CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో తొలి అభ్యుదయ చిత్రం… షావుకారు సినిమా..

సినిమా ఒక వ్యాపారం, లాభాలు దాని లక్ష్యం. అంతేకాదు జనం మెచ్చిందే మంచి సినిమా, జనం అంటే కలెక్షన్, కలెక్షన్ అంటే డబ్బు. నిర్మాతల దృష్టిలో సినిమా విజయానికి కొలబద్ద గల్లాపెట్టె గలగలలే. ఆ గలగలలు లేనినాడు సినిమాలో నిలువెత్తు బంగారం ఉన్నా, అది నిరర్థకం అన్నది వారి నిశ్చితాభిప్రాయం. కొన్నిసార్లు సాహిత్య విలువలు, సామాజిక స్పృహ ఉన్న సినిమాలను, సినిమా ప్రతికూల సమీక్షకులు మెచ్చినా కూడా జనం తీర్పు మరోలా ఉండి అది అపజయానికి దారి తీయవచ్చు. అలాంటి కోవలోకి వచ్చే చిత్రం షావుకారు. తెలుగులో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయ చిత్రంగా “షావుకారు” సినిమాను చెప్పుకోవచ్చు. అభ్యుదయ కళలపట్ల గానీ, ప్రజా ఉద్యమాల పట్ల గానీ ఎంత మాత్రం సానుభూతి, లక్ష్యము లేని “చక్రపాణి” గారు విజయా పతాకం మీద “నాగిరెడ్డి” గారితో కలిసి తీసిన మొదటి సినిమా ఇది.

పదహారణాల తెలుగు పల్లె కథను, గ్రామీణం ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం “షావుకారు”. ఏ ద్వేషాలు లేని మానవ సంబంధాలే ధ్యేయంగా కొత్త సమాజాన్ని నిర్మించుకోవాలని ఈ షావుకారు సినిమా చెబుతుంది. ఈ సినిమా కథను చక్రపాణి సమకూర్చారు, సంభాషణలు కూడా చక్రపాణి గారే వ్రాశారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే దర్శకులు ఎల్వీ ప్రసాద్ గారే వ్రాసుకున్నారు. పాటలు సముద్రాల రాఘవాచార్య గారు వ్రాశారు. పల్లెటూర్లలో మనం చూసే సమస్త రకాల మనుషులు ఇందులోకి వస్తారు. వాళ్ళ స్వభావాలు, కోరికలు, మంచితనాలు, మంకుతనాలు, అచ్చట్లు, ముచ్చట్లు అన్నీ కనిపిస్తాయి. వాళ్ళ మాటల్లోనే అమాయకత్వం, గడుసుతనము ప్రతిఫలిస్తాయి.

అసలు సినిమాలలో మృగ్యంగా ఉండేది వాస్తవికత. కానీ “షావుకారు” సినిమాలో వాస్తవికత నూటికి నూరుపాళ్ళు. చెంగయ్య, రామయ్య, కోమటి బంగారయ్య, పంతులు, చాకలిరామి, సున్నం రంగడు ఈ పాత్రలన్నింటినీ ఇతర చిత్రాలలో మనం చూసినా, “షావుకారు” సినిమాలో ఉన్నంత సహజంగా ఏ సినిమాలో ఉండవు. “షావుకారు” సినిమాలో , అవసరమైనంత నాటకీయత, సంఘర్షణ ఉన్నది. కానీ అప్పటికే చెత్త సినిమాల ప్రభావంతో బుర్రలు చెడి ఉన్న జనం, దాని నాటకీయత, సంఘర్షణ కృతకంగా ఎగదోయడం వలన  ఈ సినిమాను జనం ఎగబడి చూడలేదన్నది నిజం. షావుకారు సినిమా ఈరోజుకీ చూసినా మనకు కనిపించేది ఒక్కటే. ఎలాంటి నాటకీయత లేకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సూటిగా చెప్పారు.

