఆకట్టుకుంది. కళను అద్భుతంగా ఆవిష్కరించి కాసులను పుష్కలంగా పండించింది. మొదటి చిత్రంతోనే అన్నపూర్ణ పిక్చర్స్ మంచి అభిరుచి గల సంస్థగా నిలిచింది. దొంగరాముడు విజయవిహారం చేస్తుండగానే రెండో సినిమాకు శ్రీకారం చుట్టారు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారు. మొదటి చిత్రాన్ని జనారంజకంగా మలిచిన కే.వీ.రెడ్డి గారినే రెండో చిత్రానికి కూడా దర్శకత్వం చేయవలసిందిగా కోరారు. సరిగ్గా అదే సమయానికి మాతృ సంస్థ వాహనీ నుంచి కూడా పిలుపు వచ్చింది.

గతంలో వారి మధ్య ఏవో పొరపొచ్చాలు వచ్చినందున ఖాళీగా ఉండటం ఇష్టం లేని కే.వీ.రెడ్డిగారు అన్నపూర్ణ వారికి “దొంగరాముడు” సినిమా చేశారు. అటు తన వాళ్ళ నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. ఇటు దుక్కిపాటి గారు కూడా తమ రెండవ సినిమా బాధ్యత కూడా తననే తీసుకోమంటున్నారు. ఏం చెప్పాలో తోచని కె.వి.రెడ్డి గారు “వాహినీ వాళ్లు పిలిచారు గనుక వెళ్లకపోతే ఇదివరకు ఉన్న విభేదాలు మరింత పెద్దమవుతాయి. ఈసారికి మీరే ఎవరినైనా పెట్టుకోండి. నా సహాయ సహాకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. కథా చర్చలకు నేను కూడా వస్తాను, సలహాలు చెబుతాను” అని చెప్పలేక చెప్పలేక చెప్పారు. కె.వి.రెడ్డి గారి పరిస్థితి అర్థం చేసుకున్నారు దుక్కిపాటి మధుసూదన రావు గారు.

ఆదుర్తి కే ఓటేసిన దుక్కిపాటి…

కె.వి.రెడ్డి గారికి కుదరకపోవడంతో వెంటనే కొత్త దర్శకుడి కోసం అన్వేషణలు ఆరంభించారు. అప్పుడు దుక్కిపాటి గారికి గతంలో తాను చూసిన అమరసందేశం (1954) సినిమా గుర్తుకు వచ్చింది. నిర్మాతలు డి.బి.నారాయణ, ఎస్.భావనారాయణలు అందులో కథనాయకుడిగా మొదట అక్కినేనిని ప్రయత్నించారు. కొన్ని కారణాల రీత్యా వీలుకాలేదు. తర్వాత చిత్రాలలో నైనా అక్కినేని చేత నటింపజేద్దామనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ అమరసందేశం చిత్రాన్ని అక్కినేని గారికి చూపించారు. అక్కినేని గారు దుక్కిపాటి గారితో కలిసి ఆ సినిమా చూశారు. అమరసందేశం బాగా ఆడలేదు. కానీ వీళ్ళిద్దరికీ ఆ సినిమా కన్నా దర్శకుడు బాగా నచ్చాడు. మంచి అవకాశం ఇస్తే సత్తా చూపించగలరనిపించి మనమే అవకాశం ఇస్తే అనుకున్నారు దుక్కిపాటి గారు. కానీ అన్నపూర్ణలో ఇతర దర్శకులు వేరే మరికొందరు పేర్లు చూస్తున్నారు. ఆ దర్శకులేమో దుక్కిపాటికి గారికి నచ్చడం లేదు.  దాంతో మళ్లీ కే.వీ.రెడ్డి గారి సలహామేరకు ఆదుర్తి గారికే ఓటు వేశారు.

