HEALTH & LIFESTYLE

పళ్లు తొలగిస్తే చూపు మందగిస్తుందా?

పళ్ళు తీసేస్తే కళ్ళు దెబ్బతింటాయనీ, చూపు మందగిస్తుందనీ చాలామందిలో ఒక అపోహ ఉండే ఉంటుంది. కానీ పంటికి, కంటికి ఎలాంటి సంబంధమూ లేదంటున్నారు నిపుణులు. ముఖంలోని ఈ రెండు భాగాలు దగ్గరగా ఉన్నప్పటికీ, చూపును నియంత్రించే దృశ్యనాడి, దంతాలకు వెళ్ళే నాడులు చాలా దూరంలో ఉంటాయి. అలాగే, ఈ రెండు భాగాలలోని రక్తనాళాలు కూడా వేటికవే ప్రత్యేకమైనవి.

కాబట్టి, పంటి చికిత్స లేదా పళ్లు తొలగించడం వల్ల కళ్లకు ఎటువంటి నష్టం జరగదు. దంతాలలో ఇన్ఫెక్షన్ వస్తే, అది ముఖంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు, కానీ కంటి కుహరం సురక్షితంగా ఉంటుంది. లేనిపోని అపోహలతో పంటి చికిత్సను ఆలస్యం చేస్తే.. ఇన్ఫెక్షన్ తీవ్రమై చిగుళ్లకు హాని కలిగించవచ్చు. సందేహాలుంటే వెంటనే దంత వైద్యులను సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవాలి.

ఉదయం పాదాల నొప్పికి చికిత్స

కొందరికి ఉదయం నిద్రలేచి అడుగు కింద పెట్టగానే పాదాలు తీవ్రంగా నొప్పి పుడుతుంటాయి. దీనికి కారణం పాదం అడుగున ఉండే ప్లాంటార్ ఫేషియైటిస్ అనే పొర వాపు. ఊబకాయం, ఎక్కువసేపు కదలకుండా ఉండటం, చదును పాదాలు, చదునైన చెప్పులు ఈ సమస్యకు కారణం. ఈ నొప్పి తగ్గడానికి కొన్ని వ్యాయామాలు ఉపయోగపడతాయి. ఉదయం లేవగానే పాదాలను సాగదీయడం, గోడకు చేతులు ఆనించి వంగడం వంటివి చేయాలి. ఎక్కువసేపు కూర్చుంటే మధ్యమధ్యలో నడవాలి. మడమల వద్ద మెత్తగా ఉండే చెప్పులు ధరించడం మేలు. నేలపై గుండ్రటి వస్తువును అదిమి ముందుకు వెనక్కూ కదల్చడం, తువ్వాలుతో పాదాన్ని లాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

Show More
Back to top button