HISTORY CULTURE AND LITERATURE

విదేశాలకు వెళ్లేముందు తన ఆఖరి ప్రసంగం.. ఆనందీబాయి గోపాల్ జోషి..

జీవితం ఎంత విచిత్రమైనది అంటే, కొన్నిసార్లు కొన్ని ప్రతికూల సంఘటనలు జరిగినప్పుడు కొందరు దానిపట్ల రాజీ పడతారు, కొందరు మన ఖర్మ ఇంతే అనుకుని సరిపెట్టుకుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ ప్రతికూల సంఘటన నుండి ప్రేరణపొంది తనకు జరిగిన నష్టం మరొకరికి కలగకూడదని దానికి శాశ్వత పరిష్కారం వెతుక్కుంటారు. అలా తన సమస్యకు పరిష్కారం వెతుక్కున్న ఒక స్త్రీ కసితో స్వదేశం విడిచి, అమెరికా వెళ్లి చదువుకుని చివరికి “పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు” అయ్యింది. ఆవిడ ఎవరో కాదు ఆనందీబాయి గోపాల్ జోషి. తన తొమ్మిది సంవత్సరాల వయస్సులో అప్పటి బాల్య వివాహాల ఆచారం ప్రకారం వివాహం చేసుకుని తన పద్నాలుగు సంవత్సరాల వయస్సులో, ఒక బాలుడికి జన్మనిచ్చి, సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో బాబు జన్మించిన పది రోజుల్లో తన కుమారుడిని కోల్పోయింది. ఆ సమయంలో ఆమె రోదన చెప్పరానిది, ఆమె మాతృవేదన వివరించలేనిది, ఆమె పుత్రశోకం వర్ణించరానిది. ఆ సంఘటన ఆనందీబాయి జీవితంలో ఒక మలుపును తీసుకొచ్చింది. తాను వైద్యురాలు కావడానికి ప్రేరణనిచ్చింది.

ఆనందీబాయి గోపాల్ జోషి 1886 లో పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. వైద్య పట్టా కోసం అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమెనే. 31 మార్చి 1865వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పూనాలో ఒక సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తనకంటే ఇరవై సంవత్సరాలు పెద్దయిన గోపాల్ రావు జోషిని ఆమె తన తొమ్మిదేళ్ల వయస్సులో వివాహం చేసుకున్నారు. ఆమె అసలు పేరు యమునా జోషీ అయితే గోపాల్ రావుతో వివాహం జరిగిన తరువాత, ఆమె భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టారు. కళ్యాణ్ లో తపాలా గుమాస్తాగా పనిచేసే గోపాల్ రావు, తరువాత రోజులలో అలీభాగ్ లాంటి గ్రామాలలో ఉద్యోగ బదిలీలు అవుతూ చివరకు బదిలీపై కలకత్తా చేరిపోయారు. గోపాల్ రావు మాములుగానే అభ్యుదయ బావాలు, సామాజిక భావాలు కలిగిన ఉన్న గోపాల్ రావు మహిళల విద్యకు మద్దతు పలికారు. సంస్కృతం కంటే ఆంగ్ల భాష నేర్చుకోవడం ముఖ్యమని,  భావించి విద్య పట్ల ఆనందీబాయికి ఉన్న ఆసక్తి గమనించి, ఆంగ్లం నేర్చుకోవడానికి  తగిన ఏర్పాట్లు సహాయం చేశారు. కేవలం పదే పది రోజుల్లో చనిపోయిన తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని ఆనందీబాయి భారదేశంలో సౌకర్యాలు మెరుగ్గా లేకపోవడంతో అమెరికా వెళ్లి వైద్య విద్యనభ్యసించారు.

కలకత్తా నుండి అమెరికా వరకూ నౌకలో ప్రయాణం చేసిన ఆనందీబాయి జూన్ 1883 లో న్యూయార్క్ చేరుకున్నారు. అక్కడ వైద్యవిద్యకై పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాలలో చేరి 600 అమెరికన్ డాలర్లను ఉపకారవేతనంతో 19వ యేట ఆమె తన వైద్య విద్యను ప్రారంభించి మూడు సంవత్సరాల పాటు వైద్య విద్యను అభ్యసించారు. భారతదేశానికి భిన్నంగా ఉన్న శీతోష్ణస్థితి సమస్యను అమెరికాలో ఎదుర్కొన్న ఆమెకు కళాశాల వారు ఏర్పాటు చేసిన గదిలో సరైన “ఫైర్‌ ప్లేస్” లేనందున, ఫైర్‌ ప్లేస్ నుండి అత్యధికంగా పొగరావడంతో ఆమెకు చలి కానీ, లేక పొగ కానీ భరించవలసిన పరిస్థితి ఎదురైంది. అలా రెండు సంవత్సరాల అమెరికా వాసం తరువాత ఆమెకు అనారోగ్యం పాలైంది.

