
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా అంటే -టైమ్ మ్యాగజైన్ ‘టైమ్ 100’ లిస్టు. ప్రతిష్ఠ, ప్రాముఖ్యత కలిగిన ఈ జాబితాలో 2025 ఏడాదికి ఎంపికైన వారిలో ఈసారి భారత్ నుంచి నేరుగా ఎవరూ లేకపోయినా… భారత మూలాలున్న అమెరికన్ మహిళ ఒకరు చోటు దక్కించుకున్నారు. ఆమె ఎవరో కాదు – అమెరికన్ బయోటెక్ దిగ్గజ సంస్థ వెర్టెక్స్ ఫార్మా సీఈవో రేష్మా కేవల్రమణి.
ముంబయిలో జన్మించిన రేష్మా 1988లో అమెరికాకు వెళ్లారు. వైద్య విద్యను బోస్టన్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో ఫెలోషిప్ పూర్తి చేసిన తరువాత, 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పూర్తిచేశారు. 2017లో వెర్టెక్స్లో చేరిన రేష్మా, కేవలం రెండేళ్లలోనే సీఈవోగా ఎదిగారు – ఇది ఆమె ప్రతిభకు నిదర్శనం.
2020లోనే రేష్మా, అమెరికాలో ఒక ప్రధాన బయోటెక్ సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. కానీ ఆమె గొప్పతనం అక్కడే ఆగిపోలేదు. ఆమె నేతృత్వంలో వెర్టెక్స్ ఫార్మా సికిల్ సెల్ అనీమియా వంటి జన్యు సంబంధిత వ్యాధులకు సంచలనాత్మకమైన చికిత్సను అభివృద్ధి చేసింది. CRISPR టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ జీనో ఎడిటింగ్ చికిత్సకు అమెరికా FDA ఆమోదం లభించింది – ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రథమంగా జరిగిన మెడికల్ మైలురాయి.
టైమ్ మ్యాగజైన్ ఈ ఆవిష్కరణను, ఆమె దూరదృష్టి నాయకత్వాన్ని గుర్తించి ‘ప్రభావవంతమైన వ్యక్తులు’ జాబితాలో ఆమెను చేర్చింది. జింగో బయోవర్క్స్ వ్యవస్థాపకుడు జాసన్ కెల్లీ మాట్లాడుతూ, “రేష్మా చూపిన దారిలోనే భవిష్యత్ మెడిసిన్ సాగనుంది. మన శరీరాలు మాట్లాడే డీఎన్ఏ భాషతోనే కొత్త మందులు రూపొందుతాయి. ఇది ఆరోగ్య రంగానికి విప్లవం,” అని అన్నారు.
భారతీయ మూలాలు ఉన్నప్పటికీ, ప్రపంచ ఆరోగ్య రంగంలో తన ముద్ర వేసిన రేష్మా, మహిళా నేతృత్వం, వైద్య విజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తూ టైమ్ మ్యాగజైన్ జాబితాలో భారత ప్రతిష్టను నిలబెట్టారు. ఇది గర్వించదగిన ఘట్టమే.