
చంద్రమోహన్ (1942 మే 23 – 2023 నవంబరు 11)
“చంద్రమోహన్‌గా వచ్చాను. చంద్రమోహన్‌గానే వెళ్లిపోతాను, నాకు ఏ బిరుదులూ వద్దు” అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు, అన్నట్టే వెళ్లిపోయారు. తెలుగు తెర మీద తెలుగును అద్భుతంగా పండించిన తెలుగు నటులు. తెలుగు నేలను విడిచి వెళ్లిపోయారు. ప్రముఖ నటులు చంద్రమోహన్ గారు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతూ 11 నవంబరు 2023 నాడు ఉదయం 9.45 గంటలకు గుండెపోటుతో మరణించారు. చంద్రమోహన్ గారి వయస్సు సుమారు 82 సంవత్సరాలు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ గారి అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హీరోలందరూ నటులు కాలేరు, నిజమే. కానీ నటులు హీరోలు కావచ్చు. ఎందుకంటే కథకు హీరో అయితే ఆ కథే అతడికి పేరు తీసుకొస్తుంది. కానీ, అదే కథకు నటుడు దొరికితే అది అద్భుత చిత్రమవుతుంది. ఈ రెండింటికీ సరిపోయే అతి కొద్ది మంది నటులలో ప్రముఖ నటులు చంద్రమోహన్ గారు ఒకరు. నీరు ఏ పాత్రలో పోస్తే, దాని ఆకారాన్ని సంతరించుకున్నట్లు చంద్రమోహన్ గారు కూడా ఆ పాత్రలో కలిసిపోతారు, ఇమిడిపోతారు, అందులో మమేకమై మన హృదయాలకు దగ్గరైపోతారు.
చంద్రమోహన్ గారు తన సినీ ప్రస్థానంలో ఫలానా పాత్రలలో మాత్రమే నటిస్తానని ఏనాడూ గిరిగీసుకుని కూర్చొలేదు. అగ్ర కథానాయకులు ఏయన్నార్, కృష్ణ వంటి కథనాయకుల చిత్రాలలో నటిస్తూనే, మరోవైపు అప్పుడే చిత్ర పరిశ్రమలో స్టార్లుగా ఎదుగుతున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి హీరోల చిత్రాల్లో వారి స్నేహితుడి పాత్రల్లోనూ మెప్పించారు చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు ఒక హీరో, ఒక హస్యనటులు, ఒక గుణచిత్ర నటులు, పిల్లలకు తండ్రి ఇలా చెప్పుకొంటూ పోతే చంద్రమోహన్ గారు ఒక సహజ నటులు.
1966 లో బియన్ రెడ్డి నిర్మించిన రంగులరాట్నం చిత్రం ద్వారా చంద్రమోహన్ గారు పరిచయం అయ్యారు. ఆ చిత్రంలో ఏదో చిన్న పాత్ర వస్తుందని వెళితే ఏకంగా హీరోగా ఎంపిక చేయబడ్డారు. పైగా అప్పుడే వేషాల కోసం ప్రయత్నిస్తున్న కృష్ణంరాజు గారి లాంటి ఆరడుగుల హీరోలను దాటుకుని ఆ చిత్రంలో ఎంపిక చేయబడ్డాడు. సినిమా విజయవంతం అయ్యింది. మంచి పేరు కూడా వచ్చింది. దర్శక, రచయితలు ఆయనకు రాసిన పాత్రలకు వందశాతం న్యాయం చేసేవారు. “ప్రతి ఘటన” లో లాయర్ గోపాలకృష్ణగా, “శ్రీ షిర్డీ సాయిబాబా” లో నన్వలిగా, “ఆదిత్య 369” లో తెనాలి రామకృష్ణగా చంద్రమోహన్‌గారు జీవించారు. ఆ పాత్రలలో తాను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఇమిడిపోయారు.
