
రావు బాలసరస్వతీ దేవి ( 29 ఆగస్టు 1928 )
బాల సరస్వతీ దేవి అందం చూడవయా.. ఆనందించవయా (దేవదాసు), ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై (పిచ్చి పుల్లయ్య), రావే నా ప్రేమలత, హైలెలో నా రాజా (పెళ్ళి సందడి), ఆయేనే అరుణోదయ వేళ వేదమంత్ర పారాయణ చేసే (గాంధారి గర్వభంగం), ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా (మంచి మనసుకు మంచి రోజులు), ఏరిఏరి నా సమానులిక ఏరి, మధురముగా ఆహా మధురముగా (చెంచులక్ష్మి), తెలుపవేలనే చిలుకా పలుకవేలనే బదులు పలుకవేలనే, దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి మాయింట (షావుకారు), ఏమో ఏమనుకొనెనో నా మాట మరచెనో మనసు మారెనో (వచ్చిన కోడలు నచ్చింది), ఏల పగాయే ఇటులేల పగాయె ప్రభో మనకు (లైలా మజ్ను) లాంటి పాటలను ఆలపించి పాటలో ప్రతీ పలుకు మనసుపొరలలో గూడు కట్టుకొనేలా చేసిన గాయకులు, లాలిత్యం, హాయిగా రాగ యుక్తం ఆలపించే గాయనీమణులలో చెప్పుకోతగినవారు రావుబాల సరస్వతి దేవి గారు.
బాల సరస్వతి దేవి పేరు వినగానే మనకు ఓ మంత్రస్వర గాత్ర మాధుర్యం గుర్తుకొస్తుంది. తనది ఎవ్వరికీ అనుకరణ కాని సొంత గొంతుక. తన గాత్రంతో మనసులను సుదూర తీరాలలో ఓలలాడించగల స్వర బాల మన బాల సరస్వతీ దేవి గారు. గట్టిగా మీటితే తంత్రులు కందిపోతాయేమో అనిపించే సున్నిత స్వర రాగవీణ. తెలుగు సినిమా సంగీతం తనకంటూ ఓ విభిన్నమైన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే బాల సరస్వతి దేవి గారి స్వరావిష్కరణ జరిగింది. బాల సరస్వతి దేవి గారు నాలుగు దశాబ్దాల నట, గాన కళాజీవనంలో ఒక కళాకారిణి గా చేరిన శిఖరాలు అత్యున్నతమైనవి. 95 సంవత్సరాలు వయస్సు లో తాను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.
రావు బాల సరస్వతీ దేవి గారు పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్య గాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి గారు ప్రసిద్ధి పొందినారు. ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికి సుపరిచితురాలు. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవి గారి సొంతం. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే ఉంది. తాను పాటల తోటలో విరబూసిన స్వరసుమం, తాను నడిచే పాటకు నిలువెత్తు నిజస్వరూపం. తన పాట ఒక్కటే ప్రాణంగా జీవిస్తున్న ఓ రాగాల కోయిల.
@ జీవిత విశేషాలు…
జన్మ నామం : సరస్వతి
ఇతర పేర్లు : రావు బాలసరస్వతీ దేవి
జననం : 29 జూలై 1929
స్వస్థలం : వెంకటగిరి, మద్రాసు ప్రాంతం, బ్రిటీషు ఇండియా (ఇప్పడు ఆంధ్ర ప్రదేశ్)
తండ్రి : పార్థసారథి
తల్లి : విశాలాక్షి
వృత్తి : నటి, నేపథ్యగాయని
భర్త : రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్
పురస్కారం : రామినేని పౌండేషన్ అవార్డు
@ నేపథ్యం..
రావు బాల సరస్వతి దేవి గారు 29 ఆగస్టు 1929 నాడు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో పార్థసారథి, విశాలాక్షి దంపతులకు జన్మించారు. వీరి తాతగారు మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. గుంటూరులో వీరికి రత్న మహల్ అనే సినిమా థియేటర్ ఉండేది. దాంతో వీరి తాతగారు తప్ప 1934లో వీరి కుటుంబం అంతా గుంటూరు తరలి వచ్చింది. బాల సరస్వతి తండ్రి పార్థసారథి గుంటూరులో రత్న సినిమా హాలు నడిపేవారు. తల్లిదండ్రులు ఇరువురు సంగీత అభిమానులు. సంగీతానికి అభిమానులు మాత్రమే కాదు వీణ, సితార లను వాయించేవారు. వీరికి సంగీత పరికరాల దుకాణం ఉండేది. ఆ సంగీత పరికరాల కోసం ఎంతో మంది సంగీత కళాకారులు వారింటికి వచ్చేవారు. అలా చిన్ననాటి నుంచి బాల సరస్వతి దేవి గారికి సంగీతం పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. బాల సరస్వతి దేవి గారు ఎక్కువ చదువుకోలేదు.
