Telugu Politics

ఎస్సీల వర్గీకరణ.. బీజేపీ ఓటు బ్యాంకుగా పరిగణిస్తుందా..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్‌లో నిర్వహించిన అణగారిన వర్గాల విశ్వరూప సభకు ప్రధాని మోడీ హాజరయ్యన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రధాని మోడీ మాదిగల పోరాటంలో తోడుంటానని, ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మార్పీఎస్‌ డిమాండ్లను బీజేపీ అంగీకరించిందా? లేదా దేశంలో ఉన్న మాదిగల మాదిరి దళిత ఉప కులాల ఓట్లను ఆకర్షించడానికి దీన్నొక రాజకీయ అస్త్రంగా వాడుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై అనేక కమిషన్ల నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పులు, అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాలు కేంద్రం దగ్గర ఉండగా.. మరోసారి కమిటీ వేసి తేలుస్తామనడం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నమేననే చాలామంది అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.

మరీ ముఖ్యంగా నిర్దిష్టంగా ఒక సెక్షన్ ఓటర్లను నమ్మించేందుకే ఈ సభని, కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే ఈ ఎత్తుగడ వేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఈ అంశం పక్కకి పోతుందని, కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల పార్టీల వైపు మాదిగ ఓటు బ్యాంకు వెళ్లకుండా చూడడానికి మోడీ ఈ అంశాన్ని తీసుకొచ్చినట్లు వాదనలు వినిపిస్తున్నాయి.

నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, విపక్షాలు సైతం.. ఎన్నికల నేపధ్యంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. కానీ, ఏ పార్టీ కూడా దీని అమలకు పూనుకోలేదు. చివరికి బీజేపీ తన 2014 మేనిఫెస్టోలోనే వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించింది. అప్పటి నుంచి పదేళ్లుగా MRPS నాయకులు కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలు ఇస్తూ వస్తున్నారు. అప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా చట్టబద్ధత ఇవ్వలేకపోయింది.

ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ వచ్చి MRPSకి మద్దతు తెలుపుతూ, ఒక కమిటీ వేస్తామని చెప్పారు కానీ.. ఆర్టికల్‌ 370 లాగా చట్ట సవరణ చేసి, వర్గీకరణ చేపడతామని ఎక్కడా అసలు చెప్పలేదు. ఎందుకంటే ఈ వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయడం అంత సులభం కుదరదు. దీనికి పార్లమెంట్‌లో రెండు సభల ఆమోదంతో పాటు దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం అవసరం అవుతుంది. YSR ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అఖిలపక్షాన్ని, ప్రత్యేక బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయినా కూడా అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అంతగా పట్టించుకోలేదు.

ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం తీర్మానం చేసి పంపింది. కానీ కేంద్రం దీనిపై చొరవ తీసుకోలేదు. ఏదీ ఏమైనప్పటికీ.. ఈసారి మోడీ కేవలం వాగ్దానాలు చేసి వాటిని తుంగలో తొక్కిన ఇతర రాజకీయ నేతల జాబితాలో చేరతారా అనేది కొన్ని రోజుల్లోనే తెలుసుపోతుంది.

Show More
Back to top button