మనల్ని గాయపరిచి, తూట్లు పొడిచే పుస్తకాలే మనం చదవాలి. ఫ్రాంజ్ కాఫ్కా. నేను సాహిత్యం తప్ప మరేమీ కాను, సాహిత్యం ద్వారానే జీవితాన్ని పట్టుకుని వేలాడుతున్నాను. దాన్ని కోల్పోతే అంతా కోల్పోయినట్టే. రచన చావు కన్నా గాఢమైన నిద్రలాంటిది. శవాల్ని వాటి సమాధుల్లోంచి లాగనట్టే, రాత్రుళ్లు నన్నూ నా డెస్కు నుంచి లాగలేరు ” అంటారు ఫ్రాంజ్ కాఫ్కా. ఆయన ప్రేగ్ నుండి వచ్చిన బోహేమియన్ రచయిత. అత్యంత ప్రభావవంతమయిన రచయితలలో ఫ్రాంజ్ కాఫ్కా ఒకరు. ఆయన తన జీవితాన్ని సంపూర్ణంగా సాహిత్యానికే వెచ్చించారు. అందుకే “డాంటే, షేక్స్పియర్, గెథెలకూ వారి వారి కాలాలకూ ఎలాంటి సంబంధం ఉందో, కాఫ్కాకూ మన కాలానికీ అలాంటి సంబంధమే ఉంది” అన్నారు బ్రిటిష్-అమెరికన్ కవి విస్టాన్ హ్యూ ఆడెన్. “నేను సాహిత్యానికి కనపడని గొలుసుల ద్వారా కట్టివేయబడ్డాను, ఎవరన్నా దగ్గరకొస్తే నా గొలుసులు ముట్టుకుంటున్నారేమో అని అరుస్తాను ” అంటారు ఫ్రాంజ్ కాఫ్కా.
కాల్పనిక సాహిత్యం కన్నా, రచయితల ఆత్మకథల పైనా, ఉత్తరాలపైనా ఎక్కువ ఆసక్తి చూపించేవారు కాఫ్కా. కౌమారంలోనే ఆయన “గెథె”, “క్లీస్ట్”, “నీషే, “స్పినోజా”, “డార్విన్” లను చదువుకున్నారు. ముఖ్యంగా “నీషే” ప్రభావం ఎక్కువగా ఉండేది. మనల్ని గాయపరిచి, తూట్లు పొడిచే పుస్తకాలే మనం చదవాలి. అంటారు కాఫ్కా. మన తల మీద మొట్టి నిద్ర లేపకపోతే ఎందుకిక పుస్తకాలు చదవటం? ఆనందం కోసమా! అసలు పుస్తకాలు లేకపోయినా మనం ఆనందంగానే ఉండగలం, ఆనందపెట్టే పుస్తకాలు మనమే చిటికెలో రాయగలం. నిజమైన పుస్తకాలు వేరు. అవి ఒక విపత్తులా, మనకన్నా ఎక్కువగా మనం ప్రేమించిన వారి చావులా, అందరికీ దూరంగా అడవుల్లోకి వెలి వేయబడటంలా, ఒక ఆత్మహత్యలా మనల్ని కదిలించాలి అనేది అతని ఉదేశ్యం. మనలో గడ్డకట్టుకుపోయిన సముద్రాలకి పుస్తకం ఒక గొడ్డలిపెట్టు కావాలి అంటారు కాఫ్కా. అయితే ఆయన వ్రాసిన పుస్తకాలు నిజంగా అలాంటి ప్రభావాన్నే చూపించేవి.
అత్యంత ప్రమాదకర రచయిత…
ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమయిన జర్మనీ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. సాహిత్యం లోని అస్థిత్వవాద శైలి పై ఆయన చేసిన రచనలు ప్రభావవంతమైనవి. ఆయన పలు నవలలు, కథలు వ్రాశారు. తన సంపూర్ణ జీవితాన్ని సాహిత్యానికే వెచ్చించారు కాఫ్కా. అతని సాహిత్యం ఇరవయ్యో శతాబ్దపు సందిగ్ధ మానవుని మనఃచైతన్యానికి ప్రాతినిధ్యం వహించగలిగింది. అతనికి సాహిత్య వ్యాసంగం పట్ల ప్రజలకు విపరీతమయిన వ్యామోహం ఉండేది. నిజానికి ఫ్రాంజ్ కాఫ్కా ఒక డ్రగ్ లాంటివాడు. ఇతని గురించి చదివినా, విన్నా తనను వదిలించుకోవడం చాలా కష్టం. రచయితగా అతను అత్యంత ప్రమాదకారి. ఆయన ఎప్పుడూ కూడా మెదడును తూట్లు పొడిచే పుస్తకాలు చదవమని అంటారు. చదవడమే కాదు, ఆయన మన మెదడును తూట్లు పొడిచే పుస్తకాలను వ్రాశారు.