ఆమె తీవ్ర ఆరోగ్యసమస్యలతో బాధపడుతూనే, మూడు సంవత్సరాల ఉన్నతవిద్యాభ్యాసం పూర్తిచేసి చివరి పరీక్షలు వ్రాసి,   11 మార్చి 1886 నాడు ఆమె వైద్య విద్యలో డాక్టరేట్ సాధించారు. తన భర్త కూడా పాల్గొన్న ఆమె పట్టభద్రోత్సవంలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలుగా పేర్కొనడం ఆమెకు మరపురాని అనుభూతిని కలుగజేసిందనే చెప్పాలి. క్షయ వ్యాధిగా నిర్ధారించబడిన ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ దిగజారడంతో ఆమె తిరిగి భారతదేశానికి వచ్చి కొల్హాపూరు సంస్థానంలో వైద్యురాలిగా పనిచేయడానికి నిర్ణయించుకున్నారు. క్షయ వ్యాధి తిరగబడి, భారతదేశానికి తిరిగివచ్చిన ఒక్క సంవత్సరంలోపునే 26 ఫిబ్రవరి 1887 తేదీన తన 22 సంవత్సరాల చిరుతప్రాయంలో అకాలమరణం చెందారు ఆనందీబాయి గోపాల్ రావు జోషి. ఆమె మరణంతో దేశం అంతటా విషాదం ఆవరించింది.

ప్రసంగం…

సుమారు 140 సంవత్సరాల క్రిందట 1886 వ సంవత్సరంలో పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు, తన 18 సంవత్సరాల వయస్సులో అమెరికా వెళ్లి వైద్యవిద్యను అభ్యసిద్దాం అనుకుంది. కానీ 140 యేండ్ల క్రిందట భారతదేశంలో, అందులోనూ ఒక అమ్మాయి, అదీగాక చదువుకోవడం కోసం విదేశాలకు వెళతానంటే స్థానికులు అవాక్కయ్యారు, అభ్యంతరం వ్యక్తంచేశారు. కానీ ఆమె ఎందుకు వైద్యవిద్యను అభ్యసించాలని బలంగా నిర్ణయించుకుందో ఆమె హృదయానికి మాత్రమే తెలుసు. అప్పటి ఆచారాల ప్రకారం తన తొమ్మిది సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్న ఆనందీబాయి, తన 14 సంవత్సరాల వయస్సులో ఒక బాలుడికి జన్మనిచ్చింది.

ఆ బాలుడికి అప్పటికీ అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం వలన ఆ పసిగుడ్డు పది రోజుల్లో చనిపోయాడు. ఈ సంఘటన ఆనందీబాయి జీవితంలో ఒక మలుపును తీసుకొచ్చింది. తాను వైద్యురాలు కావడానికి ప్రేరణనిచ్చింది, వైద్యురాలు కావాలనే కాంక్ష పెరిగిపోయింది. అది కూడా భారతదేశంలో కాకుండా అమెరికా వెళ్లి వైద్యవిద్యను అభ్యసించడానికి సిద్ధపడింది. ఇదే విషయాన్ని గ్రామస్థులకు, స్థానికులకు తెలిపింది. కానీ వారు ఆమెను వ్యతిరేకించారు. అప్పుడు వారికి నచ్చజెప్పడానికి వారందరినీ సమావేశపరిచింది. ఆమె ఎదురుగుండా సుమారు 300 మంది ఆడవాళ్లు మరియు మగవాళ్ళు ఉన్నారు. వారితో ఇలా ఆమె చెప్పాల్సిన విషయం ఇలా చెప్పుకొచ్చింది. 

“లేడీస్ అండ్ జెంటిల్మెన్”.. నేను మీ ముందు ఇలా నిలబడడానికి నాకు చాలా భయంగా ఉంది. నేను మీకంటే ఎక్కువ చదువుకున్న దానిని కాదు. ఇక్కడ నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఇంతసేపు మాట్లాడడం ఇదే మొదటిసారి. నేను చాలా తప్పులు మాట్లాడొచ్చు, అదేవిధంగా మీ అందరికీ చాలా విసుగు కలిగించవచ్చు. అయినా కూడా మీరు ఖచ్చితంగా విని తీరాల్సిందే. మీరందరూ కూడా ఈ అమ్మాయి అమెరికా ఎందుకు వెళుతుంది అని మమ్మల్ని అంటున్నారు? సముద్రాలు దాటి ఎందుకు వెళ్లాలి? అని మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా నా దగ్గర సమాధానం ఉంది. మొదటగా నేను అమెరికా ఎందుకు వెళుతున్నానని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను అమెరికా వెళ్లడానికి కారణం వైద్యురాలు అవ్వాలని.

నేను ఎందుకు వైద్యురాలిని అవ్వాలనుకుంటున్నాను అంటే భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన వైద్యం లేక, సరైన వైద్యం తెలియక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. నేను కన్న కొడుకు, నాకు జన్మించిన పది రోజుల్లోనే చనిపోయాడు. ముక్కుపచ్చలారని ఆ బాబు ఎందుకు చనిపోయాడో నాకు అంతుబట్టలేదు. ఆ సమయంలో నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒక తల్లిగా నరకయాతన అనుభవించాను. పుత్రశోకం ఎలా ఉంటుందో కన్నతల్లులకు తెలియంది కాదు. మన దేశంలో మహిళా వైద్యులు లేక, మహిళా వైద్యులకు వివరించే, విన్నవించుకునే సమస్యలను పురుష వైద్యులకు వివరించుకోలేక ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు.