ఆదుర్తి ని నచ్చిన అక్కినేని…

దుక్కిపాటి గారు ఆదుర్తి గారిని తన కార్యాలయానికి పిలిపించి తన తదుపరి చిత్రానికి తానే దర్శకుడు అని చెప్పారు. ఆదుర్తి గారి ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ విషయం అన్నపూర్ణ సంస్థ చైర్మన్ అక్కినేని గారికి తెలియదు. ఒక రకంగా దుక్కిపాటి గారు తీసుకుంది ఏకపక్ష నిర్ణయమే. తన అభిప్రాయాలని ఏకరువుపెడుతూ కాశ్మీరులో ఉన్న అక్కినేని గారికి ఉత్తరం వ్రాశారు. “అల్లావుద్దీన్ అద్భుతదీపం” (1957) చిత్రీకరణ కోసం అక్కినేని అప్పుడు అక్కడ ఉన్నారు. దుక్కిపాటి గారి నిర్ణయాన్ని అక్కినేని గారు బలపరిచారు. నేను కన్నతల్లి (1953) సినిమాకు పనిచేస్తున్నప్పుడు దర్శకులు ప్రకాశరావు గారికి ఆదుర్తి గారు సహాయ దర్శకునిగా ఉండేవారు. అప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. మంచి అభిరుచి  ఉన్నవారు. మీరు ఆయనని తీసుకొని మంచి పని చేశారని కాశ్మీరు నుంచి దుక్కిపాటి గారికి ప్రత్యుత్తరం వ్రాశారు అక్కినేని గారు. తన నిర్ణయానికి మద్దతు లభించినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కార్యరంగంలోకి దిగారు దుక్కిపాటి మధుసూదన రావు గారు.

తారాగణం ఎంపిక…

తోడికోడళ్ళు సినిమాలో పెద్ద కోడలిగా కన్నాంబ, ఆవిడ మతిమరుపు పెనిమిటిగా ఎస్వీ రంగారావు, రెండో కోడలుగా సూర్యకాంతం, ఆవిడ జంటగా రేలంగి, మూడో కోడలుగా సావిత్రి, తన భర్తగా అక్కినేని నిర్ణయమయ్యారు. “వైకుంఠం” గా జగ్గయ్యను తీసుకున్నారు. నవనీతంగా రాజసులోచన, తిరుపతయ్యగా చదలవాడ కుటుంబరావును తీసుకున్నారు. ఇలా తారాగణాన్ని నిర్ణయించాక ఈ సినిమాను తమిళంలో కూడా ఏకకాలంలో తీస్తే అనే ఆలోచన ఆదుర్తి గారికి వచ్చింది. అక్కినేని నాగేశ్వరావు గారి ఎనిమిదవ చిత్రం “కీలుగుఱ్ఱం” (1949) తమిళంలో కూడా మాయాకుదిరై పేరిట తయారై విడుదలైంది. తర్వాత వచ్చిన మాయక్కారి (మాయలమారి), కాదల్ (ప్రేమ),  పెట్రతాయి (కన్నతల్లి), పూన్ గొత్తయి (పరదేశి), పెణ్ణిన్ పేరుమయ్ (అర్ధాంగి) వంటి సినిమాలతో అక్కినేని గారు అక్కడి వారికి కూడా బాగా చేరువయ్యారు. 

దొంగ రాముడు సినిమాను “తిరుట్టురామన్” పేరిట అనువదించి  విడుదల చేస్తే ఆ సినిమా కూడా తమిళనాడులో 100 రోజులు ఆడింది. ఇక సావిత్రి, రంగారావు, కన్నాంబ గార్లు తెలుగుతో సమానంగా తమిళంలో కూడా తారా గౌరవాన్ని అందుకుంటున్నారు. రాజసులోచన కూడా పొరుగు సోదరుల అభిమానతార. వీళ్లంతా ఉన్నారు కాబట్టి రెండు భాషలలోనూ తీస్తే ఖర్చుకలిసి వస్తుంది. ఇలా రెండు భాషల్లోనూ తీసే చిత్రాల్లో నటించే ఉమ్మడి తారలకు ఆ రోజుల్లో ఒకటిన్నర పారితోషికం ఇచ్చేవారు. డబుల్ వెర్షన్ వల్ల ఆర్థికంగా కలిసి వచ్చే అంశాలన్నిటినీ ఆదుర్తి గారు అన్నపూర్ణ భాగస్వాములకు వివరించి వారందరినీ ఒప్పించారు.  కె.వి.రెడ్డి గారు కూడా వీళ్ళ ఆలోచనలను బలపరిచారు. “దొంగ రాముడు” చిత్రం 100వ రోజున తెలుగు దినపత్రికలన్నిటిలోను అన్నపూర్ణ వారి తదుపరిచిత్రం “తోడికోడళ్ళు” అంటూ ప్రకటన వచ్చింది.