నిజానికి విజయా వారు తీసిన చిత్రాలన్నింటిలోనూ కాసింత సాహిత్య విలువలు, సామాజిక స్పృహ ఉన్న ఏకైక సినిమా ఈ “షావుకారు”. ఈ సినిమా అజరామర చిత్రంగా పేరు తెచ్చుకుంది. కానీ కాసులు మాత్రం సంపాదించలేకపోయింది. విజయా సంస్థ తరువాత మరెన్నడూ ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. పూర్తి జనరంజక సినిమాలు తీసి బాక్సాఫీసును వినువీధిలో ఏళ్లతరబడి తన బావుటాను ఎగరవేసింది..

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :    ఎల్.వి.ప్రసాద్

సహాయ దర్శకుడు :  తాతినేని ప్రకాశరావు 

నిర్మాణం   :     నాగిరెడ్డి, చక్రపాణి

తారాగణం  :   షావుకారు జానకి, నందమూరి తారక రామారావు, గోవిందరాజులు సుబ్బారావు, ఎస్.వి.రంగారావు, శాంతకుమారి, పద్మనాభం, వల్లభజోస్యుల శివరాం, వంగర, టి.కనకం, శ్రీవాత్సవ, మాధవపెద్ది సత్యం, మోపర్రు దాసు

సంగీతం    :    ఘంటశాల వెంకటేశ్వరరావు

నేపథ్య గాయకులు :  ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, కృష్ణవేణి జిక్కి, ఎమ్.ఎస్.రామారావు, పిఠాపురం నాగేశ్వరరావు, బాలసరస్వతీరావు

కథ, మాటలు, పాటలు  :  చక్రపాణి 

ఛాయాగ్రహణం  :   మార్కస్ బార్ట్‌లే

కళ           :      మాధవపెద్ది గోఖలే

కూర్పు      :    నాగిరెడ్డి

నిర్మాణ సంస్థ    :    విజయా వారి చిత్రం

నిడివి      :     177 నిమిషాలు

విడుదల తేదీ   :     07 ఏప్రిల్ 1950

భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

ఈ సినిమా గ్రామీణ నేపథ్యాన్ని తలపిస్తుంది. ఒక పల్లెటూరులో రైతు రామయ్య, వడ్డీ వ్యాపారి చెంగయ్య ఇరుగుపొరుగున నివసిస్తుంటారు. రామయ్యకు ఒక కుమారుడు నారాయణ, కోడలు శాంతమ్మ, పెళ్ళీడుకు వచ్చిన చిన్న కుమార్తె సుబ్బులు ఉంటారు. చెంగయ్యకు ఒకే ఒక్క కుమారుడు ఉంటాడు. తన పేరు సత్యం. తాను పట్టణంలో చదువుకున్నాడు. ఈ రెండు కుటుంబాలు ఒకరికొకరు చాలా స్నేహపూర్వకంగా ఉంటుండేవి. సుబ్బులు, సత్యం ఇద్దరూ ప్రాణమిత్రులు లాగా ఉంటారు అని ఊరిలో అందరూ భావిస్తుండేవారు. రెండు కుటుంబాల మధ్య స్నేహం బాంధవ్యంగా మారుతుందనుకున్న తరుణంలో కథ మారిపోతుంది. చెంగయ్య తండ్రి పరోపకారి. ఒక సత్రం లాంటి ఇంటిని నిర్మించి పేద ప్రజల అవసరాలకు తగిన ఏర్పాట్లు చేస్తాడు. కానీ చెంగయ్య పాలనలో అది వాణిజ్య పరంగా మారి వివాదాలకు వేదికగా మారుతుంది. చెంగయ్య స్వార్థం వల్లే ఇలా జరుగుతోందని గ్రామస్తులు గ్రహిస్తారు.