భారతదేశంలో స్త్రీ వైద్యులు లేక ఆడవారు ఎదుర్కొనే ఇబ్బందులను మార్చడానికి నేను చదువుకోడానికి అమెరికా వెళుతున్నాను. మద్రాసులో కొన్ని కళాశాలలు ఉన్నాయి, కావున ఇక్కడే వైద్యవిద్యను చదువుకోవచ్చు కదా అని మీరు అంటున్నారు నిజమే. కానీ మద్రాసులో నర్సింగ్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. పైగా పాఠాలు బోధించేందుకు యూరప్ నుండి వచ్చిన ఉపాధ్యాయులు కూడా  మగవారే. ఆడవాళ్లకు బోధించే ప్రత్యేకమైన బోధనా పద్ధతులు గానీ, వాటిని అర్థం చేసుకొని వివరించే పద్ధతులు గానీ ఇక్కడ లేవు. అందుకే నేను భారతదేశంలో చదువుకోకుండా బయటి దేశం అమెరికా వెళుతున్నాను. అయితే నేను ఒక్కదాన్నే ఎందుకు వెళ్లాలి, తోడుగా భర్తను కూడా తీసుకెళ్లవచ్చు కదా అన్నదే మీ ప్రశ్న. అయితే మేము ఇద్దరం వెళ్లడానికి సరిపడే డబ్బులు మావద్ద లేవు. అందువలన నేను ఒక్కదానినే వెళుతున్నాను. ఇకపోతే నేను తిరిగి భారతదేశం వచ్చాక మీరు నన్ను సంఘ బహిష్కరణ చేస్తారా? ఒకవేళ నేను అమెరికా వెళ్ళినా గానీ, హిందువుగానే బ్రతుకుతాను, హిందూ ఆచారాలను నేను అతిక్రమించను, హిందుత్వాన్ని నా మనసులో నుండి తుడిచిపెట్టబోను అని నేను మనసా వాచా కర్మణా నమ్మి వెళుతున్నాను.

నేను వచ్చాక సంఘ బహిష్కరణ చేస్తారని నేను ఏమాత్రం అనుకోవడం లేదు. అలాంటి పరిస్థితులను కూడా మీకు నేను కల్పించను. నేను అక్కడికి వెళ్లిన తరువాత నాకు ఏమైనా అయితే అన్నదే మీ అభిప్రాయం కావచ్చు. అక్కడేమవుతుంది నాకు? ఇక్కడ వుంటే మాత్రం ఏమీ అవ్వదని నమ్మకం ఉంటుందా? ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం పూర్తయిన తరువాత త్రోవలో ఏమైనా జరిగి, ఎవరైనా మరణించరని నమ్మకం ఉందా? ఏ రూపంలో అయినా, ఎప్పుడైనా ఏదైనా ఉపద్రవం ముంచుకురావచ్చు, ఏమైనా జరగొచ్చు అని మీరు అనడం అనేది అర్థం లేని ప్రశ్న. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.

మీరు అడుగుతున్న చిట్టచివరి ప్రశ్న ఏమిటంటే ఎవ్వరూ చేయని పని నీవెందుకు చేస్తున్నావు అనే కదా! మీరు ఒక్క విషయం ఆలోచించండి. క్రైస్తవ సోదర, సోదరీమణులారా ఇదే విషయాన్ని గనుక వివరించాల్సి వస్తే, ఆరోజు సిలువ ఎవరూ ఎక్కలేదు కదా? నేనెందుకు సిలువ ఎక్కాలి అని జీసస్ అనుకొని ఉంటే, ఈరోజు మీరు ఆయనని దేవుడిగా భావించేవారా? అందువలన ఎవ్వరూ చేయని పని నీవెందుకు చేస్తున్నావని అనకండి. ఎవరో చేయని పనిని ఎవరో ఒకరు ఏదో ఒక రోజు మొదలుపెట్టాలి. అందుచేత అమెరికా వెళ్లే పనిని నేను కొత్తగా చేస్తున్నానని అనుకోవడం లేదు. విశాల దృష్టితో ఆలోచించండి అని ఈ విధంగా ఆనందీబాయి గోపాల్ రావు జోషి రెండు గంటలసేపు సుమారు 300 మందికి వివరించింది. 

ఆవిధంగా 140 సంవత్సరాల క్రిందట మొట్టమొదట సముద్రాలు దాటిన ఒక హిందూ వనిత, అమెరికాలో వైద్య విద్యను అభ్యసించిన మొట్టమొదటి హిందూ వనిత, కోటి కలలతో, కోటి ఆశయాలతో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆనందీభాయి గోపాల్ రావు జోషి 21 సంవత్సరాలు పూర్తిగా నిండకుండానే కన్నుమూశారు.

Show More
Back to top button