నిజానికి కాఫ్కాకు భయం ఎక్కువ. కానీ ఆ భయం అతన్ని తిరుగులేని తత్వవేత్తను చేసింది. కాఫ్కా తత్వశాస్త్రం మొత్తం కలల గురించి అసంకల్పిత స్థితిగా మనం మదనపడే భయం గురించి ఉంటుంది. ఉదాహరణకు మనలో ప్రతీ ఒక్కరికి చందమామ అంటే ఇష్టం. అయితే ఆ చందమామను చూసి ఎవ్వరూ భయపడరు. కానీ మన కలలో చందమామను చూసి భయపడే అవకాశం ఉంది. మన మెలకువ జీవితంలో చందమామను చూసి ఇష్టపడతాం. కానీ కలలో మాత్రం ఎందుకు భయపడతాం అనే సందేహం వస్తుంది.
నిజానికి కలలో భయపడేది చందమామ వలన కాదు. మనలో అప్పటికే ఉన్న భయమే చందమామ మీదికి ప్రతిబింబించి అదే భయంగా మారుస్తుంది. సాధారణంగా చెప్పాలంటే కాఫ్కా రచన విధానం మొత్తం మన కలల నిర్మాణాన్ని అనుసరిస్తుంది. మన కలలో ఒక ధోరణి ఉంటుంది. మనం కలలో చంద్రుని చూసి భయపడినట్లుగా, మన కలలో కనపడే దృశ్యాలకు, వాటి వలన మనకు కలిగే భావాలకు అసలు పొంతనే ఉండదు. కేవలం ఒక్క భయం మాత్రమే కాదు, సంతోషం, కామం, ఉద్వేగం జుగుప్సా ఇలా ఏ భావానికైనా కూడా వర్తింపజేస్తుంది. కానీ ఇక్కడ కాఫ్కా జీవితం మొత్తం భయంతోనే నడుస్తుంది. అది తెలుసుకోవాలంటే ముందు ముందుగా కాఫ్కా కథ తెలుసుకోవాలి.
20 యేండ్లకే రచయిత కావాలని…
కాఫ్కా ఒక యూదుడు. అతని తండ్రి హెర్మన్ కాఫ్కా ఒక మొరటు మనిషి. ఆయన ఎప్పుడూ కటువుగా ఉండేవాడు. ఆయన పుట్టడమే పేదరికంలో పుట్టాడు గనుక తనకు కష్టపడి సంపాదించడం తప్పనిసరి అయిపోయింది. ఒక్కరోజు కూడా ఆయన తన పిల్లల్ని ప్రేమగా పలకరించిన పాపాన పోలేదు. అందువలన చిన్నప్పటినుండి కాఫ్కోకు తన తండ్రి పట్ల గానీ, జీవితం పట్ల గానీ భయం అలా పేరుకుపోయింది. పాఠశాల జీవితం కూడా అలా భయంగా సాగిపోయింది. పాఠశాల చదువు చదువుతూనే పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. క్రిస్టోఫర్ ప్రీస్ట్ (నవలా రచయిత), ఫ్రెడ్రిక్ నీట్షే, బరూచ్ స్పినోజా, డార్విన్ మొదలగు రచయితల రచనలు విపరీతంగా చదివారు.
వీరిలో ఫ్రెడ్రిక్ నీట్షే ప్రభావం అతనిపై గాఢంగా పడింది. ఇతనికి కథలు, నవలల కన్నా కూడా తత్వవేత్తల ఉత్తరాలు, జీవిత చరిత్రలు చదవడం చాలా ఇష్టం. అందుకే తాను ఎక్కువగా ఉత్తరాలు వ్రాసేవారు. నిజానికి అతని తత్వశాస్త్రం చదువుకోవడానికి అతను వ్రాసిన ఉత్తరాలు ఉపయోగపడ్డాయి. తనకు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి కాఫ్కా ఒక రచయిత కావాలని నిర్ణయించుకున్నారు. అదే విషయమై తన మిత్రునికి ఒక ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరంలో ఏముందంటే మనల్ని గాయపరిచి, మనల్ని తూట్లుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. మన తల మీద ఒకటి పీకి నిద్ర లేపకపోతే మనం ఎందుకు ఇంకా పుస్తకాలు చదవడం? పుస్తకాలు చదవడం ఆనందం కోసమా? అసలు పుస్తకాలు లేకపోయినా మనం ఆనందంగా ఉండగలం.
