Telugu News

తిరుమల లడ్డూపై ‘మహాపాపం’: వైసీపీ హయాంలో 20 కోట్ల లడ్డూల కల్తీ..!

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీస్థాయిలో కల్తీ జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. శాసనసభలో నిర్వహించిన ‘మహాపాపం’ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్ ద్వారా ఆయన అక్రమాలను వివరించారు. 2019-24 మధ్య కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని, అధికారులు మరియు నిపుణులు కలిసి ఒక పద్ధతి ప్రకారం ఈ కుట్రకు పాల్పడ్డారని ఆక్షేపించారు. సుమారు 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించడం వల్ల రూ.231.51 కోట్ల మేర అక్రమాలు జరిగాయని, ఎన్‌డీడీబీ (NDDB) నివేదిక ప్రకారమే తాను లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పానని సీఎం స్పష్టం చేశారు.

ఈ కుంభకోణం కోసం గత ప్రభుత్వం నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకుందని చంద్రబాబు విమర్శించారు. పాలు కొనుగోలు నిబంధనలు తొలగించడం, నెయ్యి ఉత్పత్తి అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించడం, వార్షిక టర్నోవర్ పరిమితిని రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించడం వంటి చర్యల ద్వారా అనర్హులైన కంపెనీలకు ద్వారాలు తెరిచారని మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా నీరుగార్చి, కల్తీ నెయ్యి అని ల్యాబ్ నివేదికల్లో తేలినా అధికారులు ఆ రిపోర్టులను తొక్కిపెట్టారని ఆయన ఆరోపించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ సాగిన ఈ లాలూచీ పైన విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు.

అక్రమాలకు సహకరించిన సూత్రధారులను, సరఫరాదారులను సీఎం సభలో బహిర్గతం చేశారు. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రధాన సూత్రధారిగా ఉండగా, ఏఆర్ డెయిరీ ఫుడ్స్, శ్రీవైష్ణవి డెయిరీ వంటి షెల్ కంపెనీలు కల్తీ నెయ్యి సరఫరా చేశాయని వెల్లడించారు. తితిదే అధికారులు ల్యాబ్ నివేదికలను ఫోర్జరీ చేశారని, లంచం తీసుకుంటూ చిన్నప్పన్న వంటి అధికారులు దొరికిపోయారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం తితిదే ఈవో, ఛైర్మన్‌లకు తెలియకుండా జరిగే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు సీబీఐ పర్యవేక్షణలో సిట్ (SIT) విచారణ జరుగుతుందని, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఏకసభ్య కమిటీని వేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

Show More
Back to top button