@ బాల్యం…
బాల సరస్వతీ దేవి గారి ఇంటి వాతావరణ ప్రభావం వల్ల, పసితనం నుండే సంగీతంలో మెళకువలు తెలుసుకునేవారు. బాల్యం నుండి సంగీతమే తనకు చదువు. ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ తనకు ట్యూటర్. ఆమె దగ్గరే బాల సరస్వతీ దేవి గారి సంగీత చదువంతా సాగింది. ఆవిడే తనకు లోకజ్ఞానం నేర్పుతూ వచ్చింది. కొంతకాలం తాను కర్ణాటక సంగీతం నేర్చుకున్న తరువాత నాన్నగారు ఎంతో శ్రద్ధగా బొంబాయి తీసుకెళ్ళి వసంత దేశాయ్ గారి దగ్గర హిందూస్థానీ సంగీతం నేర్పించారు. ఆ విధంగా 1940 నాటికి బాల సరస్వతీ దేవి గారికి సంగీతంలో ప్రావీణ్యం ఏర్పడింది.
బాల సరస్వతీ దేవి గారు మంచి గాయనిగా పేరు సంపాదించుకోవాలన్నది వారి నాన్నగారి కల. పైగా నాన్న పార్థసారథి గారు కర్నాటక సంగీతంలో దిట్ట. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడే తాను తన కూతురికి పట్టుదలగా, ఆరేళ్ళ వయస్సు నుండే సరస్వతీ దేవి గారికి సంగీతం నేర్పించేవారు. తమ టాకీస్ లో ప్రదర్శించే పాటలను అచ్చు అలాగే పాడేవారు.
@ బాల సరస్వతీ దేవి అనే పేరు..
అలత్తూర్ సుబ్బయ్య (గుంటూరు) గారి వద్ద మూడు సంవత్సరాలు శాస్త్రీయ కర్ణాటక సంగీతాన్ని వారు అభ్యసించారు. ఖేల్కర్, వసంత దేశాయ్ గార్ల వద్ద హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు. కె.పిచ్చుమణి గారి వద్ద వీణ, డానియల్ గారి వద్ద పియానో లాంటి సంగీత వాయిద్యాలలో తాను తర్ఫీదు పొందారు. గుంటూరులో వీరి సినిమా థియేటర్ను 1936లో నాటకరంగ స్థలంగా మార్చేశారు. అక్కడే ఎన్నో నాటకాలు ప్రదర్శించేవారు. ఆ నాటకాల్లో పాటల సన్నివేశాలు వచ్చినప్పుడు బాల సరస్వతీ దేవి గారు నేపథ్యగానం అందించేవారు.
అలా సరస్వతీ దేవి గారు పాటలు పాడుతున్నప్పుడు అవి విన్న హెచ్.ఎం.వి. గ్రాంఫోన్ రికార్డ్స్ కంపెనీవారు తనకు తెలియకుండానే తన వాయిస్ రికార్డ్ చేసుకెళ్ళారు. హెచ్.ఎం.వి. ప్రతినిధి కొప్పరపు సుబ్బారావుగారు వచ్చి తన పాటలు రికార్డింగ్కి నాన్నగారితో ఒప్పందం చేసుకున్నారు. బాల సరస్వతీ దేవి గారు తన ఆరో ఏట అంటే 1934లో తొలిసారిగా హెచ్ఎంవి వారికి “పరమపురుష” అనే పద్యం, “దొరికే దొరికే నాకు” పాటలు రికార్డుగా ఇచ్చారు.
ఇంతలో సి పుల్లయ్య గారు తన సతీ అనసూయ (1936) కోసం పాడగలిగే అమ్మాయి కోసం అన్వేషిస్తూ బాల సరస్వతి గారిని “గంగ” పాత్రకు ఎంపిక చేశారు. అదే సమయంలో తమిళంలో భక్త కుచేల తీస్తున్న కే.సుబ్రహ్మణ్యం గారు కృష్ణుడిగా నటింపజేశారు. ఆయన చిన్నతనంలోనే సరస్వతి దేవికి ముందు బాల కలిపారు. దాంతో బాల సరస్వతీ దేవీ అనే పేరు వచ్చింది. తన వివాహనంతరం బాలకు ముందు రావు వచ్చింది. రావు అనేది కూలంక ఎస్టేట్ పేరు. ఆ ఎస్టేట్ రాజా గారిని పెళ్లి చేసుకోవడం తో తన పేరు రావు బాల సరస్వతీ దేవి గా మారిపోయింది.