నారాయణ సహాయంతో గ్రామంలోని యువకులు షావుకారు చెంగయ్యను ప్రశ్నిస్తారు. ఈ సంఘటనతో రామయ్య, చెంగయ్య కుటుంబాల మధ్య స్నేహం చెదిరిపోయి వారిమధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. సెలవుల కోసం స్వంత ఊరికి తిరిగి వచ్చిన సత్యం ఈ సంఘటనలు చూసి బాధపడతాడు. చెంగయ్య కోపంతో రామయ్య కుటుంబాన్ని రోడ్డు పైకి లాగుతాడు. గతంలో రామయ్యకు స్నేహపూర్వకంగా ఇచ్చిన అప్పులను అతను తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తాడు. చెంగయ్య రామయ్య కొడుకు నారాయణపై చట్టపరమైన కేసు పెట్టి జైలు పాలు చేయిస్తాడు. చెంగయ్య తన రౌడీ అసిస్టెంట్ సున్నం రంగడు సహాయంతో వ్యవసాయ పొలాలకు నిప్పు పెట్టిస్తాడు. ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు గ్రామంలో పెద్ద సమస్యగా మారుతాయి. దీనికి పరిష్కారం ఏమిటి? రామయ్య, చెంగయ్య కుటుంబాల మధ్య స్నేహం ఎలా తిరిగి వస్తుంది? సుబ్బులు, సత్యంల పెళ్లి తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికిన తరువాత సినిమా కథ సమాప్తం అవుతుంది.

విజయా ప్రొడక్షన్స్

విజయా ప్రొడక్షన్స్ అనగానే గుర్తుకు వచ్చే పేర్లు నాగిరెడ్డి – చక్రపాణి. జీవితంలో స్నేహాలు ఎలా ఏర్పడతాయి అనడానికి నాగిరెడ్డి – చక్రపాణి లే ఉదాహరణ. వీరిరువురు ఒక ఊరికి సంబంధించిన వారు కానే కాదు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు అస్సలు కాదు. ఒక వ్యాపారంలో ఉన్నవారు కాదు, ఇద్దరి అభిరుచులు ఒకటి కాదు. కానీ వీరి స్నేహం కలిసాక జీవితాంతం ఆప్తమిత్రులుగా, ప్రాణ మిత్రులుగా కొనసాగారు. చాలా అద్భుతమైన, స్నేహపూర్వకమైన కథ వారిద్దరి మధ్య అనుబంధం.

చక్రపాణి..

చక్రపాణి గారు బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. తనది తెనాలి దగ్గర ఐతనగరం. తన అసలు పేరు ఆలూరు వెంకట సుబ్బారావు. చిన్నప్పుడే తాను ఉన్నత పాఠశాల విద్య అయిపోగానే చదువు మానేశారు. తాను హిందీ చదివుకుని అందులో ధృవపత్రం కూడా పొంది, హిందీ పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేస్తుండేవారు. అలా ఉండగా తనకు వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత తనకు క్షయ వ్యాధి సోకింది. ఆ క్షయ వ్యాధిని నయం చేసుకోవడానికి తాను ముదినేపల్లిలో గల దవఖానలో చేరారు. ఆ సందర్భంలో తనకున్న రెండు ఊపిరితిత్తులలో ఒక ఊపిరితిత్తును పూర్తిగా తొలగించారు. ఇది జరిగినప్పుడు తన వయస్సు కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు. అప్పటినుండి ఆ ఒక్క ఊపిరితిత్తుతో తాను మరో యాభై ఏళ్లు జీవించారు. తాను దవఖానలో ఉన్నప్పుడు తన ప్రక్క మంచం మీద బెంగాలీ అతను ఉండేవారు.