ఆవు స్థానంలో కుక్క…

రెండు భాషలలోనూ ఒక ఆవు కూడా ప్రధాన పాత్రధారి. కుటుంబరావు ఇంట్లో ఆవు ఉంటుంది. అయితే చివరి నిమిషంలో ఆ ఆవు స్థానంలో కుక్కను మార్చారు. అదెలాగంటే అక్కినేని గారికి జానకిరామ చౌదరి అభిమాని. తాను మదనపల్లి వాస్తవ్యుడు. ఆయన అక్కినేని గారికి ఓ ఉత్తరం వ్రాస్తూ, తన దగ్గర ఒక అల్సేషియన్ కుక్క ఉన్నదని, మనం ఏం చెబితే అది తూ.చా. తప్పక చేస్తుందని, మీ సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే పనికొస్తుందని తెలిపారు. ఆ ఉత్తరంతో పాటు కుక్క ఫోటో కూడా పంపించారు. దుక్కిపాటి గారిని ఆ ఉత్తరం ఆకర్షించింది. వెంటనే ఆదుర్తి గారిని, కళాదర్శకులు యస్.కృష్ణారావు గార్లను మదనపల్లి పంపించారు. నిజానికి చౌదరి వ్రాసిన దాంట్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆ కుక్క ఏం చెబితే అది క్షణాల్లో చేస్తుంది. వెంటనే దాన్ని తీసుకొని మద్రాసు తిరిగి వచ్చారు ఆదుర్తి గారు. రూడ్ అనే ఆ కుక్కని దృష్టిలో ఉంచుకొని స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు.

సంభాషణలు…

కథ సిద్ధం అయ్యింది. తారాగణం ఎంపికయ్యారు. తెలుగులో ఆత్రేయ గారితో సంభాషణలు వ్రాయించారు. మరి తమిళం లో సంభాషణలు ఎవరి చేత వ్రాయించాలి? అప్పుడు దుక్కిపాటికి గారికి తన స్నేహితులు శ్రీధర్ పేరు సూచించారు. శ్రీధర్ పూర్తి పేరు చెంగల్పట్ వి. శ్రీధర్. తాను మన తెలుగువాడే. తాతల హాయంలో వాళ్ల కుటుంబం నెల్లూరులోనే ఉండేది. తర్వాత భుక్తికోసం చెంగల్పట్ చేరారు. అక్కడ చదువుకున్న శ్రీధర్ మొదట్లో ప్రభుత్వ ఉద్యోగి, నాటకాలు కూడా వ్రాసేవాడు. రత్తపాశం అన్న తన నాటక రంగస్థలం మీద భాగ ప్రసిద్ధి. 1954లో ఆర్.ఎస్.మణి దానిని సినిమాగా తీస్తూ శ్రీధర్ ని సినిమాలకు తీసుకువచ్చాడు. 1956లో వచ్చిన అమరదీబం శ్రీధర్ సత్తాని పరిశ్రమకు తెలియచెప్పింది. శ్రీధర్ తెలుగు మాట్లాడగలడు కానీ తమిళ సినిమాలో పుట్టి పెరిగినందున తెలుగు వ్రాయలేరు. “తోడికోడళ్ళు” సినిమాకు తెలుగులో ఆత్రేయ గారు వ్రాసిన సంభాషణలను అంతే క్లుప్తంగా అర్థవంతంగా ఆయన తమిళంలోకి తర్జుమా చేశాడు. తోడుగా తమిళదనాన్ని అద్దాడు. తమిళ చిత్రానికి “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” (మా ఇంటి మహాలక్ష్మి) అని పేరు పెట్టారు.