1966 లో “రంగుల రాట్నం” సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన చంద్రమోహన్ గారు తన 55 ఏళ్ల సినీ ప్రస్థానంలో మొత్తంగా 932 సినిమాలలో నటించారు. తాను అనారోగ్య సమస్యలతో గత 5-6 సంవత్సరాలుగా నటనకు దూరమయ్యారు. చంద్రమోహన్ గారు చివరగా 2017లో వచ్చిన ఆక్సిజన్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో హీరో గోపీచంద్ గారికి తాను తండ్రి పాత్రలో నటించారు.
@ జీవిత విశేషాలు…
- జన్మ నామం : మల్లంపల్లి చంద్రశేఖర రావు
- జననం : 23 మే 1942
- స్వస్థలం : పమిడిముక్కల, కృష్ణా జిల్లా, భారత్
- తండ్రి : మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి
- తల్లి : శాంభవి
- పిల్లలు : ఇద్దరు కుమార్తెలు
- వృత్తి : తెలుగు సినిమా నటుడు
- జీవిత భాగస్వామి : జలంధర
- బంధువులు : శివలెంక కృష్ణప్రసాద్ (మేనల్లుడు)
- పురస్కారాలు : నంది అవార్డు
@ నేపథ్యం…
చంద్రమోహన్ గారి అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు 23 మే1945 నాడు జన్మించారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పమిడిముక్కలలో చదువుకున్న చంద్రమోహన్ గారు, గుంటూరు జిల్లా అచ్చంపేటలో ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి వరకు చదివి, బాపట్లలో అగ్రికల్చర్ కళాశాలలో బి.ఎస్సి అగ్రికల్చరల్ పూర్తి చేశారు. చంద్రమోహన్ గారు కె.విశ్వనాథ్ గారికి దగ్గరి బంధువులు.
@ వ్యక్తిగత జీవితం…
చంద్ర మోహన్ గారి శ్రీమతి పేరు జలంధర గారు. ఆవిడ రచయిత్రి కూడానూ. వారికి ఇద్దరు కుమార్తెలు, మధుర మీనాక్షి, మాధవి. వీరిరువురికి వివాహాలు అయ్యాయి. మొదటి కుమార్తె మధుర మీనాక్షి గారు మానసిక వైద్య నిపుణులు. తాను అమెరికాలో స్థిరడ్డారు. రెండవ కుమార్తె మాధవి గారు డాక్టరు. తాను చెన్నై లో నివాసం వుంటున్నారు. చంద్రమోహన్ గారి సతీమణి జలంధర గారు ప్రముఖ రచయిత్రి. “అగ్నిపుష్పం”, “అభిమానులతో ఉగాది”, “ఆటోగ్రాఫ్”, “ఆకాశంలో మల్లెపూలు”, “ఆత్మహత్య”, “ఉపాసన” వంటి సుమారు 55 వరకు కథలు, నవలలు వ్రాశారు.
@ కథనాయకుడి నుండి హాస్యనటుడి వైపు..