@ వివాహం…
రావు బాల సరస్వతి గారు 1944 లో అప్పటికి తన వయస్సు సుమారు 15 నాటికి వీరు మద్రాసులో ఉండగా, ఒకసారి తన అత్తయ్య, మావయ్యలతో మద్రాసు గిండిలో గుర్రపు రేసులు చూడ్డానికి వెళ్ళారు. అప్పటికి తన వయస్సు 15 సంవత్సరాలు. వెంకటగిరి మహారాజాగారి నాలుగవ కుమారుడు “రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్” గారు కూడా అక్కడికి వచ్చారు. వారు కోలంక రాజావారు. వారి గుర్రాలు కూడా రేసుల్లో ఉండేవి. అక్కడ రావు బాల సరస్వతి గారిని చూసి తాను పాటలు బాగా పాడుతుందనీ, సినిమాల్లో నటిస్తుందని తెలుసుకున్నారు.
కొన్నాళ్ళకు రాజా గారి కుటుంబం లో అందరూ మద్రాసు వచ్చారు. “మీ పాటలు వినాలని వచ్చాం, వినిపిస్తారా?” అన్నారు. వాళ్ళు వచ్చింది పెళ్ళిచూపులకే అని సరస్వతి గారి నాన్నగారికి అర్థమైంది. మీ అమ్మాయి నచ్చింది, చేసుకుంటాం అన్నారు రాజా వారు. నాన్నగారు సరస్వతి గారినే అడగమన్నారు. రాజావారు అడిగేసరికి సరస్వతి గారు కాదనలేకపోయారు. రాజు గారికి, సరస్వతి గారికి మధ్య దాదాపు 19 సంవత్సరాలు తేడా ఉంది. కానీ ఆ రోజుల్లో అలాంటివి పట్టించుకునేవారు కాదు. ఆ విధంగా 1944లో కోలంక రాజావారితో రావు బాల సరస్వతి గారి వివాహం జరిగింది.
@ సినీ ప్రస్థానం…
రావు బాల సరస్వతీ దేవి గారు భక్త కుచేల (తమిళం) తర్వాత బాల సరస్వతి తుకారం (1937), బాలయోగిని (తెలుగు, తమిళం), మహానంద (1939) చిత్రాల్లో తాను బాల తారగా నటించారు. మద్రాసులో అలత్తూరు సుబ్బయ్య గారి వద్ద శాస్త్ర సంగీత నేర్చుకున్నారు. ఇంతలో గూడవల్లి రామబ్రహ్మం “ఇల్లాలు” సినిమా తీస్తూ ఎస్.రాజేశ్వరరావు సరసన కథనాయికగా నటింపజేశారు. ఈ సినిమాతోనే సాలూరి రాజేశ్వరరావు గారు పూర్తిస్థాయి సంగీత దర్శకులు అయ్యారు. ఈ సినిమాలో సాలూరి వారితో బాల సరస్వతి గారు పాడిన పాటలు మంచి ప్రాచుర్యం పొందాయి.
“ఇల్లాలు” సినిమా సెట్స్ మీద చూసిన నాటి మద్రాసు రేడియో అధికార బృంద సభ్యులు జనమంచి రామకృష్ణ, ఆచంట జానకిరాం తదితరులు వారిని రేడియో కేంద్రానికి తీసుకెళ్లి వారి పాటలను లైవ్ బ్రాడ్ కాస్ట్ చేయించారు. అలా మొదలైన వారి రేడియో ప్రస్థానంలో వారిని నెల నెలా పాడమని కాంట్రాక్టు ఇచ్చారు. అలా రేడియోతో ఏర్పడిన ఆమె అనుబంధం 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రారంభోత్సవం నుండి 1998 లో స్వర్ణోత్సవానికి పాడే దాకా కొనసాగింది. ఈ ఘనత కేవలం రావు బాల సరస్వతి గారికి మాత్రమే దక్కింది
@ పిన్న వయస్సులో గాయనిగా కిర్తి..