సంగీతం , గేయ రచన…

కథలో పల్లె నేపథ్యం ఎక్కువ కాబట్టి అంతకుముందే విడుదలైన రోజులు మారాయి (1955) తో ప్రేక్షకులను బాగా కిర్రెత్తించి ఉన్న మాస్టర్ వేణు (హీరో భానుచందర్ తండ్రి) ని సంగీత దర్శకులుగా తీసుకున్నారు. తెలుగు వర్షన్ కు ఆత్రేయతో పాటు తాపీ, శ్రీశ్రీ, కొసరాజు గార్లు కూడా పాటలు వ్రాశారు. ఉమ్మడి కుటుంబం నుండి వేరుపడ్డాక సుశీల బాధతో పాడుకునే పాట “కలకాలమీ కలత నిలిచేది కాదు.. తాతాజీ వ్రాశారు. గ్రామానికి పోయిన సత్యం ఊరి వారందరిని కలుపుకొని వ్యవసాయం చేస్తూ పాడే “నలుగురు కలిసి పొరుపులు మరిచి” పాట, రమణయ్యను కవ్విస్తూ నవనీతం పాడే “పొద్దైనా తిరగకముందే” పాటలను శ్రీ శ్రీ వ్రాశారు.

భావకుడైన సత్యం పాడుకునే “కారులో షికారుకెళ్లే”, అనసూయమ్మ కొడుకును ఆటపట్టిస్తూ పిల్లలు పాడే “ఎంతెంత దూరం కోసెడు దూరం”.. పాటలను ఆత్రేయ వ్రాశారు. సినిమా ఆరంభంలో వచ్చే గాలిపటం పాట, చివరలో వచ్చే నీసోకు జూడకుండా నవనీతం పాట, మధ్యలో వచ్చే “ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే”, టౌను పక్కకెళ్లొద్దురా డింగరీ, శ్రీరస్తు శుభమస్తు.. పాటలను కొసరాజు వ్రాశారు. రమణయ్యకు ఓ పద్యం కూడా పెట్టారు. “పెండ్లియాడిన భర్త పీకపై”.. అంటూ సాగే పద్యాన్ని కూడా కొసరాజే వ్రాశారు. “కన్నతల్లి” సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై “దొంగరాముడు” తో పేరు సంపాదించుకున్న గాయని సుశీల  ఈ సినిమాలో మొదటిసారిగా సావిత్రి గారికి పాటలు పాడారు. తర్వాత కాలంలో వాళ్ళిద్దరూ కాంబినేషన్ ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పనవసరం లేదు కదా.

పాటలు…

ఏరువాక సాగారో.. పాట (రోజులు మారాయి) విజయానికి కారణమైంది. దీనిని రచన కోసరాజు గారు. తమ సినిమాలో కూడా పల్లె ప్రజలను ఆకర్షించే ఒక పాట కొసరాజుతో వ్రాయించాలి అనుకున్నారు దుక్కిపాటి గారు. తబలిస్టుని వెంటేసుకుని హార్మోనితో వచ్చారు వేణు. పల్లెలో పొలానికి నీళ్లు పెట్టేందుకు రైతులు “గూడ” వేయడం మామూలే కదా. నాయిక, నాయకుల చేత గూడ వేయిస్తూ పాట పెట్టాలని అనుకున్నారు. మరి ఆ పాట జానపద సాహిత్యానికి కొసరాజు తప్ప ఇంకెవరు బాగా వ్రాయగలరు. ముందు మాటలు ఇస్తే తరువాత బాణీలు కట్టుకుంటాను అన్నారు వేణు. కొసరాజు గారు కాసేపు ఆలోచించి

“ఆడుతు పాడుతు పనిచేస్తుంటే

అలుపు సొలుపేమున్నది

ఇద్దరమొకటై చేయికలిపితే

ఎదురేమన్నది – మనకు కొదవేమున్నది”

అని పల్లవి వేశారు. మెరుపు వేగంతో హార్మోనిని పలికించే వేణు రెండు మూడు బాణీలు వినిపించారు. అందులో ఒకటి దుక్కిపాటి గారికి బాగా నచ్చింది. మరునాడు చరణాలకు కూర్చున్నారు. రైతు కష్టసుఖాలు చెబితే సరిపోదు. ఇది నాయిక, నాయకుల పాట గనుక కాసంత శృంగారం, చమత్కారం కూడా రంగరించాలన్నారు దుక్కిపాటి గారు. వెంటనే కొసరాజు గారు 

“ఒంపులు దిరిగీ ఒయ్యారంగా

ఓరగంట నువు చూస్తుంటే – నీ

గాజులు ఘల్లని మోగుతుంటే – నా

మనసు జల్లుమంటున్నది”