చంద్రమోహన్ గారి తొలి చిత్రం “రంగులరాట్నం”. ఈ చిత్రానికి తాను నంది పురస్కారం అందుకున్నారు. నటుడిగా మంచి పేరు వచ్చింది. అవకాశాలు వెంటనే రాలేదు. తన ఎత్తు సాకు చూపుతూ కొన్ని అవకాశాలు చేజారిపోయాయి. ఈ విషయంలో మొదట్లో బాధకు గురైన చంద్రమోహన్ గారు ఆ తరువాత బాపు గారి దర్శకత్వంలో నటించిన చిత్రం “బంగారు పిచుక”. చలం, పద్మనాభం, రాజబాబు హాస్యానటులు గానే కాకుండా కథానాయకులు గానూ రాణించారు. కానీ, దీనికి విరుద్ధంగా కథనాయకుడి తో పాటు హాస్యాన్ని కూడా పండించగల నటుడిగా తనని తాను నిరూపించుకున్నారు చంద్రమోహన్ గారు
“కొంటె కాపురం”, “సీతాపతి సంసారం”, “గోపాలరావుగారి అమ్మాయి”, “పక్కింటి అమ్మాయి”, “ఇంటింటి రామాయణం”, “రాధాకల్యాణం” లాంటి చిత్రాలు చూస్తే, చంద్రమోహన్ గారు చక్కటి హాస్యాన్ని పండిస్తూనే తన స్థాయి తగిన హీరోయిజాన్ని ఆయా పాత్రల్లో చూపించారు. “పదహారేళ్ళ వయస్సు” సినిమాలో అవిటి వ్యక్తిగా, కాస్త తింగరతనం కలగలిసిన గోపాలకృష్ణ పాత్రలో చంద్రమోహన్ గారి నటన తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పవచ్చు. తాను ఇష్టపడే మల్లి మరొకరిని ఇష్టపడుతోందని తెలిసిన తర్వాత చంద్రమోహన్ పలికించే హావభావాలు సినిమాలో లీనమైన ప్రతి ప్రేక్షకుడిని కన్నీళ్లు పెట్టిస్తాయి. తమిళంలో ఇదే పాత్రను చేసిన కమల్‌హాసన్ చంద్రమోహన్ నటనకు ఫిదా అయిపోయారంటే చంద్రమోహన్ గారి నటన ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు.
@ కథానాయికల కథానాయకుడు..
చంద్రమోహన్ గారిది చిత్రసీమలో లక్కీ హ్యాండ్ అంటుంటారు. తాను కథానాయికల కథనాయకుడు. ఏ కథానాయిక అయినా తనతో మొదటి సినిమాలో నటిస్తే ఆమె తప్పకుండా అగ్ర కథానాయిక అయినట్లే. “పదహారేళ్ళ వయసు” చిత్రంలో చంద్రమోహన్ గారికి జోడిగా నటించిన శ్రీదేవి గారు, “శ్రీరంగనీతులు” సినిమాలో చంద్రమోహన్ గారి సరసన నటించిన విజయశాంతి గారు, “సెక్రెటరీ” చిత్రంలో చంద్రమోహన్ గారితో నటించిన పిమ్మట జయసుధ గారు ఆ తరువాత కాలంలో అగ్ర కథనయికల హోదాను దక్కించుకున్నారు.
జయప్రద గారు, లక్ష్మీ గారు, రాధిక గారు, తాళ్లూరు రామేశ్వరి గారు, మంజుల గారు, ప్రభ గారు లాంటి సుమారు 40 మంది హీరోయిన్లను చంద్రమోహన్ గారికి జోడిగా నటించారు. అగ్రకథనాయకులు “శోభన్‌బాబు” గారు చంద్రమోహన్ గారికి మంచి స్నేహితులు. తాను చాలా ఆస్తిపరులు. అయినా చంద్రమోహన్ గారి వద్ద డబ్బులు అడిగేవారు. చంద్రమోహన్ గారు ఇచ్చిన డబ్బుతో కలిసొచ్చిందని నమ్మిన శోభన్ బాబు గారు తాను ఆస్తి కొన్న ప్రతిసారీ చంద్రమోహన్ గారి వద్ద డబ్బులు తీసుకునేవారు. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్ గారిది.
@ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోని నటుడు…
చాలా మంది ఏదో ఒక విషయంలో ప్రతిభను కనబరుస్తారు. అంటే యాక్షన్ హీరో, ఫ్యామిలీ స్టార్, కమెడియన్ ఇలా ఏదో ఒక దానిలో ఇమిడిపోతారు. చంద్రమోహన్ గారు చిత్ర పరిశ్రమలో నటుడిగా ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత “ఇలాంటి పాత్రలే చేస్తాడు” అని కాకుండా “ఎలాంటి పాత్ర అయినా చేస్తాడు” అని అనిపించుకున్నారు. చంద్రమోహన్ గారి నటనను గమనించిన శోభన్‌బాబు గారు “అన్ని పాత్రలకు సరిపోతున్నావు. ఏదోక రోజు నీకు మంచి అవకాశాలు వస్తాయి. అప్పటివరకూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకు” చంద్రమోహన్ గారికి సలహా ఇచ్చారు.