ఆ బెంగాలీ దగ్గర బెంగాలీ భాష నేర్చుకొని బెంగాలీ పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేయడం మొదలుపెట్టారు. అలా అనువాదం చేయడమే కాకుండా సాహిత్యం మీద ఆసక్తి పెంచుకొని తన కలం పేరు “చక్రపాణి” అని పెట్టుకుని తెనాలిలో కొన్ని పత్రికలు కూడా నడుపుతూండేవారు. పుస్తకాలు ప్రచురించడం, పత్రికల నిర్వహణ కోసం చక్రపాణి గారు అప్పుడప్పుడు మద్రాసుకు వెళుతుండేవారు. 1939 సంవత్సరంలో పుల్లయ్య గారు “ధర్మపత్ని” తీస్తున్నారు. ఆ సినిమాకు మాటల రచయితగా రామారావు గారు “చక్రపాణి” గారిని సిఫారసు చేశారు. అలా మొట్టమొదటిసారిగా మాటల రచయితగా ధర్మపత్రి సినిమాతో సినిమా రంగప్రవేశం చేశారు చక్రపాణి గారు. ఆ సినిమా పూర్తయిన తరువాత మళ్లీ తెనాలి వచ్చి యధావిధిగా పత్రిక నిర్వహణ పనులు చూసుకుంటున్నారు.  1944 – 1945 ప్రాంతాలలో చక్రపాణి గారితో  “స్వర్గసీమ” సినిమాకి మాటలు వ్రాయించారు బి.ఎన్.రెడ్డి గారు. ఆ స్వర్గసీమ సినిమా అయిపోయాక తాను తెనాలి వెళ్ళిపోవాలనుకున్నారు.

నాగిరెడ్డి..

ప్రఖ్యాత దర్శకుడు బి.ఎన్.రెడ్డి గారి తమ్ముడే బి.నాగిరెడ్డి గారు. తాను కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఉల్లిపాయల వ్యాపారంలో ఉంటూ రంగూన్ కు ఉల్లిపాయలు ఎగుమతి చేస్తుండేవారు. ప్రపంచ యుద్ధం రావడంతో ఉల్లిపాయల వ్యాపారం మానేసి తమ సొంత “ప్రెస్” నడుపుతుండేవారు. బి.ఎన్.రెడ్డి గారి సినిమాలను నాగిరెడ్డి గారే ప్రచారం చేస్తుంవారు. తాను నడిపించే ప్రెస్ కు పుస్తకాల ముద్రణ కోసం చక్రపాణి గారు వెళుతుండేవారు. అలా వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. “ధర్మపత్ని” సినిమా జరుగుతుండగానే చక్రపాణి గారి భార్య మరణించారు. తన ఇద్దరు పిల్లలు చక్రపాణి గారి అత్తగారింట్లో ఉంటున్నారు. దాంతో నాగిరెడ్డి గారి సూచన మేరకు చక్రపాణి గారు మద్రాసు లోనే ఉండిపోయారు. అలా మొదలైంది వారి కుటుంబ స్నేహం. నాగిరెడ్డి గారు వ్యాపారం చూసుకునేవారు, చక్రపాణి గారు సృజనాత్మక రంగాల వైపు, రచనల వైపు ఉంటూ 1944 లో “ఆంధ్రజ్యోతి” అనే మాసపత్రికను స్థాపించారు. అది బాగానే నడిచింది.

1947 జూలైలో పిల్లల కోసం “చందమామ” అనే మాసపత్రికను స్థాపించి దానిని నడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా 1949లో వాహినీ స్టూడియోస్ ను అమ్మేస్తున్న మూల నారాయణస్వామి గారి వద్ద నాగిరెడ్డి – చక్రపాణి గార్లు ఆ స్టూడియోను ముందుగా లీజుకు తీసుకున్నారు. కాలక్రమేణా ఆ స్టూడియోను కొనుగోలు చేశారు. ఆ తరువాత 1949లో విజయా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి చక్రపాణి గారు సూచించిన “షావుకారు” అనే కథతో సినిమా తీయాలనుకున్నారు. ముందుగా ఆ సినిమాకు రచయితగా ఆచార్య ఆత్రేయ గారిని అనుకున్నారు. కానీ తనుకు అనారోగ్య సమస్యలు ఉండడంతో పాలగుమ్మి పద్మరాజు గారిని అనుకున్నారు. తనకు కూడా ఏవో ఇబ్బందులు ఉండడంతో తప్పనిసరి పరిస్థితులలో చక్రపాణి గారు తానే సంభాషణలు వ్రాయడానికి పూనుకున్నారు. “మనదేశం”, “గృహప్రవేశం” లాంటి  విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఎల్వీ ప్రసాద్ గారిని దర్శకుడుగా అనుకున్నారు. పాటల కోసం సముద్రాల  రాఘవాచార్య గారిని ఎంచుకున్నారు.