అంటూ చెలరేగిపోయారు. ఘంటసాల, సుశీల గుమ్ముగా పాడారు. రికార్డయిన పాట విన్న ఆత్రేయ గారు చిన్న సందేహం వెలిబుచ్చారు. రెండో చరణంలో నాయిక తీరని కోరికలేవో నాలో తికమక చేస్తూ ఉన్నవి అంటుంది.  సెన్సార్ అధికారి త్యాగరాయ శాస్త్రి అంటే అప్పట్లో అందరికీ హడల్. ఈ మాటలకు అభ్యంతరం చెప్పరు కదా అన్నది ఆత్రేయ గారి మీ మాంస. అంతా ఆలోచనలో పడ్డారు. పర్లేదులే ఇందులో అంత ప్రమాదం ఏమీ లేదు అని తరువాత సర్దుకున్నారు. పాటలపర్వం కూడా ముగిసింది.

చిత్రీకరణ…

తోడికోడళ్ళు సినిమా చిత్రీకరణ అంతా ఎక్కువ భాగం వాహినీ స్టూడియోలోనే జరిగింది. వాహినీ స్టూడియోలో చిత్రీకరణ కార్యక్రమాలు మొదలయ్యాయి. నిష్కృతి నవళికను తెలుగులోకి అనువదించింది చక్రపాణి గారు. శరత్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించిన విజయాధినేత చక్రపాని గారికి అదుర్తి గారు “నిష్కృతి” కథను సినిమాగా ఎలా మలిచారు అన్నది ఓ ప్రహేళిక అయ్యింది. అది చాలా చిన్న కథ. దానిని మూడు గంటల సినిమాగా పెంచడానికి అదనంగా వీళ్ళు ఏమి దినుసులు వేసారన్నది చక్రపాణి గారి సందేహం. తాను ఆ ఆత్రాన్ని ఆపుకోలేక స్క్రిప్ట్ పట్టుకుపోయి ఆసాంతం చదివేశారు. చిత్రీకరణకు కూడా తాను క్రమం తప్పకుండా హాజరయ్యి తనకు తోచిన సలహాలు చెప్పేవారు.

ఆరంభంలో వచ్చే “గాలిపటం గాలిపటం” పాటను కోడంబాక్కం లోని షావుకారు ఇంట్లో తీశారు. టూరిస్ట్ బస్సు ఆపరేటర్ గా పని చేసిన  కొసరాజు గారికి మద్రాసు చుట్టుపక్కల గ్రామాలన్నీ చిరపరిచితం. అందుకని ఆ లొకేషన్ ఎంపిక బాధ్యతల్ని కొసరాజు గారికే వదిలిపెట్టారు దుక్కిపాటి మధుసూదన రావు గారు. ఆనాటి మద్రాసుకు 18 కిలోమీటర్ల దూరంలో జనపసత్రం అనే ఓ గ్రామం ఉంది. అక్కడ శ్రీనివాసులు నాయుడు అని ఒక కామందు ఉన్నాడు. తాను కొసరాజు గారికి మంచి స్నేహితుడు. తిరుపతి పోయే రహదారిలో శ్రీనివాసులు నాయుడుకు చాలా పొలాలు ఉన్నాయి. పల్లె సన్నివేశాలు, పొలాల్లో తీయాల్సిన పాటలు అక్కడే చిత్రీకరించారు.

రైతుబిడ్డ అయిన అక్కినేని గారు పంచె ఎగగట్టి బురద నీళ్లలో దిగేసి “గూడ” చేస్తుంటే చూసేవాళ్ళకు అది చిత్రీకరణ లాగా అనిపించలేదు. ఎటొచ్చీ సావిత్రి గారికే ఇబ్బందయ్యింది. లయ తప్పకుండా “గూడ” వేయాలి. సావిత్రి గారు అఖండురాలు కనుక తాను ఒక్కపూటలోనే ఆ పట్టు సాధించారు. ఆ ఊర్లోనే రెండో పాట కూడా తీశారు. ఈ సినిమాలో “టౌను పక్కకెళ్లొద్దురా డింగరీ”  పాటకు నర్తించింది ఇ.వి.సరోజ, నృత్య దర్శకుడు ఏ.కే.చోప్రా. అలాగే దసరా పండుగ సందర్భంగా అయ్యవారితో కలిసి కుటుంబరావు ఇంటికి వచ్చిన బడి పిల్లలు పాడే శ్రీరస్తు శుభమస్తు పాటలో నర్తించింది నటరాజ నాట్యనిలయం అనే నృత్య పాఠశాల పిల్లలు.