పెళ్ళికి ముందే శృంగారం…
నిజానికి ఆనందాన్ని కలిగించే పుస్తకాలు చిటికెలో మనమే వ్రాయగలం. కానీ నిజమైన పుస్తకాలు అందుకు భిన్నంగా ఉంటాయి. నిజమైన పుస్తకాలు ఒక విపత్తులా ఉండాలి. మనకన్నా ఎక్కువగా మనం ప్రేమించిన వారి చావులా ఉండాలి. అందరికీ దూరంగా అడవుల్లోకి వెలివేయబడడం, ఒక ఆత్మహత్యలా మనల్ని ఆ పుస్తకాలు కదిలించాలి. మనలో గడ్డకట్టిన సముద్రానికి, పుస్తకం ఒక గొడ్డలిపెట్టు కావాలి అంటారు కాఫ్కా. దీనిని బట్టి సాహిత్యం అనేది అతని మనసులో ఎంత బలంగా కూరుకుపోయిందో అంచనా వేయొచ్చు. అందుకే కాఫ్కా ఒకచోట నేను సాహిత్యం తప్ప మరేమి కాను అని అంటారు. సాహిత్యం ఆధారంగా నా జీవితాన్ని పట్టుకొని వేలాడుతున్నాను, అది పోగొట్టుకుంటే అన్నీ పోయినట్టే అని ప్రగాఢ నమ్మకం అని అంటారు కాఫ్కా. ఇకపోతే కాఫ్కా ప్రేమ జీవితాన్ని గనుక గమనిస్తే, కాఫ్కా ప్రేమలో పడేకంటే ముందే శృంగారం చేశారు. తన జీవితంలో శృంగారం ఒక్కోసారి ఇష్టపడేవారు, ఒక్కోసారి ద్వేషించేవారు. మనసు ఉసిగొలిపే కోరిక శరీరాన్ని దాటి పైకి ఎదగలేని శృంగారం స్వభావం తనను కృంగదీసేది. అందుకే “ఒకచోట ఇద్దరు కలిసిన పాపానికి భరించాల్సిన శిక్ష సంభోగం” అని ఆయన వ్రాసుకున్నారు. అలాగే ఆయన ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. రెండుసార్లు ఆయనకు తన ప్రియురాలుతో నిశ్చితార్థం కూడా అయ్యింది. తనే కావాలని ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఎందుకంటే కాఫ్కాకు పెళ్లి అంటే ఇష్టం లేదు, అతని పెళ్లి సరిపడదు అని తన ఉద్దేశ్యం.
క్షయ వ్యాధితో కాఫ్కా మరణం…
కాఫ్కా వివాహ పరిస్థితి దారుణం. తన ప్రియురాలు లేకుండా ఆయన ఉండలేరు, అలాగని ఆమెతో కలిసి బ్రతకలేరు. ఎటూ తెగని ఊగిసలాటతో తనను తానే బాధ పెట్టుకోవడమే కాకుండా, ఆమెను కూడా విపరీతంగా బాధపెట్టేవారు. ఆకర్షణ, వికర్షణలు ఒకేసారి అతనిపై పనిచేసి, అతనిని వణికించాయి. ఆమె పట్ల నిరంతర ఆలోచన కలిగి ఉండేవాడు. ఒక్కోసారి ఆమెకు నెలకు యాభైకి పైగా ఉత్తరాలు రాసే వ్రాసేవారు. వారిద్దరి జీవితం దాదాపు ఉత్తరాలతోనే సాగింది. ఆమెను కలవడానికి ఎన్నో అవకాశాలు తనకు ఉన్నాకానీ కలిసేవారు కాదు. కాఫ్కా ఆమెను దూరం పెట్టడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. అదేమిటంటే ఆమెకు సాహిత్యంలో ఓనమాలు కూడా తెలియకపోవడం. ఆయన చెప్పే మాటలు కానీ, అతను వ్రాసే వ్రాతలు కానీ, అతని తత్వశాస్త్రం కానీ ఆమె అర్థం చేసుకోలేకపోయేది. వారిద్దరి మధ్య ఒక సంఘర్షణ మొదలయ్యేది.