“సిరిసిరి మువ్వ” లో సాంబయ్యగా కనిపించినా, “కురుక్షేత్రం” లో అభిమన్యుడిగా వీరవిహారం చేసినా, “ప్రాణం ఖరీదు” లో మూగవాడిగా అద్భుత నటన కనబరిచినా మనకు ఆ పాత్రలే కనపడతాయి తప్ప చంద్రమోహన్ గారు కనిపించరు. “రామ్ రాబర్ట్ రహీమ్” లో కృష్ణ, రజనీకాంత్ గార్లు యాక్షన్ తో అదరగొడితే, చంద్రమోహన్ గారు తన డిక్షన్‌తో అలరించారు. “పక్కంటి అమ్మాయి” మనసు దోచేందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి చంద్రమోహన్ గారు చేసే హంగామా ఎంతో సహజంగా ఉంటుంది.
@ మలిదశలో…
కాలంతో పాటు ప్రతి మనిషీ మారాల్సిందే. అందుకు మనుషులు మాత్రమే గారు కళాకారులూ, నటీనటులు ఏమీ అతీతులు కారు. చంద్రమోహన్ గారు ఆ విషయాన్ని బాగా వంటబట్టించుకున్నారు. బాగా తెలుసు. సుమారు 50 ఏళ్ల పాటు చిత్రసీమలో నటుడిగా కొనసాగిన తాను వయసుకు తగిన పాత్రలను ఎంపిక చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకుని 90వ దశకం నాటికి కథనాయకుల, హస్యనటుల పాత్రలకు నెమ్మదిగా స్వస్తి పలికి, తండ్రి పాత్రలు చేయడం మొదలు పెట్టారు.
“కలికాలం” తో మొదలైన ఆ ప్రవాహం చివరి వరకూ కొనసాగింది. “గులాబీ” సినిమాలో కొడుకు అతడి స్నేహితులతో కలిసిపోయే తండ్రిగా ఎంతగా అలరించారో, “ఆమె” లో ఇద్దరు కూతుళ్లకు తండ్రిగా, పరిస్థితులకు తలవంచే మధ్యతరగతి ఉద్యోగిగా అంతే భావోద్వేగాలను పంచారు. “నిన్నే పెళ్లాడతా” లో ఆయిల్ పుల్లింగ్ చేసినా, “ప్రేమించుకుందాం రా” లో పేపర్ వేసే వాడితో గొడవ పడినా తనకు మాత్రమే చెల్లింది. “తమ్ముడు”, “మనసంతా నువ్వే”, “నువ్వు నాకు నచ్చావ్”, “నువ్వే నువ్వే”, “సంతోషం” ఇలా చెప్పుకొంటూ పోతే, ఒక కుటుంబరావు, ఒక శేఖరం, ఒక చంద్రం కనిపిస్తారు.
@ మహాపథగమనం…
చంద్రమోహన్ గారు వయో భారంతో గత కొంతకాలంగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాదు లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. 11 నవంబరు 2023 నాడు ఉదయం 9.45 గంటలకు చంద్రమోహన్ గారు (తన 81 ఏళ్ళ వయసులో) మహాపథగమనం (మరణించారని) చెందారని వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన మృతికి అభిమానులు, పలువురు ప్రముఖులు సామజిక మాధ్యమాల (సోషల్ మీడియా) వేదికగా సంతాపం తెలుపుతున్నారు. శనివారం , ఆదివారం అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం తన భౌతిక కాయాన్ని ఉంచి సోమవారం హైదరాబాదు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.








