Telugu News

విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి

జాతీయస్థాయిలో విపక్ష కూటమి ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార పక్షం విజ్ఞప్తి చేసినప్పటికీ.. విపక్ష పార్టీలు తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు విశ్రాంత ణ్యామూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నిర్ణయానికి ‘ఇండియా కూటమి’లోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రతిపక్షాలన్నీ ఒకే పేరును అంగీకరించడం ప్రజాస్వామ్యానికి గొప్ప విజయమని ఖర్గే పేర్కొన్నారు.

జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి దేశంలోని ప్రఖ్యాత న్యాయనిపుణులలో ఒకరు. ఆయన ఆంధ్రప్రదేశ్, గువాహటి హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో కూడా సేవలందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందని ఖర్గే తెలిపారు. 1946 జూలైలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారంలో జన్మించిన ఆయన, 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా, 2005లో గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా ఆయన సేవలందించారు.

మరోవైపు, ఎన్డీయే అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. ఈ విషయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసి మద్దతు కోరారు. అయితే, ఇప్పుడు విపక్షాలు కూడా తమ అభ్యర్థిని ప్రకటించడంతో రాధాకృష్ణన్, సుదర్శన్ రెడ్డిల మధ్య పోటీ అనివార్యమైంది.

Show More
Back to top button