పూర్తయిన సెన్సారు, పంపిణీ…

తోడికోడళ్ళు సినిమా తెలుగు మరియు తమిళ భాషలలో చిత్రీకరణ పూర్తిచేసుకుంది. నిర్మాణాంతర పనులు కూడా పూర్తిచేసుకుని మొదటి కాపీలు వచ్చాయి. దుక్కిపాటి మధుసూదన రావు గారికి తమిళంలో ఇదే మొదటి సినిమా కావటంతో అక్కడ పంపిణీదారీ వ్యవహారాలు తెలియవు. విజయా ప్రొడక్షన్స్ అధినేతలలో ఒకరైన చక్రపాణి గారు “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” ని మనం తీసుకుందామని నాగిరెడ్డి గారికి సూచించారు. అంతా ఖరారు అవుతున్న వేళ అనుకోని అవాంతరమేదో వచ్చి నాగిరెడ్డి గారు ఆ సినిమాను వదిలేసారు. సినిమా బాగాలేదని కోడంబాక్కంలో పుకార్లు షికారవుతున్నాయి.

ఇంతలో తమిళ చిత్రరంగంలో ప్రముఖుడు అయిన ఏ.సుబ్రహ్మణియన్ (సుబ్బయ్య చెట్టియార్) వచ్చి “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” సినిమాను చూస్తానన్నారు. సుబ్బయ్య చెట్టియార్ గారు గతంలో ఏ.వీ.ఎం.చెట్టియార్ గారితో భాగస్వామిగా ఉన్నారు. సినిమా ప్రదర్శన పూర్తికాగానే “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” సినిమాను తాను తీసుకుంటున్నట్టు సుబ్బయ్య చెట్టియార్ గారు చెప్పారు. “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” సినిమాను దుక్కిపాటి గారు చెప్పిన రేటుకే తీసేసుకున్నారు సుబ్బయ్య చెట్టియార్ గార. రెండు వర్షన్ లు సెన్సార్ కి వెళ్లాయి. వీళ్లంతా భయపడినట్టుగా శాస్త్రి గారు “ఆడుతూ పాడుతూ” పాటలోని ఆ చరణాలకు అభ్యంతరం చెప్పలేదు.  రాజసులోచన పాటకు అభ్యంతరం చెప్పారు.

విడుదల…

8 జనవరి 1957 వ తేదీన “తోడికోడళ్ళు” తెలుగు సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. 12 జనవరి 1957 నాడు తేదీన “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” కి సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. 11 జనవరి 1957 తేదీన తెలుగు తోడికోడళ్ళు, 01 ఫిబ్రవరి 1957 నాడు తమిళ వర్షన్ “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” విడుదలయ్యాయి. తెలుగు నాట యువకులందరూ “కారులో షికారుకెళ్లే” పాటను మెచ్చుకున్నారు. పల్లెటూరు వాళ్లంతా “ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే” అంటూ హాయిగా పాడుకున్నారు. తోడుకోడళ్ళు 100 రోజులాడింది.

విజయవాడ (మారుతి టాకీస్) లోనూ, తెనాలిలోను శతదినోత్సవ వేడుకలు జరిగాయి. ఆ వేడుకకు కె.వి.రెడ్డి గారు అధ్యక్షత వహించారు. తారలంతా కె.వి.రెడ్డి గారి చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు. “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” శత దినోత్సవ వేడుకలు మద్రాసు వుడ్ ల్యాండ్స్ హోటల్లో జరిగాయి. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలికి ఆనాడు అధ్యక్షుడిగా ఉన్న “కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం” సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి మద్రాసు నగరానికి మేయర్ గా వున్న రామనాథన్ చెట్టియార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  తోడికోడళ్ళు చిత్రానికి ఆ ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రప్రతి యోగ్యతా పత్రం కూడా లభించింది. ఆనాడు తెలుగు చిత్రసీమలో అన్నపూర్ణ కీర్తి పతాక ధగధగలాడింది.

Show More
Back to top button