ఎన్టీఆర్ నేపథ్యం…

నందమూరి తారకరామారావు గారు బి.ఏ పూర్తి చేసి నాటకాలు వేసుకుంటుండేవారు. తన గురించి తెలుసుకున్న ఎల్వీ ప్రసాద్ గారు తన సహాయకుడు తాతినేని ప్రకాశరావు గారిని ఎన్టీఆర్ గారి వద్దకు పంపించి ఆయనను మద్రాసుకు రప్పించి స్క్రీన్ టెస్ట్ చేసి ఎన్టీఆర్ గారి ఫోటోలు తీశారు. ఎన్టీఆర్ గారికి వేషాలు ఇవ్వడానికి ఎల్వీ ప్రసాద్ గారి వద్ద వేషాలు గానీ, పాత్రలు గానీ లేవు. తాను తీయబోయే తరువాత సినిమాలలో వేషాలు ఇస్తామన్నారు. ఈలోగా ఎన్టీఆర్ గారికి సబ్ రిజిస్టార్ గా గుంటూరులో ఉద్యోగం వచ్చింది. మూడు నాలుగు వారాలు ఉద్యోగం చేశారు. ఈలోగా తనకు మద్రాసు నుండి ఇంకో ఉత్తరం వచ్చింది. బి.ఏ.సుబ్బారావు గారి దర్శకత్వంలో ఒక సినిమాలో వేషం ఉంది, నటించాలని రమ్మని ఎల్వీప్రసాద్ గారు ఆ ఉత్తరం ఎన్టీఆర్ గారికి వ్రాశారు.

అప్పటికే ఎన్టీఆర్ గారికి ఒక కొడుకు, సబ్ రిజిస్టార్ ఉద్యోగం. ఇవన్నీ వదులుకొని మద్రాసు వెళ్లగలనా? మద్రాసులో స్థిరపడగలనా? లేదా? అని ఆలోచించి నిర్ణయం తీసుకొని మద్రాసుకు వెళ్లారు. ఎన్టీఆర్ గారు “నేను సినిమాలకు పనికొస్తానా లేదా” అని ఎల్వీ ప్రసాద్ గారిని కొంచెం గట్టిగానే అడిగారు. దానికి సమాధానంగా బేషుగ్గా పనికొస్తావని ఎల్వీ ప్రసాద్ గారు బదులివ్వడమే కాకుండా తాను ఎన్టీఆర్ గారిని బి.ఏ సుబ్బారావు గారి వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు నడిచొచ్చే విధానం చూసిన బి.ఏ సుబ్బారావు గారు తాను తీయబోయే సినిమాలో కథనాయకుడిగా ఎన్టీఆర్ గారినే ఎంచుకున్నారు. ఆ సినిమానే “పల్లెటూరు పిల్ల”. అందులో మరో హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు. అలా ఆ సినిమాలో నటిస్తుండగా “షావుకారు” సినిమాకు ఎన్టీఆర్ గారిని హీరోగా తీసుకున్నారు. 

నటీనటుల ఎంపిక…

చక్రపాణి గారికి కూడా ఎన్టీఆర్ గారిని చూడగానే స్ఫురద్రూపి, అందగాడు, మొహంలో కళ ఉంది, చురుకుగా ఉన్నాడు అనుకున్నారు. ఎన్టీఆర్ గారు అప్పటికే పల్లెటూరు పిల్ల సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాకు ఎన్టీఆర్ గారిని ఎంపిక చేసుకున్నారు చక్రపాణి గారు. కథానాయిక కోసం శంకరమంచి జానకిని తీసుకున్నారు. వాళ్ళ నాన్న పేరు టేకుమల్ల వెంకోజీరావు. రాజమండ్రిలో ఆంధ్ర పేపరు మిల్లులో పనిచేస్తున్నారు. వాళ్ళ పెద్దమ్మాయి జానకి, రెండో అమ్మాయి కృష్ణకుమారి. అప్పటికే ఆమెకు పెళ్లయి ఒక పాప కూడా ఉంది. జానకి వయస్సు పదిహేడు సంవత్సరాలు. ఆమె ఆల్ ఇండియా రేడియోలో నాటకాలు వేస్తుండేవారు. రేడియో ప్రసారంలో ఆమె గొంతు విన్న బి.యన్ రెడ్డి గారు నీవు ప్రయత్నిస్తే సినిమాల్లో మంచి కథానాయిక అవుతావు అని జానకి గారికి కితాబిచ్చారు. దాంతో ఆమెకు సినిమాలలో నటించాలనే ఆసక్తి పెరిగింది.