సాలూరి రాజేశ్వరరావు, బాలసరస్వతి గార్లు ఇల్లాలులో పాడిన “కావ్యపానము చేసి”, “కల కాదననవా బాల” పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. అది చూసిన హెచ్.ఎం.వి వారు “తుమ్మెద ఒకసారి”, “కోపమేల రాధా”, “పొదిరింటి నుంచి పొంచి” వంటి పాటలతో ప్రైవేట్ రికార్డులు వీరితో పాటించారు. ఆ సమయానికి బాల సరస్వతి గారి వయస్సు 12 ఏళ్ళే. పాటల కన్నా ఎక్కువ ప్రైవేట్ రికార్డులే ఎక్కువ ఆదరణ పొందాయి. హెచ్ఎంవి వారికి పురుషులు పాడవలసిన పాటలు ఆమెతో, స్త్రీలు పాడవలసినవి సాలూరు వారితో పాడించడం ఆ రోజుల్లోనే ఓ ప్రయోగం.
“శశివదనము గనినే వికసితమందితినే”, “చలిగాలి వీచింది తెల్ల తెల్లవారింది ఇకనైనా ఇల్లు చేరవా ప్రియా”, “రావే రావే కోయిలా” వంటి ఎప్పుడైనా రేడియోలో ప్రసారమైనప్పుడు అలనాటి శ్రోతలను ఆనందింప చేస్తాయి. ఆ రోజుల్లో రావు బాల సరస్వతీ దేవీ గారు పాడిన “ఆ తోటలో అందగాడెవరే” రికార్డు విన్న చలం తన అభిమాన గాయని బాలసరస్వతి అని స్వయంగా రాసుకోవడం విశేషం. సినిమాల విషయానికొస్తే “ఇల్లాలు” తర్వాత అపవాదులు కే.ఎస్.ప్రకాష్ రావు సోదరిగా సరస్వతీ దేవి గారు నటించారు. “దాసి పెణ్” తమిళ చిత్రంలో ఎం.జీ.ఆర్ సరసన, “రాధిక” (1947) లో ఈలపాటి రఘురామయ్య గారి సరసన నటించారామె.
ఇంకా ఆమె “సువర్ణమాల” (1948), తమిళంలో “పరిబిల్హణ”, “జ్యోతి మలర్”, “తిరునీలకంఠన్”, కన్నడంలో చంద్రహాస చిత్రాలలో నటించడముతో పాటు గానం కూడా చేశారు. 1944లో కాకినాడకు చెందిన కోలంక జమీందారు రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి రావు గారితో వివాహం తర్వాత బాల సరస్వతి గారి సంగీత యాత్రలోని చివరి మజిలీలు దగ్గరవుతూ వచ్చాయి. ఇంట్లో వారికి అయిష్టంగా ప్రవర్తించి బాధ పెట్టడం ఇష్టం లేకనే పరిశ్రమకు దూరమయ్యారు.
బాల సరస్వతి గారు నటిగా కన్నా గాయని గానే సుప్రసిద్ధులయ్యారు. 1943లో నాగయ్య గారు తీసిన “భాగ్యలక్ష్మి” లో కమలా కోట్నిస్ కు “తిన్నె మీద చిన్నోడా” పాడిన తాను తొలి నేపథ్య గాయని అయ్యారు. సినిమాల్లో బాలసరస్వతి గారిని గాయనిగా ప్రోత్సాహించిన వారు సి.ఆర్.సుబ్బరామన్ గారే. “నటనలు తెలిసేనులే” (స్వప్న సుందరి), “ఊగుదువే ఊయల” (శాంతి), “తానే మారినా”, “అందం చిందెనయా”, “ఇంత తెలిసి ఉండి ఈ గుణమేలరా” (దేవదాసు) పాటలు సుబ్బరామన్ సంగీతంలో పాడినవే. భానుమతి చిత్రాల్లో గాయనిగా మరొకరికి పెద్దగా అవకాశాలు రావడం అరుదు. కానీ సుబ్బరామన్ సంగీతం చేసిన ప్రేమ, కాదల్, లైలా మజ్ను చిత్రాల్లో బాల సరస్వతి గారి పాటలు కూడా ఉన్నాయి. బాల సరస్వతి గారి పై పై సుబ్బారామన్ గారికున్న నమ్మకం అది.
అయితే బాల సరస్వతి గారి ఎదుగుదలకు నాటి కొందరు సంగీత దర్శకులు పనిగట్టుకుని వ్యతిరేకంగా పనిచేశారు అని అంటుంటారు. హిందీ “ఉడన్ కఠోలా” తమిళ వెర్షన్ కు నౌషాద్ సంగీతంలో పాడేందుకు బొంబాయి వెళ్ళినప్పుడు రెండు పాటలు రికార్డు కాగానే హిందీ వర్షన్ కు పాడిన లత “బాల” ను వెంటనే బొంబాయి నుంచి పంపకపోతే నేను పాడను అని అక్కడ సంగీత దర్శకుడిని శాసించిందట. అయినా కూడా నౌషద్ “బాల” ను బొంబాయిలో స్థిరపడమని కోరారు. కానీ సరస్వతి గారు తిరిగి మద్రాసు వచ్చేసారు.
