Telugu Breaking NewsTelugu Politics

వేడెక్కుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా ఒకరు అడుగుపెట్టారు. ఆయనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. డిసెంబర్ 23న టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ రాకతో కొంత బలోపేతం అయిన టీడీపీ.. ప్రశాంత్ కిశోర్ వస్తే  మరింత బలం చేకూరినట్లవుతుంది. సాధారణంగా ప్రశాంత్ కిశోర్ అంటే టీడీపీకి నచ్చని పేరు. దీనికి కారణం గతంలో వైసీపీకి పనిచేయడమే. అయితే, ఇలాంటి తరుణంలో వీరి కలయిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

* పీకే రాష్ట్ర రాజకీయాలను మార్చగలుగుతాడా..?

ఈయన మొదటిసారిగా 2012లో గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పనిచేసి మోదీ ముఖ్యమంత్రి నుంచి 2014లో ప్రధానిమంత్రి వరకు ఎదగడంలో ఎంతగానో కీలకపాత్ర పోషించారు. అసలు బీజేపీ సోషల్ మీడియా వింగ్ కాన్సెప్ట్ ఈయనదే. అంటే సోషల్ మీడియా ద్వారా విషయం జనాలకి బాగా రీచ్ అవుద్దని పీకేనే చెప్పారు. తర్వాత 2019లో సీఎం జగన్ సారథ్యంలో సామాజిక తంత్రాన్ని ఉపయోగించి వైసీపీ అధికారంలోకి రావడానికి, బీహర్‌లో నితీష్ కుమార్ అధికారంలోకి రావడానికి పీకే ఎంతో దోహదపడ్డారు. అయితే, ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తే.. 2024లో టీడీపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* MLAలలో వ్యతిరేకత..!

నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను జిల్లా కార్యకర్తలను సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు పిలిచి వారితో రాబోయో అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చిస్తున్నారు. ప్రజలలో వ్యతిరేకత ఉన్న ఎమ్మేల్యేలకు ఈసారి సీట్లు కేటాయించ కూడదని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సీట్లు కేటాయించని ఎమ్మేల్యేలకు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌‌లుగా నియమిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ అధికారంలోకి వస్తే.. కొంతమంది MLAలకి  MLC, రాజ్యసభ సీట్లు, నామినేటెడ్ పదవులు కట్టబెడతామని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. ఈ నిర్ణయంపై కొంతమంది MLAలు సంతృప్తి చెందగా.. మరికొంత మంది అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఆళ్ల వెంకటరామకృష్టారెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో వైసీపీ శ్రేణుల్లో మరింత ఆందోళన కలిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అన్నా రాంబాబు అనారోగ్య కారణాల దృష్ట్యా ఎన్నికలకు దూరమైనట్లు తెలిపారు. ఇలా పలు కారణాలతో వైసీపీ వలసలు జరగడంతో వచ్చే ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది.

* షర్మిల.. ఏపీలో కాలు పెట్టి చేయి కాల్చుకుంటారా?

అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల్లో మారుమోగిన వైఎస్ షర్మిల పేరు ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కూడా మారుమోగుతోంది. ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేస్తారని ప్రచారం జరుగుతుంది. అదీ కాకుంటే షర్మిలను వచ్చే ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్‌గా కూడా కాంగ్రెస్ పార్టీ నియమించవచ్చనే ఊహాగానాలు వినపడుతున్నాయి. గత ఎన్నికల్లో బై బాబూ అంటూ నినాదాలు చేసిన షర్మిల ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుందా అన్నట్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అలా చేస్తే.. జగన్‌కు వై.యస్ అభిమానులు నుంచి కొంతమేర ఓట్లు చీలే అవకాశాలు లేకపోలేదు. అయితే, ఇది టీడీపీకి కొంతమేర లాభం చేకూర్చే విధంగా ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వైసీపీ ఓట్లు చీలడం వల్ల టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ అవుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా జగన్‌ను కాదని రెడ్డి సామాజికవర్గం కానీ, మరో క్యాస్ట్ కానీ షర్మిల ప్రచారం చూసి ఓటు వేసే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితుల్లో మరోసారి షర్మిల ఏపీలోనూ కాలు పెట్టి చేయి కాల్చుకుంటారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఏది ఏమైనప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో ముందు ముందు ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది.

Show More
Back to top button