Telugu Featured NewsTelugu News

ప్రధాని పిలుపు: పొదుపు వైపు అడుగులా? ఆర్థిక సంక్షోభ సూచనలా?

ప్రధాని పిలుపు పొదుపు వైపు అడుగులా? ఆర్థిక సంక్షోభ సూచనలా? భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక క్లిష్టమైన సంధిగ్ధంలో ఉంది. ఒకవైపు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న శక్తిగా.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నామని గంభీరమైన నినాదాలు వినిపిస్తుంటే, మరోవైపు రూపాయి విలువ పతనం, పెరుగుతున్న దిగుమతుల భారం సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. చమురు, బంగారం, యూరియా వంటి కీలక వస్తువుల దిగుమతుల కోసం మనం బిలియన్ల కొద్దీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఇటీవల ప్రధాని మోదీ చేసిన ‘వినియోగ నియంత్రణ’ విజ్ఞప్తులు కేవలం పొదుపు సూచనలు మాత్రమే కావు, అవి దేశ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న లోతైన అసమతుల్యతకు హెచ్చరికలు. నిజమైన అభివృద్ధి అంటే కేవలం ఎక్స్‌ప్రెస్ హైవేలు, షేర్ మార్కెట్ రికార్డులు మాత్రమే కాదు; ఒక సామాన్యుడు ధరల పెరుగుదలకు భయపడకుండా తన వంటగదిని, పిల్లల భవిష్యత్తును నమ్మకంగా చూసుకోగలగడమే అసలైన పురోగతి.

మన ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా ఉన్న ముడి చమురు ధరలు ప్రపంచ మార్కెట్‌లో మండుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మరియు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు బ్యారెల్ ధరను 70 డాలర్ల నుండి 120 డాలర్లకు చేర్చాయి. ఇది కేవలం రవాణా ఖర్చులను మాత్రమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలను కూడా ఆకాశానికి ఎత్తుతోంది. చమురు తర్వాత బంగారం, యూరియా దిగుమతుల కోసం మనం చేస్తున్న ఖర్చు విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.

ఫిబ్రవరిలో 728 బిలియన్ డాలర్లుగా ఉన్న మన విదేశీ మారక నిల్వలు, మే నాటికి 690 బిలియన్ డాలర్లకు పడిపోవడం గమనార్హం. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం, 2026లో మన కరెంట్ అకౌంట్ లోటు 84 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. ఈ గణాంకాలు దేశం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందా అన్న అనుమానాలను కలిగిస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు విదేశీ ప్రయాణాలు, చమురు మరియు బంగారు వినియోగాన్ని తగ్గించుకోమని ప్రజలను కోరుతోంది.

మరోవైపు, అభివృద్ధి కేవలం గణాంకాల్లోనే కనిపిస్తోందా అన్న ప్రశ్న సామాన్యుడిని వేధిస్తోంది. జీడీపీ పెరుగుతున్నప్పటికీ, మధ్యతరగతి కుటుంబాల ఈఎంఐలు, వైద్య, విద్యా ఖర్చులు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వం సబ్సిడీల ద్వారా ప్రజలకు రక్షణ కవచంగా ఉండేది. కానీ ఇప్పుడు ‘తగ్గించుకోండి, పొదుపు చేయండి’ అనే సందేశాలు బాధ్యతను ప్రజలపైకి నెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. సంపాదన పెరగకపోయినా ఖర్చులు రెట్టింపు అవ్వడం వల్ల జీవితం కేవలం అప్పులు తీర్చడానికే పరిమితమవుతోంది. నిరుద్యోగం, పెరుగుతున్న వడ్డీ రేట్లు యువతలో అసహనాన్ని కలిగిస్తున్నాయి. కేవలం బిలియనీర్ల సంఖ్య పెరగడం దేశ బలానికి కొలమానం కాకూడదని, సామాన్యుడి జీవన ప్రమాణం పెరగడమే నిజమైన సంక్షేమమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ గడ్డు పరిస్థితి నుండి గట్టెక్కడానికి తక్షణమే సమగ్రమైన ‘ఇంధన విప్లవం’ అవసరం. పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను 30 శాతానికి పెంచడం, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఎలక్ట్రిక్ వాహన రంగాలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయడం ద్వారా చమురు దిగుమతుల భారం తగ్గించుకోవచ్చు. అలాగే, యూరియా దిగుమతులను తగ్గించే నానో యూరియా వాడకాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతును స్వావలంబన దిశగా నడిపించాలి. రూపాయి విలువను కాపాడటానికి గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్‌ను పునర్వ్యవస్థీకరించాలి మరియు ఇతర దేశాలతో రూపాయి ఆధారిత వాణిజ్యాన్ని విస్తరించాలి. అన్నింటికంటే ముఖ్యంగా, సెమీకండక్టర్లు, ఏఐ వంటి ఆధునిక రంగాల్లో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆర్థిక గణాంకాలు గంభీరంగా ఉండటమే కాదు, ఆ ప్రయాణంలో సామాన్యుడి శ్వాస ఆగిపోకుండా చూడటమే పాలకుల అసలైన కర్తవ్యం.

Show More
Back to top button