ఈ విధంగా తాను మదనపడుతూ ఉండగా ఒకసారి తన ప్రియురాలికి ఒక ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది. “నా రచనకు గాఢమైత్రి నీతోనే, బద్ధ శతృత్వం కూడా నీతోనే, అందుకే అది నిన్ను ఎంతగా ఇష్టపడిందో, తనను కాపాడుకునే పరిస్థితి వచ్చేసరికి అంతకంటే ఎక్కువ వ్యతిరేకించింది” అని వ్రాశారు. కానీ అతను మాత్రం ఏదిజీవితాంతం వేదన అనుభవించారు. ఒకప్రక్క తండ్రి, ఒకప్రక్క ప్రేయసి, ఇంకోపక్క క్షయ వ్యాధి, మరోపక్క సాహిత్యం, ఈ నాలుగే అతని వేదనకి కారణమయ్యాయి. ఆయన భరించలేని వేదనతో, తనలో పడే తపనతో మనకు తిరుగులేని తత్వశాస్త్రాన్ని అందించిపోయారు. దాంతో కాఫ్కా రచనలు సాహిత్యంలో ఒక ఆధునికత మొదలైంది. అప్పటివరకు ఉన్న తత్వవేత్తలు అందరూ వాస్తవ జీవితాన్ని పునాది చేసుకుని వ్రాస్తే, కాఫ్కా మాత్రం మనలో ఉన్న భయాన్ని అంతర్లీనంగా ఉండే స్వప్నాలపై వ్రాయడం మొదలుపెట్టారు. దాంతో సాహిత్యంలో కొత్త శకం మొదలైంది. ఏది ఏమైనా ఫ్రాంజ్ కాఫ్కా తన నలభై ఏళ్ళ వయసులో క్షయ వ్యాధితో మరణించారు.
కాఫ్కా నిషిత దృష్టి కలవాడు…
కాఫ్కా తాను మరణించిన తరువాత తన రచనల్ని, సాహిత్యాల్ని, ఉత్తరాలని తగలబెట్టమని తన మిత్రుడికి చెప్పారు. కానీ ఆ మిత్రుడు ఆ రచనలని తగలబెట్టకుండా వాటిని ప్రచురింపజేశారు. కాబట్టే మనం ఇప్పటికీ కూడా కాఫ్కా రచనలు చదవగలుగుతున్నాం. అయితే ఫ్రాంజ్ కాఫ్కా చనిపోయిన మూడు రోజుల తరువాత ఆయనను అర్థం చేసుకున్న తన మాజీ ప్రేయసి వ్రాసిన నివాళి అప్పట్లో ఒక వార్త పేపరులో ప్రచురింపబడింది. కాఫ్కాను ఆమె ఎంత లోతుగా అర్థం చేసుకుందో ఆ నివాళి చెబుతుంది. అతను సిగ్గరి, భయస్థుడు, సున్నిత మనస్కుడు, మంచివాడు. కానీ తాను వ్రాసిన పుస్తకాలు మాత్రం క్రూరమైనవి, బాధపెట్టేవి.
అతను ప్రపంచాన్ని అదృశ్య భూతాలతో నిండి ఉన్నట్టుగా నిత్యం నిస్సహాయమైన మనసులపై విరుచుకుపడి వారిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగాను చూశాడు. అతను నిషిత దృష్టి కలవాడు, జీవించలేనంత విజ్ఞుడు, పోరాడలేనంత బలహీనుడు. కానీ ఇది స్వచ్ఛమైన మనషులకు ఉండే బలహీనత. తన బలహీనతలను ముందే ఒప్పేసుకుని లొంగిపోయి, తద్వారా విజేతలే సిగ్గు పడిపోయే పరిస్థితి కలిగించేస్తారు. ఇది ఆమె అతడిని అర్థం చేసుకున్న నిజమైన తీరు. చివరగా కాఫ్కా గురించి తన దినచర్య నుండి ఒక మాటతో ముగించాలి అంటే పరిమిత వృత్తం స్వచ్ఛమైనది అంటాడు. జీవితం మొదట్లో చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే నీ జీవితపు వృత్తాన్ని అంతకంతకు కుదించుకుంటూ రావాలి. అంతే కాదు నీవు ఆ వృత్తానికి వెలుపలు ఎక్కడ ఉన్నామో అని నీకు నీవే పరిశీలన చేసుకోవాలి.