బాల సరస్వతి 1958 వరకు పాడిన పాటలన్నీ ఆణిముత్యాలు తగినవే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సింహాళ భాషల్లో కలిపి సుమారు 2000 పైగా పాటలు పాడారు. వాటిల్లో “మల్లెపూలు మల్లెపూలు కల్వ పూలు కావాలా” (రాజే నా ప్రాణం), “రావే ప్రేమలతా” (పెళ్లి సందడి), “గోపాలకృష్ణుడు నల్లన” (రాధిక), “తానేమి తలంచెనో” (దాంపత్యం), “తన పంతమే” (మానవతి), “యదుకుమార గిరిధర” (సువర్ణమాల), “అదిగదిగో గగనసీమ” (నా యిల్లు), “పలుక రాదటే చిలకా” (షావుకారు), “ధరణికి గిరి భారమా” వంటివి మచ్చుకు కొన్ని కాగా తన సినిమా ప్రస్థానం ముగించిన తర్వాత తన దగ్గర బంధువు విజయనిర్మల కోసం “సంఘం చెక్కిన శిల్పాలు” లో అంపకాల పాట పాడారు.
@ పురస్కారాలు…
బాల సరస్వతికి పరిశ్రమ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశాయి. అయినా సేలం ఖాది చేనేత ప్రదర్శనలో (1956), బాంబినో వారి ఉత్తమ గాయని పురస్కారాలు, మద్రాసు ఐక్య అకాడమీ సన్మానం, ఢిల్లీలో అంబేద్కర్ భవన్ లో ఉత్తమ గాయని అవార్డు (1985), మద్రాసు తెలుగు సంగీత అకాడమీ పురస్కారం (1988), హైదరాబాదులో ఘంటసాల విగ్రహావిష్కరణ సందర్భంగా లతాచే సన్మానం (1993) నాటి ప్రధాని పీ.వీ. నరసింహారావు గారిచే జాతీయ సమైక్యతా అవార్డు (1995), చంద్రముఖి ఆర్ట్స్ వారి స్వర్ణ పథకం (1998), పైడి లక్ష్మయ్య స్మారక అవార్డు, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ఆత్మగౌరవ పురస్కారం (2000) ఆమెను వరించాయి.
@ చిత్ర సమాహారం…
★ నేపథ్యగాయనిగా..
రావు బాల సరస్వతీ దేవి గారు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహళీసు బాషలలో 2000కు పైగా పాటలు పాడారు. తాను నేపథ్య సంగీతం అందించిన తెలుగు సినిమాల జాబితా..
ఇల్లాలు (1940)
భాగ్యలక్ష్మి (1943)
చెంచులక్ష్మి (1943)
మాయా మచ్ఛీంద్ర (1945)
రాధిక (1947)
లైలా మజ్ను (1949)
స్వప్న సుందరి (1950)
పరమానందయ్య శిష్యుల కథ (1950)
షావుకారు (1950)
ఆహుతి (1950)
వాలి సుగ్రీవ (1950)
మాయలమారి (1951)
రూపవతి (1951)
మానవతి (1952)
ప్రియురాలు (1952)
ప్రేమ (1952)
శాంతి (1952)
చిన్నకోడలు (1952)
దేవదాసు (1953)
నా చెల్లెలు (1953)
నా ఇల్లు (1953)
పిచ్చి పుల్లయ్య (1953)
మా గోపి (1954)
వద్దంటే డబ్బు (1954)
జయసింహ (1955)
తెనాలి రామకృష్ణ (1956)
దాంపత్యం (1957)
పెద్దరికాలు (1957)
రాణి రంగమ్మ (1957)
వీరకంకణం (1957)
మంచి మనసుకు మంచి రోజులు (1958)
వచ్చిన కోడలు నచ్చింది (1959)
గాంధారి గర్వభంగం (1959)
పెళ్ళి సందడి (1959)…
★ నటిగా..
బాలయోగిని (1936)
అనసూయ (1936)
ఇల్లాలు (1940)
చంద్రహాస (1941)
రాధిక (1947)
సువర్ణమాల (1948)
వాలి సుగ్రీవ (1950)