నాగిరెడ్డి – చక్రపాణి గార్లు కొత్తగా సినిమా తీస్తున్నారు. అందులో వేషం కోసం బి.ఎన్.రెడ్డి గారు సిఫారసు చేయగా నాగిరెడ్డి గారు శంకరమంచి జానకి గారిని షావుకారు సినిమాకు కథానాయికగా తీసుకున్నారు. ఆ సినిమాలో ఇంకో పాత్ర పేరు సున్నం రంగడు. ఆ పాత్ర కోసం ఎస్వీ రంగారావు గారిని తీసుకున్నారు.  తన మొట్టమొదటి సినిమా “వరూధిని”. ఆ సినిమా సరిగ్గా ఆడకపోయేసరికి తిరిగి వెనక్కి వెళ్లి తన ఊరిలో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయనకు తన మిత్రుడు బి.ఏ సుబ్బారావు గారు “పల్లెటూరు పిల్ల” సినిమాలో వేషం ఇస్తాను రమ్మని ఉత్తరం వ్రాశారు. బి.ఏ సుబ్బారావు గారి ఉత్తరం చదివిన తాను సినిమాలలో నటించడానికి మద్రాసు వెళ్లబోతుండగా ఎస్వీ రంగారావు గారి నాన్నగారు చనిపోయారు. దాంతో మద్రాసు వెళ్లలేకపోయారు.  అందువలన “పల్లెటూరు పిల్ల” లో అవకాశం తప్పిపోయింది. అప్పటికే పల్లెటూరి పిల్లలో ప్రతినాయకుడి పాత్రను వేరేవాళ్లకి ఇచ్చారు. దాంతో తాను కథానాయిక తండ్రి వేషంతో సరిపెట్టుకున్నారు.

బి.ఏ సుబ్బారావు గారి సినిమాలో నటిస్తున్నప్పుడే “మన దేశం” సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ గారికి చిన్న చిన్న పాత్రలు ఇచ్చారు. కెమెరా గురించి, నటన గురించి తెలుస్తుంది అని బి.ఏ సుబ్బారావు గారు ఆ సినిమాలో నటించడానికి వీరిని పంపించారు. ఆ విధంగా వారు “మనదేశం” సినిమాలో చిన్న పాత్ర వేశారు. షావుకారు చిత్రం కోసం అంతా కొత్త వాళ్ళనే ఎన్నుకున్నారు. సినిమా అంతా కొత్త వాళ్లతోనే తీశారు. ఎన్టీఆర్, షావుకారు జానకి, ఎస్వీఆర్ అంతా కొత్తవారే. వీరి ముగ్గురు ప్రధాన పాత్రలకు ఎంపిక చేయబడ్డారు. షావుకారు చంగయ్యగా గోవిందరాజుల సుబ్బారావు, హీరోయిన్ తండ్రి పాత్ర వేసిన వారు శ్రీవాత్సవ (ఆయనే ఆ తరువాత సంవత్సరం మల్లీశ్వరి సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర ధరించారు). ఎస్వీ రంగారావు గారి ప్రక్కన చాకలి రామిగా పాత్ర వేసింది టి.కనకం, సహాయ దర్శకులు తాతినేని ప్రకాశరావు గారి సిఫారసుతో ప్రజానాట్యమండలి కళాకారులు చదలవాడ కుటుంబరావు, వల్లభజోస్యుల శివరామ్ గారికి చిన్న చిన్న పాత్రలు లభించాయి. మాధవపెద్ది సత్యం గారికి ఒక చిన్న పాత్ర లభించింది.

ఘంటశాల వెంకటేశ్వర రావు…

సముద్రాల రాఘవాచార్య గారి అత్తగారి ఊరు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఊరు ఒక్కటే. దాంతో సముద్రాల రాఘవాచార్య గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి అవకాశాలు ఇప్పించడానికి మద్రాసు కు తీసుకువచ్చారు. ఘంటశాల గారిని సినీ పరిశ్రమలో చాలామందికి పరిచయం చేసి అవకాశాలు ఇప్పించారు సముద్రాల రాఘవాచార్య గారు.

కాంట్రాక్టు నటీనటులు…

షావుకారు సినిమాకు సంగీతం దర్శకత్వం వహించే కంటే ముందే “మన దేశం”, “లక్ష్మమ్మ కథ” అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. నటీనటులందరినీ నెల జీతానికి తీసుకున్నారు. ఎన్టీఆర్ గారికి మొదటి సంవత్సరం నెలకు 1500 రూపాయలు, సినిమా పూర్తయినాక 5000 రూపాయలు, రెండవ సంవత్సరం నెలకు 1700 రూపాయలు, సినిమా పూర్తయ్యాక సినిమాకి 7500 రూపాయలు మరియు విజయా ప్రొడక్షన్స్ వారు రెండు సంవత్సరాలలో తీసిన ప్రతీ సినిమాలో తనకు కథానాయకుడి వేషం ఇవ్వాలని కాంట్రాక్టు వ్రాయించుకున్నారు ఎన్టీఆర్ గారు.

ఘంటసాల గారిని కూడా కాంట్రాక్టు సంగీత దర్శకుడుగా రెండు సంవత్సరాలు కాంట్రాక్టు వ్రాయించుకున్నారు. ఆ విధంగా విజయా ప్రొడక్షన్స్ లో కాంట్రాక్టు సంగీత దర్శకుడిగా వున్న ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి “షావుకారు” సినిమా ఎంతో పేరు తీసుకువచ్చింది. తాను అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సంగీత దర్శకుడుతో పాటు సంగీత వాయిద్యకారులందరినీ సమన్వయపరిచే కండక్టర్ అని ఒక అతను ఉండేవాడు. ఈ సినిమాకు కండక్టర్ గా వేణు ఉన్నారు. తాను తరువాత రోజులలో చాలా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడే హీరో భానుచందర్ గారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా మార్కస్ బాట్లే ను తీసుకున్నారు. ఇంతకుముందు కొన్ని సినిమాలకు ఛాయాగ్రకుడిగా వ్యవహరించినా కూడా “షావుకారు” సినిమా నుండే తనకు మంచి పేరు వచ్చింది.

విడుదల…

ఈ సినిమా చిత్రీకరణ అంతా వాహినీ స్టూడియోలోనే జరిగింది. సెట్టింగులు వేసి ఈ సినిమాను చిత్రీకరించారు. కళాధర్ ని ఈ సినిమాకు కళా దర్శకులుగా   తీసుకున్నారు. వరికుప్పలు తగలబెట్టడం, ఇల్లు, సత్రం, హరికథ చెప్పడం ఇవన్నీ కూడా పల్లెటూర్లలో ఉన్నట్టు ఉంటాయి. ఈ సినిమాకు వాడిన చెర్నాకులం, బిందెలు, గంటలు కొట్టడం లాంటివి చక్రపాణి గారు తన ఊరు నుండి తెప్పించారు. ఎల్వీ ప్రసాద్ గారికి అంతకుముందే సినిమాలు తీసిన అనుభవం ఉండడంతో చిత్రీకరణ సజావుగా సాగిపోయింది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, ప్రక్కనే “పల్లెటూరు పిల్ల” చిత్రీకరణ కూడా ప్రక్కనే జరిగింది. “పల్లెటూరి పిల్ల” కంటే ముందుగానే “షావుకారు” సినిమా 07 ఏప్రిల్ 1954 విడుదలైంది. సినిమా బాగానే ఉంది. కానీ ఇందులో మెలోడి డ్రామా లేదు, సంభాషణలు లేవు అని ప్రేక్షకులు అనుకున్నారేమో గానీ షావుకారు సినిమా అంతగా ప్రజాదరణ పొందలేదు. కానీ విజయవాడలో ఈ సినిమా 100 రోజులు ఆడింది.

ఎన్టీఆర్ కు అచ్చొచ్చిన దుర్గా కళామందిర్…

విజయవాడ దుర్గా కళామందిర్ సినిమా థియేటర్ లో ఎన్టీఆర్ గారి “షావుకారు” సినిమా వంద రోజులు ఆడింది.  విజయవాడ దుర్గా కళామందిర్ సినిమా థియేటర్ లో ఎన్టీఆర్ గారి “షావుకారు” సినిమా వంద రోజులు ఎలా ఆడిందో, తన చిట్ట చివరి చిత్రం కూడా 100 రోజులు అదే థియేటర్ లోనే ఆడింది. ఎన్టీఆర్ గారు “షావుకారు” సినిమా నుండి తాను రాజకీయ రంగ ప్రవేశం చేసేవరకు కూడా ప్రతీ సంవత్సరం తన సినిమా ఒకటి శత దినోత్సవం జరుపుకునేది. “షావుకారు”, “పల్లెటూరి పిల్ల”, “సంసారం” సినిమాలు ఒకే సంవత్సరంలో శత దినోత్సవాలు జరుపుకున్నాయి. అలా సినీరంగంలో అడుగుపెట్టగానే ఒకే సంవత్సరంలో మూడు శత దినోత్సవాలు జరుపుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్ గారు ఒక్కరే. చక్రపాణి గారు ఆ తర్వాత అలాంటి సినిమాలు కాకుండా, వాణిజ్యపరమైన సినిమాలు తీశారు. ఈ చిత్రం తమిళంలో ఎంగ వీటు పెన్ (1965) గా పునర్నిర్మించబడింది. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర వేసింది “నీరజ” అయితే ఆ సినిమాతోనే తన పేరు విజయనిర్మల గా మార్చబడింది.

“షావుకారు” జానకి…

దర్శకులు యల్.వీ. ప్రసాద్ గారు షావుకారు సినిమా చిత్రికరిస్తున్నారు. అప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో శంకరమంచి జానకి గారు ఏడువ్వాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా కూడా నటి జానకి గారికి ఏడుపు రాలేదు. సమయం గడిచిపోతుంది. అయినా జానకి గారికి ఏడుపు మాత్రం రావడం లేదు. అప్పుడు దర్శకుడు ఎల్వీ ప్రసాద్ గారు ఇక ఏమీ తోచక “ఈ క్రొత్త ముఖాలు వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు” అని అన్నారట. ఆ మాటలు జానకి కి ముల్లులా తగిలి వెంటనే దుఃఖం ఆపుకోలేక బొట బొటా కన్నీళ్లు కారుస్తూ ఏడవటం మొదలెట్టారు.

దర్శకుడు ఎల్.వీ.ప్రసాద్. ఆమె ఏడుస్తున్నప్పుడే ఆ ఏడ్పు మొహంతో వున్న జానకితో తనకి కావలసిన ఏడుపు సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించుకున్నారట. అయితే చిత్రీకరణ అయిపోయినా కూడా జానకి గారు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఏడుపు మానలేదు. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ గారు ఆమె దగ్గరికి వెళ్లి “మీ మనసును కష్టపెట్టి మీకు ఏడుపు తెప్పించడానికి ఆలా అన్నాను కానీ, మీరు నిజమే అనుకున్నారా ఏంటి” అని నవ్వుతూ చెప్పారట ఆమెతో. వెంటనే ఆమె ఏడుపు ఆపేశారు. ఆ రోజులలో దర్శకులు, నటీనటులు ఒక సన్నివేశం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. “షావుకారు” సినిమా జానకి గారు నటించిన మొదటి తెలుగు సినిమా. అందుకే ఆ సినిమా విడుదలైన దగ్గర నుండి ఆమె పేరు షావుకారు జానకి గానే స్థిరపడింది.

Show More
Back to top button